డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల అభ్యంతరం
ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చి వెళ్లాల్సిందని ఆక్షేపణ
వరుస ఫిర్యాదులతో వివరణ కోరిన కలెక్టర్
నిబంధనల ప్రకారమే వెళ్లానని మేయర్ సమాధానం
సెప్టెంబర్ 5న బయలుదేరనున్నట్లు సమాచారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నగర మేయర్ సునీల్‌రావు అమెరికా పర్యటన వివాదం చివరికి కలెక్టర్ వద్దకు చేరింది. ఇటీవల మేయర్ 14 రోజులపాటు తాను అమెరికా వెళ్తున్నానని కమిషనర్, కార్పొరేటర్లకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీనిపై కార్పొరేటర్లతో పాటు, డిప్యూటీ మేయర్ కూడా తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ఆయన వెళ్తూవెళ్తూ.. డిప్యూటీ మేయర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వకుండా వెళ్లారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, తాను బీసీ మహిళ అయినందునే మేయర్ చిన్నచూపు చూస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్, బీసీ సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. ఆయన పర్యటన నిబంధనలకు విరుద్ధమని ఆరోపించాయి. ఆయన 33 రోజులపాటు పర్యటించేలా టికెట్లు బుక్ చేశారని, వాస్తవానికి 14 రోజులకు మించి విదేశాలకు వెళ్లినట్లయితే.. నిబంధనలకు ప్రకారం డిప్యూటీ మేయర్‌కు ఇన్‌చార్జి అప్పగించాలన్న వాదన తెరమీదకు తీసుకొచ్చారు.
వెలుగుచూసిందిలా..
వాస్తవానికి మేయర్ సునీల్‌రావు వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లారు. ఈనెల 23న వెళ్లి.. సెప్టెంబర్ 25న (33 రోజులు) వచ్చేలా ఆయన బుక్ చేసుకున్న టికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వివాదం రాజుకుంది. ఆయన తీరుపై సొంత పార్టీ, విపక్ష కార్పొరేటర్లు కూడా విమర్శించారు. నిబంధనల ప్రకారం.. 14 రోజులు దాటితే తనకు బాధ్యతలు ఇవ్వాలని, కానీ.. తాను బీసీ మహిళను అనే వివక్షతోనే మేయర్ సునీల్‌రావు తనకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వలేదని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి ఆరోపించారు. అసలు మేయర్ పర్యటనకు అధికారిక అనుమతే లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టం 2009 34(2) ప్రకారం తనకు ఇన్‌చార్జి మేయర్‌గా అవకాశం కల్పించాలని ఫిర్యాదులో విన్నవించారు. కాగా, ఈ విషయంపై బల్దియాలోని ప్రతి విభాగం, ప్రతి ఉద్యోగి చర్చించుకోవడం ప్రారంభించారు.
మేయర్ వివరణ కోరిన కలెక్టరేట్
మేయర్‌పై వరుస ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ కార్యాలయం నుంచి మేయర్‌ను వివరణ కోరింది. దానికి ఆయన సమాధానమిస్తూ.. తాను మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం ఇచ్చాకే విదేశీ పర్యటనకు వచ్చానని, నిబంధనల మేరకు తాను అనుమతి తీసుకున్నానని, ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు.
6న ఇండియాకు: మేయర్
తాను నిబంధనల ప్రకారం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయికి సమాచారం ఇచ్చానని, తనది కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమేనని మేయర్ సునీల్‌రావు తెలిపారు. తాను కేవలం 14 రోజుల వరకే అందుబాటులో ఉండనని కార్పొరేటర్లకు ముందస్తుగానే సమాచారమిచ్చానని పేర్కొన్నారు. తాను బుక్ చేసిన టికెట్లను సాకుగా చూపి తనపై దాడికి దిగడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. ఆ టికెట్లను ఎప్పుడైనా రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, వచ్చే నెల 6వ తేదీన కరీంనగర్‌లో ఉంటానని వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం మేయర్ 14 రోజుల పర్యటన ముగుస్తుంది. కాగా, ఈ వ్యవహారమంతా టీ కప్పులో తుపానులా సమసిపోనుందని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment