వానకు తల దాచుకున్న చోట | Akhilan story | Sakshi
Sakshi News home page

వానకు తల దాచుకున్న చోట

Published Sun, Oct 11 2015 1:01 AM | Last Updated on Sat, Aug 11 2018 4:36 PM

వానకు తల దాచుకున్న చోట - Sakshi

వానకు తల దాచుకున్న చోట

క్లాసిక్ కథ
చెన్నపట్టణం జాతకంలో ‘ప్రచారయోగం’ ఉచ్చస్థితిలో ఉన్నట్టుంది. దానికి తలనొప్పి గాని జ్వరం గాని వచ్చినా, జలుబు చేసినా వెంటనే ఆ సంగతి రెక్కలు కట్టుకుని దేశమంతా వ్యాపిస్తుంది. దాని సందు గొందులూ మురికివాడలూ కాలిబాటలూ మొదలైన వాటికి అంతగా ప్రచార భాగ్యం కలగనిమాట వాస్తవమే. కాని అప్పు డప్పుడూ వాటికి కూడా ఆ అదృష్టం పడుతుంది. గుడిసెలు పరశురామ ప్రీతి అయితేనో, గుడిసెలలోని వాళ్లు కొందరు వార్నిష్‌లు దొంగ సారాగా తాగితేనో అప్పుడు పత్రికలవారు ఆ విషయాలకు అంతులేని ప్రాముఖ్యం యిస్తారు.
 
నగరంలో వాన కురవనందువల్ల నీటి యెద్దడి యేర్పడిందని దేశమంతా మారు మోగిపోయింది. కుళాయిలు కన్నీళ్లు కారుస్తున్నవనీ, పాలలో కలిపేందుకు నీళ్లు లేక పాలవాళ్లు బాధపడుతున్నారనీ పత్రికలు కంటతడి పెడతాయి. నీటి యెద్దడి అంటే యేమో తెలీని పట్టణ ప్రముఖులు పలువురు పత్రికలు చదివిన తర్వాత గాని నీటి యెద్దడి యేర్పడినట్లు గ్రహించరు.
 
ఎన్నాళ్లని నీటి యెద్దడి అంటూ పాడిన పాటే పాడడం? పత్రికలకు కొత్త కబురు అందించాలని కాబోలు ఉన్నట్టుండి చెన్నపట్టణంలో వాన కురవడం మొదలుపెట్టింది. వానకు రోషం వచ్చిందేమో!
 రెండో రోజున విశ్రాంతి తీసుకున్న వాన మూడో రోజు మధ్యాహ్నం మళ్ళీ విజృంభించింది. మెరుపులు మెరుస్తున్నాయి. ఆకాశంలో ఎడతెగని రణగొణ ధ్వని.
 
రాత్రి ఎనిమిది దాటింది. విద్యుత్ ప్రసారం లేని కొన్ని వీధులలో తప్ప, మిగిలిన చోట్లలో విద్యుద్దీపాల కాంతి వాన నీటిలో కలిసిపోయింది. వాన నీరు ప్రవహించేందుకు వీలున్న వీధుల్లోకి, పిలవని చుట్టంగా, ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. పిలవని చుట్టాలు మరి కొందరున్నారు. వానకు తలదాచుకోడానికి వీధుల్లో వాళ్లు అటూ యిటూ తిరుగు తున్నారు. పట్టణంలో వాన కురవకూడ దని వీధి మలుపుల్లో వెలసిన దేవుళ్లకు మొక్కుకున్న ‘ఆరు బయట నివసించే’ పౌరులు వాళ్లు. రోడ్డుపక్కన వుండే చెట్టు చేమలు, మూసిన దుకాణాల ముందు భాగం, కప్పువేసిన బస్సు స్టాండ్లు, పార్కులలోని సిమెంటు బెంచీలు, కాలి బాటలు - మొదలైన చోట్ల, గోడల కంటించిన సినిమా పోస్టర్లు చింపి, వాటిని పరుచుకుని కాలక్షేపం చేస్తారు!
 
మైలాపూరు వైపు వెడుతున్న అయి దారుగురిలో వెళ్లసామి ఒకడు. రెండు నెలల క్రితం బతుకు తెరువు కోసం పట్టణం వచ్చాడు. కాయ కష్టం చెయ్య డంలో బద్ధకించడు. కొత్వాల్ చావడిలో బస్తాలు మోయడం, చేతిబండి వానికి సహాయపడడం, కట్టెలు కొట్టడం, ప్రయాణికుల మూటాముల్లెలు మోయడం మొదలైన పనులు చేసేవాడు.
 
మన్నడి నుంచి - అతను మైలాపూరు వెళ్లడానికి కారణం లేకపోలేదు. కూలికి చేతిబండి లాగే కరుప్పన్ మైలావూరు కూనం ఒడ్డున వున్న ఒక కుప్పంలో నివ సిస్తున్నాడు. కరుప్పన్‌తో పాటు ఒకసారి వెళ్లసామి అతని గుడిసెకు వచ్చాడు. ఆ పూట అక్కడ భోజనం చేశాడు కూడా. పెద్ద పరిచయం లేకపోయినా, వెడితే అడ్డు చెప్పడని అతని వుద్దేశం. బస్సులో వెళ్లా లంటే ముప్ఫయి పైసలు చెల్లించుకోవాలి. చొక్కా జేబులో తొంభై అయిదు పైసలు న్నాయి. పని బాగా వున్న రోజుల్లోనే అంతంత మాత్రం దొరికేవి డబ్బులు.

వాన పడడం వల్ల, రెండు మూడు రోజులుగా ఆ కాసిని డబ్బులు కూడా కరువయ్యాయి. ఆకలి మాత్రం మూడు పూటలు కాదు, అయిదు పూటలు వేసేది. రాయపేటరోడ్డు గుండా మైలాపూరు సరిహద్దుకి వచ్చిన వెళ్లసామి, వెళ్లవలసిన చోటు విచారించుకుంటూ నడక సాగిం చాడు. మంచి వానలో నాలుగు మైళ్లు నడి చాడు. దారిలో ఒక టీ దుకాణం కనిపిం చింది. ఆకలి ఎక్కువయింది. నాయరు వద్ద పది పైసల బన్లు మూడు కొని, తిని, రెండు అరటిపళ్లు కూడా లోపలికి పంపించాడు. మొత్తం నలభై పైసలు. కాని చలికి గడ్డ కట్టుకుపోతున్న శరీరం సింగిల్ టీ కోరింది. ఇంకో పది పైసలిచ్చి వేడి వేడి తేనీరు మెలమెల్లగా తాగాడు. ఒంట్లో వేడి వ్యాపించడంతో హాయిగా వుంది.
 
కుప్పం వైపు తిరిగే సందుని చూచీ చూడడంతో వెళ్లసామికి కడుపు తరుక్కు పోయింది. గుడిసెలు గుడిసెలుగా లేవు. వాటిలో మనుషులూ కనిపించలేదు. కొంచెం దూరం బురదలో నడిచివెళ్లాడు. రెండు మూడు గుడిసెలు నేలమట్టమయి నాయి. ఎందుకు నేనింత దూరం వెతుక్కుంటూ వచ్చాను? అనుకున్నాడు. అక్కడున్న దీపస్తంభం ఆధారం చేసుకుని ఎలాగో కరుప్పన్ గుడిసెను గుర్తుపట్టాడు. అరుగుమీది తడికలు పడిపోయినాయి.

గాలికి తలుపు కొట్టుకుంటోంది. మెరుపుల కాంతికి గుడిసె లోపలి భాగం కనిపి స్తోంది. బయట నుంచునే పరీక్షగా చూశాడు. పైకప్పు జల్లెడలా వుంది. ఒక మూల ఒకరినొకరు కౌగిలించుకుని యిద్దరు కూర్చున్నారు. ఇద్దరూ స్త్రీలే. ఒకామె కరుప్పన్ తల్లి. మరొకామె అతని కూతురు. కరుప్పన్ భార్య మరణించిన విషయం వెళ్లసామికి తెలుసు.
 
వెళ్లసామి ఆలోచనలోపడ్డాడు. వానకు తల దాచుకునేందుకు మరోచోటు దొరక్క అక్కడికి వచ్చాడు. కరుప్పన్ లేడు. ఇంట్లో వాళ్లకే చోటు లేదు. కారుతున్న ఆ గుడిసె కంటె బయటే బాగుందనుకున్నాడు. వెనక్కి వెళ్లిపోదామనుకున్నాడు. అప్పుడు ఒక సంఘటన జరిగింది.
 ‘‘అవ్వా! అవ్వా! నాన్న వచ్చాడే’’ అంటూ కరుప్పన్ కూతురు తలుపు తెరిచింది. నుంచున్న వ్యక్తి ముఖం సరిగ్గా చూడకుండానే ‘‘వచ్చావా? దోవ తెలిసిందా?’’ అంటూ ఆదుర్దాగానూ కోపంగానూ అతన్ని ఆహ్వానించింది.
 
ఉలిక్కిపడ్డాడు వెళ్లసామి. ‘‘నేను...’’
చంపకం అతన్ని చూస్తూ నిర్ఘాంత పోయింది. ఆగంతకుడు ఎవరో గుర్తు తెలిసిన తర్వాత ఆమె దడ తగ్గింది. కాని ఆమె ముఖంలోని నిరాశ తగ్గలేదు.
 ‘‘ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇంకా యింటికి రాలేదా?’’ అడిగాడు.
 ‘‘రెండు రోజులయింది యింటి మొగం చూసి. అవ్వకు జ్వరం వస్తున్నట్టు తెలిసి కూడా దొంగ సారా తాగి ఎక్కడో పడివుంటాడు’’ అంది.
 
బాధపడ్డాడు వెళ్లసామి. ‘‘వానకు యింత అవస్థ పడుతూ వుంటే, కన్నతల్లినీ కన్నకూతుర్నీ మరిచిపోయి ఎలా వుండగలి గాడు! వాడూ మనిషేనా!’’ అనుకున్నాడు.
 వెళ్లిపోదామనుకున్న వాడల్లా కొంచెం తటపటాయించాడు. ఆ దురవస్థలో వాళ్లనలా విడిచిపెట్టి తాను హాయిగా ఉండడానికతనికి మనస్కరించలేదు.
 
చంపకం అతన్ని లోపలికి రమ్మంది. వెళ్లాడు. కాలు పెట్టిన చోటల్లా నీళ్లు. అవ్వకు పక్కగా కొయ్య పలక వేసి కూర్చో మంది. కూర్చోలేదు. ఇంతలో చంపకం వచ్చిన మనిషి ఎవరో అవ్వకు తెలియ జేస్తోంది. పేదరికంతో పాటు ముసలి తనమూ జ్వరమూ కలిసేసరికి ఆ ముసలి దానికి, చెవులూ కళ్ళూ సరిగా పని చేస్తు న్నట్లు లేదు. కూర్చున్న తీరూ, కనిపించిన విధమూ చూస్తే, వ్యాధితో బాధపడే ఆడ కోడి గుర్తుకి వచ్చింది. ‘‘మిగిలిన వాళ్ళల్లా మీరూ ఎక్కడికైనా వెడితే బాగుండేది గదా!’’ అన్నాడు వెళ్లసామి.
 
‘‘అవ్వ నడవలేదు. అవ్వను ఒంటరిగా విడిచిపెట్టి, వెళ్ళడానికి నాకు కాళ్ళాడలేదు.’’
 ‘‘మీరు లోపలే కూర్చుని వానలో తడిస్తే, ఆ తర్వాత చావ్వలసిందే.’’
 ‘‘కాని ఎక్కడికని వెళ్ళగలం?’’ అంది.
 ఆమె అన్న మాట ములుకోలు దెబ్బలా అనిపించింది వెళ్లసామికి. వేలకు వేలుగా మేడలూ మిద్దెలతో, గుళ్ళూ గోపురాలతో మహా గర్వంగా కనిపించే యీ తమిళదేశపు రాజధాని నగరంలో నివసిస్తూనా ఆమె యీ మాట అంది! ‘‘ఏవన్నా తిన్నారా లేదా?’’ అడిగాడు. ‘‘తిన్నాం’’ అంది. ఆమె చెప్పింది అబద్ధం అని అక్కడున్న పొయ్యి సాక్ష్యమిచ్చింది. అందులో నీళ్లు నిలిచాయి. సరకుపేళ్లు నానిపోయినాయి.

వాన నీళ్ళు పట్టడాని కేమో కుండలు వాడబడ్డాయి. కొంచెంసేపు ఆలోచించి ‘‘మీరిద్దరూ నాతో రండి. మొదట మనం ఎక్కడైనా తలదాచు కోవాలి’’ అన్నాడు. చంపకం ఆలోచిం చింది. అవ్వ ఆరోగ్యం చూస్తే, ఆ రాత్రివేళ ఆమెతో ఒంటరిగా వుండడానికి భయం వేసింది. పరిచయం లేని ఆ యువకుడితో వెళ్లడానికి భయపడింది.
 ‘‘అవ్వ నడవలేదు గదా...’’
 అవ్వను మెల్లగా పైకి ఎత్తాడు వెళ్ల సామి. అతనితోపాటు బయలుదేరడం చంపకానికి భయంగానే వుంది. అయినా తలవని తలంపుగా అక్కడికతను రావడం, భగవంతుడే పంపించాడని అనుకుంది. అతని ఆదరభావం, ఖచ్చితమైన తీరూ ఆమె భయాన్ని కొంచం పారదోలాయి. ముసలిదాన్ని మోసుకుని నడక సాగించాడు వెళ్లసామి.
 
నాయరు టీకొట్టు మూస్తున్నాడు. నాలుగు బన్లు కట్టి యిమ్మని కేక వేశాడు వెళ్లసామి. నాయరిచ్చిన పొట్లాన్ని పంచె కొంగున కట్టుకున్నాడు. ఇంకా అయిదు పైసలే మిగిలాయి. నాయర్ దుకాణంలో అతనికీ, పని చేసే కుర్రవాడికీ పడుకో డానికి చోటు లేదు. ఇంకెక్కడైనా చోటు దొరుకుతుందేమో అని విచారించాడు.
 
‘‘శాంథోం సముద్రం ఒడ్డున వుంది చూడండి, కార్పొరేషను బడి... అక్కడికి వెళ్లండి’’ అన్నాడు నాయరు. ‘‘అదెక్క డుంది?’’ వెళ్లసామి పట్టణానికి కొత్త గదా! ‘‘నాకు తెలుసు రండి’’ అంది చంపకం.
 అరమైలు నడిచి వెళ్ళిన తర్వాత, ఆ బడిలో చోటు లేదన్న విషయం తెలియ వచ్చింది. చంపకం కళ్లల్లో నీళ్ళు తిరుగు తున్నట్టు వీధి దీపాల వెలుతురు వల్ల తెలుసుకోగలిగాడు. ఏం చెయ్యాలో తెలీక వాళ్లు వీధిలో ఒక మూల నిలబడ్డారు.
 
అప్పుడు పది దాటి వుంటుంది. ఆ అపరాత్రి వేళ కూడా చాలా కార్లు వస్తూ పోతూ వున్నాయి. ప్రాణం లేని ఆ కార్లకు కూడా షెడ్లు అనే యిళ్లు వున్నాయి. ఎండవానల నుంచి వాటిని జాగ్రత్తగా కాపాడతారు. మనిషి ఎలా పోతే యేం?
 వచ్చిన దారినే తిరుగు ముఖం పట్టారు. కాలి బాటను ఆనుకుని కాంపౌండు గోడ ఒకటి పొడుగ్గా వుంది. ఆ గోడకు వెనకాల ఇళ్లు యేమీ కనిపించలేదు. కాంపౌండు గోడ నానుకుని రెండు మూడు డబ్బారేకుల సావిళ్ళు ఉన్నాయి. ఒక దాంట్లో కొంతమంది నిద్రపోతున్నారు. మరోదాన్లో మేకలూ ఆవులూ వున్నాయి.

మూడవ సావిట్లో ఒకే ఒక గాడిద మాత్రం నిలబడింది. భగవంతుడు కళ్లు తెరిచాడనే ఆనందం కలిగింది వెళ్లసామికి.  ఆ కాంపౌండు గోడకు ఎక్కడో ఒక చోట వాకిలి అంటూ ఒకటి వుండాలి. అది కనక వుంటే... అది తెరిచే వుందో, లేదో! తాళం వేసి వుందేమో. కాపలా వాళ్లెవరైనా వుంటే, అతని కాళ్లు పట్టుకునైనా బతిమాలవలసిందే.
 అతని అభిప్రాయం తెలుసుకుందో లేదో, చంపకం గజ గజ వణికిపోయింది. ముఖం పాలిపోయింది. మొండిపట్టు పట్టింది, లోపలికి పోవద్దంటూ. ‘‘వద్దు... మనం దీన్లోకి వెళ్లకూడదు.’’
 ‘‘ఏం?’’ అని అరిచాడు వెళ్లసామి.
 
‘‘చెపుతున్నాను విను, వద్దు.’’
 ‘‘ఇప్పుడే మీ అవ్వకు ప్రాణం పోయి నట్టుంది. ఇక మీద నేను మొయ్యలేను. ఇక్కడికి వెళ్లకూడదంటే, సముద్రానికి దారి చూపు. సరాసరి అక్కడికే వెడదాం. అందులో పడి పూర్తిగా మునిగిపోదాం...’’
 చంపకం అతనికేదో చెప్పబోయింది. అతని ప్రయత్నం నుంచి అతన్ని విరమింపజేయాలనుకుంది. కాని అతని కోపం చూసి, యేమీ మాట్లాడలేక పోయింది. ఏమన్నా మాట్లాడితే, అతను వాళ్లను విడిచిపెట్టి పరుగెత్తుకుపోయేలా వున్నాడు. ఆ పరిస్థితిలో అతన్ని వదులు కోడానికి ఆమె యిష్టపడలేదు.
 
ముసలిదాన్ని కిందికి దింపి, చంపకాన్ని ఎత్తి గోడ మీద కూర్చో బెట్టాడు. తర్వాత ముసలిదాన్ని ఎత్తి గోడ మీద కూర్చోబెట్టి, పట్టుకోమని చెప్పాడు. ఆఖరికి అతను గోడ ఎక్కి కిందికి దూకాడు. వాళ్లను దింపాడు. గాడిద నుంచున్న సావిట్లోకి వాళ్లు వెళ్ళారు. వాళ్లను చూసి, గాడిద తనంత తానే పక్కనున్న సావిట్లోకి దారి తీసింది తన వాళ్లను కలుసుకోడానికి. వెళ్లసామి ముసలిదాన్ని నేలమీద పడుకోబెట్టాడు. ఈలోగా చంపకం ఒక మూలకు వెళ్లి తన చింపిరి పాతను పిండి, దాంతో తల తుడుచుకుంది. అవ్వ తలను కూడా తుడి చింది. అతని పంచను కూడా పిండింది. వెళ్లసామి చొక్కా విప్పి పిండుకున్నాడు.
 
ఆ సావిడి పొడుగ్గా ఉంది. వాన జల్లు వల్ల సిమెంటు నేల సగం దాకా తడిసి పోయినా, మిగిలిన సగం పొడిగానే ఉంది. ముగ్గురూ పడుకునేందుకు చోటు చాలదు. అయినా ఆ చోటు అతనికి స్వర్గంలా కనిపించింది. పంచె కొంగున కట్టుకున్న బన్నులు పైకి తీశాడు. నానిపోయి వున్నాయి. వాటిని చంపకానికి అందిం చాడు. అవ్వకు తెలివి లేదన్న మాటేగాని, ఆమె నోట్లో బన్ను ముక్కలు పెట్టిందో లేదో ఆమె మెల్లగా నమిలింది. ఒకటిన్నర బన్ను కంటె ఎక్కువ తినలేకపోయింది.
 ‘‘ఏం నువ్వు తినవా?’’ అంటూ చంపకం ఒక బన్ను వెళ్లసామికి యిచ్చింది.
 
‘‘కడుపు నిండా తిన్నాను. ఇంక ఒక్క పిసరైనా లోపలికి పోదు’’ అంటూ సులభంగా అబద్ధం ఆడాడు. నాలుగు కాదు, ఆరు బన్నులైనాసరే తినగలడు. చంపకం తింటూ వుండడం చూసి ఎంత గానో సంతోషించాడు. దూరాన విద్యుద్దీ పాల వెలుతురులో మెరిసిపోతున్న నగర భవనాలను ఆశగా చూశాడు. ‘‘పట్టణానికి వచ్చిన కొత్తల్లో నేనేం అనుకున్నానో తెలుసా?’’ అని మొదలుపెట్టాడు.

 ‘‘ఏమనుకున్నావేవిటి?’’
 ‘‘మేడ మీద మేడ, దానిపైన మరో మేడ - యిలా పట్టణం పైపైకి పెరిగి పోతోంది; వీధుల్లో కార్లు బారులు బారు లుగా వెడుతున్నాయి. అంగళ్ళలో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా వస్తువులెన్నో మెరిసి పోతున్నాయి. ఇలాంటి కుబేర పట్టణంలో పని, తినడానికి అన్నం, వుండడానికి నీడా దొరక్కపోతాయా అనుకున్నాను.’’
 ‘‘నువ్వు చూసింది కుబేర పట్టణాన్నే. ఒక్కపూట భోజనానికి పదిహేను రూపాయలు ఖర్చు పెడుతున్నారట కొందరు మగవాళ్ళు. ఆడవాళ్ళు యాభై రూపాయలు పెట్టి ఒక్క గజం రవికగుడ్డ కొంటారట.’’
 
‘‘మీరుండే పట్టణాన్ని కూడా చూశాను’’ అన్నాడు వెళ్లసామి.
 ‘‘నువ్వు సరిగ్గా చూసుండవు. మా గుడిసెల పట్టణాన్ని చూడాలంటే, కూవం ఒడ్డునే తిరగాలి. అక్కడక్కడా పుట్టుకొ స్తున్న మురికివాడల్ని కూడా చూడాలి.’’
 ‘‘ఇప్పటికే చాలు చాలనిపిస్తోంది. నేను పడ్డ కష్టం కుక్క కూడా పడి వుండదు’’ అతని కంఠం రుద్ధమయింది.
 
‘‘డబ్బున్న వాళ్లకే యిది స్వర్గం... నీకూ నాకూ కాదు... యిది... యిది...’’
 అర్ధోక్తిలోనే ఆపివేసింది చంపకం.  ‘‘చెప్పేసెయ్.... ఎందుకు దాస్తావ్?’’
 ‘‘చెప్పవలసిన మాట కాదిది.’’
 ‘‘చెప్పకపోతే నిన్ను విడిచిపెట్టను.’’
 విడిచిపెట్టడని అనుకుంది. ‘‘మన మిప్పుడు ఎక్కడున్నామో, అలాంటి చోటు...’’ అని చెబుదామనుకున్నాను-
 
‘‘మనమిప్పుడు ఎక్కడున్నామని?’’
 ఆమె బదులు చెప్పడానికి ఇష్టపడ లేదు. అతనూ విడిచి పెట్టలేదు. మళ్లీ మళ్లీ అడిగాడు.
 ‘‘నీకింకా తెలీలేదా?’’
 ‘‘తెలుస్తే, నిన్నెందుకడుగుతాను?’’
 ‘‘వల్లకాట్లో వున్నాం.’’
 ‘‘ఏమిటి?’’
 
‘‘అవును. ఏ సావిట్లో వుంచి పీనుగుల్ని తగలబెడతారో, ఆ సావిట్లోనే వున్నాం. ఆ చోటు మీదే కూర్చున్నాం. నువ్వు పక్కకు నెట్టావు చూడు, ఆ బూడిద మనుషుల్ని కాల్చగా వచ్చిన బూడిద...’’
 ఇక్కడికి వచ్చే ముందు చంపకం తనను ఎందుకు వారించిందో వెళ్లసామికి యిప్పుడర్థమయింది. అయినా తన భయాన్ని గాని ఆదుర్దాని గాని అతను చూపుకోలేదు. ధైర్యశాలిలా పక పక నవ్వుతూ ‘‘కుబేర పట్టణంలోనివాళ్లు ఆఖరికి వచ్చి నివసించే చోటికే మనమూ వచ్చామన్నమాట’’ అన్నాడు.
 ‘‘భయంగా లేదూ?’’ అని అడిగింది.
 
‘‘ఏవన్నా వుంటే భయపడాలి. నా దగ్గరేముందని... నాకెవరున్నారని?’’
 ‘‘మీ వూళ్లో ఎవ్వరూ...?’’
 ‘‘నాన్నా, అత్తయ్యా, ఇల్లూ, వాకిలీ, ఆస్తీ, గీస్తీ... ఏమీ లేవు... ఊరు విడిచిపెట్టి యిక్కడికి... వచ్చేశాను.’’
 ‘‘ఎందుకొచ్చావ్?’’
 
‘‘ఆకాశాన్ని నమ్ముకున్న వూళ్లో బ్రతుకులేదు. పని చేద్దామంటే ఏమీ లేదు. మోసం చేసి బతకడం చేతకాదు. పట్టణం మెరుపుల్ని నమ్మి యిక్కడికి వచ్చేశాను.’’
 వెళ్లసామికి భయం ఆవరించింది, అతనికి తెలీకుండానే. ఒక్క నిముషానికి ముందు నాకేం భయం లేదన్నవాడు, యిప్పుడు తన జీవితాన్ని చూసి భయపడి పోయాడు. వస్తున్న యేడుపుని ఆపుకోలేక పోయాడు. ‘‘ఏ మొహం పెట్టుకుని యిక నేను మా వూరు వెడతాను?’’ అన్నాడు.
 
‘‘దిగులు పడకు. వయస్సులో వున్న వాడివి, బెంబేలు పడితే ఎలా?’’ అని ఓదారుస్తూ అతనికి దగ్గరగా జరిగింది చంపకం. మెరుపు వెలుతురులో ఆమె ముఖం చూశాడు. ఆమె నలుపు. కాని చూడ ముచ్చట గొలిపే ముఖం. వయసు వచ్చిన పిల్ల అతనితో అంత చనువుగా మాట్లాడడం అతనికదే తొలి అనుభవం.
 ‘‘మేమంతా యీ పట్టణంలో బతకడం లేదూ? నీకు మాత్రం ఏదో ఒక బతుకు తెరువు కనిపించకపోతుందా?’’ అంది చంపకం. ‘‘ఇదీ ఒక బతుకేనా?’’ అన్నాడు వెళ్లసామి బాధగా. ‘‘నన్ను కన్న తండ్రినీ, నిన్ను కన్నాడు చూడు - మీ నాన్ననూ గొంతు పిసికి చంపాలి. కాసుకి గతిలేని వాళ్లు పిల్లల్ని కనకూడదు. డబ్బు గడించకుండా పిల్లల్ని కంటే సరా? ఇంతకూ మీ అయ్య ఎక్కడికి వెళ్లాడు?’’
 
తన తండ్రిని గురించి అతనలా మాట్లాడడం ఆమెకు నచ్చలేదు. అయినా అలా మాట్లాడే హక్కు అతనికున్నట్లు ఆమె అనుకుంది. ‘‘చాలా పొద్దుపోయింది. నిద్రవస్తే నిద్రపో,’’ అంది. ‘‘ఈ చల్లో, యీ నడి వల్లకాట్లో నువ్వు బాధగా మాట్లాడితే, నాకు ఏడుపొస్తుంది.’’
 ‘‘నువ్వు పడుకో. భయపడకుండా నిద్రపో’’ అన్నాడు వెళ్లసామి. ముసలిది వాళ్లిద్దరి మధ్యా కట్టెలా పడివుంది.

 ప్రశాంతంగా పడుకునేందుకు వీలు లేదను కున్నాడు. ఒళ్లు బాగా అలిసిపోయినా, మనసులో మాత్రం ఒక విధమైన భావోద్రేకం ఉరకలు వేస్తోంది. ముందు వెనుకలు తెలియని ఒక అపరిచిత యువతి తన బాధను చూసి ఏడుస్తా ననడం తలుచుకుని నవ్వుకున్నాడు.
 చంపకం పడుకున్న కొంతసేపటికల్లా, వెళ్లసామి ఎలాగో ఒదిగి కాళ్లు చాచాడు. అవ్వను దగ్గరికి తీసుకుని చంపకం నిద్రపోవడం అతను గమనించాడు.
 
ఆకాశం దాగుడుమూతలాడుతోంది, కొంచెంసేపు వాన కురుస్తూ కొంచెంసేపు వాన వెలుస్తూను. అది డబ్బారేకుల సావిడి కావడం వల్ల, వాన జల్లుకి మరీ చప్పుడవుతోంది. వీస్తున్న గాలిలో కుళ్ళి పోయిన మానవ శరీరం తాలూకు కంపు కూడా కలిసింది. నిద్ర రాలేదు. చిత్రమైన యీ లోకంలో, విచిత్రమైన ఒక వలయంలో, తలవని తలంపుగా తాను చిక్కుకున్నట్లనిపించింది. తన రక్షణలో ఇద్దరు స్త్రీలు నిర్భయంగా నిద్రపోతు న్నారు. అతనిలో పురుషత్వం మేల్కొన్నది. తాను పరమ దరిద్రుడనని గాని, బ్రతుకు తెరువు లేని కూలి అని గాని, అతనను కోలేదు. వయసు వచ్చిన పురుష సింహం అతను. కాయకష్టంతో తననూ తనను అంటిపెట్టుకున్న వాళ్ళనూ పోషించగలడు.

 తనలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని కలిగించిన చంపకాన్ని పరీక్షగా చూశాడు. బలిష్ఠమైన ఒళ్ళు, చక్కని ముఖం, ప్రేమ భరితమైన హృదయం - పట్టు పరువు మీద పడుకున్నదానిలా పడుకుంది గాని, కట్టెలు పేర్చి మండబెట్టిన చితిమీద పడుకున్న దానిలా తోచలేదు. వెళ్లసామి పెదవుల మీద చిరునవ్వు దోబూచు లాడింది. మెలమెల్లగా కునుకుపట్టింది.

 అది మూడవ జామో నాలుగో జామో... ఉన్నట్టుండి డబ్బారేకుల షెడ్డు మీద ఎడతెరిపి లేకుండా గులకరాళ్లు పడ్డట్లు చప్పుడయింది. వడగళ్ల వానా అది! ఏదో మండుతున్నట్టుగా కళ్లు మిరు మిట్లుగొలిపే ఒక మెరుపు. దాన్ని అనుస రించి పిడుగుపడ్డ చప్పుడు. చంపకం గభాలున లేచి అవ్వను కదిలించి చూసింది. అవ్వ ఒళ్లు మంచులా చల్లగా ఉంది. గొల్లున ఏడుస్తూ, వెళ్లసామి వద్దకు వెళ్లి అతని చెయ్యి పుచ్చుకుంది. భయంతో వణికిపోయింది. వెళ్లసామి కళ్ళు తెరి చాడు. ఆమె ముఖం పరీక్షగా చూశాడు. ప్రపంచంలోని భయమంతా ఆమె కళ్లల్లో గూడు కట్టుకున్నట్టు కనిపించింది.
 
‘‘నాకెందుకో భయంగా వుంది’’ అంటూ యేడ్చింది. ‘‘మన మిక్కణ్ణుంచి వెళ్లిపోదాం’’ అని బతిమాలింది. వెళ్లసామి ఆమెను పట్టుకుని ఒళ్లో కూర్చోబెట్టుకు న్నాడు. ఆమె వారించలేదు. చలి బాధ నుంచీ, భయం నుంచీ ఆమెను కాపాడే నిమిత్తం తన విశాలమైన వక్షస్థలానికి చేర్చుకున్నాడు. ‘‘భయపడకు - నేను న్నాను’’ అంటూ చెవిలో చెప్పాడు మాటి మాటికి. ఆమె భయం క్రమకమంగా తగ్గు ముఖం పట్టింది. అలా వాళ్ళు ఆ శ్మశానం మధ్యలో మృత్యుదేవత సంచరించే ఆ చోట, బూడిదగుట్ట మీద తమను మరిచిపోయి అలాగే వుండిపోయారు.
 
వాన కురిసింది. పిడుగులు చప్పుడు చేశాయి. గాలి వీచింది. సముద్రం ఘోషించింది. అయినా చంపకం భయం దూదిపింజలా ఎగిరిపోయింది. ఆమె ముఖం పక్కకు తిప్పుకుని, పళ్ళు కనిపించేలా నవ్వింది. ఆ నాలుగు కళ్లల్లోనూ కొత్త కాంతి తళుక్కుమంది. చంపకం తన చేతుల్ని అతని కంఠం చుట్టూ పోనిచ్చింది. ఆ చేతుల్లోని కవోష్ణం అతనిలోని చలిని పారదోలింది.
 
‘‘ఇలాగే యీ చోట్లో మనమిద్దరం ఒకటిగా చచ్చిపోతే ఎంత బావుంటుంది!’’ అంది మెల్లగా. తరువాతి మాటలను పైకి రానీయకుండా ఆమె అధరాలను వెళ్లసామి తన నోటితో కప్పివేశాడు. ఆ తర్వాత వాళ్లు యీ లోకంలోనే లేరు. మెరుపులు, పిడుగులు, వాన, చలిగాలి, శ్మశానం, మరణం, ఆకలి బాధ, దయావిహీనత, దురాశ, స్వార్థం - ఇవేమీ లేని ఒక అద్భుత ప్రపంచంలో వాళ్ళిద్దరూ తమ్ము తాము మరిచిపోయి సంచరించారు.

ప్రాణానికి ప్రాణం యివ్వడానికి జంకని ప్రేమ ఎల్లెడలా నిండిన ఆనంద జగతి అది! కుబేరుల్నీ కోటీశ్వరుల్నీ కూడా ఆ చోట్లో క్షణకాలంలో గుప్పెడు బూడిదగా చేసే ఆ పరమశివుడు ఆ రుద్ర భూమిలో ఇద్దరు అనాథలు మైమరచి వుండడం బహుశా చూచి వుండడు. ఎన్నడో మన్మథుడు శివుని కంటి మంటకు కాలిపోయినట్లు చెపుతారు. కాని ఆ మన్మథుడికి నేడు అక్కడ నూతన జీవం ప్రసాదించే పని కలిగింది.
 
నాశనాన్ని గర్భంలోనే నాశనం చేసే జీవలోకంలోని ఒక బొట్టు జీవశక్తి అనే చిప్పలో ముత్యమై పడింది. ఆమెకూ అప్పుడు తెలియదు. అతనికీ తెలియదు. తమను కన్నందుకుగాను తమ తలిదండ్రుల్ని నిందించిన వాళ్లిద్దరూ ఒక్క మెరుపు మెరిసిన తృటికాలంలో తలిదండ్రులుగా మారిపోయిన వింతను వాళ్లు తెలుసుకోలేదు.
 
వాన కురిసింది. మెరుపు మెరిసింది. పిడుగుపడ్డ చప్పుడయింది. సముద్రపుటల మాత్రం పుడుతూ పెరుగుతూ ఒడ్డుకి మోదుకుని విరిగి పోతూ మళ్ళీ మళ్ళీ పుడుతూ పెరుగుతూ విరిగిపోతూ వుంది. విరిగిన అలలా అక్కడ ఆ ముసలిది పడివుంది. పుట్టిన అలను ఆమె మనుమరాలు భరించింది. అందుకు సాక్ష్యంగా నిలిచింది ఆ డబ్బా రేకుల షెడ్డు.
 (కథా భారతి సంకలనం నుంచి)
 (స్థలాభావం కారణంగా కథను కాస్త సంక్షిప్తీకరించడం జరిగింది)
 - అఖిలన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement