దేవానై | Classic story: Devanai | Sakshi
Sakshi News home page

దేవానై

Published Sun, Nov 1 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

దేవానై

దేవానై

క్లాసిక్ కథ
రామనాథయ్యరూ ఆయన భార్య సీతాలక్ష్మీ తమ కార్లో చైనా బజారుకి వెళ్లి, ఏవో సామాన్లు కొని, ఆ పక్కనే ఉన్న ఒక హోటల్లో ఫలహారం చేసి మళ్లీ కారెక్కారు. ‘‘అలా బీచికి వెడదామా?’’ అడిగాడు రామనాథయ్యరు. ‘‘వెడదాం. జన సమ్మర్దం లేనిచోట కారునాపమని చెప్పండి. సమ్మర్దమంటే నాకసహ్యం. అదిగో, టాయ్స్ అమ్ముతున్నాడక్కడ. రెండు కొనండి. పిల్లలకి తీసుకు వెడదాం.’’ సీతాలక్ష్మి మాట ముగించేలోగా, ఆమె భావాన్ని పసిగట్టి కారు దగ్గరికి వచ్చాడు బొమ్మలమ్మే అతను. కారులో కూర్చునే ధరలడుగుతూ బొమ్మలు చూడసాగారు. మరో తలుపు దగ్గర ఒక బిచ్చగత్తె ‘‘అయ్యా! ధర్మం చెయ్యండి. ఈ పసిబిడ్డను చూడండమ్మా’’ అంది. ఆమె యువతి. చేతిలో ఒక పసిబిడ్డ ఉంది.
 
‘‘అన్నీ జపాన్‌వేనా?’’ అడిగాడు రామనాథయ్యరు.
 ‘‘అన్నీ జపాన్‌వేనండీ. మన వూళ్లో యివి తయారవుతాయా?’’ అని జవాబిచ్చాడు బొమ్మలతను.
 బిచ్చగత్తె మళ్లీ అర్థించింది.
 ‘‘మధ్య యీ పాపిష్ఠిదాని గోల ఒకటి. బిచ్చగాళ్ల బెడద మరీ ఎక్కువయింది మా వూళ్లో’’ అంది సీతాలక్ష్మి.
 ‘‘ఆకలేస్తోందమ్మా.’’
 ‘‘వెడతావా పోలీసుని పిలవమంటావా?’’ సీతాలక్ష్మి కసిరింది.
 ‘‘చంటిబిడ్డ పాలకోసం తపించి పోతోందమ్మా. ఒక్కణా యిప్పించండి.’’
 
బొమ్మలు కొని కార్లో పెట్టి ‘‘బీచికి పోనియ్’’ అన్నాడు రామనాథయ్యరు. బిచ్చగత్తెను పొమ్మని, డ్రైవరు కారుని పోనిచ్చాడు. ‘‘అయ్యా! అయ్యా!’’ అంటూ కారుని పుచ్చుకుని ఆమె కొంచెం దూరం పరుగెత్తింది.
 ‘‘పరిగెత్తకు. వృథాగా చనిపోతావు’’ అన్నాడు రామనాథయ్యరు. ఆమె ముఖం చూశాడు. అంతకుమునుపు ఎక్కడో చూసినట్టనిపించింది.
 కారు వేగంగా వెడుతోంది. ‘‘అయ్యో, పాపం! చిన్నపిల్ల. మనవూరి దానిలా వుంది’’ అన్నాడు రామనాథయ్యరు.
 ‘‘ఏ వూరిదో యేవిటో; పాపిష్ఠిది. దాన్ని గురించి మనకెందుకు? ఇలా యివ్వండి చూద్దాం ఆ బొమ్మ’’ అంటూ ఒక్కొక్కటిగా కొన్న బొమ్మల్ని చూడసాగింది సీతాలక్ష్మి.
     
సేలంలో పొన్నమ్మపేట పెరియన్న మొదలి వీధిలో ఒక పేద కుటుంబం ఉంది. వైయాపురికి ముప్ఫయ్యేళ్లు. అతని చెల్లెలు దేవానై; ఇరవై యేళ్ల యువతి. ఇంకా పెళ్లి కాలేదు. తల్లిపేరు పళనియమ్మ. కులవృత్తి అయిన చేనేతను ఆధారం చేసుకుని వాళ్లు ముగ్గురూ అతి కష్టంతో కాలం వెళ్లదోస్తున్నారు. వారానికి నాలుగు రూపాయలు సంపాదించేవాళ్లు.
 
రాను రాను చేనేత వ్యాపారం పడిపోయింది. కూలి తగ్గుముఖం పట్టింది. ఎన్నో మగ్గాలతో పాటు వైయాపురి మగ్గం కూడా మూలపడింది. ఇద్దరు ఉద్యోగస్థుల యిళ్లల్లో వాకిలి ఊడ్చి, కలాపి చల్లి, చిల్లర మల్లర పనులు చెయ్యసాగింది దేవానై. అలా నెలకు మూడు రూపాయలు కళ్లజూచేది. పళనియమ్మ కూడా మరో యింట్లో పొద్దునపూట కలాపి చల్లి ఒక రూపాయి సంపాదించేది. షావుకార్ల వద్ద పనికోసం తిరిగేవాడు వైయాపురి. ఎక్కడా పని దొరకలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. తర్వాత వైయాపురి బెంగుళూరు వెళ్లాడు. అక్కడేదన్నా మిల్లులో పని దొరుకుతుందేమో అని ఆశించాడు. అతనితోపాటు కొందరు మొదలియార్లు కూడా బయలుదేరారు. వెళ్లిన కొన్నాళ్లకు ఒక మిల్లులో చేరినట్లుగా వైయాపురి ఇంటికి జాబు వ్రాశాడు. అతనికి వ్రాయనూ చదవనూ కొంచెం తెలుసు. వాళ్ల నాన్న పొన్నమ్మపేట మునిసిపల్ పాఠశాలలో చేర్పించాడు. ఆ రోజుల్లో నేత పనివారి జీవితం అంత అధ్వాన్నంగా ఉండేది కాదు.
 
‘‘ఎవరెవరికో లంచాలు పెట్టి ఒక మిల్లులో చేరాను. రోజుకి ఎనిమిదణాల కూలి, నెలకు ఇరవై ఆరు రోజుల పని. పదమూడు రూపాయలు వస్తాయి. ఈ నెల జీతం భోజనం ఖర్చుకీ చేసిన అప్పు తీర్చడానికీ సరిపోతుంది. ఆ తర్వాత నెలకు రెండు రూపాయల చొప్పున పంపిస్తాను. ఆ పైన భగవంతుడున్నాడు’’ అని వ్రాశాడు వైయాపురి. పక్కింటి మారియప్ప ముదలి కొడుకు ఆ ఉత్తరం చదివి వినిపించాడు. తల్లీ, దేవానై అంతులేని సంతోషం చెందారు. పది రోజులకు తర్వాత మరో జాబు వచ్చింది.
 
‘‘అమ్మకు ప్రణామములు. నేనిక్కడ క్షేమం. నువ్వూ దేవానై క్షేమమని తలుస్తాను. మన యింట్లో మగ్గం ముందు కూర్చుని పనిచేసిన ఆ రోజులు తలుచుకుంటే, కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇక్కడ నాకు పిచ్చెక్కినట్టుగా ఉంది. నా అవస్థా, దుఃఖమూ చెప్పలేను. ఎందుకు మన వూరు విడిచిపెట్టి వచ్చానా అనిపిస్తోంది. వీలుంటే పక్కింటి అబ్బాయి చేత జాబు వ్రాయించేది.’’
     
దేవానై వాకిలి ఊడ్చి కలాపి చల్లే యిళ్లల్లో ఒకటి పింఛను పుచ్చుకుంటున్న ఒక ఉద్యోగస్థుడిది. ఆయన భార్య మంచిది. పని చేయించుకోవడంలో కఠినంగా ఉన్నా, యితర విషయాలలో ఆప్యాయత కనబరిచేది. పాత చీర యిచ్చింది. అప్పుడప్పుడూ కొంచెం అన్నం పులుసూ ఇస్తూ వుండేది. ఇలా కొన్నాళ్లు గడిచాయి. కాని దేవుడికి కన్ను కుట్టింది కాబోలు! ఆ యింట్లో పనిచేసే వంటవాడు మిగిలిన భోజన పదార్థాలు దేవానైకి ఇస్తూండేవాడు. ఆమెతో పరిహాసాలాడేవాడు.

ఒకనాడు అసభ్యంగా ప్రవర్తించాడు. దేవానైకి కోపం వచ్చింది. కాని యెవరితో చెప్పుకుంటుంది? ‘‘ఎక్కడా చెప్పకు. నీకు నెలకు రెండు రూపాయలిస్తాను’’ అని ఆశ చూపాడు ఆ నీచుడు. దుఃఖాన్ని దిగమింగి యింటికి వెళ్లింది. ‘‘నేనింక ఆ యింట్లో పనిచెయ్యలేనమ్మా’’ అంది తల్లితో. ఎందుకని తల్లి అడిగింది. కంటతడి పెట్టి జరిగిన విషయాన్ని చెప్పింది దేవానై. ఇంకెక్కడైనా పని దొరుకుతుందేమోనని ప్రయత్నించారు. ప్రతి యింట్లోనూ ఎవరో ఒకరు పనిచేస్తూనే వున్నారు. అలా రెండు నెలలు తిరగ్గా, చివరికి ఒక యింట్లో దొరికింది.
 
ఆరు నెలలు గడిచాయి. బెంగుళూరులో వైయాపురి పనిచేస్తున్న మిల్లులో ఒక సమ్మె జరిగింది. వైయాపురి కూడా అందులో చేరవలసి వచ్చింది. ఒక నెల గడిచింది. కార్మికులు ప్రదర్శనలు చెయ్యసాగారు. మొదట్లో ఉత్సాహంగా కనిపించింది. చేతిలో ఉన్న నాలుగు డబ్బులూ ఖర్చు కావడంతో ఉత్సాహం అడుగంటింది. ప్రభుత్వోద్యోగులు కొంతమంది రాజీ కుదిర్చారు. అంతా మళ్లీ పనుల్లోకి వెళ్లారు. ఒక వారం తిరిగేసరికి, ఇరవై యైదుగుర్ని పనిలోంచి తీసివేసినట్లూ, వాళ్లు మిల్లులోకి ప్రవేశించకూడదనీ గేటు ముందు ఒక బోర్డు కట్టారు. ఆ యిరవై యైదుగురిలో ఒకడు వైయాపురి. ‘‘నేనే పాపమూ యెరగను. కొత్తగా చేరినవాణ్ని. ఎందులోనూ నేను చేరలేదు’’ అని వైయాపురి తన మేస్త్రీ వద్ద మొరపెట్టుకున్నాడు.
 ‘‘ఇది పెద్ద దొర ఉత్తరువు. ఆ టైం కీపరు రంగస్వామి నాయకన్ ఇతరులతో పాటు నీ పేరూ దొరకు పంపించాడు.

నేనేం చెయ్యలేను’’ అన్నాడు మేస్త్రి. రంగస్వామి నాయకన్ వద్దకు వెళ్లి బతిమాలుకున్నాడు వైయాపురి. ‘‘నాకేమీ తెలీదు. జీతం బట్వాడా చేసే ఆ గుమాస్తా అయ్యరు చేసిన పని యిది’’ అన్నాడతను. ఎవరి వద్దకు వెళ్లి, ఏం బతిమాలుకున్నా చివరికి ఫలితం లేకపోయింది. రోజులు గడవను గడవను ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. అతికష్టం మీద వైయాపురి మదరాసు చేరుకున్నాడు. అతనిలా పనిలోంచి తీసివేయబడినవాళ్లు పదిమంది అతనితోపాటు మదరాసుకి బయలుదేరారు. వాళ్లలో కొందరి వద్ద వున్న డబ్బుని అంతా పంచుకున్నారు. ఎనిమిది రోజులపాటు మిల్లులన్నీ తిరిగారు. చివరికి వైయాపురికి ఒక మిల్లులో పని దొరికింది.
 
గేటులో ఉండే అతనికీ, ఇతర ఉద్యోగస్థులకీ ఇవ్వవలసిన మామూళ్లకుగాను అయిదు రూపాయలు కావలసి వచ్చింది. దీనికీ, భోజనానికీ గాను చేసిన అప్పుని తీర్చడానికి వైయాపురి తన చెవులనున్న బంగారు పోగుల్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు. మిల్లులో చేరిన కొన్నాళ్లకల్లా శ్రమను మరచిపోయేందుకు తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత జూదం ద్వారా డబ్బు గడించవచ్చునని కొందరు స్నేహితులతనికి బోధ చేశారు. అదీ అలవాటయింది. వచ్చే డబ్బుల్లో భోజనం ఖర్చు, గుడిసె అద్దె మొదలైనవి పోగా మిగిలిన డబ్బుని ఊరికి పంపడానికి బదులుగా, యిలా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. పఠాను దగ్గర బాకీ పెరగసాగింది. ఈ కష్టాలన్నీ మరిచిపోయేందుకు ఇంకా ఎక్కువగా తాగేవాడు. మొదట్లో ఏవో వంకలు చెప్పి, ఆ తర్వాత డబ్బు పంపలేకపోతున్నానని యింటికి ఉత్తరం వ్రాశాడు.

దేవానై కూడా మదరాసులో ఏదో ఒక మిల్లులో చేరవచ్చుననీ వ్రాశాడు.  ఆ ఉత్తరం చూసుకుని దేవానై, పళనియమ్మా కలత చెందారు. ఆ తర్వాత ఒకనాడు ‘‘అమ్మా, నేనూ పట్నం వెడితే! వైయాపురితో పాటు నేనూ కష్టపడి సంపాదించి, నీకు డబ్బు పంపుతాను. పట్నంలో చాలామంది ఆడపిల్లలు పనిచేస్తారటగా మిల్లుల్లో’’ అంది దేవానై. మొదట్లో పళనియమ్మ తటపటాయించింది. ‘‘ఆడపిల్ల అలా వెళ్లవచ్చా?’’ అంది. చివరికి సరే అంది. పక్కింటి మారప్ప మొదలి వద్ద తన బంగారు కమ్మల్ని తాకట్టు పెట్టి, పన్నెండు రూపాయలు తీసుకుని దేవానై మదరాసుకి బయలుదేరింది.
 
దేవానైని ఒక మిల్లులో నూలు వడికే డిపార్టుమెంటులో చేర్పించాడు వైయాపురి. అతను పనిచేసే మిల్లు వేరు; ఈ మిల్లు వేరు. ఆమెలా నూట యాభైమంది ఆడపిల్లలు - చిన్నా పెద్దా - ఆ మిల్లులో పనిచేస్తున్నారు. దేవానై, మరి పదిమంది పైన ఒక ‘జాఫర్’. అతను మొదట్లో దేవానైని చాలా ఆప్యాయంగా చూచేవాడు. తర్వాత కస్సుబుస్సులాడడం మొదలుపెట్టాడు. ఒంటరిగా కనక చూస్తే కారణం లేకపో యినా ప్రీతి పూర్వకంగా మాట్లాడేవాడు.
 
‘‘ఈయన ఇలా వుంటాడేవిటి?’’ అని తనతోపాటు పనిచేసే ఒకామెను అడిగింది దేవానై. ‘‘నువ్వు వఠ్ఠి పల్లెటూరి దానివి! ఆయన వద్ద సరిగా మసలుకోకపోతే జీతంలో సగం ఫైను కింద పోతుంది. ఆయన కనక సంతోషంగా వుంటే మనకెంతో మంచిది’’ అంది.
 కొన్నాళ్లు దేవానై అన్నిటినీ సహించి ఊరుకుంది. ఆ తర్వాత దేవుడేవిటి, దయ్యమేమిటి అనుకుంది. మేస్త్రి చేతుల్ని ప్రతిఘటించడం మానుకుంది. మనస్సు కుదుర్చుకుని నవ్వుతూ మాట్లాడసాగింది. క్రమేపీ ఆమెకూ సంతోషం కలిగేది. కూలి కూడా ఎక్కువయింది. అలా కొన్ని నెలలు గడిచాయి. దేవానైకి తనలో మార్పులు కనిపించాయి. గర్భధారణ అయినట్టు గ్రహించింది.

అడవిలో వేటగాని నుంచి తప్పించుకునే ఏనుగులా అవస్థపడింది. అన్నయ్యతో చెప్పడానికి భయపడింది. ఆమెతో పనిచేసే కొందరు ఆమె పరిస్థితిని చూసి వేళాకోళం చెయ్యడం మొదలుపెట్టారు. ఊరికి తిరిగి వెడదామా అనుకుంది. కాని జాతి నుంచి వెలివేస్తారేమో అని భయపడింది. అదీగాక తల్లి ఎలా సహించి ఊరుకుంటుంది! అందువల్ల ఊరికి వెళ్లే ఉద్దేశాన్ని విడిచిపెట్టింది. దేవుడే దిక్కని ధైర్యం తెచ్చుకొని అలాగే ఆ మిల్లులోనే పనిచేస్తోంది. మళ్లీ ఒక రోజున ఆమె మనస్సు చివుక్కుమంది. ‘‘అయ్యో! నేనేం చెయ్యను? కళంకం తెచ్చుకున్నాను’’ అని ఒకామెతో చెప్పుకొని యేడ్చింది.
 ‘‘భయపడకు, దీనికో విరుగుడు మందుంది. రెండు రూపాయలిస్తే చాలు. ముత్తుసామి ఆచారి వీధిలో ఒకావిడ వుంది. ఆవిడ అన్నీ చేస్తుంది’’ అందామె.
 
కొన్నాళ్లయిన తర్వాత ఇంకొక స్నేహితురాలు... ‘‘కడుపులో ఉన్న బిడ్డని చంపకూడదమ్మా. అందువల్ల మూడు జన్మలకైనా తీరని పాపం చుట్టుకుంటుందని చెపుతారు. పిళ్లయారుగుడి వీధిలో ఒక ముసలమ్మ వుంది. ఆవిడ చాలా మంచిది. నువ్వావిడ వద్దకు వెళ్లు. నీలా చాలామంది ఆవిడ యింట్లోనేవుండి పురుళ్లు పోసుకున్నారు. నువ్వేమీ భయపడకు’’ అంది.
 ‘‘నువ్వు చల్లగా వుండాలి అక్కయ్యా’’ అంది దేవానై. తర్వాత పిళ్లయారుగుడి వీధిలో నివసించే ఆ పరోపకారి ముసలమ్మ యింటికి వెళ్లింది. ప్రసవం కొంచెం కష్టంగా జరిగింది. అయినా పుట్టిన బిడ్డను తాకిందో లేదో, దేవానైకి లోకం కొత్తగా కనిపించింది. తన కష్టాలను మరిచిపోయింది. తన బిడ్డే తన లోకమనుకుంది.
 
‘‘దైవం ప్రసాదించిన చిహ్నం యిది. ఈ బిడ్డ యేం పాపం చేసిందని’’ అంటూ బిడ్డకు పాలిచ్చేది. ఇలా కొన్ని రోజులు గడిపింది, కష్టాలన్నీ మరిచిపోయి.
 ‘‘దేవానై! నువ్విప్పుడు పనిలోకి వెళ్లలేవు. ఇక్కడే కొన్నాళ్లుందువుగాని’’ అంది జాలిగా ఆ ముసలమ్మ. ‘‘ఇంత మంచివాళ్లు యీ లోకంలో వుండగా నేను దేవుణ్ణి నిందించాను’’ అని నొచ్చుకుంది దేవానై.
 ఒక్క నెల తిరగ్గానే అసలు విషయం బయటపడింది. మగవాళ్ల వల్ల మోసపోయి, అనాథలైన యువతుల సహాయంతో అవినీతికరమైన వృత్తిని సాగిస్తోంది ఆ ముసలమ్మ. దేవానై కూడా ఈ విష వలయంలో చిక్కుకుంది. ఆ రోజు నుంచి ఆమె మిల్లుకి వెళ్లలేదు.
     
 ‘‘సేలంలో మన యింట్లో పనిచేసే దేవానై గుర్తుందా? ఆమెలా వుంది యీ బిచ్చగత్తె’’ అన్నాడు రామనాథయ్యరు.
 దేవానై సేలంలో పింఛను పుచ్చుకునే ఒక ఉద్యోగస్థుని యింట్లో మొదట పనికి కుదిరింది. ఆ ఉద్యోగస్థుని పెద్ద కొడుకే రామనాథయ్యరు. ఆయన మదరాసులో ఒక పెద్ద బ్యాంకులో క్యాషియరుగా పనిచేస్తున్నాడు.
 ‘‘సేలం పిల్ల యిక్కడెందుకుంటుందండి! మీ భ్రమ కాకపోతేను’’ అంది సీతాలక్ష్మి.
 ‘‘ఏమో, ఎలాగో, ఎవరైతే మాత్రమేం? పసిపిల్లలతో అలా తల్లులు బిచ్చమెత్తుకుంటున్నారు గాదా! మనదేశానికి ఎలాంటి గతి పట్టింది!’’ అన్నాడు రామనాథయ్యరు.
 
‘‘మీకెప్పుడూ దేశం గురించే ఆలోచన. మన యింటి సంగతి మనం చూసుకుంటే చాలదూ?’’ అంది ఆమె.
 ఆ మరునాడు సాయంకాలం రామనాథయ్యరు, ఆఫీసు నుంచి సరాసరి చైనా బజారుకి వెళ్లాడు. ఆమెనక్కడ చూడవచ్చుననీ, ఆమెనడిగి విషయం కనుక్కుందా మనీ అనుకున్నాడు. ఆ హోటలు దగ్గరే కారునాపాడు. ‘‘అయ్యా, అయ్యా!’’ అంటూ చాలామంది బిచ్చగాళ్లు ఆయన్ని చుట్టుముట్టారు. కాని ఆమె మాత్రం కనిపించలేదు.
 
ఆ పై శనివారం సాయంకాలం రామనాథయ్యరూ ఆయన భార్యా మళ్లీ చైనా బజారు వైపు వెళ్లారు. ‘‘అదుగో మీ బిచ్చగత్తె’’ అంది సీతాలక్ష్మి. రామనాథయ్యరు కారుని చూసీ చూడడంతోనే ఆ కారులోని వాళ్లు యేమీ యివ్వరనుకొని, అక్కడికి కొంచెం దూరంలో ఆగిన మరో కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లింది ఆ బిచ్చ గత్తె. బిడ్డని ఎత్తికొని, ‘‘అమ్మా! ఒక్క కానీ యివ్వండి. ఈ బిడ్డను చూడండమ్మా’’ అని బతిమాలుకుంటోంది.
 దూరంగా నుంచున్న బిచ్చగత్తెను పిలవడానికి రామనాథయ్యరు సిగ్గుపడ్డాడు. కొంచెంసేపలాగే నిలబడ్డాడు. ఆ కారు వద్ద పని అయిపోగానే తన దగ్గరికి వస్తుందనుకున్నాడు. కాని ఆమె జన సమూహంలో కలిసిపోయి కనిపించలేదు.
 ‘‘వెడదాం రండి’’ అంది సీతాలక్ష్మి.
 
ఎనిమిది రోజులయిన తర్వాత రామనాథయ్యరు సతీసమేతంగా సినిమాకి వెళ్లాడు. కథ నలోపాఖ్యానం. గేటు దగ్గర ఒకటే జనం. కొత్త తార టి.కె.ధనభాగ్యం దమయంతిగా నటించింది. ‘‘తరవాతి ఆటకు వెళ్లవచ్చు. ఈ ఆటకు టికెట్లు అయిపోయాయి’’ అన్నారు. ‘‘ఇంటికి వెళ్లి మళ్లీ వద్దామా?’’ అడిగాడు రామనాథయ్యరు. సీతాలక్ష్మి జవాబు చెప్పేలోగా ‘‘అమ్మా! ధర్మం చెయ్యండి’’ అంటూ ఒక కంఠం వినిపించింది, కారు తలుపు వద్ద. సేలం అమ్మాయేమో అని వెనక్కి తిరిగి చూశాడు రామనాథయ్యరు. ఆమె కాదు. ఎవరో!
 ‘‘ఇక్కడ కారునాపి వుంచితే, బిచ్చగాళ్ల గోల భరించలేం. ముందర యింటికి పోనీ’’ అంది సీతాలక్ష్మి డ్రైవరుతో. అప్పుడే ఒక పోలీసు లాఠీ ఝళిపిస్తూ ఆ బిచ్చగత్తెను అక్కడి నుంచి తరిమాడు.
     
 ఆ రాత్రి రామనాథయ్యరుకి కలలో బిచ్చగత్తె కనిపించింది.
 ‘‘నువ్వు దేవానైవి కాదూ? ఏ వూరు?’’ అని అడిగాడు. సంతోషంతో ఆమె కళ్లు పెద్దవైనాయి. చేతిలో ఉన్న బిడ్డను నిమురుతూ ‘‘బాబూ! మీది సేలం కదూ? వేపచెట్టు యింటి వాళ్ల అబ్బాయివా?’’ అడిగింది బిచ్చగత్తె.
 ‘‘నాయర్! ఈమెను ముందు సీట్లో కూర్చోబెట్టు’’ అన్నాడు.
 ఇంటికి వెళ్లగానే ‘‘ఎవరీమె! ఈ పాపిష్ఠిదాన్ని ఎందుకు తీసుకొచ్చారు మన యింటికి?’’ అడిగింది భార్య.
 ‘‘మన యింట్లో ఈమెను పనిమనిషిగా ఎందుకు పెట్టుకోకూడదు? అన్నం పెట్టి నాలుగు రూపాయలిద్దాం.’’
 
‘‘ఇంకా నయం! చెడిపోయినదాన్ని యింట్లో చేర్చడమా! బాగానే వుంది మన తెలివి. ఫో బయటికి’’ అంది సీతాలక్ష్మి.
 ‘‘నేను దొంగతనం చెయ్యనమ్మా. మీరు చెప్పే పనులన్నీ చేస్తాను’’ అంది బిచ్చగత్తె. ‘‘అక్కర్లేదు. ఫో బయటికి’’ అంది సీతాలక్ష్మి.
 ‘‘ఒక్క రూపాయి యిచ్చి పంపిద్దాం పోనీ’’ అంటూ రామనాథయ్యరు పర్సుకోసం జేబు తడిమి చూశాడు. పర్సు కనిపించలేదు. బిచ్చగత్తె బిగ్గరగా ఏడవసాగింది... మెలకువ వచ్చింది. అంతా కల. తన కూతురు రాధ పక్కమీద కూర్చుని యేడుస్తోంది.
 ‘‘ఇంకా నయం! సీతాలక్ష్మి నిజానికి యింత కఠినంగా ప్రవర్తించదు. కలే గదా...’’ అని సంతోషించాడు రామనాథయ్యరు. తర్వాత చాలా రోజుల పాటు బజారు, రైల్వేస్టేషను సినిమా హాలు - మొదలైన చోట్లన్నీ చూస్తూవుండేవాడు. కాని ఆ బిచ్చగత్తె కనిపించలేదు. ఆమె యేమయిందో ఎవరికి తెలుసు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement