ఎర్ర చీర | Red Saree story | Sakshi
Sakshi News home page

ఎర్ర చీర

Published Sun, Oct 25 2015 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

ఎర్ర చీర

ఎర్ర చీర

క్లాసిక్ కథ
విశాలాక్షి గుండెలు గుబగుబలాడాయి. వశం తప్పి కొట్టుకున్న గుండెలతో తన రూమ్‌లోకి వచ్చి తలుపు భళ్లున వేసి, పిడికిట్లో సగం నలిగిన కాగితాన్ని టేబిలు మీదికి విసిరి, గుండెలమీద చేతులు పెట్టుకుని రెండు నిమిషాలలాగే వుండిపోయింది. కాస్త భయం, గాభరా తగ్గాక వెళ్లి కాగితాన్ని చేతిలోకి తీసుకుని దానివంక చూసి ‘‘ఎంత ధైర్యం అతనికి?’’ అనుకొంది. మరీ ఆలస్యమై పోతుందని మనసు తొందరపెట్టడం ప్రారంభించాక, వణికీ వణకని చేతుల్తో కాగితాన్ని విప్పింది విశాలాక్షి.
 
‘‘చూడండి... చెయ్యకూడని పనులు చెయ్యడమంటే మనుషులకిష్టం. ఇలా ఓ అందమైన అమ్మాయికి వుత్తరం రాసి, ధైర్యంగా అందజేయడం తప్పని నాకు తెలుసు. ఐనా ఆలోచనల్ని అణచుకోలేకా, మనసుని జయించలేకా రాస్తున్నాను. గరల్స్ హాస్టల్లో చివరి రూమ్‌లో మీరుంటున్నారు కదూ. మీ రూమ్‌కి కుడి పక్కనున్న కిటికీలోంచి ఎదురుగా చూస్తే ఒక తెల్లని మేడ వుంది. ఆ మేడమీద గదివుంది. ఆ గదిలో నేనున్నాను. కొద్దికాలం క్రితం వరకూ, యూనివర్సిటీలో ఎమ్మే చదివాను. ఈ మధ్యనే సెకండ్ క్లాసులో ప్యాసయినట్టు యూనివర్సిటీవాళ్లు డిక్లేర్ చేశారు.
 
ఈ వూళ్లో చాలాకాలం నించీ వుంటున్నా, ఈ గదికి నేనొచ్చి రెణ్ణెల్లే కావస్తోంది. ఆ వచ్చిన రోజునే మిమ్మల్ని మీ రూమ్ కిటికీలోంచి చూశాను. అంత కంటే... మీరావేళ కట్టుకున్న ఎర్రచీరతో చూశాననడం బాగుంటుంది. ఎర్రని టెర్లిన్ చీరంటే నాకెంతో ఇష్టం. సంతోషమంత... ఆప్యాయమంత ఇష్టం. ఇంకా ఎక్కువ... చెప్పలేనంత ఇష్టం. ఆ వేళ మీకు తెలియ కుండానే, అటూ ఇటూ కదలాడే ఎర్రచీరతో బాటు మిమ్మల్ని చూశాను. ప్రపంచాన్నీ, నన్నూ, అన్నిటినీ అందర్నీ మర్చిపోయి, ఆలోచనల్ని, అంతరంగాన్ని, పనుల్ని పక్కకునెట్టేసి మరీ చూశాను. ఎప్పుడూ ఎన్నడూ ఎరగని ఊహా తీతమైన భావాలు నన్నావేళ చుట్టుముట్టేయి.
 
ఎర్రని అందమైన దానిమ్మ గింజల మధ్య మల్లెపువ్వులు అమర్చినట్లున్న మీరు ఆ రోజే నా హృదయం మీద చెరగని ముద్రవేశారు. ఆ తరువాత... ఎప్పుడూ మీ కోసం, మీతోబాటు ఎర్రచీర కోసం వెతికిన కళ్లు రెండు మూడు మార్లు మాత్రం సంతృప్తిని పొందాయి. మిమ్మల్ని ప్రేమించానని, రోజూ మీరే కలల్లోకొస్తు న్నారనీ పిచ్చిపిచ్చిగా రాయడం నాకిష్టం లేదు. కాని ఎర్రచీర కట్టుకున్న మీరంటే మాత్రం నాకు ప్రాణంకన్నా ఎక్కువ. కనీసం మీ ముఖ పరిచయమైనా నాకు లేదు. ఐనా మీరంటే...
 
రేపు ఆదివారం రాత్రి ట్రెయిన్‌లో నేను ఇంటర్‌వ్యూకని బొంబాయి వెళ్లి పోతున్నాను. ఈ వూరిలో నాకు మిగిలి పోయిన కోరిక ఒఖ్ఖటే... ఆఖరిసారి మిమ్మల్ని ఎర్రచీరలో చూడ్డం! అందుకే ఆదివారం సాయంత్రం ఆరుగంటలకి ఆ చీర కట్టుకొని బీచికొస్తారు కదూ! మీ ఫ్రెండ్స్‌తో వచ్చినా నాకభ్యంతరం లేదు. కాని మనసారా ఎర్రని చీరతోబాటు మిమ్మల్ని చూడ్డం నా ఆఖరి ఆశ. మరో విధంగా భావించరనే తలుస్తాను. మీ పేరు తెలియకపోవడంవల్లే ఎలా సంబో ధించాలో తెలిసింది కాదు. క్షమించండి... చక్రవర్తి.’’
 
ఉత్తరం చదవడం పూర్తిచేసి, నిట్టూర్చింది విశాలాక్షి.
 ఏమాలోచించాలో, ముక్కూ, మొహం, పేరూ తెలియని ‘అతని’ గురించి ఏమనుకోవాలో ఆమెకి తెలీలేదు.
 తల నొప్పిగా వుందని క్లాసు నుంచి హాస్టల్‌కి వచ్చేస్తూంటే హాస్టలెదురుగా వున్న తెల్లమేడలోంచి పదేళ్ల పనిపిల్ల వచ్చి ఆ కాగితాన్నిచ్చి ‘మీకిచ్చేయమన్నారు’ అనేసి మాటైనా వినకుండా వెళ్లి పోయింది. అదృష్టవశాత్తు రోడ్డుమీద జనం ఎక్కువమంది లేరు. ఉన్నవాళ్లెవరూ దీన్ని గమనించలేదు. కాగితాన్ని పారేద్దా మనుకుంది విశాలాక్షి. కాని చేతులు రాలేదు. ఎందుకో చదవాలనిపించింది. వణికే చేతుల్తో, కదిలే గుండెల్తో గబగబా రూమ్‌కి వచ్చి వుత్తరం చదివేసింది!
 
విశాలాక్షికెవరూ ఇలాంటి వుత్తరాన్ని కాని, ఇంతకుమించిన ప్రేమలేఖల్ని గాని ఇప్పటిదాకా రాయలేదు. ఇరవై యేళ్ల విశాలాక్షికీ అనుభవం మొదటిసారి. కథల్లో ఎక్కువసార్లు, కలల్లో తక్కువసార్లు ఇలా చదివింది, చూసింది. కాని నిజ జీవితంలో ఇలాంటి ఉత్తరాన్ని ఎవరూ రాయలేదు. ‘‘ఇరవై యేళ్ల వయసుండీ, పట్నంలో బీఎస్సీ చదువుతున్న విశాలాక్షికి... తెల్లని విశాలాక్షికి... ఎవరూ ఉత్తరం రాయనే లేదా? ఉహు... రాసేవుంటారు’’ అని చాలామందికి అనిపించవచ్చు.

ఐనా విశాలాక్షికీ అనుభవం కొత్త. కారణం... విశాలాక్షి వయసులోనే వున్నా... పట్నంలో చదువుతున్నా, తెల్లగావున్నా అంత బావుండదు. అలాగని అనాకారి కాదు... కాని ఆ లేని అనాకారితనానికి అబ్బాయిల్ని పిచ్చెక్కించే ప్రేమలేఖ రాయడానికి పురిగొల్పే శక్తి లేదు. అందుకే విశాలాక్షి కొన్నాళ్లు బాధపడేది.
 
తను పి.యు.సి.లో వుండగానే తన క్లాస్‌మేట్ సరస్వతికి తమ సీనియర్ వుంగరాల జుత్తబ్బాయి ప్రేమలేఖ రాసినప్పుడూ... ఫస్టియర్‌లో వున్నప్పుడు పక్కరూమ్‌లోవున్న అరుణని దేవానంద్ లాంటబ్బాయి ప్రేమించి సినిమాలకీ, పిక్నిక్కులకీ తీసుకెళ్లినప్పుడు... విశాలాక్షికి దాదాపు ఏడుపొచ్చింది. అందర్నీ అందరూ కాకపోయినా, చాలామంది అమ్మాయిలని అబ్బాయిలూ, అబ్బాయిల్ని అమ్మాయిలూ ప్రేమిస్తున్నారు. ‘కాని తన్నెవరూ ప్రేమించరేం’ అని కించపడేది. ఆఖరికి ‘నేనంతందంగా వుండను కాబోలు’ అని సమాధానపరచుకుని, అప్పటికి నిట్టూర్చి... ఓపికున్నంతవరకూ విచారించేది. కాని ఇన్నాళ్లకు... మూల పడేసిన వీణనెవ్వరో తీసి మ్రోగించినట్టూ, తంత్రులు సరిచేసినట్టూ ఐంది.
 
విశాలాక్షి తలనొప్పి పోయింది. మన సిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆ అబ్బాయి తనను ప్రేమిస్తున్నాడు కాబోలు. ప్రేమించకపోతే అలా ఎందుకు రాస్తాడు?? ఇన్నాళ్లకు తనను ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు. విశాలాక్షి అద్దం దగ్గరికి వెళ్లి అద్దంలో చూసుకుంది. తన కళ్లల్లో తనకే తెలియని కాంతీ, అప్రయత్నంగా మెరిసిన చిరునవ్వులో ఏవో అందాలూ... ‘‘నేనూ అందంగానే వున్నాను’’ అనుకుంది.
 అరే! అసలు సంగతి తను మరిచి పోయింది. రేపే ఆదివారం. ఆ ఎర్రచీర తనది కాదు. తన రూమ్‌మేట్ సరళది. రెండు మూడుసార్లు తనే ముచ్చటపడి కట్టుకొంది. ఎర్రచీరంటే తనకూ ఇష్టమే... ఇప్పుడు మరీ యిష్టం.
 
పొద్దున్న గదిలోంచి ఏ చీర కట్టుకు వెళ్లానో చూసుంటాడతను - మళ్లీ వచ్చేదాకా పాపం వేచివుంటాడు కాబోలు..! తనకోసం ఇంత శ్రమించిన ఒక మగప్రాణి వుందంటే విశాలాక్షికి చాలా సంతోషంగా వుంది. చెప్పలేనంత సంతోషంగావుంది.
 విశాలాక్షి కుర్చీలో కూర్చుని వుత్తరం మరోమారు చదివింది, దాన్ని జాగర్తగా పెట్లో దాచేసి, మళ్లీ కూర్చొని ఏదో ఆలోచించనారంభించింది. చల్లనిగాలి వీస్తుండగా, ఈ ప్రపంచంలో ఎవరూ సాధించలేని విజయం సాధించినంత సంతోషం కలగనారంభించింది.
     
ఉదయం ఎనిమిది గంటలకు నిద్ర లేచిన విశాలాక్షి ‘ఆదివారం వచ్చేసింది’ అనుకొంది సంతోషంగా, ఆరాటంగా. ఆమె మనసులో ఇప్పుడు ఆకాశమంత సంతోషం వుంది. ఆలోచనలో సముద్ర మంత ఆరాటముంది. గబగబా కాలకృత్యాలు ముగించుకొని పుస్తకం చేత్తో పట్టుక్కూర్చొంది.
 ‘‘ఏమిటోయ్! ఇవాళా చదువే? మార్నింగ్‌షోకి పోదాం రారాదూ అంది సరళ. విశాలాక్షి ఏదో చెప్పేంతలో బయట అడుగుల చప్పుడు వినబడింది. వార్డెన్ గదిలోకి వచ్చింది.
 ‘‘విశాలాక్షీ... మీ అన్నయ్యగాబోలు విజయనగరం నుంచి వచ్చారు. నిన్ను చూడాలట. కింద విజిటర్స్ రూమ్‌లో వున్నారు రా’’ అంది.
 
‘‘ఉండవోయ్ మళ్లీ వస్తాను’’ అని సరళతో చెప్పేసి కిందకు వెళ్లింది విశాలాక్షి.
 ‘‘ఏవమ్మా! బావున్నావా?’’ అన్నాడు కింద గదిలో కూర్చున్న అన్నయ్య.
 ‘‘ఊ’’ అంది విశాలాక్షి.
 ‘‘సుభద్రమ్మగారికి బొత్తిగా కనపడ్డం మానేశావుట’’ అన్నాడు రామారావు.
 సుభద్రమ్మ రామారావు అత్తగారు. రామారావ్ విశాలాక్షన్నయ్య. వాళ్లంటే విశాలాక్షికి అసహ్యం. ఆప్యాయత మీటర్లలో కొలిచి మరీ వొలకబోస్తారు.

ఆవిడకీ మిగతావాళ్లకీ విశాలాక్షంటే అసూయా, కోపం. హాస్టల్లోవుంటూ చదువుకుంటున్నందుకూ, పోకిరీ వేషా లేస్తుందని అభిప్రాయం వున్నందుకూ.     
 ‘‘అమ్మానాన్నల దగ్గర్నుంచి వుత్తరాలొస్తున్నాయా?’’ అన్నాడు రామారావు.
 ‘‘ఊ’’
 సరే! అలా వెళ్లి మాట్లాడుకుందాం రా! ఓసారి నువ్వు వాళ్లని చూసినట్టూ వుంటుంది’’ అన్నాడు రామారావు. విశాలాక్షికి వస్తాననక తప్పింది కాదు.
 
‘‘సరే, వుండు గదికి వెళ్లొస్తాను’’ అని చెప్పి గదిలోకి వచ్చింది. సరళకప్పుడే చీర సంగతి చెప్పేస్తే సరి. కాని... ఎలా చెప్పడం? యేం బావుంటుంది? ఐనా సరళ ఎక్కడికి వెళ్తుంది కనక? వెళ్లినా ఆ చీర పెట్లోనే వుంటుందిగా? ఆ మాత్రం అడక్కుండా చీర తీసుకునే చనువూ అధికారం తనకు లేకపోలేదు.
 ‘‘నేను మార్నింగ్ షోకి వెడుతున్నానోయ్! మధ్యాహ్నం కలుద్దాం. నీకిప్పుడు తీరిక లేదుగా! నా దగ్గరో తాళం వుంది. నువ్వు తాళం వేసుకుని వెళ్లిపో. బై బై..’’ అంటూ మరో ఫ్రెండ్ కోసం కాబోలు... పక్క రూమ్‌కి వెళ్లింది సరళ.
 
విశాలాక్షికంతా ఆరాటంగా వుంది. తలుపు తాళం వేసి కిందకు వచ్చి ‘‘పదన్నయ్యా’’ అంది.
 ఆ మధ్యాహ్నం విశాలాక్షికి సుభద్రమ్మ గారింట్లో భోంచేయక  తప్పింది కాదు.  ఓ పక్క మొహమాటం... బిగువు... బిడియం. మరోపక్క సాయంత్రం గురించి ఆరాటం... తొందర.
 భోంచేశాక ఓ అరగంట కూచొని పనుందని అందరి దగ్గరా సెలవు తీసుకుని వచ్చేసింది. ‘‘వచ్చేవారం మళ్లీ కలుస్తాన్లే... జాగ్రత్తగా చదూ’’ అన్నాడు రామారావు.
 ‘‘ఊ’’ అనేసి వచ్చేసింది విశాలాక్షి.
     
‘‘నీ కోసం చూసి, ఓ పావుగంట క్రితం వాళ్ల బంధువులింటికి వెళ్లింది సరళ’’ అంది పక్క రూము భానుమతి.
గదివైపు చూసింది విశాలాక్షి. తాళం కప్ప వెక్కిరించింది. వాచీ చూసుకుంది. మూడైంది. తాళం తీసి గదిలో ప్రవేశిం చింది. తను ఆరుగంటలకి పార్కుకెళ్లా లంటే సరళ కనీసం ఐదుకైనా యిక్కడుండాలి. కాని... సరళ సంగతి తనకి తెలుసు. బంధువులతో ఆదివారం బైటకెడితే భోజనాల టైమ్‌కి కాని రాదు. ఇప్పుడెలా? ఫరవాలేదు. ఆ పెట్టె తాళం లాంటిదే మరోటి తన దగ్గర వుంది. చీర తీసుకోవచ్చు’’... అనుకుంది విశాలాక్షి. అనుకోకుండా విశాలాక్షికి మళ్లా తల నొప్పి ప్రారంభమైంది. కాస్త అమృతాం జనం పట్టించుకొని ఐదుగంటలకి అలారం పెట్టి బెడ్ మీద వాలింది విశాలాక్షి.
     
విశాలాక్షి బరువుగా కళ్లు తెరిచేసరికి గదిలో సగం వెలుగుతో బాటు చీకటి కూడా ఆక్రమించింది. తలలో ఎవరో సుత్తులతో సున్నితంగా కొడుతున్నారు. వెంటనే లేచి టైము చూసింది. వాచీ నాలుగున్నర దగ్గర ఆగిపోయింది. వెంటనే రిస్టు వాచీ చూసుకుంది. ఆరూ పది నిముషాలైంది. తలలో సుత్తులు ఇప్పుడు బరువుగా కొట్టడం మొదలెట్టాయి!
 
‘‘అరెరే!’’ అనుకొంటూ పక్కమీంచి లేచింది. ఆరాటం, ఆతృత, భయం, విసుగు, కోపం! గబగబా ముఖం కడుక్కొని సరళ పెట్టె తెరిచింది విశాలాక్షి. దేవుడు తనమీద పగ తీసుకుంటున్నట్టు అనిపించింది. పెట్టంతా గాలించినా, ఎర్రచీర ఎక్కడా కనబడలేదు.
 విశాలాక్షికేం చేయాలో తోచలేదు. వాచీ ఆరూ ఇరవై చూపిస్తోంది. ఆరాటం! భయం! కోపం! విసుగు!
 ఇప్పుడేం చేయాలి? ఏదో చెయ్యాలి? ఎలాగైనా అక్కడికి వెళ్లాలి. పోనీ ఏదో ఓ చీర... ఏం చేయడం మరి... వెళ్లకపోతే అసలు ప్రమాదమే! అతను? అతన్ని కలుసుకోవాలి. లేకపోతే రేపతని ప్రయాణం. వెళ్లాలి... వెళ్లాలి.
 
విశాలాక్షి లేచి ముఖం కడుక్కొంది... తనకున్న వాటిలో గులాబీ రంగు చీర... కాస్త వెలిసిపోయింది కట్టుకుంది. ఓ పక్క వొళ్లు స్వాధీనం తప్పిపోతోంది. ఏమైనా వెళ్లాలి అనుకుంటూ రూమ్ తాళం వేసి మెట్లు దిగింది. బరువైన మనసుతోనే బలవంతంగా శక్తి తెచ్చుకుంటూ, జోరుగా బీచ్ వైపు నడిచింది విశాలాక్షి.
     
బీచి బిజీగావున్న హృదయంలా సందడిగా వుంది. చంటిపిల్లల దగ్గర్నుంచి, చరమదశ ఎంతో దూరంగా లేనివాళ్ల వరకూ అందరూ గాలిని, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. విశాలాక్షి తొందరగా పార్కులోకి ప్రవేశించింది. టైము ఆరున్నరైంది. చీకటి, వెలుగు ఒకే సరిహద్దును చేరుకున్నట్టు న్నాయి! ప్రకృతికి ఇద్దరు కవల పిల్లలు పుట్టినట్టు వెలుగూ చీకటీ కలిసి ఒకేలాగున్నాయి!
 ఒక్కసారి విశాలాక్షికి దూరంగా లీలగా ఎర్రచీర కనబడింది. ‘‘ఔను! సందేహం లేదు. ఆమె సరళే!’’ అనుకుని గబగబా సరళ వద్దకు నడిచింది.
 ‘‘సరళా...’’
 
‘‘హల్లో విశాలా? మధ్యాహ్నం ఏమై పోయావోయ్! నీకోసం చూసి చూసి మావాళ్లతో వాళ్లింటికెళ్లి ఇలా వచ్చేశాను. పోనీలే, ఏమైతేనేం వచ్చావుగా?’’ అంది సరళ అందంగా నవ్వుతూ.
 విశాలాక్షి మనసక్కడ లేదు. అతను... అతన్నెలా పోల్చుకోవడం? తనే ఎర్రచీర కట్టుకోవాల్సిన వ్యక్తినని ఎలా చెప్పడం?
 ‘‘ఏయ్ విశాలా? ఏమిటాలో చిస్తున్నావ్?’’ అంది సరళ. విశాలాక్షి ఉలిక్కిపడి సరళకేసి చూసింది.
 ఎర్రచీరలో సరళ ధగధగా మెరిసి పోతోంది. తనలాగే రెండు జడలు. దాదాపు తనంతే పొడుగు... విశాలాక్షి మనసులో ఏదో అవ్యక్తమైన ఆలోచన మెరిసింది.

ఎడం కన్నొక్కసారి అదిరింది.’’
 ‘‘ఏయ్! అది సరే కాని ఓ చిన్న గమ్మత్తు చెప్పనా’’ అంది సరళ.
 ‘‘ఊ’’ అంది మనసుని స్వాధీన పర్చుకోవడానికి ప్రయత్నిస్తూ విశాలాక్షి.
 ‘‘ఇందాక... నేను మా కజిన్స్‌తో బీచి కొచ్చినప్పుడు, అంటే వాళ్లూ ఇప్పుడిక్కడే వున్నారనుకో!’’ అంటూ నాలుగడుగుల దూరంలో కూచున్న మరో ఇద్దరమ్మా యిల్ని చూపించింది సరళ. ‘‘వాళ్లతో మాట్లాడుతున్నాను. ఇంతలో ఎవడో బ్రూట్ దగ్గరగా వచ్చి మాట్లాడబోయాడు. చూస్తే పెద్దమనిషిలాగున్నాడని ఏమిటని అడిగాను.

అప్పుడు ఏమన్నాడో తెల్సా -
 ఎర్రచీరలో మీరెంతో బావున్నారు. నా మాట కొట్టేయకుండా ఇలా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. జీవితాంతం మిమ్మల్ని మర్చిపోలేను. మీ పేరు కూడా చెబితే కృతజ్ఞుణ్ని’’ అనింకా ఏదో అనబోయాడు.
 ‘‘ఆ! అప్పుడేమైంది?’’ అనడిగింది విశాలాక్షి కంగారుగా.
 ‘‘ఏముందీ - మర్యాదగా మాట్లాడు మిస్టర్! పిచ్చిగా వాగవద్దని ఇంకా బాగా చీవాట్లు పెట్టి పంపించాను. మా కజిన్స్ కూడా బాగా దులిపేశారనుకో! వెంటనే వెళ్లిపోయాడు పాపం’’ అని వెంటనే ‘‘ఏయ్! అడుగో వాడే!’’ అంది పార్కుపై నున్న కిళ్లీ కొట్టుకేసి చూపిస్తూ సరళ.
 
విశాలాక్షి కంగారుగా అటు చూసింది. అప్పుడే టర్నింగ్ తిరిగి ఎర్రటి ఇంజిన్‌తో వున్న పదో నంబరు బస్సు వచ్చి ఆగింది. పార్కుపైన కిళ్లీకొట్టు దగ్గర్నుంచి తెల్లటి ప్యాంట్‌లో నల్లటి సిల్కు షర్ట్ టక్ చేసిన ఓ ఆకారం దిగులుగా, నీరసంగా - బస్‌వైపు నడిచింది.
 ‘‘వాడే! బ్రూట్. ఆ నల్లషర్టు...’’ అంది సరళ.
 
విశాలాక్షికి పరుగెత్తుకువెళ్లి అతని చేతులు పట్టుకు ఆపాలనిపించింది. అన్నీ వివరంగా చెప్పేసి క్షమాపణ కోరుకోవా లనిపించింది. అప్రయత్నంగా కళ్ల వెంట నీళ్లుకారి ఆరిపోయాయి. వెంటనే... సరళ వెనక్కి వెళ్లిపోయింది.
 ‘‘ఏమోయ్, ఏమైంది?’’ అంది సరళ విశాలాక్షి వైపు తిరుగుతూ.
 సరళ ఎర్రచీర పైట గాలికి విలాసంగా ఎగురుతోంది. ఎగురుతోన్న ఆ ఎర్రపైట లోంచి మెల్లగా కదిలిన బస్సు స్వప్న శిఖరంలోంచి జారిపోయిన యదార్థంలాగ కనిపించింది విశాలాక్షికి.
 
విశాలాక్షికి కన్నీళ్లాగలేదు. ఆమెతో పాటు ఆమె మనసు కార్చిన కన్నీళ్లలో మధురమైన భావాలన్నీ తడిసి ఎటో కొట్టుకుపోయాయి! హృదయంలో లెఖ్ఖలేనన్ని డైనమైట్లు బద్దలవుతున్నాయి. అంతా పీడకల లాగ... అందరూ శత్రువు ల్లాగా... సైనేడ్‌లో ముంచిన కత్తుల్లాగా కనబడుతున్నారు. సముద్రమంతా తనమీదకే కొట్టుకొచ్చినట్లయింది.
 
‘‘అరరే! ఇదేమిటి విశాలా? కన్నీళ్లు!’’ అంది సరళ. దీనంగా సరళ వైపు చూసింది విశాలాక్షి. సరళ కట్టుకున్న ఎర్రచీర, కన్నీళ్లలోంచి రక్తపుముద్దలా కనిపించింది విశాలాక్షికి.
 (శ్రీరంగం రాజేశ్వరరావు రాసిన కథకు సంక్షిప్త రూపం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement