తుపాన్ రాత్రి | Night storm story | Sakshi
Sakshi News home page

తుపాన్ రాత్రి

Published Sun, Aug 16 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

తుపాన్ రాత్రి

తుపాన్ రాత్రి

క్లాసిక్ కథ
అతణ్ని చూస్తూ ఉంటే అతనో పెద్ద మాటకారిలాగానే ఉన్నాడు. చెప్పిన విషయం చెప్పకుండా చెప్పుకుపోతున్నాడు. ఇంట్లోంచి కాఫీ తెప్పించాడు. తాగుతూ కూర్చున్నాను. అతను విషయం మార్చాడు. తనకు ఉద్యోగం దొరికిన తొలిరోజుల గురించి చెప్పడం ప్రారంభించాడు. ఎలాగైతేనేం చివరికి విశాఖపట్నంలో ఉద్యోగం దొరికింది. ఒక పెద్ద వ్యాపారస్తుడు సముద్రపు ఒడ్డున బీచ్‌రోడ్‌లో వరుసగా పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాడు. అతను నన్నక్కడ సూపర్‌వైజర్‌గా నియమించుకున్నాడు. మంచి జీతం, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు.

పని జరుగుతున్న చోటుకు నాకిచ్చిన ఇల్లు చాలా దగ్గర. సూపర్‌వైజర్ అన్న డిజిగ్నేషన్ నాకెందుకో ఎబ్బెట్టుగా అనిపించేది. కాని అందులోని లోతుపాతులు తెలిసిన తర్వాత, అదే బావుందనిపించింది. కాని మొదట్లో ఉద్యోగం నిలదొక్కుకోవడం కష్టమే అయ్యింది. కాంట్రాక్టరు, రాళ్లు కొట్టేవాళ్లు, వడ్రంగి పనివాళ్లూ అందరూ... అనవసరంగా నేను వాళ్ల పనుల్లో జోక్యం కలిగించుకుంటున్నట్లు బాధపడిపోయేవారు. కాని కొద్దికాలంలోనే ఎవరిని ఎప్పుడు బెదిరించాలో, ఎప్పుడు ఎలా పని చేయించుకోవాలో తెలుసుకున్నాక ఇక ఏమాత్రం కష్టమనిపించలేదు. మీరు నమ్మండి, నమ్మకపోండి. అది మీ ఇష్టం.

కాని నా అంతటి అదృష్టవంతుడు అసలు దేశంలో ఉన్నాడా అనిపించేది అప్పట్లో - ఎందుకంటే చెప్తాను వినండి. అదృష్టం నంబర్ వన్-సూపర్‌వైజర్‌గా నా పని అతి సులభంగా ఉండేది. సామాన్యంగా నా పర్యవేక్షణంతా ఇంట్లో పడుకుని కిటికీ గుండా చేస్తూ ఉండేవాడిని. అదృష్టం నంబర్ టు - నేనూ, నా భార్య అందమైన ఊహా ప్రపంచంలో బతికేవాళ్లం. ఎందుకంటే అప్పటికింకా మా అబ్బాయి పుట్టలేదు. వాడు పుట్టడానికి ఇంకా నెలరోజుల వ్యవధి ఉంది. అదృష్టం నంబర్ త్రీ - మా ఇల్లు ప్రశాంతమైన పరిసరాల్లో అధునాతనంగా ఉండేది. ఇక సముద్రమా? వాకిట్లోకి సరిగా పది అడుగులే. అట్లా అన్నీ కలిసొచ్చాయి.
 
అది నవంబర్ నెల. ఒకరోజు ఉదయమే మామూలు ప్రకారం తొమ్మిదిన్నరకు నిద్రలేచాను. బయటంతా కారుమబ్బులు కమ్ముకుని నల్లగా ఉంది. పనివాళ్లు నాకోసం కాచుకుని ఉన్నారు. విషయమేమిటని తెలుసుకుంటే, ఆ రోజు వాతావరణం బాగోలేదు కాబట్టి పనిలోకి పంపించవద్దని అభ్యర్ధించారు. అలాంటి పిచ్చివేషాలు వేయగూడదని, మాట్లాడకుండా పనిలోకి వెళ్లమని గద్దించాను. కొద్దిసేపటి తర్వాత వీధిలోకి వెళ్లాను. ప్రపంచమంతా స్తంభించినట్లుంది. అందరి ముఖాలు దీనంగా ఉన్నాయి. ఎక్కడా చైతన్యం లేదు.
 
అప్పటికి పది కావస్తోంది. అయినా దుకాణాలు తెరవలేదు. మామూలు రోజు పగటిపూట దుకాణాలు మూసి ఉంచడం విడ్డూరంగా అనిపించింది. ఒక్కసారిగా ఘొల్లుమని గోల వినిపించి అటూ ఇటూ చూశాను. పక్కనే ఉన్న పాఠశాల విడిచిపెట్టారు. పిల్లలందరూ కేకలేస్తూ గేట్లోంచి బయటికొస్తున్నారు. సెలవు దొరికిందన్న సంతోషం కాబోలు! ఒక పిల్లవాడు మాత్రం బరువైన సంచీని బలవంతంగా మోస్తూ ఏడుస్తూ నడుస్తున్నాడు. ఏమైందని నేనా పిల్లవాణ్ని దగ్గరికి తీసుకున్నాను. వాడు ఏడుపుతోనే చెప్పాడు.
 
‘‘మరండీ... ఈ రోజు ప్రపంచం మునిగిపోతుందాండీ. అట్లా అని మా టీచరుగారు చెప్పారు’’ అని అన్నాడు. నేనింటికి వెళ్లగానే నా భార్య అలాగే చెప్పింది. భయం భయంగా ముఖం పెట్టి వణుకుతున్న గొంతుతో, ‘‘ప్రపంచం ఈ రోజుతో ముగుస్తుందటండీ’’ అని చెప్పి, నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉండబట్టలేక బొలబొలమని ఒక ఖాళీ నవ్వు నవ్వింది. ప్రపంచం అంతమవడం అన్న విషయమ్మీద నేనూ కొన్ని పిచ్చి జోకులు వేసి తనని నవ్వించాను. నిజంగానే ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వస్తే మంచి మంచి చీరెలు ఏరుకుని వెంట తీసుకుపొమ్మని... ఆమెకు సలహా ఇచ్చాను.
 
మిట్ట మధ్యాహ్నానికి చూద్దును కదా సైట్‌మీద ఎవరూ లేరు. పనివాళ్లంతా చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. అంతా నిర్మానుష్యంగా తయారైంది. వాళ్లలా వెళ్లిపోవడం నాకెంతో కోపం తెప్పించింది. ప్రపంచం మునిగిపోతుందన్న వార్త ఎవరు ఎప్పుడు పుట్టించారో గాని, వాతావరణం అందుకు తగినట్లుగానే భయంకరంగా మారిపోయింది. పగలు మూడు గంటలకే అన్ని దిక్కులకు చీకటి వ్యాపించింది. కొబ్బరిచెట్లు హోరుగాలికి నిలవలేకపోతున్నాయి. ఒక్కోసారి కింద ఇసుకను తాకి లేస్తున్నాయి.

జానపద కథల్లో దెయ్యాల నృత్యాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాయి. చల్లని వేళల్లో నాలో కవిత్వాన్ని పుట్టించే సముద్రం అప్పుడు ప్రళయరూపాన్ని దాల్చింది. సముద్రపు నీరు ఎర్రగా మురికి రక్తంలాగా అయ్యింది. ఒక్కొక్క కెరటం ఎత్తులో సగం కొబ్బరి చెట్టంత ప్రమాణంతో ఉంది. ఈ భూమండలాన్ని ఈ క్షణమో, మరో క్షణమో కప్పివేయాలన్నట్లు కెరటాలు ఒకదాని కంటే మరొకటి వేగంతో ఉధృతంగా లేచి పడుతున్నాయి. విపరీతమైన సముద్రపు హోరు మానవ నాశనాన్ని కోరుతున్నట్లుగా ఉంది.
 
నా శ్రీమతి నా పక్కనే చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది. తర్వాత ఒంట్లో నలతగా ఉందని పోయి పడుకుంది. ఆమె ఉదయం ఉన్నంత ఉత్సాహంగా లేదు. ముభావంగా, బలహీనంగా ఉన్నట్లు కనిపించింది. దీపం వెలిగించి, ఆమె పక్కనే వెళ్లి కూర్చుని ఆరోజు వార్తాపత్రికలోని వింతల్ని, ముఖ్యమైన వార్తల్ని చదివి వినిపించాను. ఎలాగైనా ఆమె మనసుకు ఉల్లాసం కలిగించాలని నా ప్రయత్నం.

ఆ సమయానికి బయట సముద్రం రాక్షసిలా ఘోషిస్తోంది. ఈదురుగాలి రక్తదాహంతో కేకలేస్తున్నట్లుగా ఉంది. దానికితోడు యింటి కప్పును సమ్మెటలతో బాదుతున్నట్లు వర్షం మొదలైంది. నేను చదువుతున్న వింత వింత వార్తల్ని మా ఆవిడ నిశ్శబ్దంగా వింటోంది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా మూలగడం మొదలుపెట్టింది. మరికొంతసేపటికి తనకు నొప్పులు మొదలయినాయని ప్రకటించింది.
 
రాత్రి ఎనిమిదయ్యేసరికి ఆమె పరిస్థితి మరీ విషమించింది. నాకేం చేయాలో తోచలేదు. అంత బాధలో కూడా ఆమెకు నా ఆకలి జ్ఞాపకం ఉంది. వెళ్లి వంట చేసుకొమ్మని సలహా ఇచ్చింది. నిజంగా అప్పటికే ఆకలితో కడుపు కాలిపోతూ ఉంది. వంటింట్లోకి ప్రవేశించాను. పొయ్యి అంటించే ప్రయత్నం చేశాను. నేర్చుకోలేక నేను ఓటమిని అంగీకరించిన విషయాల్లో సైకిలు తొక్కడం, తర్వాత ఈ పొయ్యి అంటించడం ఒకటి. మన ఆడవాళ్లు అంత సులభంగా నిమిషంలో ఎలా పొయ్యి అంటిస్తారోనన్నది నాకు అంతుపట్టని విషయమే!

ఈ విషయంలో వాళ్లకు జోహార్లు అర్పించాల్సిందే. పొయ్యి నిండా కట్టెలు పేర్చాను. అగ్గిపెట్టె కోసం వెతికాను. తెరిచివున్న కిటికీ పక్కగా తడిసిన అగ్గిపెట్టె కనిపించింది. ఒకదాని తర్వాత ఒకటి యాభై పుల్లలు గీశాను. ఒక్కటీ వెలగలేదు. అనుకోకుండా యాభై ఒకటవ పుల్ల కాబోలు వెలిగింది. దాంతో పక్కనే ఉన్న పాత దినపత్రిక అంటించాను. అది పూర్తిగా కాలిపోక ముందే వార్తాపత్రిక పేజీలు ఒక్కొక్కటే కాలుస్తూ పొయ్యాను.

కాని పొయ్యిలోని కట్టెలు మాత్రం ఇంకా అంటుకోలేదు. నా వేళ్లు అప్పటికే చాలాసార్లు అంటుకున్నాయి. అప్పుడు నాకు అనిపించింది. ఈ ఇళ్లు, దుకాణాలు ఉత్తుత్తగా ఎలా తగలబడిపోతాయో నాకు అర్థం కాలేదు. వంటింటి నిండా పొగ నిండింది. ఊపిరి ఆడడం కష్టమైపోయింది. అప్పటికే కళ్లూ, ముక్కూ పొగను పంచుకున్నాయి.
 వంటిల్లు విడిచిపెట్టి లోన గదిలోకి వెళ్లాను. ‘‘ఏమైనా తిన్నారా?’’ శ్రీమతి అడిగింది.
 
‘‘హూ! ఇంకా అది కూడానా? తుపాను వచ్చినా బతికి బయటపడొచ్చు కానీ, ఈ ఆకలితో బతికేట్లులేను’’ అని కోపంతో అరిచినట్లే చెప్పాను. అప్పుడు నాలో పొయ్యి అంటించడం చేతకాలేదన్న ఉక్రోషం ఉంది. అందుకే మూతి ముడుచుకుని కోపంగా కూర్చున్నాను. సామాను గది అంటే మరేదో కాదు, వంటింట్లోనే ఓ మూలకు సామాను గది అని గౌరవప్రదమైన పేరు. పాలు ఉన్నాయనగానే ముఖం బల్బులా వెలిగించుకుని సామాను గదిలోకి వెళ్లాను. ఒక్క గుటకలో పాలు స్వాహా చేసేవాడినే. కాని మళ్లీ ఆలోచించాను.

శ్రీమతి పరిస్థితి బాగా లేదు. ఆమెకు ఏ సమయంలోనైనా వీటి అవసరం రావొచ్చు. మరేదైనా తిని కడుపు నింపుకుందామనుకున్నాను. సామాను గదిలోని, కుండలు, బుట్టలు, డబ్బాలు అన్నీ వెతకడం ప్రారంభించాను. ఒక కుండలో మెత్తగా, జిగటగా ఏదో తగిలింది. బహుశా చింతపండు అయివుంటుందని చేయి వెనక్కి తీసుకునే లోపలే వేలికి ఏదో కరిచింది. కంగారుపడి కుండ బోర్లించి చూస్తే అందులోంచి నల్లగా, పెద్దగా, లావుగా ఉన్న తేలు బయటపడింది. దాన్ని చూడగానే పైప్రాణాలు పైనే పోయాయి. కొద్దిసేపటికే మంటలు మొదలయ్యాయి. విషం - ప్రభావం చూపుతోందన్న మాట! బాధతో ఎగిరాను. గంతులేశాను. కిందపడి దొర్లాను. ముందు గదిలోకురికాను.
 
పెనుగాలి ఇంకా తీవ్రమైంది. ముందు గది పైకప్పు పెంకులు కొన్ని ఎగిరిపొయ్యాయి. వర్షపు నీళ్లతో ఇల్లు నిండిపోయింది. నిలుచుండే చోటు ఎక్కడా లేదు. ఇల్లు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చునన్నంత ఘోరంగా ఉంది పరిస్థితి. కొట్లాటల్లో విసురుకునే కత్తుల్లాగా ఇంట్లోని క్యాలెండర్లు, పటాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎగిరిపడుతున్నాయి. వీటికి తోడు తేలు విషం! మంటలు, పోట్లు భరించలేకుండా ఉన్నాయి. నీళ్లలోంచి కాళ్లను లాక్కుంటూ శ్రీమతి ఉన్న గదిలోకి వెళ్లాను.

ఆ గది కొంత మెరుగ్గా ఉంది. మంచంమీద ఆమె బాధతో మూలుగులతో మెలికలు తిరిగిపోతోంది. నేనక్కడే నిశ్చేష్టుణై్నపోయి నిలబడ్డాను. ఏం చేయాలో తోచలేదు. అవి పురిటి నొప్పులే అని ఆమె స్పష్టం చేయడంతో శపించేద్దామన్నంత కోపం వచ్చింది. లేకపోతే ఇలా పరిస్థితులన్నీ ఒకేసారి విషమించిన రోజే ఆమె ఈ నొప్పులు తెచ్చుకోవాలా? బాధలోనే మధ్యలో చెప్పింది, ‘‘మిమ్మల్ని బాధ పెట్టదలచుకోలేదు గానీ ఏం చేయనూ? తప్పదు - వెళ్లి ఎవరినైనా సహాయం పిలుచుకు రండి.’’
 
సహాయం..? ఎవరొస్తారు ఇంత రాత్రి తుపానులో? అయినా నాకిక్కడ ఎవరు తెలుసుననీ? అంతా కొత్త. ఇక తప్పదని, లాంతరు ఒక చేత, గొడుగు మరో చేత పట్టుకుని సిద్ధమయ్యాను. వెళ్తున్నట్టు ఆమెతో చెప్పి, చిర్నవ్వొకటి విసిరేసి బయలుదేరాను. మా ఇంటి ముందు రోడ్డు కొంత భాగం చెడిపోయి గుంటలయ్యాయి. వాటిలో సముద్రపు నీరు వచ్చి చేరింది. అక్కడ ఇళ్లు దూరందూరంగా ఉన్నాయి గనుక, మా పక్కింటికి వెళ్లాలంటే కొంత దూరం నడవాల్సి ఉంటుంది. అందుకు దగ్గరి తోవ వెతుకుతున్నాను.

ఇంతలో గాలికి గొడుగు లేచిపోయింది. ఎటు పోయిందో కనిపించలేదు. వెనువెంటే లాంతరు ఆరిపోయింది. నేనిక చీకట్లోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. కాళ్లతో తోవలోని రాళ్లను పుణుక్కుంటూ పుణుక్కుంటూ చెట్లను, పొదలను తప్పించుకుంటూ నడిచాను. వీటికితోడు వీపులో వెన్నుపూస మీద చల్లని వర్షపునీరు పారుతున్న సంతోషమొకటి. కనిపించని దయ్యాల చేతిలో నలిగిపోతున్నట్లు అనిపించింది. చెట్లు కుడికి, ఎడమకు కొట్టుకుంటున్నాయి. ఈదురుగాలి మృత్యు సంకేతంలా ఉంది. కాళ్లు కోసుకుపోయి రక్తం కారుతున్నట్లుంది. అప్పటికి గాని నేను పక్కింటికి చేరలేదు.

అందులో ఒక విదేశీయుడు ఉంటున్నాడు. తను పోలీసు అధికారి. అతని ఇంటిముందు క్రూరమైన పెంపుడు కుక్కలుంటాయని జ్ఞాపకం వచ్చింది. అడుగు వెనక్కి వేశాను. ఆలోచిస్తూ కొద్దిసేపు నిలబడ్డాను. ఆ ప్రాంతానికి నేను కొత్త. ఎవరూ తెలియదు. అసలు ఎవరు ఎక్కడుంటారో తెలియంది ఎవరింటికని వెళ్లడం? ఆకాశంలో మెరుపు మెరిసింది. నా మనసులో కూడా మెరిసినట్లయింది.

వెంటనే అక్కడి నుండి కదిలాను. అదే రోడ్డులో మరో పదడుగులు పోతే ఒక డాక్టరుగారిల్లుంది. అతని యింటికి ‘సాగర దృశ్యం’ అనే పేరు కూడా ఉంది. తేలుకుట్టిన వేలు నోట్లో వేసుకుని చీకుతూ పరిశీలించుకుంటే తెలిసిందేమంటే - నేనప్పుడు చిన్నపిల్లాడిలా భోరుమని ఏడుస్తూ నడుస్తున్నాను.
 
మిట్టలూ, పల్లాలూ జాగ్రత్తగా దాటుతూ ‘సాగర దృశ్యం’ అనే డాక్టరుగారి యింటి వరండా చేరుకున్నాను. సుమారు యిరవై నిమిషాలు తలుపు బాదాను. తర్వాత యింటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కేకలు పెట్టాను. అప్పుడుగాని ఒక మూల కిటికీ తెరుచుకోలేదు. అందులోంచి ఒక స్త్రీ కనిపించింది. ‘‘ఎవరు మీరు?’’ అని ఒక పనికిరాని ప్రశ్న వేసింది. నేనెవరో, నా వివరాలేమిటో ఆమెకు అన్నీ ముందే తెలిసినట్టు, నా పేరు చెప్పగానే ఆమె అంతా అర్థం చేసుకోబోతున్నట్టూ! గత్యంతరం లేక నా పేరు, వివరాలు గొంతు పెద్దగా చేసి చెప్పాను.

ఆ క్షణంలో నేనెన్ని కష్టాల్లో వున్నానో కూడా టూకీగా చెప్పాను. అంతా బూడిదలో పన్నీరులాగా కొద్దిసేపైన తరువాత ‘‘మీరెవరూ?’’ అని ఆమె మళ్లీ కేకేసింది. నేనూ కేకేశాను బదులు చెప్పడానికి - విపరీతమైన తుపాను చప్పుడులో ఎవరి మాట ఎవరికీ విన్పించడం లేదు.
 ఒక్కో ప్రశ్న ఆమె రెండు మూడుసార్లు అడగడం, నేను చెప్పడం జరిగింది. కిటికీలోంచి వచ్చిన కొద్ది వెలుగులో ఆమెకు నేనో భూతంలాగా కనిపించి ఉంటాను.

వర్షంలో తడిసి ముద్దయిన బట్టలు, బురదైపోయిన కాళ్లూ, చేతులూ, ముఖం నిండా అతుక్కుపోయిన వెంట్రుకలు... నా వాలకం చూసి ఆకలి భరించలేక అడుక్కునే బిచ్చగాడని ఊహించుకుందేమో గాని, గౌరవంగా ఉద్యోగం చేసుకునే పెద్దమనిషి అనుకుని ఉండదు. ఆకలితో ఒళ్లు తేలిపోతున్న మాట నిజమే. చివరికి శక్తినంతా కూడదీసుకుని గొంతెత్తి అడిగాను డాక్టరుగారి గురించి. ఆమె కూడా ఎంతో కష్టపడి బిగ్గరగా అరిచి చెప్పింది. డాక్టరుగారు యింట్లో లేరని, బొంబాయి వెళ్లారని, ఇంటి నిండా బంధువులు ఉన్నారని, అందరూ పడుకున్నారని, వాళ్లంతా లేస్తారేమోనని తను తలుపు తీయలేకపోతున్నానని, ఎంతో మర్యాదగా చెప్పింది.

నాకు సాధ్యమైనంత వరకు నేను దయ్యాన్నో, భూతాన్నో కాదని, ఒక కుటుంబీకుణ్నని, ఎంతో విషమ పరిస్థితినెదుర్కొంటున్నానని చెప్పాను. ఆమె కొంత జాలి కనబరిచింది. అయినా అది ఏం చేసుకోను? నాకు డాక్టరుగారు కావాలి. వైద్యం ఏమాత్రం తెలియని ఆమో, గాఢనిద్రలో ఉన్న ఆమె బంధువులో అక్కరలేదు.
 
అదృష్టం బాగుండి తిరిగి క్షేమంగా ఇల్లు చేరాను. ఒకరిని సహాయం రమ్మన్నాననీ, వాళ్లొస్తున్నారనీ శ్రీమతికి అబద్ధం చెప్పాను. ఆ చిన్న అబద్ధంతో ఆమె ముఖంలో కొత్త వెలుగు కనిపించింది. తర్వాత సముద్రం వైపున్న కిటికీ తెరవమని అడిగింది. అందుకు నేనొప్పుకోలేదు. అప్పటికే ఇల్లు పగుళ్లు బట్టి ఉంది. కిటికీ తెరవడమంటే తుపానుని గదిలోకి ఆహ్వానించడమేనని చెప్పాను. అదే విషయం మేం వాదులాడుకుంటూ ఉండగా వెనక వంటగది అంతా కుప్పకూలిపోయిన శబ్దమైంది. వెనువెంటనే మేమున్న గదిలో ఏదో పేలుడు సంభవించినట్లయ్యింది.

మేం తెరవాలా వద్దా అని చర్చించు కుంటున్న కిటికీ ఉధృతమైన గాలికి ఊడిపోయి కిందపడిపోయింది. గదిలోని దీపం ఆరిపోయింది. స్థాణువునైపోయి కుప్పగా కూలబడిపోయాను. లేచి చీకట్లో కిటికీ వెదికి దాని స్థానంలో దాన్ని పెడదామని ప్రయత్నించాను. అది అడ్డంగా ఉంటే పెనుగాలి బారి నుండి కొంతవరకు తప్పించుకోవచ్చని నా అభిప్రాయం. కిటికీని అదిమిపెట్టానే గాని చేతి తేలు మంటల్ని అదిమి పెట్టలేకపోయాను. అదే సమయంలో నన్ను భయకంపితుడ్ని చేసే విధంగా నా శ్రీమతి పెడబొబ్బలు పెట్టింది.

కేకలు వేసింది. మంచం మీద లేచి లేచి పడింది. నాకు పిచ్చిలేచినంత పనైంది. ధైర్యంగా ఉండమని, సహించి ఊరుకోమని చెప్పాను. కోప్పడ్డాను. చివరకు అడ్డమైన తిట్లన్నీ తిట్టాను. ఇంతలో కెవ్వుమని శిశువు కేక వినిపించింది. అనాలోచితంగా కిటికీని విడిచిపెట్టి ఆశ్చర్యంగా నిలబడ్డాను. కొత్తగా పుట్టిన శిశువు కేక తుపాను గాలినీ, చీకటిని ఛేదిస్తున్నట్లుగా ఉంది. ఈ జీవం సమాప్తం కాదు. కొత్త జీవం పుడుతూ ఉంటుందన్నట్లుగా ఉంది.
    
ఆయన అకస్మాత్తుగా నిలబడి ‘‘బాబూ ఇలారా’’ అని ఇంట్లోకి కేకేశాడు. కథల్లోలాగా ఆయన అనుభవం ఇంత విచిత్రంగా ఉండటం నాకు గమ్మత్తుగా అనిపించింది. ‘తర్వాత ఏమైంది? అంతటి భయానకమైన పరిస్థితుల్లో ఆ పసివాడు ఎలా బతికాడు?’ ఇలా అనేక రకాల ఆలోచనలు నా మెదడులో తిరుగుతున్నాయి. లోపలి నుండి ఓ చిన్న కుర్రాడొచ్చాడు. ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. వాడి కళ్లూ, వాడి చూపులూ చూడగానే మహాగడుసువాడేననిపించింది. వాడిలో చురుకుదనం, చలాకీతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
 
‘‘అయ్యా! వీడేనండి! ఆ తుపాను రాత్రి మమ్మల్నాడుకోవడానికి మా ఇంటికొచ్చిన పెద్దమనిషి’’ అని బొలబొలా నవ్వుకుంటూ కొడుకును వొళ్లో కూచోబెట్టుకున్నాడు అతను. తెలుగు అనువాదం: దేవరాజు మహారాజు
-  ఆర్.కె.నారాయణ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement