Rk narayan
-
ఆర్. కె. నారయణ్: అక్కరకు ఆదుకున్న మిత్రుడు.. కథ!
ఆ గదిలోని ముగ్గురు శత్రువులు తలపునకు వచ్చినపుడు తప్ప తక్కిన సమయంలో వారిసంతోషానికి హద్దులేదు. వాళ్లు ఇలాంటి స్థితిలో ఉండగా రాజం స్నేహం మీద ఉపన్యాసం దంచనారంభించాడు. ‘ఐకమత్యమే బలం’ అనే నీతిని గరిపే ‘ముసలివాడు– కట్టెల మోపు’ అనే కథను ఉదాహరణగా తీసుకుని, అందరికీ నచ్చేట్టు స్నేహాన్ని గురించి మాటాడాడు. మూడువారాల తరువాత ఒకనాటి మధ్యాహ్నం స్వామినాథన్ మణి ఇంటి ముందు నుంచుని సన్నగా ఈలవేశాడు. మణి వచ్చి అతనిని కలుసుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం గనుక వచ్చి తనను కలుసుకుంటే అద్భుతం చూపిస్తానన్నాడు. ఏమిటయి ఉంటుందా అని ఆలోచిస్తూ వాళ్లిద్దరూ రాజం ఇంటికి బయలు దేరారు. ‘‘ ఆ..యేంలేదు’’ అన్నాడు స్వామినాథన్ ‘‘రాజం యేదో యెగతాళికి అని వుంటాడు. వాళ్లయింటికి మనిద్దర్నీ రప్పించుకోవడాని కిదో యెత్తు’’ ఇలా అనుమానం వెలిబుచ్చినందుకు మురికికాలవలోకి తోసేద్దామనుకున్నాడు మణి. ‘‘బహుశా యేకోతినో కొనివుండవచ్చు’’ అని తిరిగీ అన్నాడు స్వామినా«థన్ ధైర్యంగా. మణి అతనిమీద మహాదయ చూపుతున్నట్టు ‘అయి ఉండవచ్చు’ అన్నాడు. వాళ్లకి ఆశ్చర్యంగొలిపే విషయాలు ఒకొకటే ఊహించుకుని చివరకు లాభంలేదని ఊహించడమే మానుకున్నారు. ఆలోచనలు శత్రువులమీదికి మళ్లాయి. ‘‘నే నేం చెయ్యబోతున్నానో తెలుసా?’’ అని అడిగాడు మణి. ‘‘ సోము నడుం విరగొట్టేస్తాను. వాడు యెక్కడ వుంటున్నదీ నాకు తెలుసు. బజారు వెనుక కబీర్వీధిలో వుంటున్నాడు. తమలపాకులు కొనక్కోవడానికి తరచుగా బజార్లో ఒక కొట్టుకు రావడం చూశాను. ముందుగా మునిసిపాలిటీ దీపం మీద రాయి విసిరి దాన్ని ఆర్పేస్తాను. కబీర్ వీధిలో యెంత చీకటో నీకేం తెలుసు?.. దుడ్డుకర్ర పుచ్చుకుని చీకట్లో నుంచుంటాను. వాడు వచ్చీ రావడంతోనే యెముకలు విరగ్గొట్టిపడేస్తాను...’’ ఈ మాటలు వింటూంటే స్వామినాథన్‌కి వణుకు పుట్టింది. ‘‘ అంతటితో అయిందీ’’ అంటూ మళ్లీ మొదలుపెట్టాడు మణి. ‘‘బఠాణీగింజ’’ను కాలికింద నలిపేస్తాను. యిక శంకర్‌ని సరయూనది ఒడ్డుమీది రావి చెట్టుమీద వేలాడగట్టివురేస్తాను.’’ రాజం ఇంటికి చేరుకోగానే మాటాడుకోవడం ఆపేశారు. గేటువేసి ఉంది. గోడఎక్కి లోపలకు దూకారు. ఒక నౌకరు వారివైపు పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘గోడ యెందుకు యెక్కారు?’’అని అడిగాడు. ‘‘యీ గోడ నీ అబ్బసొమ్మా యేం?’’ అని మణి విరగబడి నవ్వసాగాడు. ‘‘నడుములు విరిగితే’’– అంటూ మొదలుపెట్టాడు నౌకరు. ‘‘నీకెం? నీ నడుం విరగదుగా’’అని దయాదాక్షిణ్యాలు లేనివాడిలా నవ్వాడు స్వామినాథన్. ‘‘యింకొక్కమాట నువేం పోలీసు సూరెంటు కొడుకువా?’’ అన్నాడు మణి. ‘‘ఉహు.. కాను’’ అని నౌకరు జవాబిచ్చాడు. ‘‘అలాయితే, విను’’ అన్నాడు మణి. ‘‘మేము పోలీసు సూపరెంటుగారి కొడుకుతో మాటాడాలని వచ్చాం.’’ దాంతో నౌకరు వెనక్కి తగ్గాడు. రాజం గది తలుపు మీద దబదబా బాదాడు. గడియ చప్పుడుకాగానే వెళ్లి స్తంభం చాటున దాక్కున్నాడు. రాజం తొంగిచూసి ఎవరూ కనిపించకపోయేసరికి మళ్లీ తలుపు వేసుకున్నాడు. మణి, స్వామినాథన్∙స్తంభం చాటునుంచి ఇవతలకి వచ్చి ఏమిచేయడానికీ తోచక గుమ్మం ముందు నిలబడ్డారు. స్వామినాథన్ తలుపు సందున నోరుపెట్టి పిల్లిలాగా మ్యావ్ అన్నాడు. మణి.. స్వామినాథన్‌ని ఇవతలికి లాగి తాను తలుపుసందున నోరు పెట్టి కుక్కలాగా మొరిగాడు. మళ్లీ గడియచప్పుడయి తలుపు కొద్దిగా తెరుచుకుంది. మణి.. స్వామినాథన్ చెవిలో ‘‘నువు గుడ్డిపిల్లి పిల్లవి, నేను గుడ్డికుక్క పిల్లను’’ అన్నాడు. మణి వంగి చేతులు నేలకు ఆనించి, కళ్లు గట్టిగా మూసుకుని, తలతో తలుపుతోసి గుడ్డికుక్క పిల్లలాగా నటిస్తూ రాజం గదిలో ప్రవేశించాడు. స్వామినాథన్ కళ్లుమూసుకుని మణి వెనకాలే పాక్కుంటూ వెళుతూ మ్యావ్ అని అరవసాగాడు. ఈవిధంగా గది నాలుగుమూలలా తిరగసాగారు. రాజం వాళ్ల కూతలకు జవాబుగా తానూ నిమిషనిమిషానికీ మొరుగుతూ, మ్యావ్ అంటూ ఆ ఆటకు రక్తి కట్టించాడు. గుడ్డికుక్క పిల్లకు మనిషికాలు రాసుకుంది. ఆ కాలు రాజందే అనుకొని మెల్లిగా పిక్క మీద కరిచింది. కాని, కళ్లు తెరిచి చూసేసరికి ఆశ్చర్యం! ఆ కాలు అతని శత్రువు సోముది. గుడ్డిపిల్లి పిల్ల ఒక కాలు దగ్గరికి చల్లగా వెళ్లి పంజాతో గోకసాగింది. కళ్లు తెరిచి చూసేసరికి ఆశ్చర్యం! అది శత్రువు శంకర్ కాలు! మణి అలాగే ఒక్క నిమిషం కొయ్యబారిపోయి, లేచి నుంచున్నాడు. సిగ్గుతో కోపంతో చుట్టూ చూశాడు. ‘బఠాణీగింజ’ ఒకమూల అల్లరికి కళ్లు మిణకరిస్తూ కూర్చున్నాడు. గొంతు పిసికేయాలన్నంత కోపంవచ్చింది మణికి. వెనుకకుతిరిగి చూశాడు. రాజం నవ్వు అణచుకుంటూ అతనికేసి రెప్పలార్పకుండా చూస్తున్నాడు. ఇక స్వామినాథన్ ఏ కుర్చీకిందో బల్లకిందో ఎవరికంటా పడకుండా చీకట్లో దాక్కోవడం ఉత్తమమని తలచాడు. ‘‘రాజం! యేమిటి నీవుద్దేశం?’’ అని అడిగాడు మణి. ‘‘యెందుకలా మండిపడతావ్?’’ ‘‘యిదంతా నీ తప్పు’’ అన్నాడు మణి కఠినంగా. ‘‘నాకు తెలవదు..’’ చుట్టూ చూశాడు. ‘‘బలేబాగుంది! నిన్ను కుక్కలాగా నడుస్తూ మొరగమన్నానా? మొరగమన్నానా?’’ సోము, అతనిజట్టు ఫక్కున నవ్వారు. మణి చుట్టూ తేరిపారజూచి, ‘‘రాజం, నేను వెళ్లిపోతున్నా. యిది నేను వుండదగిన స్థలం కాదు’’ అన్నాడు. ‘‘నువు వెళ్లిపోతే యిక నీతో నేనూ మాటాడను’’ అన్నాడు రాజం. ఏంచేయడానికి మణికి పాలుపోలేదు. రాజం అతనిని పక్కకు తీసుకువెళ్లి శాంతపరచాడు. అంతులేని కష్టంలో చిక్కుకుని ఉన్న స్వామినాథన్ వైపు తిరిగి, తన జీవితంలో కుక్కలా, పిల్లిలా అంత చక్కని నటన ఎన్నడూ చూడలేదని పొగడి, అతనిని కూడా ఓదార్చాడు. ‘కొద్దినిమిషాల వరకు నిజంగానే కుక్కే మొరుగుతోంది, పిల్లే అరుస్తోంది అని భ్రమపడ్డాను. ఏ సంతలోనో ఇలా ప్రదర్శిస్తే మీకు బహుమానాలు వచ్చిపడతాయి.’ అన్నాడు. తిరిగీ అలా నటిస్తే, తానెంతో సంతోషిస్తాననీ, చూడడానికి వాళ్ల నాన్నను కూడా పిలుచుకు వస్తాననీ చెప్పాడు. దీంతో స్వామినాథన్, మణి చల్లబడిపోయి, తమను చూచుకుని తామే గర్వించసాగారు. ఆ తరువాత అంతా ఫలహారాలు చేశారు. ఆ గదిలోని ముగ్గురు శత్రువులు తలపునకు వచ్చినపుడు తప్ప తక్కిన సమయంలో వారిసంతోషానికి హద్దులేదు. వాళ్లు ఇలాంటి స్థితిలో ఉండగా రాజం స్నేహం మీద ఉపన్యాసం దంచనారంభించాడు. ‘ఐకమత్యమే బలం’ అనే నీతిని గరిపే ‘ముసలివాడు– కట్టెల మోపు’ అనే కథను ఉదాహరణగా తీసుకుని, అందరికీ నచ్చేట్టు స్నేహాన్ని గురించి మాటాడాడు. అక్కరకు ఆదుకున్న స్నేహితుడే నిజానికి స్నేహితుడు. శత్రుత్వాన్ని పెంచుకునేవారు ఎటువంటి నరకయాతనలు పడతారో ఒళ్లు గగుర్పొడిచేటట్లు వర్ణించాడు. శత్రుత్వాన్ని పెంచుకున్న వాడిని చనిపోయిన తరువాత ఒక గదిలో పెట్టి తాళం వేస్తారు. బట్టలు ఊడదీసి ఎర్రగాకాలుతున్న ఇనుప దిమ్మెమీద నిలబెడతారు. చుట్టూ తేనెతుట్లు. వాటిల్లో నిమ్మకాయంత తేనెటీగలు. ఆ పాపి దిమ్మెమీద నుంచి కిందకు అడుగుపెడితే, ‘ఆ గదిలో తిరిగే వందలకొలదీ తేళ్లు, జెర్రులమీద కాలు పెట్టాలి. ఇదంతా వేదాలలో రాసుంది’ అని చెప్పాడు రాజం. అంతా గజగజ వణికిపోయారు. నిద్రాహారాలు లేకుండా ఆ పాపి అలా నెల రోజులు నిలబడాలి. ఆపైన అతనిని ఒకవంతెన మీదికి తీసుకువెళతారు. వంతెనె కింద కళపెళకాగే నూనె చెరువు. పైగా వంతెన మహా ఇరుకు. కాలి అడుగు కంటె ఎక్కువ వెడల్పు ఉండదు. ఒకొక్క అడుగు వేసుకుంటూ వెళ్లాలి. ఆ వంతెన మీద కూడా కందిరీగ గూళ్లు, ముండ్లజెముడు పొదలు బోలెడన్ని ఉన్నాయి. వంతెన మీదుగా సాగిపొమ్మని వెనక నుంచి అదమాయిస్తుంటారు. కళపెళకాగే ఆ నూనెలో కాలుజారి పడకుండా ఎల్లకాలం నడవాలంటే ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ వెళ్లాలి.. రాజం మాటలు అందరినీ ముగ్ధుల్ని చేశాయి. ముందుకు వచ్చి ‘నేటినుంచీ మాకు శత్రువులంటూ లేరు’ అని చెప్పమని రాజం వారిని ఆహ్వానించాడు. ఆ మాట చెపితే శంకర్‌కి ఒక బైండుబుక్కు, స్వామినాథన్‌కి గడియారంలా పనిచేసే ఇంజను, సోముకి బెల్టు, మణికి చక్కటి చాకూ, ‘బఠాణీగింజ’కు మహాపసందయిన కలం ఇస్తానన్నాడు. బీరువా తెరిచి తాను వారికి బహుమానంగా ఇవ్వదలచిన ఆ వస్తువులన్నింటినీ చూపెట్టాడు. గోళ్లుకొరుక్కుంటూ అంతా మాట్లాడకుండా కొంచెంసేపు నిలబడ్డారు. ఈ రాజీ చేయడంలో హైరాన పడ్డాడేమో రాజంకు ముచ్చెమటలు పట్టాయి. మొట్టమొదట ‘బఠాణీగింజ’ లేచి బీరువా ముందు నిలబడి, ‘‘ఆ కలం యిలా యివ్వు చూస్తాను’’ అన్నాడు. రాజం కలం ఇచ్చాడు. ఆ కలాన్ని అటూ ఇటూ తిప్పిచూసి, ఏమీ అనకుండా తిరిగి ఇచ్చి వేశాడు. ‘‘యేం నచ్చలేదా?’’ అని అడిగాడు రాజం. బఠాణీగింజ బీరువాలోకి తేరిపార జూస్తూ ‘‘నాకు ఆ పెట్టె కావాలి’’ అన్నాడు ఒక చిన్న పెట్టెను చూపిస్తూ. ఆ పెట్టెమీద పసుపుపచ్చటి నల్లటి నమూనా చిత్రాలు, మూతమీద తాజమహల్ బొమ్మ వేసి ఉన్నాయి. ‘‘ఉహూ.. వీల్లేదు. అది నాకు కావాలి’’ అన్నాడు రాజం. ఒక నిమిషం గడిచింది. రాజంకు అలాంటి పెట్టెలు ఇంకా రెండు ఉన్నాయి. మనసు మార్చుకుని ‘‘నా కక్కరలేదులే. కావలిస్తే తీసుకో’’ అన్నాడు. కొద్దిసేపటికి మణి అరచేతితో చాకుకు పదునుపెడుతున్నాడు. సోము బెల్టు పెట్టుకుంటున్నాడు. శంకర్ లావుపాటి బైండుబుక్కు అటూ ఇటూ తిప్పి చూస్తున్నాడు. స్వామినాథన్ ఆకుపచ్చని ఇంజనును ఆప్యాయంగా గుండెకేసి అదుముకుంటున్నాడు. సేకరణ: ‘స్వామి, స్నేహితులు’ అనే పుస్తకంలోంచి.. రచన: ఆర్. కె. నారయణ్ అనువాదం: శ్రీనివాస చక్రవర్తి చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!! -
ప్రేమను పండించిన ‘స్వాతంత్య్రం’
సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల రచయిత ఆర్ కె నారాయణ్ సృష్టించిన కాల్పనిక గ్రామం మాల్గుడి పరిసరాలు ఆధా రంగానే ‘మహాత్ముని కోసం నిరీక్షణ’ నవల రూపొం దింది. ఇద్దరు సాధారణ యువతీ యువకుల ప్రేమ జీవిత క్రమంలో.. జాతీయోద్యమ కాలపు ఉద్విగ్నత లను చిత్రించిన ఈ నవల రచయిత రచనల్లో అత్యంత విజయవంతమైన నవలగా చరిత్రకెక్కింది. ఈ కథలో ప్రధాన పాత్ర శ్రీరామ్. హైస్కూల్ చదువు పూర్తి చేశాక మాల్గుడిలో తన అమ్మమ్మతో కలిసి నివసిస్తుంటాడు. మహాత్మాగాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న భారతి పట్ల ఆక ర్షణలో పడతాడు శ్రీరామ్. ఆమె పట్ల ప్రేమ భావం శ్రీరామ్‌ను కూడా క్విట్ ఇండియా ఉద్యమంవైవు మర లిస్తుంది. ఒక క్రమంలో అతడు బ్రిటిష్ వ్యతిరేక తీవ్ర వాదులతో చేయి కలిపి, గ్రామీణ ప్రాంత అజ్ఞాత కార్య క్రమాల్లో పాల్గొంటాడు. తన కార్యకలాపాల ఫలితంగా జైలుకు వెళతాడు. తిరిగివచ్చిన తర్వాత భారతిని కలు స్తాడు. దేశ విభజన మధ్యనాటి ఉద్విగ్న పరిస్థితుల మధ్య భారతి, శ్రీరామ్ మహాత్మాగాంధీ అంగీకారంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు భారతిలోని హాస్యప్రవృత్తి, చిరచిరలాడే స్వభా వం, సమర్థత, నమ్రత శ్రీరామ్‌ని కట్టిపడేస్తుంది. కానీ శ్రీరామ్‌లోని చపలచిత్తం కారణంగా.. తొలుత మహా త్ముడి ఆదర్శాల పట్ల విశ్వాసం ప్రకటించి న ప్పటికీ, ప్రజాకర్షణ కలి గిన జగదీష్ వంటి జాతీయ విప్లవకారుల ప్రభావానికి కూడా అతడు సులువుగా గుర వుతుంటాడు. వలసవాద వ్యతి రేక పోరాటంలోని ద్వంద్వ, అనిశ్చిత పరిస్థితిని, ప్రజ లపై దాని ప్రభావాన్ని అత్యంత ప్రభావవంతంగా చిత్రించిన విశిష్ట నవల ‘మహాత్ముని కోసం నిరీక్షణ’. తమ తమ వ్యక్తిగత సంకుచిత ప్రయోజనాలు, ఆలోచ నల మధ్యలోంచే భారతీయులు స్వాతంత్య్రోద్యమాన్ని ఎలా నిర్మించారు, ఎలా పాల్గొన్నారు, స్వీయ జాగరూ కత, వైయక్తిక దార్శనికత గురించిన గాంధీ బోధనలను వారు తమలో ఎలా ఇంకింప చేసుకున్నారనే చరిత్రను కళ్లకు కట్టిన నవల ఇది. స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో సాగే అద్భుతమైన ప్రేమ గాథ ‘వెయిటింగ్ ఫర్ ది మహాత్మా‘ను ఆర్.కె. నారాయణ్ రచించగా అంతే ఆసక్తికరంగా సరళమైన వ్యవహారిక భాషలో రచయిత వేమవరపు భీమేశ్వరరావు అనువదించారు. తొలుత ఫిజిక్స్ మాస్టారు, తర్వాత హోమియో డాక్టర్, ఆ తర్వాత రచయితగా మారిన భీమే శ్వరరావు ఆర్కే నారాయణ్ ఆత్మను తెలుగులోకి తీసుకు రావడంలో విజయం సాధించారు. 1940లో స్వాతంత్రో ద్యమంతోపాటు భారత్‌లో ఆవిర్భవిస్తున్న సామాన్యుడి ఆకాంక్షల క్రమవికాసాన్ని, నాటి సామాజిక స్థితిగతు లను ప్రతిభావంతంగా వివరించిన నవలను తెలుగు పాఠకులకు అందించారు. ఎప్పుడో కాలేజీ రోజుల్లో చదివిన ‘వెయిటింగ్ ఫర్ ది మహాత్మా’ ఆంగ్ల గ్రంథాన్ని డెబ్బై ఏళ్ల వయస్సులో తెనిగించి తన ఇష్ట రచయితకు అనువాదకులు చేసిన అక్షర నివాళి ఇది. యాభై ఏళ్ల క్రితం ‘చెట్టునీడ’ కథ ప్రచురించిన తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు రచనా వ్యాసంగం చేపట్టిన భీమేశ్వరరావు గాంధీ ఆశయాలతో అంతర్లీనమైన ప్రేమకథను ఇష్టంగా తెలుగు పాఠకులకు అందించారు. 1920ల నాటి స్వాతం త్య్రోద్యమ కాలం నుంచి 1970ల నాటి నక్సలైట్ ఉద్య మం వరకు సాగిన తెలుగు రాజకీయ, సామాజిక పరి ణామాలను ‘అతడు ఆమె’ సీక్వెల్ నవలా రచన ద్వారా ఉçప్పల లక్ష్మణరావు అద్భుతంగా చిత్రిం చారు. మహాత్ముని ఆదర్శాలు, వ్యక్తిగత ఆకాంక్షలు ప్రాతిపదికన ఆర్కే రచన కూడా ఇలాగే సాగడం విశేషం. ‘మహాత్ముని కోసం నిరీక్షణ’, పేజీలు 260, వెల: రూ.150, ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు, రచయిత భీమేశ్వరరావు వేమవరపు, సికింద్రాబాద్, మొబైల్ నంబర్ : 98497 78163 కె. రాజశేఖరరాజు -
తుపాన్ రాత్రి
క్లాసిక్ కథ అతణ్ని చూస్తూ ఉంటే అతనో పెద్ద మాటకారిలాగానే ఉన్నాడు. చెప్పిన విషయం చెప్పకుండా చెప్పుకుపోతున్నాడు. ఇంట్లోంచి కాఫీ తెప్పించాడు. తాగుతూ కూర్చున్నాను. అతను విషయం మార్చాడు. తనకు ఉద్యోగం దొరికిన తొలిరోజుల గురించి చెప్పడం ప్రారంభించాడు. ఎలాగైతేనేం చివరికి విశాఖపట్నంలో ఉద్యోగం దొరికింది. ఒక పెద్ద వ్యాపారస్తుడు సముద్రపు ఒడ్డున బీచ్‌రోడ్‌లో వరుసగా పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాడు. అతను నన్నక్కడ సూపర్వైజర్గా నియమించుకున్నాడు. మంచి జీతం, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. పని జరుగుతున్న చోటుకు నాకిచ్చిన ఇల్లు చాలా దగ్గర. సూపర్వైజర్ అన్న డిజిగ్నేషన్ నాకెందుకో ఎబ్బెట్టుగా అనిపించేది. కాని అందులోని లోతుపాతులు తెలిసిన తర్వాత, అదే బావుందనిపించింది. కాని మొదట్లో ఉద్యోగం నిలదొక్కుకోవడం కష్టమే అయ్యింది. కాంట్రాక్టరు, రాళ్లు కొట్టేవాళ్లు, వడ్రంగి పనివాళ్లూ అందరూ... అనవసరంగా నేను వాళ్ల పనుల్లో జోక్యం కలిగించుకుంటున్నట్లు బాధపడిపోయేవారు. కాని కొద్దికాలంలోనే ఎవరిని ఎప్పుడు బెదిరించాలో, ఎప్పుడు ఎలా పని చేయించుకోవాలో తెలుసుకున్నాక ఇక ఏమాత్రం కష్టమనిపించలేదు. మీరు నమ్మండి, నమ్మకపోండి. అది మీ ఇష్టం. కాని నా అంతటి అదృష్టవంతుడు అసలు దేశంలో ఉన్నాడా అనిపించేది అప్పట్లో - ఎందుకంటే చెప్తాను వినండి. అదృష్టం నంబర్ వన్-సూపర్వైజర్గా నా పని అతి సులభంగా ఉండేది. సామాన్యంగా నా పర్యవేక్షణంతా ఇంట్లో పడుకుని కిటికీ గుండా చేస్తూ ఉండేవాడిని. అదృష్టం నంబర్ టు - నేనూ, నా భార్య అందమైన ఊహా ప్రపంచంలో బతికేవాళ్లం. ఎందుకంటే అప్పటికింకా మా అబ్బాయి పుట్టలేదు. వాడు పుట్టడానికి ఇంకా నెలరోజుల వ్యవధి ఉంది. అదృష్టం నంబర్ త్రీ - మా ఇల్లు ప్రశాంతమైన పరిసరాల్లో అధునాతనంగా ఉండేది. ఇక సముద్రమా? వాకిట్లోకి సరిగా పది అడుగులే. అట్లా అన్నీ కలిసొచ్చాయి. అది నవంబర్ నెల. ఒకరోజు ఉదయమే మామూలు ప్రకారం తొమ్మిదిన్నరకు నిద్రలేచాను. బయటంతా కారుమబ్బులు కమ్ముకుని నల్లగా ఉంది. పనివాళ్లు నాకోసం కాచుకుని ఉన్నారు. విషయమేమిటని తెలుసుకుంటే, ఆ రోజు వాతావరణం బాగోలేదు కాబట్టి పనిలోకి పంపించవద్దని అభ్యర్ధించారు. అలాంటి పిచ్చివేషాలు వేయగూడదని, మాట్లాడకుండా పనిలోకి వెళ్లమని గద్దించాను. కొద్దిసేపటి తర్వాత వీధిలోకి వెళ్లాను. ప్రపంచమంతా స్తంభించినట్లుంది. అందరి ముఖాలు దీనంగా ఉన్నాయి. ఎక్కడా చైతన్యం లేదు. అప్పటికి పది కావస్తోంది. అయినా దుకాణాలు తెరవలేదు. మామూలు రోజు పగటిపూట దుకాణాలు మూసి ఉంచడం విడ్డూరంగా అనిపించింది. ఒక్కసారిగా ఘొల్లుమని గోల వినిపించి అటూ ఇటూ చూశాను. పక్కనే ఉన్న పాఠశాల విడిచిపెట్టారు. పిల్లలందరూ కేకలేస్తూ గేట్లోంచి బయటికొస్తున్నారు. సెలవు దొరికిందన్న సంతోషం కాబోలు! ఒక పిల్లవాడు మాత్రం బరువైన సంచీని బలవంతంగా మోస్తూ ఏడుస్తూ నడుస్తున్నాడు. ఏమైందని నేనా పిల్లవాణ్ని దగ్గరికి తీసుకున్నాను. వాడు ఏడుపుతోనే చెప్పాడు. ‘‘మరండీ... ఈ రోజు ప్రపంచం మునిగిపోతుందాండీ. అట్లా అని మా టీచరుగారు చెప్పారు’’ అని అన్నాడు. నేనింటికి వెళ్లగానే నా భార్య అలాగే చెప్పింది. భయం భయంగా ముఖం పెట్టి వణుకుతున్న గొంతుతో, ‘‘ప్రపంచం ఈ రోజుతో ముగుస్తుందటండీ’’ అని చెప్పి, నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉండబట్టలేక బొలబొలమని ఒక ఖాళీ నవ్వు నవ్వింది. ప్రపంచం అంతమవడం అన్న విషయమ్మీద నేనూ కొన్ని పిచ్చి జోకులు వేసి తనని నవ్వించాను. నిజంగానే ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వస్తే మంచి మంచి చీరెలు ఏరుకుని వెంట తీసుకుపొమ్మని... ఆమెకు సలహా ఇచ్చాను. మిట్ట మధ్యాహ్నానికి చూద్దును కదా సైట్మీద ఎవరూ లేరు. పనివాళ్లంతా చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. అంతా నిర్మానుష్యంగా తయారైంది. వాళ్లలా వెళ్లిపోవడం నాకెంతో కోపం తెప్పించింది. ప్రపంచం మునిగిపోతుందన్న వార్త ఎవరు ఎప్పుడు పుట్టించారో గాని, వాతావరణం అందుకు తగినట్లుగానే భయంకరంగా మారిపోయింది. పగలు మూడు గంటలకే అన్ని దిక్కులకు చీకటి వ్యాపించింది. కొబ్బరిచెట్లు హోరుగాలికి నిలవలేకపోతున్నాయి. ఒక్కోసారి కింద ఇసుకను తాకి లేస్తున్నాయి. జానపద కథల్లో దెయ్యాల నృత్యాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాయి. చల్లని వేళల్లో నాలో కవిత్వాన్ని పుట్టించే సముద్రం అప్పుడు ప్రళయరూపాన్ని దాల్చింది. సముద్రపు నీరు ఎర్రగా మురికి రక్తంలాగా అయ్యింది. ఒక్కొక్క కెరటం ఎత్తులో సగం కొబ్బరి చెట్టంత ప్రమాణంతో ఉంది. ఈ భూమండలాన్ని ఈ క్షణమో, మరో క్షణమో కప్పివేయాలన్నట్లు కెరటాలు ఒకదాని కంటే మరొకటి వేగంతో ఉధృతంగా లేచి పడుతున్నాయి. విపరీతమైన సముద్రపు హోరు మానవ నాశనాన్ని కోరుతున్నట్లుగా ఉంది. నా శ్రీమతి నా పక్కనే చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది. తర్వాత ఒంట్లో నలతగా ఉందని పోయి పడుకుంది. ఆమె ఉదయం ఉన్నంత ఉత్సాహంగా లేదు. ముభావంగా, బలహీనంగా ఉన్నట్లు కనిపించింది. దీపం వెలిగించి, ఆమె పక్కనే వెళ్లి కూర్చుని ఆరోజు వార్తాపత్రికలోని వింతల్ని, ముఖ్యమైన వార్తల్ని చదివి వినిపించాను. ఎలాగైనా ఆమె మనసుకు ఉల్లాసం కలిగించాలని నా ప్రయత్నం. ఆ సమయానికి బయట సముద్రం రాక్షసిలా ఘోషిస్తోంది. ఈదురుగాలి రక్తదాహంతో కేకలేస్తున్నట్లుగా ఉంది. దానికితోడు యింటి కప్పును సమ్మెటలతో బాదుతున్నట్లు వర్షం మొదలైంది. నేను చదువుతున్న వింత వింత వార్తల్ని మా ఆవిడ నిశ్శబ్దంగా వింటోంది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా మూలగడం మొదలుపెట్టింది. మరికొంతసేపటికి తనకు నొప్పులు మొదలయినాయని ప్రకటించింది. రాత్రి ఎనిమిదయ్యేసరికి ఆమె పరిస్థితి మరీ విషమించింది. నాకేం చేయాలో తోచలేదు. అంత బాధలో కూడా ఆమెకు నా ఆకలి జ్ఞాపకం ఉంది. వెళ్లి వంట చేసుకొమ్మని సలహా ఇచ్చింది. నిజంగా అప్పటికే ఆకలితో కడుపు కాలిపోతూ ఉంది. వంటింట్లోకి ప్రవేశించాను. పొయ్యి అంటించే ప్రయత్నం చేశాను. నేర్చుకోలేక నేను ఓటమిని అంగీకరించిన విషయాల్లో సైకిలు తొక్కడం, తర్వాత ఈ పొయ్యి అంటించడం ఒకటి. మన ఆడవాళ్లు అంత సులభంగా నిమిషంలో ఎలా పొయ్యి అంటిస్తారోనన్నది నాకు అంతుపట్టని విషయమే! ఈ విషయంలో వాళ్లకు జోహార్లు అర్పించాల్సిందే. పొయ్యి నిండా కట్టెలు పేర్చాను. అగ్గిపెట్టె కోసం వెతికాను. తెరిచివున్న కిటికీ పక్కగా తడిసిన అగ్గిపెట్టె కనిపించింది. ఒకదాని తర్వాత ఒకటి యాభై పుల్లలు గీశాను. ఒక్కటీ వెలగలేదు. అనుకోకుండా యాభై ఒకటవ పుల్ల కాబోలు వెలిగింది. దాంతో పక్కనే ఉన్న పాత దినపత్రిక అంటించాను. అది పూర్తిగా కాలిపోక ముందే వార్తాపత్రిక పేజీలు ఒక్కొక్కటే కాలుస్తూ పొయ్యాను. కాని పొయ్యిలోని కట్టెలు మాత్రం ఇంకా అంటుకోలేదు. నా వేళ్లు అప్పటికే చాలాసార్లు అంటుకున్నాయి. అప్పుడు నాకు అనిపించింది. ఈ ఇళ్లు, దుకాణాలు ఉత్తుత్తగా ఎలా తగలబడిపోతాయో నాకు అర్థం కాలేదు. వంటింటి నిండా పొగ నిండింది. ఊపిరి ఆడడం కష్టమైపోయింది. అప్పటికే కళ్లూ, ముక్కూ పొగను పంచుకున్నాయి. వంటిల్లు విడిచిపెట్టి లోన గదిలోకి వెళ్లాను. ‘‘ఏమైనా తిన్నారా?’’ శ్రీమతి అడిగింది. ‘‘హూ! ఇంకా అది కూడానా? తుపాను వచ్చినా బతికి బయటపడొచ్చు కానీ, ఈ ఆకలితో బతికేట్లులేను’’ అని కోపంతో అరిచినట్లే చెప్పాను. అప్పుడు నాలో పొయ్యి అంటించడం చేతకాలేదన్న ఉక్రోషం ఉంది. అందుకే మూతి ముడుచుకుని కోపంగా కూర్చున్నాను. సామాను గది అంటే మరేదో కాదు, వంటింట్లోనే ఓ మూలకు సామాను గది అని గౌరవప్రదమైన పేరు. పాలు ఉన్నాయనగానే ముఖం బల్బులా వెలిగించుకుని సామాను గదిలోకి వెళ్లాను. ఒక్క గుటకలో పాలు స్వాహా చేసేవాడినే. కాని మళ్లీ ఆలోచించాను. శ్రీమతి పరిస్థితి బాగా లేదు. ఆమెకు ఏ సమయంలోనైనా వీటి అవసరం రావొచ్చు. మరేదైనా తిని కడుపు నింపుకుందామనుకున్నాను. సామాను గదిలోని, కుండలు, బుట్టలు, డబ్బాలు అన్నీ వెతకడం ప్రారంభించాను. ఒక కుండలో మెత్తగా, జిగటగా ఏదో తగిలింది. బహుశా చింతపండు అయివుంటుందని చేయి వెనక్కి తీసుకునే లోపలే వేలికి ఏదో కరిచింది. కంగారుపడి కుండ బోర్లించి చూస్తే అందులోంచి నల్లగా, పెద్దగా, లావుగా ఉన్న తేలు బయటపడింది. దాన్ని చూడగానే పైప్రాణాలు పైనే పోయాయి. కొద్దిసేపటికే మంటలు మొదలయ్యాయి. విషం - ప్రభావం చూపుతోందన్న మాట! బాధతో ఎగిరాను. గంతులేశాను. కిందపడి దొర్లాను. ముందు గదిలోకురికాను. పెనుగాలి ఇంకా తీవ్రమైంది. ముందు గది పైకప్పు పెంకులు కొన్ని ఎగిరిపొయ్యాయి. వర్షపు నీళ్లతో ఇల్లు నిండిపోయింది. నిలుచుండే చోటు ఎక్కడా లేదు. ఇల్లు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చునన్నంత ఘోరంగా ఉంది పరిస్థితి. కొట్లాటల్లో విసురుకునే కత్తుల్లాగా ఇంట్లోని క్యాలెండర్లు, పటాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎగిరిపడుతున్నాయి. వీటికి తోడు తేలు విషం! మంటలు, పోట్లు భరించలేకుండా ఉన్నాయి. నీళ్లలోంచి కాళ్లను లాక్కుంటూ శ్రీమతి ఉన్న గదిలోకి వెళ్లాను. ఆ గది కొంత మెరుగ్గా ఉంది. మంచంమీద ఆమె బాధతో మూలుగులతో మెలికలు తిరిగిపోతోంది. నేనక్కడే నిశ్చేష్టుణై్నపోయి నిలబడ్డాను. ఏం చేయాలో తోచలేదు. అవి పురిటి నొప్పులే అని ఆమె స్పష్టం చేయడంతో శపించేద్దామన్నంత కోపం వచ్చింది. లేకపోతే ఇలా పరిస్థితులన్నీ ఒకేసారి విషమించిన రోజే ఆమె ఈ నొప్పులు తెచ్చుకోవాలా? బాధలోనే మధ్యలో చెప్పింది, ‘‘మిమ్మల్ని బాధ పెట్టదలచుకోలేదు గానీ ఏం చేయనూ? తప్పదు - వెళ్లి ఎవరినైనా సహాయం పిలుచుకు రండి.’’ సహాయం..? ఎవరొస్తారు ఇంత రాత్రి తుపానులో? అయినా నాకిక్కడ ఎవరు తెలుసుననీ? అంతా కొత్త. ఇక తప్పదని, లాంతరు ఒక చేత, గొడుగు మరో చేత పట్టుకుని సిద్ధమయ్యాను. వెళ్తున్నట్టు ఆమెతో చెప్పి, చిర్నవ్వొకటి విసిరేసి బయలుదేరాను. మా ఇంటి ముందు రోడ్డు కొంత భాగం చెడిపోయి గుంటలయ్యాయి. వాటిలో సముద్రపు నీరు వచ్చి చేరింది. అక్కడ ఇళ్లు దూరందూరంగా ఉన్నాయి గనుక, మా పక్కింటికి వెళ్లాలంటే కొంత దూరం నడవాల్సి ఉంటుంది. అందుకు దగ్గరి తోవ వెతుకుతున్నాను. ఇంతలో గాలికి గొడుగు లేచిపోయింది. ఎటు పోయిందో కనిపించలేదు. వెనువెంటే లాంతరు ఆరిపోయింది. నేనిక చీకట్లోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. కాళ్లతో తోవలోని రాళ్లను పుణుక్కుంటూ పుణుక్కుంటూ చెట్లను, పొదలను తప్పించుకుంటూ నడిచాను. వీటికితోడు వీపులో వెన్నుపూస మీద చల్లని వర్షపునీరు పారుతున్న సంతోషమొకటి. కనిపించని దయ్యాల చేతిలో నలిగిపోతున్నట్లు అనిపించింది. చెట్లు కుడికి, ఎడమకు కొట్టుకుంటున్నాయి. ఈదురుగాలి మృత్యు సంకేతంలా ఉంది. కాళ్లు కోసుకుపోయి రక్తం కారుతున్నట్లుంది. అప్పటికి గాని నేను పక్కింటికి చేరలేదు. అందులో ఒక విదేశీయుడు ఉంటున్నాడు. తను పోలీసు అధికారి. అతని ఇంటిముందు క్రూరమైన పెంపుడు కుక్కలుంటాయని జ్ఞాపకం వచ్చింది. అడుగు వెనక్కి వేశాను. ఆలోచిస్తూ కొద్దిసేపు నిలబడ్డాను. ఆ ప్రాంతానికి నేను కొత్త. ఎవరూ తెలియదు. అసలు ఎవరు ఎక్కడుంటారో తెలియంది ఎవరింటికని వెళ్లడం? ఆకాశంలో మెరుపు మెరిసింది. నా మనసులో కూడా మెరిసినట్లయింది. వెంటనే అక్కడి నుండి కదిలాను. అదే రోడ్డులో మరో పదడుగులు పోతే ఒక డాక్టరుగారిల్లుంది. అతని యింటికి ‘సాగర దృశ్యం’ అనే పేరు కూడా ఉంది. తేలుకుట్టిన వేలు నోట్లో వేసుకుని చీకుతూ పరిశీలించుకుంటే తెలిసిందేమంటే - నేనప్పుడు చిన్నపిల్లాడిలా భోరుమని ఏడుస్తూ నడుస్తున్నాను. మిట్టలూ, పల్లాలూ జాగ్రత్తగా దాటుతూ ‘సాగర దృశ్యం’ అనే డాక్టరుగారి యింటి వరండా చేరుకున్నాను. సుమారు యిరవై నిమిషాలు తలుపు బాదాను. తర్వాత యింటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కేకలు పెట్టాను. అప్పుడుగాని ఒక మూల కిటికీ తెరుచుకోలేదు. అందులోంచి ఒక స్త్రీ కనిపించింది. ‘‘ఎవరు మీరు?’’ అని ఒక పనికిరాని ప్రశ్న వేసింది. నేనెవరో, నా వివరాలేమిటో ఆమెకు అన్నీ ముందే తెలిసినట్టు, నా పేరు చెప్పగానే ఆమె అంతా అర్థం చేసుకోబోతున్నట్టూ! గత్యంతరం లేక నా పేరు, వివరాలు గొంతు పెద్దగా చేసి చెప్పాను. ఆ క్షణంలో నేనెన్ని కష్టాల్లో వున్నానో కూడా టూకీగా చెప్పాను. అంతా బూడిదలో పన్నీరులాగా కొద్దిసేపైన తరువాత ‘‘మీరెవరూ?’’ అని ఆమె మళ్లీ కేకేసింది. నేనూ కేకేశాను బదులు చెప్పడానికి - విపరీతమైన తుపాను చప్పుడులో ఎవరి మాట ఎవరికీ విన్పించడం లేదు. ఒక్కో ప్రశ్న ఆమె రెండు మూడుసార్లు అడగడం, నేను చెప్పడం జరిగింది. కిటికీలోంచి వచ్చిన కొద్ది వెలుగులో ఆమెకు నేనో భూతంలాగా కనిపించి ఉంటాను. వర్షంలో తడిసి ముద్దయిన బట్టలు, బురదైపోయిన కాళ్లూ, చేతులూ, ముఖం నిండా అతుక్కుపోయిన వెంట్రుకలు... నా వాలకం చూసి ఆకలి భరించలేక అడుక్కునే బిచ్చగాడని ఊహించుకుందేమో గాని, గౌరవంగా ఉద్యోగం చేసుకునే పెద్దమనిషి అనుకుని ఉండదు. ఆకలితో ఒళ్లు తేలిపోతున్న మాట నిజమే. చివరికి శక్తినంతా కూడదీసుకుని గొంతెత్తి అడిగాను డాక్టరుగారి గురించి. ఆమె కూడా ఎంతో కష్టపడి బిగ్గరగా అరిచి చెప్పింది. డాక్టరుగారు యింట్లో లేరని, బొంబాయి వెళ్లారని, ఇంటి నిండా బంధువులు ఉన్నారని, అందరూ పడుకున్నారని, వాళ్లంతా లేస్తారేమోనని తను తలుపు తీయలేకపోతున్నానని, ఎంతో మర్యాదగా చెప్పింది. నాకు సాధ్యమైనంత వరకు నేను దయ్యాన్నో, భూతాన్నో కాదని, ఒక కుటుంబీకుణ్నని, ఎంతో విషమ పరిస్థితినెదుర్కొంటున్నానని చెప్పాను. ఆమె కొంత జాలి కనబరిచింది. అయినా అది ఏం చేసుకోను? నాకు డాక్టరుగారు కావాలి. వైద్యం ఏమాత్రం తెలియని ఆమో, గాఢనిద్రలో ఉన్న ఆమె బంధువులో అక్కరలేదు. అదృష్టం బాగుండి తిరిగి క్షేమంగా ఇల్లు చేరాను. ఒకరిని సహాయం రమ్మన్నాననీ, వాళ్లొస్తున్నారనీ శ్రీమతికి అబద్ధం చెప్పాను. ఆ చిన్న అబద్ధంతో ఆమె ముఖంలో కొత్త వెలుగు కనిపించింది. తర్వాత సముద్రం వైపున్న కిటికీ తెరవమని అడిగింది. అందుకు నేనొప్పుకోలేదు. అప్పటికే ఇల్లు పగుళ్లు బట్టి ఉంది. కిటికీ తెరవడమంటే తుపానుని గదిలోకి ఆహ్వానించడమేనని చెప్పాను. అదే విషయం మేం వాదులాడుకుంటూ ఉండగా వెనక వంటగది అంతా కుప్పకూలిపోయిన శబ్దమైంది. వెనువెంటనే మేమున్న గదిలో ఏదో పేలుడు సంభవించినట్లయ్యింది. మేం తెరవాలా వద్దా అని చర్చించు కుంటున్న కిటికీ ఉధృతమైన గాలికి ఊడిపోయి కిందపడిపోయింది. గదిలోని దీపం ఆరిపోయింది. స్థాణువునైపోయి కుప్పగా కూలబడిపోయాను. లేచి చీకట్లో కిటికీ వెదికి దాని స్థానంలో దాన్ని పెడదామని ప్రయత్నించాను. అది అడ్డంగా ఉంటే పెనుగాలి బారి నుండి కొంతవరకు తప్పించుకోవచ్చని నా అభిప్రాయం. కిటికీని అదిమిపెట్టానే గాని చేతి తేలు మంటల్ని అదిమి పెట్టలేకపోయాను. అదే సమయంలో నన్ను భయకంపితుడ్ని చేసే విధంగా నా శ్రీమతి పెడబొబ్బలు పెట్టింది. కేకలు వేసింది. మంచం మీద లేచి లేచి పడింది. నాకు పిచ్చిలేచినంత పనైంది. ధైర్యంగా ఉండమని, సహించి ఊరుకోమని చెప్పాను. కోప్పడ్డాను. చివరకు అడ్డమైన తిట్లన్నీ తిట్టాను. ఇంతలో కెవ్వుమని శిశువు కేక వినిపించింది. అనాలోచితంగా కిటికీని విడిచిపెట్టి ఆశ్చర్యంగా నిలబడ్డాను. కొత్తగా పుట్టిన శిశువు కేక తుపాను గాలినీ, చీకటిని ఛేదిస్తున్నట్లుగా ఉంది. ఈ జీవం సమాప్తం కాదు. కొత్త జీవం పుడుతూ ఉంటుందన్నట్లుగా ఉంది. ఆయన అకస్మాత్తుగా నిలబడి ‘‘బాబూ ఇలారా’’ అని ఇంట్లోకి కేకేశాడు. కథల్లోలాగా ఆయన అనుభవం ఇంత విచిత్రంగా ఉండటం నాకు గమ్మత్తుగా అనిపించింది. ‘తర్వాత ఏమైంది? అంతటి భయానకమైన పరిస్థితుల్లో ఆ పసివాడు ఎలా బతికాడు?’ ఇలా అనేక రకాల ఆలోచనలు నా మెదడులో తిరుగుతున్నాయి. లోపలి నుండి ఓ చిన్న కుర్రాడొచ్చాడు. ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. వాడి కళ్లూ, వాడి చూపులూ చూడగానే మహాగడుసువాడేననిపించింది. వాడిలో చురుకుదనం, చలాకీతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘‘అయ్యా! వీడేనండి! ఆ తుపాను రాత్రి మమ్మల్నాడుకోవడానికి మా ఇంటికొచ్చిన పెద్దమనిషి’’ అని బొలబొలా నవ్వుకుంటూ కొడుకును వొళ్లో కూచోబెట్టుకున్నాడు అతను. తెలుగు అనువాదం: దేవరాజు మహారాజు - ఆర్.కె.నారాయణ్ -
80 ఏళ్ల స్వామి అండ్ ఫ్రెండ్స్...
‘మాల్గుడి ఎండలో ఒక విశేషం ఉంది. దాని గురించి ఆలోచించినవారికే అది హాని చేస్తుంది’ అని మొదలవుతుంది in Father's Room presence అనే కథ ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’లో.పదేళ్ల స్వామికిగాని, అతడి ఖరీదైన స్నేహితుడు రాజంకుగానీ, వీపున గూటం మోస్తూ దాంతో ఎవడి నెత్తయినా పగలగొడతాను అని బెదిరిస్తూ తిరిగే మణికిగానీ ఆ ఎండంటే లెక్కే లేదు. అది వారి పాలిటి తెల్లని డేరా. మల్లెల షామియానా. ఇంకా చెప్పాలంటే ‘చామీ’ అని ప్రేమగా పిలిచే నానమ్మ మెత్తటి ఒడి.మాల్గుడి పట్టణ దాపున, సరయూ నది వొడ్డున ఈ పిల్లలు, వాళ్ల అల్లరి దేశ సంపద మాత్రమే అయ్యిందా? ప్రపంచానికి మురిపెం కాలేదూ? భారతదేశం అంటే బట్లర్లు, ఇంగ్లిష్ అక్షరమ్ముక్కరాని బంట్రోతులు అనుకునే వలసపాలన రోజుల్లో, ప్రపంచంలో సాహిత్యాన్ని ఇంగ్లిష్ అనే కొలబద్ద పక్కన నిలబెట్టి కొలుస్తున్నరోజుల్లో ఏకకాలంలో ముగ్గురు భారతీయ రచయితలు లండన్వారి అచ్చులను హల్లులను ఈ మట్టినీటిలో తడిపి, ఈ గోధూళి దారుల్లో దొర్లించి, ఈ సంస్కారాలతో స్నానం చేయించి, శుభ్రమైన ధోవతీలు చుట్టి లోకానికి చూపించారు. ముల్క్‌రాజ్ ఆనంద్, రాజారావ్, ఆర్.కె.నారాయణ్... నాలుగు ముక్కల లీవ్‌లెటర్ రాయడం రాని ఈ దేశంలో నలభై వేల వాక్యాలు రాయగల సత్తా ఉన్న కలాలు ఉన్నాయి కథలూ ఉన్నాయి చూస్తారా అని చూపించినవారు వాళ్లు. వీరిలో ఎవరికివారు మేటి.ఆర్.కె.నారాయణ్? ఘనాపాటి. ఒక అయ్యర్ కుర్రాడు, తండ్రిలాగా టీచరో లేదంటే మరో బ్రిటిష్ నౌకరో కావలసినవాడు- ఆర్.కె.నారాయణ్- అచ్చు స్వామిలాగానే చదువులో అంతంత మాత్రం. యూనివర్సిటీ ఎంట్రన్స్ రాస్తే ఫెయిల్ అయ్యాడు. మూడేళ్ల డిగ్రీలో చేర్పిస్తే నాలుగేళ్లు చదివాడు. శారీరక బలం లేదు. స్కూల్ టీచర్‌గా పొద్దు పుచ్చుతాడనుకుంటే హెడ్మాస్టర్ వేసిన డ్రిల్ క్లాసుకు నిరసన తెలిపి ఇంటికొచ్చి బొబ్బున్నాడు. ఇలాంటివాడు రచనను ఒక ఉపాధిగా తీసుకోవడం గొప్ప. అందుకు కుటుంబం అంగీకరించడం మరీ గొప్ప. తొలి సంవత్సరం సంపాదన అంతా కలిపి తొమ్మిది రూపాయల పన్నెండు అణాలైనా, తొలి నవల ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ను మేనమామ ఎగతాళి చేసి పబ్లిషర్లు తిరగ్గొట్టినా ఆర్.కె.నారాయణ్‌కు తెలుసు. తన దగ్గర ఒక మంత్రనగరి ఉంది. మాల్గుడి! ముద్దులొలికే ఒక అల్లరి పిల్లవాడు ఉన్నాడు. స్వామి! వాళ్లిద్దరూ సరిగ్గా తగలాల్సిన వాళ్లకు తగలాలి. అంతే. కాని ఎలా? ఆక్స్‌ఫర్డ్‌లో ఒక స్నేహితుడుంటే అతనికి ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’ రాత ప్రతి పంపాడు. ఆ స్నేహితుడు దానిని ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత గ్రాహం గ్రీన్‌కు చూపించాడు. రోజూ బ్రెడ్డూ జాము పనికిమాలిన ఇంగ్లిష్ మర్యాదలతో విసిగిపోయున్నవాడికి పచ్చని అరిటాకు.. నడుమ తెల్లని అన్నమూ... ఆ పక్కనే కళకళలాడే బ్రాహ్మణ కుటుంబమూ... బంగారు బాల్యమూ... లేచి నడుముకు టై చుట్టుకుని అది పబ్లిష్ అయ్యేదాకా ఊరుకోలేదతడు. 1935. స్వామి అండ్ ఫ్రెండ్స్ నామ సంవత్సరం. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల నిలుచుని దుర్భుణీ వేసి చూసినా దూరంగా కనిపిస్తున్న ఒక నదురైన నౌక. రెపరెపలాడుతున్న భారతీయ పతాక. ఆర్.కె.నారాయణ్. భారతీయాంగ్ల సాహిత్యానికి ఏం తక్కువ? అవును ఏం తక్కువ అని నిరూపించినవాడు స్వామి. ఇందుకు ఆర్.కె.నారాయణ్ ఏరింది కూడా చాలా సులువైన దినుసులు. మైసూరుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో చిన్న పట్టణం- నంజనగుడ్- దానిని మాల్గుడి చేసుకున్నాడు. అందులో పారే నది-కబిని- దానిని సరయు చేసుకున్నాడు. ముఖ్యపాత్ర స్వామి? దిగుల్లేదు. తనే. ఇక తండ్రి.. తల్లి... నానమ్మ... స్నేహితులు... చిన్నప్పటి జ్ఞాపకాలు... కాకుంటే రెండు యాడ్ చేయాలి. ఒకటి స్వచ్ఛత మరొకటి అమాయకత్వం. యాడ్ చేశాడు. రచన సిద్ధం. లొట్టలు వేయకుండా ఉండటం దుస్సాధ్యం. పిల్లల ప్రపంచాన్ని పిల్లల ప్రపంచంలోకి వెళ్లి రాయడం అది. లోపలి రచన. వారి అమాయకత్వం, తెంపరితనం, భయం, కపటం, అసూయ, భేషజం, పరిణితి... పెళ్లయ్యి ఇల్లు పిల్లలు ఉంటేనే సంసారం కాదు... పిల్లలకు కూడా ఒక సంసారం ఉంటుంది... టీచర్లతో టెక్స్ట్బుక్కులతో పరీక్షలతో ఆటలతో స్నేహితులతో పోటీలతో... దానిని రాయడం అది. ఆర్.కె.నారాయణ్ దృష్టిలో పిల్లల పట్ల పెద్దల నుంచి హింస, భయాలకు తావులేదు. దానిని చెప్పడానికి కూడా ఈ నవల రాశాడు. తమిళుడే. కాని కన్నడ భూమికి, కన్నడ మనుషులకు, కన్నడ సంస్కృతికి అక్షరాలా కస్తూరి పరిమళం అబ్బాడు. మైసూర్ అంటే ఆర్.కె.నారా యణ్, ఆర్.కె.నారాయణ్ అంటే మైసూర్. నేల మీద గట్టిగా కాలూనిన ఏ రచనైనా బతికింది. ఇదీ అందుకే బతికింది. దృశ్యమాధ్యమం అందుబాటులోకి వచ్చి, టెలివిజన్ సెట్ అనేది ఇంటింటికీ క్యాలెండర్‌తో సమానం అయ్యాక స్వామి అండ్ ఫ్రెండ్స్ రచన ‘మాల్గుడి డేస్’గా మారి ప్రతి ప్రేక్షకుణ్ణి తాకింది. 1986. అంటే దాదాపు 30 ఏళ్లు.కాని ఇంకా ఆ సీరిస్‌ను చూస్తున్నారు. హిందీలో చూశారు. ఇంగ్లిష్‌లో చూశారు. దేశీయ భాషల్లో డబ్ చేసుకొని చూశారు. చూస్తూనే ఉన్నారు. ఎందుకు చూస్తున్నారు? అందులో ఉన్నది నువ్వూ. నేనూ. నిన్ను నువ్వు ఎంత సేపు చూసుకున్నా తనివి తీరుతుందా? ఈ సిరీస్ వల్ల దర్శకుడు శంకర్‌నాగ్, స్వామి పాత్ర పోషించిన మంజునాథ్ ప్రేక్షకుల్చిన ఫాల్కేలను పొందారు.స్వామి అండ్ ఫ్రెండ్స్ తెలుగులో ‘స్వామి- మిత్రులు’ పేరుతో అనువాదమయ్యి 1996లో పుస్తకంగా వెలువడింది. దీనిని వాసిరెడ్డి సీతాదేవి అనువాదం చేశారని చాలా కొద్దిమందికే తెలుసు. ఎన్.బి.టి దీనిని రహస్యంగా ఉంచిందని కూడా చాలా కొద్దిమందికే తెలుసు. అందుబాటులో ఉంచితే పాఠకులు చదివేస్తారని దాని భయం. నిజానికి అడల్ట్ చిల్డ్రన్కు ఈ వేసవిలో ఇంతకు మించిన తోడు ఉందా? అయితే ఆర్.కె.నారాయణ్‌కూ, స్వామి అండ్ ఫ్రెండ్స్‌కూ తెలుగు ప్రాంతంతో బాదరాయణ బంధం ఉందా? అలాంటి గాలి ఈ తావున తిరుగాడిందా? అలాంటి పాత్రలు ఈవైపు తారసిల్లాయా?అవును అనే అంటున్నారు ఒకరిద్దరు పాఠకులు. యూనివర్సిటీలలో కంపారిటివ్ స్టడీ చేస్తున్న విద్యార్థులు.‘పోలేరమ్మబండ కతలు’కు దక్కిన గౌరవం అది.ఇది విశేషం కావచ్చు. అలాంటి పోలికకు తెలుగులో ఒక రచన ఉండటం, అలాంటిదారిలో తెలుగులో ఒక రచయిత నడవడం ఘనతే కావచ్చు.ఇంతకీ ఎవరతడు? చాయ్‌కి పిలవాలి. చామీ.... Father's Room రెడీ చేస్తావా? - ఖదీర్