అడవి | Classic story as Forest | Sakshi
Sakshi News home page

అడవి

Published Sun, Aug 9 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

అడవి

అడవి

క్లాసిక్ కథ
మొగుడున్న రోజుల్లో సుందరమ్మకు సమస్యల్లేవు. జీవితాన్ని గురించీ, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించీ ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. మొగుడు కన్ను మూయగనే అన్ని సమస్యలూ తనవే అయ్యాయి. మొగుడు పోతూ పోతూ - పెళ్లాం బతికున్నన్ని రోజులూ గడపదాటకుండా కాలుమీద కాలు వేసుకొని తిని బతకడానికి ఆస్తిపాస్తులు మిగిల్చి వుంటే - అది వేరే విషయం. సుందరమ్మ విషయంలో అలా జరగలేదు. అందుకనే సుందరమ్మ హృదయం పని చెయ్య వలసిన సమయంలో మెదడు పనిచేసింది.

పట్టుమని పదేళ్లన్నా కాపరం చేయందే కన్నుమూసిన మొగుడి శవం మీదపడి ‘‘నా దారి యేమిటి దేవుడా?’’ అని ఏడ్చింది. దారి అంటూ ఒకటి వుంటే ఆమె ఏడుపు మరోరకంగా వుండేదేమో! ‘‘నారు పోసిన దేవుడు నీరు పోయకపోతాడా వూరుకో తల్లీ!’’ అని వచ్చినవారు ఓదార్చారు. ఆ క్షణం సుందరమ్మకీ అలాగే అనిపించింది. ప్రపంచంలో అందరు ఆడవాళ్లకీ మొగుళ్లున్నారా? అందరికీ ఆస్తిపాస్తులున్నాయా? అందరూ యేదో రకంగా బతకటం లేదా? తను మాత్రం బతకలేకపోతుందా? అనే ధైర్యం కలిగింది. ఆ ధైర్యమే కలక్కపోతే ఆ క్షణాన్నే ఆమె గుండె ఆగిపోయివుండేది.
 
సుందరమ్మకి ఎవరూ లేరు. తల్లిదండ్రులు ఎప్పుడో పోయారు. భర్త చనిపోయాడని తెలిసి అన్న మటుకు వచ్చాడు. వచ్చిన అన్న అందరిలాగే వేదాంతం చెప్పాడు. రెండు రోజులుండి మూడోరోజు ‘‘వస్తానమ్మా! ఇంటి దగ్గర ఎక్కడి పనులక్కడే వున్నాయి’’ అని ప్రయాణమయ్యాడు. సుందరమ్మ దుఃఖం ఆపుకోలేక బావురుమంది.
 ‘‘ఊరుకో అమ్మా! ఏడిస్తే పోయినవాళ్లు వస్తారా! ఎలా జరగాల్సివుంటే అలా జరుగుతుంది’’ అంటూ ఓదార్చాడు.
 
పోయినవాని కోసం ఏడ్వడం లేదు. ఉన్న ఒక్క అన్నా చచ్చినవానితో సమానమయ్యాడే అని ఏడుస్తున్నాను అని చెప్పాలనిపించింది. కాని ఏడుపు దిగమింగి ‘వెళ్లిరా’ అంది.
 సుందరమ్మ వారం పదిరోజుల్లో మామూలు మనిషి కాక తప్పలేదు. అన్నం ముందు కూకున్నప్పుడో రాత్రి పడుకున్నప్పుడో  మొగుడు జ్ఞాపకానికి వస్తూనే వున్నాడు. అదో బాధ. అంతకంటే బాధాకరమైంది - ఎలా జీవించడం అన్నది. ఖర్మకొద్దీ తనొక్కతే కాదు, ముగ్గురు పిల్లలున్నారు. ఈ పసిబిడ్డల్ని నెత్తినేసుకొని సంసారం ఎలా యీదడమా అన్నది అనుక్షణం మెదడ్లో తొలుస్తూనే వుంది. ఎంత గింజుకున్నా దానికి సమాధానం రాదు. ఏడుపు వస్తుంది. తనబాధ ఒకరితో చెప్పుకుంటే తీరేది గనకనా?
 
సుందరమ్మ ఒకవైపు యిలా కుములుతూనే వుంది. మరొకవైపు బాకీ ఆసాములు ఇంటిచుట్టూ తిరగడం ప్రారంభించారు. ఎద్దుపుండు కాకికి ముద్దా? వచ్చినవాళ్లు కాస్త పరామర్శించి బాకీ విషయం కదుపుతున్నారు. సుందరమ్మకు ఏం చెప్పడానికి నోరు రాదు, మొగానికి చెంగు అడ్డం వేసుకొని వెక్కి వెక్కి యేడ్చేది. ఎంత బాకీ ఆసాములయినా వాళ్లలోనూ మానవత్వం అంతో యింతో మిగిలే ఉన్నట్లుంది. పోనీ పాపం ఇంకా బాధలో వున్నట్లుంది, ఇంకో నెల ఆగి చూద్దాం అనుకొని వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ వడ్డీ మొదలూ తమకెంత రావాలో చెప్పిపోతున్నారు. సుందరమ్మ అన్నీ లెక్క వేసుకొంది.

దాదాపు పదివేలు. మొగుడు పోతూ పోతూ తనకు మిగిలించిందేమిటి? యేడెకరాల మెట్ట, అది అమ్మకానికి పెడితే పదివేలు రావచ్చు. లేదా ధరలు బాగున్నాయి గనుక మరో రెండు, మూడు వేలు ఎక్కువే రావచ్చు. బాకీలు పోను రెండు వేలు, మూడు వేలు మిగిలితే దాంతో జీవితాంతం ఎలా బ్రతకడం?
 
కష్టం సుఖం ఎరిగిన లౌకికుడు ఒకడు సుందరమ్మకు ఈ విషయంలో ఒక సలహా యిచ్చాడు.
 ‘‘పెద్దవాడు మీ బావ వున్నాడు. ఆయనతోనన్నా మాట్లాడు. ఆయనే యేదో ఒకటి చేస్తాడు’’
 నిజమే ఊళ్లో బావగారున్నమాట వాస్తవమే. సుందరమ్మ భర్త వున్న రోజుల్లో ఆ అన్నాతమ్ముళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అన్నాతమ్ముళ్ల మధ్యనే ఆపేక్షలు లేకపోయాక తోటికోడండ్రకు వుంటాయా? సుందరమ్మకీ తోటికోడలికీ కూడా పడేది కాదు. తమ్ముడు పోతే అన్న అందరిలాగే వచ్చి అందరిలాగే వెళ్లాడు.

అట్లాంటివాళ్ల దగ్గరికి వెళ్లి సాయం అర్థించటమంటే సుందరమ్మకు మొదట మనస్కరించలేదు. తర్వాత ఆలోచిస్తే వెళ్లడమే మంచిదనిపించింది. తను మగదక్షత లేనిది. పంతాలు పట్టింపులు తనకెందుకు? అనుకుంది. చీకటిపడ్డాక నెత్తిన ముసుగేసుకొని పిల్లల్ని వెంటబెట్టుకొని బావగారింటికి వెళ్లింది. వెళ్లేసరికి బావగారు, తోటికోడలు ఇద్దరూ ఇంట్లోనే వున్నారు.
 
‘‘ఏమ్మా ఎందుకొచ్చావు?’’ అన్నాడు సుందరమ్మ బావ.
 సుందరమ్మ, తను వచ్చిన పనేమిటో విడమర్చి చెప్పింది. ‘‘బాకీ ఆసాములు నాలుగణాల వంతో ఐదణాల వంతో తీసుకుంటే, వాళ్ల కొంపలు కూలవు - నా కొంప నిలుస్తుంది. నాకు, నా పిల్లలకు యింత నిలవనీడ దొరుకుతుంది. ఈ విషయంలో మీరే ఏదో ఒకటి చెయ్యాలి. మీకన్నా నాకు అయినవాళ్లు ఎవరున్నారు’’ అంది దీనంగా.
 ‘‘రామ! రామ. ఇవేం బుద్ధులు సుందరమ్మా? ఫలానా రామకృష్ణ చచ్చి పోగానే, అతని పెళ్లాం బాకీలు ఎగవేసి ఆస్తి అట్టే పెట్టుకుందంటే ఎంత నామర్దా. లోకులు మొగాన ఉమ్మెయ్యరూ?’’ అంది గుక్క తిప్పుకోకుండా తోటికోడలు.
 
‘‘నీకెవరో బుద్ధిలేనివాళ్లు యిచ్చారు యీ సలహా. అప్పులు ఎగవేయడం, ఐ.పి.లు పెట్టడం మన యింటా వంటా లేదు. ఏది బడితే అది చేయడమేనా? పరువు, ప్రతిష్టా విషయం ఆలోచించన వసరం లేదా?’’ అని బావగారు ఛీ కొట్టారు.
 సుందరమ్మకి కాళ్లకింద భూమి తొలుచుకుపోతున్నట్లనిపించింది. ఇట్లా జరుగుతుందని వూహించలేదు.
 
ఆ పెద్దమనిషికి పరువు ప్రతిష్టలు పట్టాయి. తన బ్రతుకు తెరువు విషయం పట్టలేదు. ఉన్న ఆస్తి అప్పులవాళ్లు రాబందుల్లా తన్నుకుపోయాక, తను కూలో నాలో చేసుకుంటూ బజార్నపడితే ఆయన పరువు ప్రతిష్టలు ఇనప్పెట్టెలో వున్నట్టు భద్రంగా వుంటాయా?
 ఛీ ఛీ ఏం మనుషులు! అనుకుంది సుందరమ్మ. సుందరమ్మ యింటికి వచ్చి భోరున యేడ్చింది. బాగా చీకటి పడింది. దీపం కూడా వెలిగించాలనిపించలేదు. అలాగే యేడుస్తూ పడుకుంది. తలుపు దగ్గర యేదో అలికిడి అయినట్లుంటే లేచి దీపం వెలిగించి వాకిట్లోకి వచ్చింది. వాకిట్లో రంగరాజు నిలబడి వున్నాడు. చిత్రం! సుందరమ్మ ఇన్నాళ్లూ మరో బాకీ ఆసామిని మర్చేపోయింది!
 
‘‘ఏం రాజూ! నువ్వూ బాకీ అడగటా నికే వచ్చావా?’’ అంది సుందరమ్మ.
 రాజు గతుక్కుమన్నాడు. అసలే నోట్లో నాలుక లేని మనిషి. ‘‘లేదు. చూచి పోదా మని వచ్చాను’’ అన్నాడు నత్తినత్తిగా.
 అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు యేదో అలా అంది కానీ, రాజు పరామర్శించిపోవడానికే వచ్చాడని సుందరమ్మకి తెలుసు.
 
‘‘చూసేదేముంది నాయనా! దిక్కు లేని దానిగా మిగిలాను’’ అంది కళ్లు వత్తుకుంటూ.
 సుందరమ్మ కంటతడి చూసి రాజు కంటతడి పెట్టాడు. తన కోసం కంట తడిపెట్టే ప్రాణి ఒకటి వుందని సుందరమ్మకు యిప్పుడే తెలిసింది.
 ‘‘ఈ పదిహేను రోజుల్నుంచి ఎక్కడ భోంచేస్తున్నావ్?’’ అంది సుందరమ్మ.
 ‘‘సర్పంచ్‌గారింట్లో భోంచేస్తున్నా’’ అన్నాడు రాజు. ‘‘పోనీ రేపట్నుంచి యిక్కడికే రారాదూ’’ అంది సుందరమ్మ.
 
‘‘నా భోజనానికేంలే యిపుడు’’ అన్నాడు రాజు. రాజును సుందరమ్మ భోజనానికైతే పిల్చింది కాని - తన పరిస్థితి జ్ఞాపకం వచ్చి మళ్లీ సంకోచమూ కలిగింది. ఇన్నాళ్ల పరిస్థితీ వేరు. ఇప్పటి పరిస్థితి వేరు.
 సుందరమ్మకు మూడేళ్లనాటి విషయం జ్ఞాపకానికి వచ్చింది. రాజును సర్పంచ్ వెంటబెట్టుకుని వచ్చాడు. ఆయన సుందరమ్మ భర్త రామకృష్ణను ‘‘ఒరే రామకృష్ణా! ఈ అబ్బాయిని మనవూరి హైస్కూలుకు టీచరుగా వేశారు. వెనకా ముందూ ఎవరూ లేరట. తిండీ తిప్పల విషయం చూడటానికి మన వూళ్లో హోటళ్లు లేకపోయే!

మీ ఇంట్లో యీ అబ్బాయికి అన్నం యేర్పాటు చూడు. పడుకోటానికి స్కూలు వుండనే వుంది’’ అన్నాడు. సుందరమ్మని పిలిచి, ‘‘నా మొగం చూచి అయినా ఈ అబ్బాయికి వండిపెట్టాలి సుందరమ్మా! తప్పదు’’ అన్నాడు సర్పంచ్.
 పెద్దమనిషి ప్రాధేయపూర్వకంగా అడుగుతూంటే కాదనడానికి సుందరమ్మకు మనసొప్పలేదు. ‘‘అలాగే పెదనాన్నా!’’ అంది.
 
ఆ రోజు నుంచి రాజు తనింట్లోనే భోంచేస్తున్నాడు. తిన్నదానికి ఋణం వుంచుకోకుండా నెలకి అరవై రూపాయలిస్తున్నాడు. అవసరమొస్తే మూడొందలు అప్పుగా కూడా యిచ్చాడు. ఇన్నాళ్లూ రాజుకు అన్నం పెట్టడంలో లాభనష్టాలను బేరీజు వెయ్యలేదు. రాజు యిచ్చే అరవై రూపాయలూ సుందరమ్మకు పెన్నిధిలా కనిపించాయి. రాజు తనింట్లో భోంచేయడం వల్ల అంతో యింతో మిగులుతుంది. తనున్న స్థితిలో అదైనా మేలే, సంకోచిస్తే లాభం లేదు. అందుకని సుందరమ్మ, రాజు లేచి వెళ్తుంటే మళ్లా చెప్పింది. ‘‘రేపట్నుంచి భోజనానికి ఇక్కడికే రా రాజూ!’’అని. రాజు వస్తానన్నట్టు తల తిప్పాడు.
    
బావగారు, తోటికోడలు పెట్టిన చీవాట్లు తిన్నాక, అప్పులవాళ్లతో పేచీ పెట్టుకోవడానికి సుందరమ్మకు ధైర్యం చాల్లేదు. ముందు ముందు ఎలా జరగాల్సివుంటే అలా జరుగుతుంది. లోకులతో మాటలు పడటం యెందుకు? అని భూముల్ని అమ్మకానికి పెట్టింది. చిత్రమేమిటంటే - కొంటామని ఒక్కరూ ముందుకు రాలేదు. భూమి కొనమని ఒకరిద్దరిని తనే ప్రాధేయపడింది.
 ‘‘చేలో చేను - మీ బావగారు కొంటామంటున్నారు. మేం కొంటే యేం బాగుంటుంది ఆయనకే యివ్వడం న్యాయం’’ అన్నారు వాళ్లు. దోపిడీ చేసేవాళ్లకి కూడా సర్దుబాట్లుంటాయని సుందరమ్మకేం తెలుసు. బావగారు కొంటారంటే మంచిదే అనుకుంది. వెళ్లి ఆయన్నే అడిగింది కొనమని.
 
ఆ మహానుభావుడు కాబట్టీ కాబట్టనట్టు ‘‘ఎనిమిది వేలిస్తాను. ఇష్టమైతే అమ్ము. కష్టమైతే మానుకో. బలవంతం లేదమ్మాయ్’’ అన్నాడు.
 ఈ స్థితిలో తను యేమి చెయ్యగలదు? కంఠ దగ్ధంగా శోకం ముంచుకొచ్చింది.
 ‘‘మీ యిష్టం. ఎంత న్యాయమని తోస్తే అంతే యివ్వండి’’ అని తన నిస్సహాయతను వెల్లడి చేసింది.
 ‘‘న్యాయమైన ధరే చెప్పాను. కావాలంటే నలుగుర్నీ విచారించుకొనే వచ్చి అమ్ము. తొందరేమొచ్చిందమ్మా!’’ అన్నాడు సౌమ్యంగా. ఎవరున్నారు తనకు విచారించటానికి? ఆయన అడిగిన ధరకే ఖాయం చేసింది. బాకీలకు పోను ఒకటి రెండు వేలు మిగులుతాయనుకొంది. అలాంటిది బాకీలకే సరిపోవడం లేదు.

బాకీలు నెత్తిమీద పెట్టిపోయిన మొగుడిమీద సుందరమ్మకు కోపం వచ్చింది. ఒకటికి పదిసార్లు మనసులో తిట్టుకుంది. ఇలా సుందరమ్మ మనసులో కుళ్లి చస్తుండగానే మరో సంఘటన జరిగింది. ఒకరోజు రాత్రి రాజు భోజనం చేస్తూ, ‘‘మీ బావగారు ఇకమీదట నన్ను యిక్కడికి భోజనానికి రావద్దన్నారు’’ అన్నాడు దీనంగా ముఖం పెట్టి.
 
సుందరమ్మ యీ మాట విని దిగ్భ్రాంతి చెందింది. ‘‘ఎందుకంటా?’’ అంది కోపంగా. వివరించాల్సిన పనిలేదనుకున్నాడో ఏమో రాజు ఏం మాట్లాడలేదు.
 ‘‘నేనూ, నా బిడ్డలూ పూటకింత తింటున్నామో లేదో ఎవరికీ పట్టదు. నా మానమర్యాదల్ని గురించి మట్టుకు జాగ్రత్తలు తీసుకుంటారు’’ అని సుందరమ్మ యేడవటానికి మొదలుపెట్టింది.
 రాజుకు ఇక భోంచెయ్య బుద్ధి పుట్టలేదు. తింటున్న పళ్లెంలో చెయ్యి కడిగి లేచాడు. ఆమెను ఎలా ఓదార్చాలో బోధపడలేదు. యేడుస్తున్న ఆమెను వదిలి, చెయ్యి తుడుచుకుంటూ వెళ్లడానికి కాళ్లు రావటం లేదు. అలాగే స్థాణువులా మంచంమీద కూర్చున్నాడు. ఎంతసేపు చూచినా సుందరమ్మ అలాగే యేడుస్తూ కూచుంది. లాభం లేదనుకొని రాజు వెళ్లడానికి లేచాడు.
 ‘‘రాజూ!’’ అంది సుందరమ్మ యేడుపు దిగమింగి. రాజు నిలబడి యేమిటన్నట్లు చూచాడు.
 ‘‘ఇక్కడే పడుకో’’ అంది.
 రాజు తికమకపడ్డాడు. మనసులో వుండాలనే వుంది. కానీ భయంతో గుండెలు కొట్టుకుంటున్నాయి.
 
ఈ మనిషి తటపటాయింపు చూస్తుంటే వళ్లు మండింది. రాజుకు మొదట్నుంచి తనమీద మనసున్న విషయం సుందరమ్మకు రూఢిగా తెలుసు. ఈమాత్రం తెలుసుకోడానికి పెద్ద అతీంద్రియ జ్ఞానం అవసరం లేదు.
 ‘‘భయమా?’’ అంది సుందరమ్మ.
 ‘‘అది కాదు నలుగురికీ తెలిస్తే...’’ అంటూ నీళ్లు నమిలాడు.
 ‘‘తెలియనీ. యేం చేస్తారో చూద్దాం’’ అంది సుందరమ్మ.
 రాజు ఇక యేమీ మాట్లాడలేదు.
    
పల్లెల్లో నిప్పు లేకుండానే పొగ వస్తుంది. నిప్పు వుంటే వేరే చెప్పాలా! వారం రోజులన్నా గడవందే ఊరంతా గుప్పుమంది. నిమ్మకు నీరెత్తినట్లు సుందరమ్మ యేమీ లెక్కచెయ్యలేదు. సుందరమ్మ బావ సుందరమ్మను ఇంటి దగ్గరకు పిలిపించి, నయానా భయానా కూడా మందలించాడు. సుందరమ్మ మొండికెత్తింది.
 
‘‘నా బతుకు నాది. మీకెందుకు బాధ’’ అంది నిర్మొహమాటంగా.
 దాంతో సుందరమ్మ బావగారు ఇటు నుంచి లాభం లేదనుకొని అటు నుంచి నరుక్కురావడానికి ప్రయత్నించాడు. అంటే రాజును బెదిరించాడు. రాజు సుందరమ్మతో మొరపెట్టుకున్నాడు.
 ‘‘నాకేదో భయంగా వుంది. మీ బావగారు నా కాళ్లూ చేతులూ విరిపిస్తానంటున్నాడు. యేం చెయ్యను?’’ అన్నాడు. సుందరమ్మకు సహనం చచ్చింది. రాజును చూస్తుంటే జుగుప్స కలుగుతోంది.
 ‘‘వాళ్లు కాళ్లూ చేతులూ విరుస్తామంటే నువ్వు మగాడివి కాదూ? ఒంగోలు కోడెలావున్నావు. కోసేస్తే బండెడు కండలున్నాయి. ఆడదానికున్న పౌరుషం లేదేం నీకు?’’ అంది.
 ‘‘నేనేమో పరాయి ఊరువాణ్ని. పైగా గవర్నమెంటు ఉద్యోగిని’’ సమర్థించుకో బోయాడు.
 ‘‘నోరు మూసుకో! పరాయి ఊళ్లో గవర్నమెంటు ఉద్యోగులు పౌరుషం లేకుండా బతకాలని రాసిపెట్టి వుందా?’’ అని నోటిమీద కొట్టినట్టు మాట్లాడింది సుందరమ్మ.
 ఇక నోరెత్తి మాట్లాడటానికి రాజుకు ధైర్యం చాల్లేదు. ఇక రెండు మాటలు గట్టిగా అంటే, కంటతడి పెట్టడానికి కూడా సిద్ధంగా వున్నాడు. సుందరమ్మకు జాలి కలిగింది. ‘‘భయపడకు రాజూ! నేనున్నాను’’ అని ధైర్యం చెప్పి దగ్గరకు తీసుకుంది.
    
తన బాధ్యత రాజు మోయవలసింది పోయి తనే రాజు బాధ్యత మోయవలసి వస్తుందని సుందరమ్మ వూహించలేదు. తీరా ఇట్లా పరిణమించిన తర్వాత చేతులు ముడుచుకు కూర్చుంటే లాభం లేదు. ఏదో చెయ్యాలి. సుందరమ్మకు సర్పంచ్ జ్ఞాపకం వచ్చాడు. ఆయనకు రాజుమీద కూడా అభిమానమే.

ఆయన తలచుకుంటే యేమైనా చెయ్యగలడు.
 సుందరమ్మ సర్పంచ్ ఇంటికివెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. ‘‘నా బతుకు నేను బతుకుతూ వుంటే చూడలేక అంతా కళ్లల్లో నిప్పులు చల్లుకుంటున్నారు. మీరు ఊరికి పెద్దలు. మీరు కూడా చూస్తూ ఊరుకుంటే, యే నుయ్యో గొయ్యో చూసుకుంటాను’’ అంది.
 ఆయన అంతా విని ‘‘నాకు సవాలక్ష పనులు, తలమునకలుగా వున్నాను. తీరిక చేసుకొని నీ విషయం ఆలోచిస్తాను’’ అన్నారు.
 
ఒకవైపు కొంపలంటుకున్నాయి. ఈయనకు తీరిక దొరికేదెపుడోనని సుందరమ్మ భయపడింది. సుందరమ్మ వూహ కరెక్టు కాదు. ఆ రోజే దీపాలు వెలిగించే సమయానికి సర్పంచ్ సుందరమ్మ ఇంటికి వచ్చాడు. సర్పంచ్ తన విషయం మరచిపోనందుకు సుందరమ్మకు సంతోషం కలిగింది. మంచం వాల్చి కంబళీ పరచి కూర్చోబెట్టింది. ముసలాడు మీసాలు సవరించి అసలు విషయం బయటపెట్టాడు. ‘‘మీ ఇద్దరికీ యే భయమూ లేదని హామీ యిస్తాను. నన్నూ ఒక కంట చూడాలి’’ అని.
 
సుందరమ్మ నిర్ఘాంతపోయింది. ఆయనకు, వయసులో తన కన్నా పెద్దదయిన కూతురు వుంది. ఆయన తన్ను కోరుతున్నాడు. గుండెల్లో మంటలు లేచాయి. స్పృహ తప్పి ఎక్కడ పడిపోతానో అనుకుంది. కానీ స్పృహ తప్పలేదు.
 ‘‘యేమంటావ్?’’ అన్నాడు సర్పంచ్. యేమంటుంది సుందరమ్మ? తలవాల్చి శ్వాస బిగబట్టి -
 ‘‘సరే’’ అంది.        
- సొదుం జయరాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement