అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది | grand mother lefted at sum place n | Sakshi
Sakshi News home page

అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది

Published Sun, Dec 13 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది

అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది

క్లాసిక్ కథ
మా అవ్వనెరగరూ మీరూ, అవ్వని... హయ్యొ! మా ఊళ్లో ఆవిణ్ని ఎరగనివాళ్లు లేరే! అసలు ఊరంతా అవ్వ అనే పిలుస్తారావిణ్ని. కొద్దిమంది ‘సుబ్బమ్మ గారూ’ అని కూడా అంటారు. ఆవిడకి కోపం వచ్చినపుడు ‘‘ఆ ఆ ఆ, ఎవర్రా అవ్వ! నువ్వు నాకేవవుతావురా చస్తే దెయ్యవవుతావు గాని’’ అని గద్దిస్తుంది. అప్పుడు చటుక్కున సర్దుకుని ‘సుబ్బమ్మగారూ’ అంటారు. ఒక్కొక్కప్పుడు, ‘సుబ్బమ్మ గారూ’ అని పిలిస్తే ‘‘హారి గాడిదా! వేలెడంత లేవు, బొడ్డుకోసి పేరెడతావురా నాకూ!’’ అని దులిపేస్తుంది. వెంటనే దిద్దుకుని ‘అవ్వగారూ’ అంటారు.
 ఏవయితేనేం... అందరికీ ఇష్టవే, అవ్వంటే.
 
అవును. అందరికీ ఇష్టవే మరి! వాళ్లకేం పోయింది ఇష్టం గాక, ఎప్పుడో కనిపిస్తుంది వాళ్లకి. కనిపించినప్పుడు ఎంచక్కా కుశల ప్రశ్నలూ అవీ వేస్తుంది. సాతల్తో సాతాళించి కబుర్లూ కథలూ చెపుతుంది. మాంచి ఫారమ్‌లో ఉంటే - అంటే ఒడుపులో ఉంటే పాటలు పాడుతుంది. పావు పాటా అవీ. ఆ కాస్సేపూ వాళ్లకి కులాసాగా ఉంటుంది. వింటారు పోతారు. వాళ్లకేం! రాత్రీ పగలూ ఆవిడతో ఇంట్లో ఉండేవాళ్లం. మేం వేగలేక చస్తున్నాం గాని!
 
అన్నట్టు - అవ్వంటే మీరెరగరన్నారు కదూ సుబ్బమ్మవ్వని - ఆవిడ మమ్మల్నెలా ఏడిపిస్తుందో చెప్పే ముందు, ఆవిడ రూపురేఖలూ ధోరణీ మీకు తెలియద్దూ! అసలు మా అవ్వంటే, మా నాన్నగారి మేనత్త. నాయన్తాలూకు అయిదెకరాల పొలవూ, అప్పారం లోగిలీ వగైరా ఆస్తితో అవ్వ కూడా నాకు సంక్రమించింది. మా నాన్న మేనత్తంటే దాదాపు డెబ్భై మాట గదా. అయితేనేం, నడుం నిటాగ్గా కదురులా నిలబెడుతుంది. ఇష్టం లేనప్పుడు మాత్రం తెలుగులో ‘ఐ’ అక్షరం లేదూ ‘ఐ’... దానిలాగా ఒంగిపోతుంది. తరుచు కంఠం రైలు గంటలాగా గణగణా మోగించేస్తుంది. ఇష్టం లేనప్పుడు పీలగా మూలుగుతుంది.

ఈ మధ్య కొంచెం చెడ్డా, గెద్ద చూపు లాంటిది అవ్వచూపు. అయితే పళ్లు మాత్రం తీయించెయ్యడవో రాలిపోవడవో జరిగింది. ఒక్కటే ఒక్క పై పన్ను మాత్రం - ముందుంది - కింది పెదిమ మీదకి వొంగి, అక్కడ కాలూని, మాట్టాడుతున్నప్పుడు రవ్వంత తలాడిస్తూ ఉంటుంది. అది అందానిక్కాబోలు ఉంచేసిందవ్వ. మా ఇంటికొచ్చిన వో పెద్దమనిషి - అప్పన్న శాస్త్రుర్లని మాంచి కవి కూడా - ఆయనొకసారన్నాడు చెమత్కారంగా... ‘‘ప్రెపంచంలో ఏ ప్రెభుత్వవూ చెయ్యలేని పని సుబ్బమ్మవ్వగారు చేసిందండి.

ఒకే ఒక్కటి తప్ప ఏ పన్నూ లేకుండా చేసిందీ!’’ అని. అయితే, అవ్వ మాట్టాడుతుంటే మాత్రం అతి స్పష్టంగా తెలుస్తుంది. కొందరు పళ్లు లేనివాళ్ల నోరు లక్కపిడతలాగా డొల్లగా ఉంటుంది. మాట్టాడుతుంటే ఏవీ తెలియదు. రొచ్చులో నడుస్తున్నట్టు పుసుకూ పుసుకూ గాలి పోసుకుంటుంది. అంతే, పాత రబ్బరు బొమ్మ కడుపు నొక్కితే చప్పుడైనట్టు అవ్వలా గాదు.
 అయినా ఓ లోపం ఉంది. అవ్వ మాటల్లో ‘ప’, ‘ఫ’ అని పలుకుతుంది. ‘తప్పూ, వప్పూ, చెప్పూ’ అంటుంది, ఈ వొంటిపన్ను వల్ల.
 
అసలు అవ్వదీ - మా సుబ్బమ్మవ్వదీ - పెద్ద జాతీయ నాయకుడి ఉపన్యాస ధోరణి. అయితే అవ్వ తెలివిగా మాట్టాడుతుంది. వోసారీ, ఉపన్యాసాల్తో దేశాన్నంతనీ తల దిమ్మెక్కించే వో పెద్దమనిషి మా ఇంటికొచ్చాడు. ఆయన సభలోనే గాక సభ ఇవతల కూడా సభలో అంతా మాట్లాడతాడు. మా ఇంటికొచ్చిన పది నిమిషాల్లో మొదలెట్టాడు ప్రసంగం. మరి పది నిమిషాల్లో అవ్వ కలుగజేసుకుని రంగస్థలంలో విరగబడింది. ఆయనగారు తోక జాడించి, నాటికీ నేటికీ అవ్వకి ‘నమస్తే’. అంతే! ఆవిడ సన్నిధానంలో నోరు విప్పడు.
 
వెనకటికి వో కవిగారు చెప్పినట్టు నిప్పుల, నీళ్లను, చప్పిడుప్పిళ్లను, తీర్థాల, తిరునాళ్ల త్రిప్పటలను, గడిదేరి గడ్డకట్టిన ఘటం అవ్వ. పెళ్లికి కాస్త ముందో వెనకో పోయాడు పెనివిటి. డెబ్బై ఏళ్ల పైని ఏకధాటిగా అంటే ఏక టాకీని వైధవ్య రాజ్యాన్ని పరిపాలించి పారేసిన రాణీ బహద్దర్. గడ్డు బ్రహ్మచారిణి. యాక్సిడెంట్, అంటే ఏ కారో, రైలో కలగజేసుకుంటే తప్ప మార్కండేయాది చిరంజీవుల లిస్టులో మనిషి మా అవ్వ.
 
నాలుగ్గంటలకే లేచి తొలి కోడిని లేపడం, తలుపులన్నీ తెరిచి పారేసి పాచిపనులు అవీ చెయ్యడం, చెంబులూ, గిన్నెలూ చప్పుళ్లు చెయ్యడం, స్నానం చెయ్యడం, పత్తిరాట్టం లాంటి కంఠవెత్తి ‘ప్రాతస్మరామి’ వగైరా శ్లోకాలు చదవడం, మా నిద్దర తగలెయ్యడం - ఇలాగ రోజంతా జరిగే తంతుని గూర్చి అట్టే చెప్పడం నాకిష్టం లేదు. ఈ వివరాలు కూడా మీకు చెప్పకపోదును. కాని మీ కోసమే చెప్పా ఇదంతా. అవ్వ ధోరణిలో చెప్పవలసి వస్తే ఎప్పుడైనా అవ్వ ఎదురయితే చప్పున తప్పుకుని మీరు దాటిపోవచ్చని! అంతేగాక, ఇవన్నీ చెపితేగాని, మేవావిడతో ఎలా వేగిపోతున్నావో మీకు తెలీదని కూడా ఇన్ని వివరాలిచ్చా మీకు. ఇంట్లో మమ్మల్ని ప్రతి ఘడియా ఏడిపించే పనుల్ని గూర్చి నేను చెప్పనే లేదు.

హయ్యొ బాబో! ఏ నవ్వండీ బాబూ, కోటయ్యగారు క్లీన్‌గా భోంచేసిన విస్తట్లోనే కొత్తదనుకున్నానని, మా శాషమ్మ దొడ్డమ్మకి మళ్లీ వడ్డించడం, నీళ్లనుకుని చెంబెడు సామర్లకోట పప్పు నూనితో చెయ్యి కడుక్కోవడం, ఎంగిలి విస్తళ్లన్నీ కట్టగట్టి గోడమీద నుంచి వీధంట వెడుతున్న మేస్ట్రీటు వీర్రాజుగారి తలమీద పడేటట్టు విసిరివేయడం - ఈ గొడవలన్నీ ముందు ముందు మీకు తెలుస్తాయి. అలాగే సినిమాకు వెళ్లడం, సర్కస్‌వాళ్ల బోనుల దగ్గర కదలకుండా నిలబడి అక్కడ జంతువులతో జత కట్టడం, శాసనసభ సీటు కోసం మా ఊళ్లో చేసిన పెద్ద ఎన్నికల సభలో రభస చెయ్యడం - ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కాదు, తర్వాత చెపుతా.
 అయితే, ఓ చిన్న సంగతి చెప్పి, అది చెప్పి తీరాలి - ఆవిడ తిర్నాళ్లలో తప్పిపోవడం దగ్గరకొస్తా.
 అప్పన్న శాస్తుర్లు గారని చెప్పానే ఇందాకా. కవిగారు, ఆయన ఓసారి అవ్వమీద పంచరత్నాలు చెప్పాడు భోజనాల దగ్గిర సరదాకి!
 ‘‘సుగుణమణిగణ నికురుంబ సుబ్బమాంబ’’
 అనిన్నీ.
 ‘సుజన సేవాలంబ గం, సుబ్బమాంబ’’
 అనిన్నీ,
 ‘‘గం’’ అంటే గంగా భాగీరథీ సమానురాలట.
 ఆయన పద్యాలు చెపుతుంటే, అవ్వ ముసిముసి నవ్వుల్తో అటూ ఇటూ తిరుగుతూ, ఏదో తన గొడవ కాదన్నట్టూ నిర్లక్ష్యంగా పట్టించుకోనట్టూ విననట్టూ అంతా విని, ‘‘అవి ఓ కాయితం మీద రాసి పారెయ్యండి బాబూ, మా నాన్నిగాడికివ్వండి’’ అంది.
 
నాన్నిగాడంటే మా పెద్దబ్బాయి, వాడంటే మా అవ్వకిష్టం. మా నాన్న పేరని! వాడూ గడుసు రాస్కెల్, ఏం చేశాడూ! ఆ పద్యాలు తీసుకుని, వల్లించి, అడపా దడపా పెద్ద రాగవరస పెట్టి అవ్వ దగ్గిర చదివేయడమూ, ఆవిడ దగ్గరేదేనా కొట్టేయడమూ. ఈ పద్యాల వెర్రి అవ్వనెంతదాకా పట్టుకుందీ అంటే
 ఓసారి నాతో అందీ - ‘‘వొరే అబ్బాయీ! నేను పోయాక పదకొండో రోజున ఈ కవుల్నందర్నీ పిలిపించి నామీద పజ్యాలు చెప్పించరా’’ అని.
 ప్రెస్తుతమేవిటంటే, నాన్నిగాడు శివరాత్రి తీర్దానికెళదామని అవ్వని రెచ్చగొట్టాడు. నా కిష్టం లేదు. ‘‘తీర్దములు మానసములు ముక్తి ప్రదములు’’ అంటూ ‘‘సత్యము తీర్దము’’ అంటూ కవి చెప్పిన మాటల్లో నమ్మకం ఉన్న వాణ్నాయెను.

అయితే ఏం జెయ్యను అవ్వా నాన్నిగాళ్లల్లో ఏ ఒక్కళ్లనీ లొంగదీయడవే కష్టం! ఇద్దరూ పట్టుకున్నారాయె! పోనీ ఇల్లేనా ఆనాటికి విశ్రాంతిగా ఉంటుందనిన్నీ దారి పొడుగునా అస్తమానవూ అవ్వకోసం పంచరత్నాలు పద్యాలు చదివి నాన్నిగాడి తెగులు కుదురుతుందనిన్నీ సరేనన్నాను, చివరికి.
 ఆ తీర్దానికే వెళుతున్న రావయ్య కాపుని బతిమాలుకుని, అతని రెండెడ్ల బండిలో మా వాళ్లని కుక్కాను. తోవలో అవ్వ కునికిపాట్లు పడి కిందపడకుండా రావయ కాపు పెద్ద కొడుకుని బండి చివర బిరడాలాగా బిగించాను. ఈ బిరడా సంగతి తర్వాత చెపుతా.
 
వాళ్లు తెల్లారగట్టే వెళ్లారు. సాయంకాలవో, రాత్రి పడుతుంటేనో రావాలి. మూడు నాలుగ్గంటలకి ఏదో పనివుండి వీధిలోకి వచ్చా. వీధరుగు పక్కని బిక్కమొహం వేసుకుని, ఏడిచి ఏడిచి ఎర్రకళ్లూ వాడూ, నాన్నిగాడు ఒదిగి నిలబడి ఉన్నాడు.
 ‘‘ఏమిరా అవ్వేదిరా’’ అన్నాను.
 ‘‘త-త-త’’ అన్నాడు.
 ‘‘ఏమిట్రా తతత తప్పిపోయిందా ఛ ఛ ఛ కాదు గదా, అంటే చచ్చిపోలేదు గదా’’ అనడిగాన.
 ‘‘తీర్ధంలో అవ్వ కనబళ్లేదు’’ అన్నాడు వాడు మెల్లిగా.
 ‘ఆ’ అన్నాను.

నా గుండె గుభేలుమంది. గోదార్లో పడిందేవో! కారు కింద పడిందేవో! గుండె ఆగిపోయిందేవో, నాకు మహ జాలీ, దుఃఖం వేసుకొచ్చాయి. అసలు అవ్వంటే మా అందరికీ ఎంత ఇష్టవో అప్పుడు తెలిసొచ్చింది నాకు. అవ్వని తీసేస్తే లోకం ఎలా ఉంటుందో మాకు తెలియదు. పాపం ఆవిడకెవరున్నారు? నిజానికి నాకు ముసలాళ్లను చూస్తే ఎంతో దిగులు. ముందుకు చూసుకుంటే నోరు తెరుచుకుని దగ్గరగా వచ్చే చీకటి భూతంగాక వాళ్లకే ఉంది!

 మా అవ్వ చూపులు ఒక్కొక్కప్పుడు, దూరాన ఆకాశాన పోయే పక్షుల్లాగా ఉంటాయి. ఎక్కడికో ఎక్కడికో పోతూన్నట్టు, అప్పుడు నాకు భయం వేస్తుంది. అవ్వ ఒక్కొక్కప్పుడు పొడుగ్గా నిట్టూర్చేది! ఆ నిట్టూర్పు చిన్నతనం నుంచీ ఎనభై ఏళ్ల దార్లోబడి పాకివచ్చినట్టుండేది. ఇప్పుడు ఈ మాటలన్నీ స్థిమితంగా అంటున్నాను గానీ అప్పుడు...
 ‘‘ఏవిట్రా, ఏం జరిగిందీ?’’ అని నాన్నిగాణ్ని అడిగాను.

 గోదావర్లో స్నానం చేసొచ్చారట. గుళ్లోక్కూడా వెళ్లొచ్చారట. స్వామి దర్శనమయ్యాక, గుళ్లో మండపం మీద కూచుని వాడి చేత సరదాగా పంచరత్నాలు కూడా చదివించుకుందిట. తర్వాత ఇవతలికి వచ్చాక, రంగుల రాట్నం దగ్గరికొచ్చేటప్పటికి నాన్నిగాడు అదెక్కుతానన్నాట్ట. వాడు కాస్సేపు దానిమీద తిరిగొచ్చేసరికి అవ్వక్కడలేదు. వాడు మొదట ఇక్కడా అక్కడా చూసి, కనబడకపోతే కంగారుపడి, ‘‘అవ్వా, అవ్వా’’ అని పిలుస్తూ తీర్ధవంతా తిరిగీ, బళ్లు విప్పినచోట అక్కడ కూడా ఆవిడ కనబడకపోతే అయిదు మైళ్లూ నడిచి ఇంటికొచ్చేశాడు. ఇదీ కథ.
 వెంటనే రావయ్య కాపొచ్చాడేమో వాళ్లింటిక్కబురు చేశాను. కావిగాణ్నీ గోవిందునీ తిర్నాళ్లకి పరుగెత్తించాను. అవసరమైతే పోలీసుల్తో గూడా చెప్పమన్నా. ఇంట్లో మా ఆవిడా పిల్లలూ నిశ్శబ్దంగా కూచున్నారు. కుక్కిన పేనుల్లా. నేను శివస్మరణ చేస్తూ బయటికి వెళుతూ, లోపలికొస్తూ మతిపోయినట్లు తిరగడం మొదలుపెట్టాను.

 రాత్రి పదయింది. అవ్వ లేకుండా రావయ్య కాపు బండి వచ్చేసిందట. కావిగాడూ గోవిందు వఠ్ఠి చేతుల్తో, అంటే అవ్వ లేకుండా వచ్చేశారు. ఇహ, ఊరుకుంటే బావుండదని, మా ఆవిడ లోపల్నించి కొంచెం కూనిరాగం ఏడుపు ప్రారంభించింది. చంటిపిల్లాడు కూడా యధాశక్తి వాళ్లమ్మకి తోడయ్యాడు. చూడ్డానికీ, ఉబుసుపోకా, సొహం గ్రామం మా ఇంటి దగ్గర చేరి, అవకాశం రాగానే సరదాగా పరామర్శలోనూ, అవ్వ దివ్య స్మృతుల్ని నెమరువేసుకోవడంలోనూ, అప్పుడే పడిపోయారు.

 ఇదీ తిర్నాళ్ల రోజున అర్ధరాత్రి మా స్థితి.
 అంతలో ‘‘సన్యాసిరాజుగారిల్లిదేనా?’’ అని దూరాన్నుంచి గద్దిస్తున్న మాటలు వినబడ్డాయి. అందరూ అటు తిరిగి చూశారు.
 ‘‘ఎవరు బాబూ, ఏవిటి?’’ అని గావుకేక పెట్టాన్నేను. చీకట్లోంచి వస్తూ పోలీసు జవాను కనబడ్డాడు. కూడా ఠీవిగా నడుస్తూ, చీకట్లో దీపస్తంభం లాగా, జవాను కంటే ధాటిగా అవ్వ సాక్షాత్కరించింది. ‘‘అవ్వొచ్చింది’’ అని కేకేశాను. లోపల్నుంచి అందరూ ‘ఘొల్లు’మని ఇవతలకి వచ్చారు.

 కొందరు మాత్రం ‘అరెరే! అవ్వ అప్పుడే దొరికేసిందే. నాల్రోజుల పాటు సరదా పోయిందే’ అని దిగులు మొహం వేశారు.
 పోలీసు జవాన్, ‘ఇదుగోండీ ముసలావిడ. నా ప్రాణాలు తోడేసిందీ! ఈవిణ్ని తిర్నాళ్లకీ తీర్ధాలకీ పంపి, దేశం మీద వదుల్తారేవిటయ్యా ఈవిడ కంటే మా సూపర్నెంటు నయం’’ అని చీదరించుకుంటూ అన్నాడు.
 ‘‘పోరా! నే సూపరింటునే, నాకేంరా బహద్దర్ని! శెలవిచ్చాను ఫో’’ అంది అవ్వ. వాడు పళ్లు బిగించి కొరకొర చూసి, చీకట్లోకి నడిచి, అక్కడ ఖాండ్రించి ఉమ్మేసి చక్కాపోయాడు.
 ఇహ తీర్ధంలో జరిగిన కథేమిటంటే...

 నాన్నిగాడు రంగులరాట్టం తిరుగుతూంటే పిల్లలందరికీ జీళ్లూ, జంగిడీ మిఠాయి, తొక్కుడుండలూ కొందామని, ఆ కొట్లకెళ్లి ఒక్కొక్కళ్లకి పేరు పేర్నా వొక్కొక్క పొట్లాం కట్టించిందట అవ్వ. అక్కడ చిల్లర విషయంలో కొట్టువాడితో పేచీ వచ్చి, వాణ్ని భూశెయనం చేసి పారేసి, దమ్మిడీలతో సహా వాడి దగ్గర్నుంచి మీద పడిందట. అక్కడ రాగిచెంబూ, గరిటా బేరం తేల్చడానికి రావరావణ యుద్ధం చేసి, రాచ్చిప్పల కొట్టువైపు దృష్టి తిప్పి, అటు దాడి చేసింది. దారిలో డక్కీ డమడమల బండి వాడు తారసిల్లితే, అన్నీ వాయించీ, నడిపి చూసీ, అమ్మేవాడు బోరుమని ఏడ్చేదాకా వాణ్ని ఆపి, అంతలో ఉప్మాకయ్యగారి కుటుంబం కనబడితే వాళ్లతో ఊసులాడి, అట్టే నాలుగడుగులేసే సరికి నాన్నిగాడు గ్యాపకానికొచ్చాడు. అప్పటికప్పుడే పొద్దువాల్తోంచి.

 ‘‘నాన్నిగా నాన్నిగా’’ అని తీర్ధవంతా తిరగడం మొదలెట్టింది. బళ్ల దగ్గిరకొచ్చి చూస్తే, రావయ్య కాపు బండీ వెళ్లిపోయింది. మళ్లీ తీర్ధంలోకి వచ్చింది... ‘‘మా నాన్నిగాడు కనబడ్డాడా?’’ అనడుగుతూ. ఎవళ్లనడిగినా వాళ్లు పట్టించుకోలేదు. అప్పటికి కంగారు పడ్డం మొదలెట్టిందవ్వ. ఇంతలో కనబడిన పోలీస్ జవాన్‌ని కూడా అడిగింది. వాడు ఊరూ పేరు అన్నీ అడిగి పోలీస్ స్టేషన్ దగ్గిర కూచోబెట్టాడు.

 ‘‘అమ్మా! బైపడకండి. ఇంటికి తీసికెడతాం’’ అని పోలీసు వాడంటే ‘‘ఎవరికిరా భయం?’’ అని ధీమాగా మొదట అన్నప్పటికీ, నాన్నిగాడి కోసం లోపల్లోపల కంగారు పడిపోయింది. అవ్వ పోలీస్‌స్టేషన్‌లో కూర్చున్న సమయంలోనే కావిగాడూ గోవిందూ అవ్వకోసం గాలించిపోయారు. ఇదంతా చెప్పాక ఇలాగంది అవ్వ. ‘‘ఆ రాచ్చిప్పల దుకాణం దగ్గిరాలస్యవయిపోయిందర్రా! అక్కడే వళ్లు మరిచిపోతుంటాను. ఏవిరా నాన్నిగా! శివరాత్రి గూడాను. అప్పన్న శాస్త్రులుగారి పద్యాలు నామీద రాసినవి చదవరా’’ అంది. అందరూ పకపకా నవ్వారు.

నాకు మాత్రం ఒళ్లు భగ్గుమంది. ఆవిడ గొంతుక పట్టుకుని ఆ రాత్రి ఆవెని శివసాయుజ్యం పొందిద్దావనుకున్నాను. దిక్కుమాలిన పాపభయవో, దండ భయవో వచ్చిపడి మళ్లీ తమాయించు కున్నాను. అంతకంటే గూడా నా లోపల పిచ్చి ఇష్టం గూడా ఏడిసిందాయెను అవ్వమీద, మా సుబ్బమ్మవ్వ మీద!                        
                                         
- దేవులపల్లి కృష్ణశాస్త్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement