సంధ్యాసమయం | Classic story, Attitudes | Sakshi
Sakshi News home page

సంధ్యాసమయం

Published Sun, Sep 6 2015 12:56 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

Classic story, Attitudes

క్లాసిక్ కథ
మాకు వివాహమైన ఆ మరుసటి రోజునుంచే, నేను ఆమె కలిసి ఒకసారి బొంబాయి వెళ్లి రావాలని నా భార్య చెప్పసాగింది. అక్కడే ఆమె మాతామహుడు, మాతామహి ఉన్నారు. పెద్దతనం మూలాన వాళ్లు బెంగుళూరులో జరిగిన మా వివాహానికి రాలేకపోయారు. అందువల్ల మేమైనా తప్పకుండా వాళ్లని చూసి, వాళ్ల ఆశీస్సులు పొంది రావాలని మా శ్రీమతి అభిలాష. నాకూ అభిలాషగానే వుంది. డెబ్భై అయిదేళ్లు దాటిన వారంటే నాకెప్పుడూ అభిమానమూ ఆకర్షణా ఉండేవి. ప్రత్యక్ష పోటాపోటీలు వాదోప వాదాలంటే నాకు భయం.

అందువల్ల వాటికి ఒదిగి సంచరించే నా స్వభావం ఒక కారణం కావచ్చు. సమవయస్సు వారితోనే - అంతెందుకు సొంత సోదర సోదరీమణులతో కూడా - పోటీలు, ఈర్ష్యలు, అభిప్రాయ భేదాలు కలుగుతూవుండడం వల్ల సుహృద్భావపూరితమైన సంబంధానికి విఘాతం ఏర్పడుతున్నది. కాని నా కంటె ముప్పయి అయిదు, నలభైయేళ్ల పెద్దవాళ్లతో నాకెలాంటి స్పర్ధ లేదు. విరోధమూ లేదు.

తమ కాలపు ధోరణులకూ విలువలకూ సాధకంగానూ, వర్తమానకాలపు ధోరణులకు బాధకంగాను వీళ్లు మాట్లాడుతుంటే, నా తరానికి చెందిన విజయ సాధకుల తలమీద మొట్టికాయలు మొట్టినట్లుగా కనిపిస్తుంది నాకు. అది నాకెంతో సంతోషం కలిగిస్తుంది.
 కాని మా బొంబాయి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. చివరికి గత సంవత్సరానికి మా వివాహమై దగ్గర దగ్గర అయిదేళ్లు కావస్తుంటే - మేము బొంబాయి వెళ్లాము. ఆ వృద్ధులు సహజంగానే మరీ వృద్ధులయ్యారు. మేము బొంబాయి వెళ్లేటప్పటికి తాతగారికేమో తొంభై తొమ్మిదేళ్లు; అవ్వగారికేమో దాదాపు డెబ్భై నాలుగేళ్లు.
 
వి.టి., మరీన్‌డ్రైవ్, మలబార్ హిల్స్ ప్రాంతాలతో పోల్చి చూస్తే, డొంబివిలీ-అంటే ఆ వృద్ధులు నివసించే ప్రాంతం - ఎనభై ఒకటిలోనూ గ్రామంగానే కనిపించింది. ఆ వృద్ధులకు మా శ్రీమతి తల్లితో కలుపుకుని నలుగురు కుమార్తెలు; ఒకే పిల్లవాడు. ఈ పిల్లవాడు సకుటుంబంగా మలబార్ హిల్స్‌లో ఒక ఆధునిక ఫ్లాట్‌లో కాపురముంటున్నాడు. తల్లిదండ్రుల్ని తనతోపాటే ఉండమని ఆయన పిలుస్తున్నాడట. కాని తాతగారు డొంబివిలీ విడిచిపెట్టడానికి అంగీకరించడం లేదట.
 
ఈ అయిదేళ్లలో నా భార్య ఆ వృద్ధుల్ని గురించి వివరంగానే చెప్పింది. వాళ్ల తాతయ్య ఆ కాలపు నిక్కచ్చి మనిషి అట; ఆయన్ని చూసి అందరూ గజగజ వణికిపోయేవారట, ఆఫీసులోనూ ఇంట్లోనూ కూడా. రైల్వేలో స్టోర్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశాడు. నిర్వహణ యంత్రాంగాన్ని రాజకీయవాదులు దిష్టిబొమ్మగా తయారుచేసిన యీ రోజుల్లో జెనరల్ మేనేజర్లకు కూడా గౌరవం కాని మర్యాద కాని లేదు. కాని ఆ రోజుల్లో, అంటే ఇంగ్లీషువాడి రోజుల్లో అన్నమాట, మామూలు సూపరింటెండ్లకు కూడా ఆత్మాభిమానమూ హోదా ఉండేవట.

(అని వాళ్ల తాతయ్య చెప్పినట్లుగా నా భార్య చెప్పింది). సమర్ధుడైతే దొరలతో సరిసమానంగా సంచరించే అవకాశం ఉండేదట. ఇలాంటి అవకాశాలు పొందినవాడట ఆ తాతగారు. అందువల్ల డిపార్టుమెంటే తనకు నమస్కారం చేసేలా ఆయనవల్ల వీలయిందట. ఆయన యింటి పనులన్నీ కూడా వుద్యోగులే సలాం పెడుతూ వచ్చి చేసి వెళ్లేవారట. ఇంక చెప్పాలా? ఇంట్లోనూ ఆయన ఒక నియంత...
 
ఆమె అవ్వగారు కూడా మన పరంపరాగతమైన ప్రత్యేకతల్ని యింకా సరిగా తెలుసుకోలేని స్త్రీత్వపు ఉత్తమ ప్రతినిధి. సూటిగా వెళ్లే రకం. సూక్ష్మబుద్ధి, వివేకం కలది. వాటికి తోడుగా సహనం కలది. గృహకృత్యాలు, బాధ్యతలు సమర్ధంగా నిర్వహిస్తూ వచ్చింది ఆవిడే. ఈ విషయంలో తాతగారు పెద్ద జీరో. ఉన్నట్టుండి కోపం తెచ్చుకోవడం, మండిపడడం, ఇంట్లో సామాన్లు ఎడాపెడా విసిరివెయ్యడం ఆయనకి మామూలు. తమ నలుగురు కుమార్తెలకు (మా అత్తగారితో సహా) వివాహాలు జరిగింది ఆవిడ వల్లనే; ఆమె చాలామంది స్నేహితురాండ్ర వల్లనే.

తాతగారికి అందుకు కావలసిన సామర్ధ్యమో సాహసమో లేదు. (నా భార్య స్త్రీ కావడం వల్ల, తన అవ్వగారిని గురించి కొంచెం ఎక్కువగానే పొగడింది. కేవలం శాంపిల్ మాత్రమే తెలియజేశాను.)
 కాగా ఆ జూన్ మిట్టమధ్యాహ్నమప్పుడు డొంబివిలీలోని నా భార్య తాతగారి యింటిని సమీపిస్తుంటే నాలో ఒకటే తహతహ. చారిత్రక వ్యక్తుల్ని కలుసుకునే ఒక ఆదుర్దా.
 అవ్వగారే తలుపు తెరిచారు.

క్షణంలో మమ్మల్ని గుర్తుపట్టి ఆహ్వానించారు. ఆ ఆహ్వానంలో ఒక సంకోచం కనిపించింది. దానికి కారణం నేనే అనుకుని బాధపడ్డాను. అవ్వగారికీ మనుమరాలికీ మద్య నేనొకణ్ని అవతరించాను! ఆవిడ ముఖంలో ‘లక్ష్మీకరమైన’ (శుభప్రదమైన) అంటారు చూడండి, అలాంటి కళ. ఊరికే వింత చూసేవారిని స్పందింపజేయని కళ... నేనే కనక మగవాణ్ని కాకపోతే, యింకా కొంచెంసేపు ఆ ముఖాన్ని చూస్తూ వుండవచ్చు; ఆ శోభలో లీనమైపోయి వుండవచ్చు.
 ఆవిడ మా మూడేళ్ల అమ్మాయిని తనవద్దకు రమ్మని పిలవగా, యిదియేమో బెదురుతూ నన్నే చూడగా, బిస్కెట్లు వెతకడానికి ఆవిడ లోనికి వెళ్లింది.
 
ఆ పాతకాలపు పెంకుటింటిని నేను పైకీ కిందకీ చూశాను. ఆ నాలుగు గోడల మధ్య జరిగిన జీవిత నాటకాన్ని కల్పన చేసుకుంటూ కూర్చున్నాను.
 నా భార్య, ఆమె తల్లి - యిద్దరూ యీ యింట్లోనే పుట్టారు...
 ఉన్నట్టుండి నా భార్య ఒక పాత్రతో వచ్చింది. ‘‘డయరీ నుంచి పాలు తీసుకురావడానికి అమ్మమ్మ బయలుదేరింది. నాకు చోటు తెలుసుగదా. నేనే వెళ్లి వస్తానన్నాను. ఇప్పుడే వస్తాను’’ అంటూ నా భార్య వెలుపలికి వెళ్లింది. ఆమెతో పాటు మా అమ్మాయి కూడా బయటికి పరుగెత్తింది. నేనూ ఆవిడా మాత్రమే మిగిలాము.
 
ఆవిడతో మాట్లాడడానికి నాకేవేవో విషయాలున్నట్లుగా అనిపించింది. అయితే దేన్ని ఎలా చెప్పాలో తెలియలేదు. ఆవిడ కూడా నాతో ఏదో మాట్లాడదలచినట్లు...
 ‘‘ఈ ఇంజనీర్లంతా వచ్చారు యివాళ...’’ అంది ఆవిడ హఠాత్తుగా.
 నాకేమీ అర్థం కాలేదు.
 ‘‘ఇక్కడ లోపల సిగ్నలింగ్ సిస్టం, ట్రాక్ ఎత్తులు వాలు ప్రదేశాలు అవన్నీ సరి చూసి, కొత్త సాధనాలు సిఫారసు చెయ్యడానికి ఫారిన్ నుంచి ఎక్స్‌పర్ట్స్ వచ్చారు...’’
 ‘‘ఓ!’’ అన్నాను. అవ్వగారు ఇంగ్లీషు మాటలు బోలెడు అనాయాసంగా వాడడం నాకు ఆశ్చర్యం వేసింది.
 
‘‘జపాన్‌లో అంతా వేగంగా రైళ్లు వెడుతున్నాయి గదా! అందుకు తగినట్టుగా ట్రాక్, సిగ్నలింగ్ అంతా మాడర్నైస్ చేసి వుంచారు... ఇక్కడ మాదిరిగానా?’’
 ఈ విధంగానే ఆవిడ మాట్లాడసాగింది. నాకదంతా సరిగా జ్ఞాపకం లేదు. ఆశ్చర్యంలో మునిగిపోయి నోరు మూసుకుని కూర్చున్నాను. అప్పుడే నా భార్య తిరిగి వచ్చింది. ఆమె రావడంతో ఆవిడ మాట్లాడడం ఆపివేసింది.
 మేమందరం కాఫీ తాగుతున్నప్పుడు తాతగారు వచ్చారు. పోస్టాఫీసులో ఆలస్యమైపోయిందని క్షమాపణ చెప్పుకున్నారు. ఇంగ్లాండులో ఉన్న తన సహాధ్యాయుడికి ఉత్తరం వ్రాసి వచ్చారట.
 ‘‘నీకూ కాఫీ కలపనా తాతయ్యా’’ అని అడిగింది నా భార్య.
 ‘‘నాకు టీయే.’’
 
‘‘సరే’’ అంటూ ఆమె లేచింది. కాని, ‘‘నువ్వు కూర్చో, నువ్వు కూర్చో’’ అని ఆయన ఆమెను కూర్చోబెట్టాడు. ‘‘ఇప్పుడు నేనిటువంటి పనుల్లో ఎక్స్‌పర్ట్‌నయ్యా. నీకు తెలుసా?’’ అన్నాడు. వంటింటికి వెళ్లి, తానే టీ తయారు చేసుకోసాగాడు. నేనూ లేచి అక్కడికి వెళ్లాను. వెంటనే ఆయన వంటింట్లో టైము మిగిల్చే నిమిత్తం తాను చేసిన కొత్త ఏర్పాట్ల గురించి సంతోషంగా వివరించాడు- తోమి బోర్లించిన పాత్రల నుంచి త్వరగా నీళ్లు కారేందుకు గాను ఏటవాలుగా ఉండే ఒక కొయ్య పలక, పొయ్యిమీద ఎక్కువ కాంతిపడేందుకు ఒక కొత్త లైట్ పాయింట్...
 
ఇదంతా నాకు కొత్తగా కనిపించలేదు. ఈయనేనా నా భార్య వర్ణించిన నియంత అని ఆశ్చర్యపడ్డాను...
ఆ రాత్రి మేము బస చేసిన యింటికి (ఇది నా భార్య పిన్నిగారిల్లు, తాతగారి మరొక కుమార్తె) తిరుగు ముఖం పట్టిన తర్వాత, డొంబివిలీ తాతయ్య అమ్మమ్మలు గురించి చాలా విషయాలు తెలియవచ్చాయి. అమ్మమ్మకు చిత్తభ్రమ మొదలయిందట; ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నదట;

పాత విషయాలు ఏకరువు పెడుతున్నదట. మునుపు తాతగారో - మరెవరో ఆవిడతో మాట్లాడిన మాటలో లేకపోతే వినిపించేలా మాట్లాడిన మాటలో...
 ఓ! అలా అయితే ఆవిడ నాతో ఆ రోజు మధ్యాహ్నం మాట్లాడిన మాటలన్నీ...
 నాకు అదోలా అయిపోయింది. ఆవిడ చదువుకున్నదీ కాదు. అయినా కూడా ఎప్పుడో విన్నది అలాగే ఒప్ప చెప్పుతున్నదంటే మేధావిగా ఉండాలి! ఈ మేధావి తన కాలమంతా వంటింట్లోనే గడిపి వేసింది. ఛీ...
 
ఆవిడ ప్రస్తుత పరిస్థితినీ చిత్తభ్రమనూ యితరులు వర్ణించడమూ నాకు చికాకు కలిగించింది. ఇందుకు మరో అందమైన వివరణ ఉండకూడదా అనిపించింది.
 ఆ తర్వాత కూడా కొన్ని తడవలు ఆ వృద్ధుల్ని చూడడానికి వెళ్లాము. ఒకసారి తాతగారే భోజన పాత్రల్ని తోమి బోర్లిస్తున్నారు. ఆ రోజు అమ్మమ్మకు ఏమీ బాగోలేదట! తాతగారే వంట చేశారట.
 ఇంకో రోజు. తాతగారప్పుడు ఇంట్లో లేరు. మమ్మల్ని చూసి అమ్మమ్మ తన ఇంగ్లీషు పాండిత్యాన్ని దులిపి వేసింది.
 
రైల్లో మేము మా ఊరికి ప్రయాణమైనాము. నా భార్యకు ఆ వృద్ధుల జ్ఞాపకం వచ్చింది. ఉన్నట్టుండి ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది.
 ‘‘ఏడవకు, ఏడవకు’’ అన్నాను ఓదారుస్తూ. కాని నాకు కూడా ఏడుపు వచ్చేంత పని అయింది.
 ‘‘తాతయ్య, అమ్మమ్మ - ఆ యిద్దర్లో ఎవరు ముందర పోయినా సరే మరొకరికి ఎంత దుఃఖంగా వుంటుందో! అది అనుకోడానికే బాధగా వుంది...’’ అంటూ మళ్లీ ఏడవసాగింది.
 నా మనస్సులో ఏదో తళుక్కుమంది. ఇదే సంగతి - అనుకున్నాను. తాతగారూ అవ్వగారూ తమకు తెలియకుండానే తరువాతి వారి మరణానికి తమను సిద్ధం చేసుకుంటున్నారు.
 
తాతగారు అవ్వగారుగా మారిపోయి వంట చేస్తున్నారు. అవ్వగారేమో తాతగారై ఆంగ్లంలో...
 తాము బ్రతికినన్నాళ్లూ ధరించిన సాంఘిక వేషాల కోసం ఒకరిని చూసి మరొకరు పరితపిస్తున్నట్టుగా కనిపించింది. ఈ వేషాలు కల్పించిన గీతల్ని మచ్చల్ని యిద్దరూ ఒకరికొకరు సానుభూతితో తడవి చూసుకుంటున్నట్టుగా తోచింది. అవ్వగారు తల్లిగా, వంటింటి రాణిగా మెలిగిన పరిస్థితిని తాతగారూ, తాతగారు తండ్రిగా బయట తిరిగే వ్యక్తిగా మెలిగిన పరిస్థితిని అవ్వగారూ గ్రహిస్తున్నట్టుగా కనిపించింది.
 ఈ భావాన్ని శ్రీమతికి విశదీకరించాలని నాకనిపించింది. కాని వెంటనే ఒక సందేహం - తనకు పవిత్రంగా కనిపించిన దేనిమీదనో నేను ముదురు రంగులు పులిమి పాడుచేస్తున్నానని ఆమె భావించదు గదా!
 
ఆమెతో నేనేమీ చెప్పలేదు.
 మేము ఢిల్లీ చేరుకున్న రెండు నెలలకల్లా డొంబివిలీ అవ్వగారు కాలధర్మం చేసినట్టుగా కబురు వచ్చింది. వెంటనే నాకు తాతగారు పాత్రలు తోమి బోర్లిస్తున్న ఆ దృశ్యమే స్ఫురణకు వచ్చింది.
 ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఆయన్ని గురించి అనుకునేటప్పుడు, మునుపటికంటె ఆయన ఎక్కువగా వంటింట్లోనే మసులుతూ వుండవచ్చుననే స్ఫురిస్తుంది. మరొకటి కూడా స్ఫురిస్తోంది. ఆయన ఆంగ్లం మాట్లాడడం మానివేసి వుండవచ్చు.
-  కె.యస్.సుందరం
(‘మొదట రాత్రి వస్తుంది’ సంకలనం నుండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement