బుద్బుదం | story of ravi sastri | Sakshi
Sakshi News home page

బుద్బుదం

Published Sun, Nov 29 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

బుద్బుదం

బుద్బుదం

క్లాసిక్ కథ
‘‘నీట్లో లేచిన బుడగ ఎంతోసేపు ఉంటుందా? ఉండదు. ఏమవుతుంది? బద్దలైపోతుంది. బద్దలవడం అంటే ఏమిటి? నీట్లో మళ్లీ కలిసిపోవడమే కదా! అంటే ఏవన్నమాటా? బుడగ నీట్లోంచి లేచింది. నీట్లోనే కలిసిపోయింది. నీరు నీర్లోనే ఉన్నప్పుడు ఆ నీరు పుట్టడం ఏమిటి? ఆ నీరు చావడం ఏమిటి? అందులో అర్థం లేదు కదా! అంతా అసందర్భమే కదా! ఆ సంగతి మీకు బోధపడిందా! అందుచేత తెలుసుకోండి ఆ నీరు ఏ విధంగా అయితే పుట్టలేదో చావలేదో ఆ విధంగానే ఆత్మపదార్థం అనేది పుట్టదు - చావదు!’’
 
అని శాస్త్రుల్లుగారు ఓ సాయంత్రం సీతారామస్వామివారి గుళ్లో పెట్రొమాక్సులైటు వెలుగులో స్వచ్ఛంగా, శాంతంగా కూర్చొని కొన్ని పరమ రహస్యాలు పామరులందరికీ తేటతెల్లంగా తెలియజేసేరు. ‘‘భేష్’’ అన్నారు పామరులు. సాయంత్రం ఆరుకి ఆరంభించిన ఉపన్యాసం ఆ దినం రాత్రి తొమ్మిది గంటలకి ముగిసింది. పెట్రొమాక్సు దీపం ఎలా తెల్లగా వెలిగిందో అలా తేటతెల్లంగా అంతా వివరించి చెప్పేరు శాస్త్రుల్లుగారు.
 
అక్కడ చేరిన పామరుల ముఖాల మీద పడిన కాంతి పెట్రొమాక్సు దీపకాంతా లేక శాస్త్రిగారి ధవళకాంతా అనే భ్రమ కలిగేట్టుగా చక్కగా నవ్వుతూ స్పష్టంగా ఉపన్యసించేరు శాస్త్రిగారు. తొమ్మిది రోజుల పురాణం చెప్పి పదో రోజున దాని సారం అంతా పిండి వడబోసి పామరులందరికీ అందజేసేరు శాస్త్రిగారు.
 ఆ రాత్రి ఆ దీపం వెలుగులో గుడిస్తంభాల మీద రాతిబొమ్మలు కూడా ఓ వెలుగు వెలిగాయి.
 
‘‘బాబూ, తమరు మాకే కాదు వాటిక్కూడా జ్ఞానోదయం ఇప్పించగలరు. తమరు అవతార పురుషులే కాని మరొకరు కాదు’’ అని ఒక పామరుడు అకస్మాత్తుగా జ్ఞానిగా మారి శాస్త్రిగార్ని శ్లాఘించేడు. శాస్త్రిగారు నిర్లిప్తంగా నవ్వేరు.
 ఉపన్యాసం ముగిసింది. పామరత్వాన్ని ఆనాటికి కొంత కొంతగా పోగొట్టుకుని లేచిన సభికుల్లో పదేళ్ల శ్యాంబాబు కూడా ఉన్నాడు.
 
మున్సిపాల్టీవారి రికార్డులో శ్యాంబాబు పేరుండదు. ‘‘ఒక మగశిశువు’’ అని మాత్రం ఉంటుంది.
 స్కూల్ రికార్డులో అతని పేరు శ్యామలరావు. వెక్కిరించాలంటే అది చీమలరావుగా పెంకె కుర్రాళ్ల పెదిమల మీద మారు రూపు చెందుతుంది. వాళ్లమ్మకి అతడు శ్యాంబాబు; కాకపోతే ఇంకా క్లుప్తంగా శాంబాబు.
 
శ్యాంబాబు అయిదోక్లాసు చదివి ఆరోక్లాసులోకి వెళ్లలేకపోయాడు. కష్టం కష్టం చాలా కష్టం. స్కూలుకు వెళ్తే పరాజయాన్ని పదిమందిలో కూర్చుని అనుభవించడం కష్టం. ఇంటికి వెళ్తే అమ్మ ఆయాసపు నిట్టూర్పులు వినడం ఎంతో కష్టం. అందుచేత ఆ కష్టాల్ని అతడు మామిడి తోటల నీడల్లోనూ, కొండగుట్టల బండరాళ్లలోనూ, సముద్రపుటలల నురుగు ముద్దల్లోనూ, తీరాన ఇసకలో సాయంకాలపు ఆటల్లోనూ మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
 
ఓనాడు సాయంకాలం చీకటిపడ్డాక శ్యాంబాబు బీచి నుండి ఇంటికి వెళ్తూ, దార్లో గుడిలో పెట్రొమాక్సు దీపపు వెలుగు చూసేడు. లోనికి వెళ్లి శాస్త్రిగారి ‘శాంత గంభీర వచనాలు’ విన్నాడు. అక్కణ్నించి ప్రతిరోజూ అతను పురాణ శ్రవణానికి వెళ్లనారంభించేడు.
 
పురాణం అంతా అయింది. శాస్త్రిగారి ఆఖరి ఉపన్యాసం కూడా అయింది. భక్తులంతా ఆయన కాళ్లమీద పడి ఆయనచేత ఆశీర్వదింపబడ్డారు. శాస్త్రిగారి పాదధూళి కళ్లకి అద్దుకుని తలెత్తి శాస్త్రిగారి స్నిగ్ధ గంభీర వదనంలోకి చూసిన శ్యాంబాబు కళ్లంట ఆనంద బాష్పాలు రాలేయి. అక్కడ ప్రసాదంగా పంచిపెట్టిన కొబ్బరికోరూ, వడపప్పూ చేతిలో వేయించుకొని, కళ్లకద్దుకుని తిందాం అనుకున్నాడు శ్యాంబాబు. కాని, అంతలో దేవుడి ప్రసాదం అమ్మకియ్యాలి అనిపించిందతనికి. గుడి పూజార్ని బతిమిలాడి రెండు బాదం ఆకులు సంపా దించి అందులో ప్రసాదం భద్రంగా చుట్టి చేత్తో జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి బయల్దేరేడతను.
 
రాత్రి తొమ్మిది దాటింది. పెద్ద ఊరు కాకపోవడం వల్ల ఊరంతా చాలామట్టుకు మాటు మణిగింది. వెన్నెల్లో జనంలేని వీధుల్లో చలికి చిన్నగా వణుకుతూ నడిచే శ్యాంబాబుకి మనసెందుకోగాని ఎంతో తేలిక పడినట్టనిపించింది. నీటి బుడగలకి చావు లేనట్టే మనుషులకి కూడా చావుండదనేది అతనికెందుకోగాని చాలా స్పష్టంగా బోధపడినట్టనిపించింది. అతను తేలిగ్గా నడవసాగేడు.
 
రోడ్డంతా గోతులు గోతులుగా ఉంది. గోతులన్నీ చాలా అడ్డదిడ్డంగా ఉన్నాయి. వాటిమీంచి చెంగు చెంగున అటూ యిటూ గెంతుతూ హుషారుగా నడిచేడు శ్యాంబాబు.
 కార్తీకం, శుక్ల సప్తమి చంద్రుడు ఓరగా ముద్దుగా నవ్వుతున్నాడు. ఆకాశంలో చుక్కలు నిర్మల సముద్రం మీద నిలబడిపోయిన పూల పడవల్లా, మనోహరంగా కనిపిస్తున్నాయి.
 ఒక మేఘం శాస్త్రిగారి తెల్లగడ్డంలాగా స్వచ్ఛంగా వెండి దూదిలా ఉంది. ఊరి సందుల్లో గాలి మత్తుగా సోలిపోయి నిద్రపోతోంది.

‘‘మంచి రాజుల’’ రాజ్యంలో మురికి మనుష్యులు కూడా ఆనందంగా ఉంటారుంటారన్నట్టు మురుగు కాలువలు కూడా చందమామల వెన్నెల అలలకి మురిసిపోతున్నాయి.
 పాతపెంకుల ఇళ్లు కూడా అంత అందమైన రాత్రిలో అంత బరువుగా బాధగా కనిపించడానికి ఎంతో సిగ్గుపడుతున్నాయి. నాచుపట్టిన పాత డాబాలు కూడా వెన్నెలందానికి రెచ్చిపోయి సిగ్గు మర్చిపోయి సింగారాలకి సిద్ధపడుతున్నాయి. రొట్టెల షావుకారిగారి కొత్త మేడ ఆయన కొత్త కోడల్లాగే ఈ వెన్నెలంతా నాదే అన్నట్టుగా రాణీలా నిల్చుంది.
 
పున్నమినాటి వెన్నెల్ని నీలపు తెరలోంచి చూస్తే ఉన్నట్టు సప్తమినాటి రమ్యాతిరమ్యంగా రాబోయే రేపటి పెండ్లికి మరికొత్త కలువకన్నియు ఈనాడు కలలో కనిపించినట్లు కడు కమ్మగా వుంది. రాత్రంతా ఎంతో చల్లగా నిన్న సాయంత్రం ఆరవేసిన అమ్మచీర ఈవాళ మెత్తగా చల్లగా ఉన్నట్టు ఎంతో మెత్తగా మధురంగా ఉంది.
 
రోజూ ఎనిమిదే అయేది. అవాళ తొమ్మిది దాటింది. అమ్మ కోప్పడుతుందేమోనని రవ్వంత అనుమానం వేసింది శ్యాంబాబుకి. అమ్మ ఎప్పుడో కాని కోప్పడదు. తను పరీక్ష తప్పినప్పుడు ఆవిడ కోప్పడలేదు. తను చూడలేదనుకొని కంటతడి పెట్టింది. అన్నకి రోషం వచ్చి కొట్టబోతే, ఆవిడ అడ్డుకొని, ‘‘తప్పమ్మా కొట్టకు’’ అని వారించింది.
 
చెల్లి ఏడుస్తే ‘‘మళ్లీ ఏడు చిన్నన్న తప్పక పాసవుతాడమ్మా! ఏడవకూడదలా! తప్పు కళ్లు తుడుచుకో!’’ అని బుజ్జగించింది. ఆ రోజున స్పెషల్‌గా తనకి వేపుడుకూర వేయించింది కూడాను.
 అయితే, ఎప్పుడైనా కోప్పడుతుందమ్మ! (బ్రతుకుబండి లాగలేక గుండె నిబ్బరం లేనెలేక). తమందర్నీ విడిచి పారిపోయిన నాన్న ఫొటో చించేస్తే తనని అమ్మ చాలా కోప్పడింది. ఓసారి కాణీ పచ్చిమిరపకాయలు కొనుక్కురమ్మని తనకి పావలా యిచ్చి పంపిననాడు అది తను సినిమా బండి వెనుక పరిగెట్టడంలో పారేసి నప్పుడు అమ్మ కొంచెం కోప్పడిందనే చెప్పాలి.
 
ఈమధ్య తొలిరోజున తను పురాణానికి వెళ్లినప్పుడు కోప్పడలేదు గాని, ‘‘నాకు ఒంట్లో బాగులేనప్పుడైనా వేగిరం ఇంటికి రాకూడదుట్రా శ్యాంబాబూ?’’ అంది.
 అంతే అంది. నిన్న సాయంత్రం తను ఆడుకొందికి వెళ్తున్నప్పుడు తనతో యేదో చెప్పబోయి ఎందుకోగాని ఊరుకుంది. ఇవాళ మాత్రం, ‘‘ఒరే శ్యాంబాబూ! నా చిట్టి తండ్రీ, ఇవాళైనా వేగిరం ఇంటికొచ్చేరా బాబూ’’ అంది.
 ‘‘ఇవాళ ఆఖర్రోజమ్మా’’ అన్నాడు తను.
 ‘‘ఫరవాలేదురా! వేగిరం వచ్చెయ్!

రోజూ పురాణానికి వెళ్తూనే వున్నావు కదా! భగవంతుడు మెచ్చుతాడు, మరేం భయం లేదు. ఒచ్చే యేడు నిన్ను తప్పక పాసుచేస్తాడు’’ అంది అమ్మ.
 శ్యాంబాబుకి ఎందుకో గాని సన్నగా సిగ్గువేసింది. చిన్నగా నవ్వు కూడా వచ్చింది. తను భక్తిగా, శ్రద్ధగా పురాణం వినడానికి వెళ్లడం తన పరీక్ష పాసు గురించి అనుకొంటోంది అమ్మ.
 ‘‘కాదమ్మా! నీకు వేగిరం నయం కావడానికి వెళ్తున్నానమ్మా’’ అని చెప్పడానికి అతనికెందుకో గాని సిగ్గువేసింది.
 
అమ్మ వేగిరం ఇంటికి రమ్మన్న రోజునే చాలా ఆలస్యం అయింది. అమ్మ కోప్పడుతుందా! కోప్పడొచ్చు. లేకపోతే విసుక్కోవచ్చు. మూడొంతులు విసుక్కోవచ్చు.
 ఇల్లు దగ్గరయ్యేసరికి శ్యాంబాబు నడక జోరయింది. కోప్పడ్డానికి అమ్మకి అవకాశం ఇవ్వకుండా పరిగెట్టికెళ్లి ఆమె చేతిలోకి దేముడి ప్రసాదం ఇచ్చేద్దాం అనుకున్నాడతను.
 అన్నకి కూడా ‘‘అన్నయ్యా ఇందరా ప్రసాదం’’ అని కొంచెం ఇస్తే వాడు కూడా ఊరుకుంటాడు. ఒకే ప్రసాదంతో ఇరువురి కోపాలూ తప్పించవచ్చు కదా అనే ఉద్దేశంతో రయ్‌మని పరుగుతీసి ఇంటికి అల్లంత దూరంలో ఆగేడు శ్యాంబాబు.
 
ఆ రాత్రి వాళ్లమ్మ అతణ్ని కోప్పడలేదు. ఇంటిముందు వీధిలో చాపమీద ఆమె పడుకొనుంది. ఆమె తలవెనుక అన్న కూర్చున్నాడు. పక్కని కూర్చొని అమ్మని కావలించుకొని ఆమె కంఠంలో తలదాచుకొంది చెల్లి సరళ.
 అన్నకి వెనకాతల పెంకుటింటి వసారాలో ఓ హరికెన్ లాంతరు పేద ముసలమ్మలా, స్తంభానికి చేర్లబడి మినుకు మినుకు మంటోంది.

అయిదారుగురు ఆడంగులు, అద్దె వాటాల వారు మర్యాదగా తలలు వంచుకుని ఓ వార కూర్చున్నారు.
 పంచె కట్టుకుని తువ్వాలు భుజాన వేసుకొన్న పెద్దమనిషొకతను స్తంభాలమీది సన్న దూలం కుడిచేత్తో పట్టుకొని ఎడం చెయ్యి నడుంమీద పెట్టుకొని చిరాగ్గా నిల్చున్నాడు.
 
ఆ సమయంలో ఆకాశం విరిగిపడిందో- చంద్రుడు ముక్కలయేడో, చుక్కలు రాలేయో, భూమి దద్దరిల్లిందో, ఉప్పెన ముంచుకొచ్చిందో, ఏం జరిగిందో, ఏం జరగలేదో తెలియదు శ్యాంబాబుకి. అమ్మ లేదని మాత్రం ఆ క్షణంలో అతను తెలుసుకున్నాడు. అతను తీసిన పరుక్కి అతని చేతిలోని ప్రసాదం కింద రాలి మట్టిలో కలిసింది.
 మురికి మచ్చల చింకి చాపమీద ఆవిడ వెల్లకిలా పడుకుంది. ఆవిడ ఆ సమయంలో నిర్మలంగా నిద్రపోవడం లేదు. ప్రాణాలు పోయినా ఆవేదనలు మాత్రం మిగిలిపోయినట్టు ఆమె ముఖం ఎంతో విచారంగా వుంది.
 
చందమామ చిలిపి శృంగారంతో చుక్కల గిలిగింతలతో తెలి వెన్నెల పట్టుతెరలతో ఆకాశం నిండా లోకమంతటా భగవంతుడు సృష్టించి గుప్పించిన ‘దివ్య సౌందర్యం’తో ఆమెకి సంబంధం ఏమీ లేనట్టు ఆమె ముఖం ఓ పక్కకి తిరిగి ఉంది.
 ‘‘నా పిల్లలంతా ఏడుస్తున్నారే! వాళ్లకి నేనన్నం పెట్టలేకపోయానే. ఈత రాని పిల్లల్ని లోతునీటిలో వదిలేసి నేనిలా శవాన్నయిపోయేనే! ఏది దారి వాళ్లకేది దారి?’’ అని మూగగా విలపిస్తున్నట్టుంది ఆమె ముఖం.

మూతలు పడని ఆమె కళ్లనుంచి ఏ క్షణాన్నయినా కన్నీరు కాలవ కట్టవచ్చు. ఏ క్షణాన్నయినా ధారధారలుగా నెత్తురు ప్రవహించవచ్చునన్నట్టుగా ఆమె ముఖం ఎంతో దీనంగా (అందుచేతనే కాబోలు) ఎంతో భయంకరంగా ఉంది.
 అమ్మా నేనొచ్చాను. రేపట్నించి ఎక్కడికీ వెళ్లను. నువ్వు వెళ్లమంటేనే వెళ్తాను. వెళ్లినా ఆలస్యం చెయ్యను. న్నేనొచ్చేనమ్మా! నీ కోసమే పురాణం! నీ కోసమే ప్రసాదం! నీ కోసమే దేవుడి అనుగ్రహం! నాక్కాదు నాక్కాదు!

అన్నీ నీ కోసమే! నీ కోసం పరీక్ష పాసయి తీరుతానమ్మా! అన్నయ్యని రేపణ్నించి వండనివ్వను. నేనే వండుతాను. నేనే నీకు జావ యిస్తాను. నయమయేక నేనే నీకు అన్నం పెడతాను.
 నేనే పనిచేసి అన్నయ్యని చదివిస్తాను. చెల్లి పెళ్లికి కట్నం నేనేనమ్మా నేనే తెస్తాను. వెళ్లి వెతికి నాన్నని పట్టి కట్టి నీకోసం నే తెస్తాను. తప్పకుండా తెస్తాను.
 
నిన్ను ఏడవనివ్వను, ఎన్నడూ ఏడవనివ్వను. నువ్వు చెప్పినట్టు వింటాను. బుద్ధిగా ఉంటాను. నాన్న ఫొటో చింపను. పావలాలు పారెయ్యను. పరీక్షలు తప్పను.
 చెట్లెక్కను, కొండెక్కను, ఈత రాకుండా నీట్లోకి దిగను. దిగనమ్మా దిగను; లే అమ్మా లే; బుద్ధిగా ఉంటాను! కళ్లు తెరువమ్మా తెరువు. లే అమ్మా లే.
 ఊరూ ఆకాశం అన్నీ విన్నాయి.

అద్దెవాటాలవాళ్లు కూడా విన్నారు. ఆ ఏడుపుకి అవధులుండవనీ ఏ దేముడెంత చెప్పినా అది ఒకంటత చల్లారదని వాళ్లందరికి బాగా తెలుసు. అంత గట్టిగా పెనుబొబ్బలు పెట్టి ఏడ్చేడు శ్యాంబాబు.
 చంద్రుడు కిందికి దిగేడు. రాత్రింకా ఉంది.
 నీటిబుడగ పోయినపుడు నీటిబుడగ లేడుస్తాయో లేదో భగవంతుడికి తెలియాలి. కాని, మనిషి పోతే మాత్రం మనుషులేడుస్తారు. శాస్త్రిగారూ... చావు నిజం కాదని మీకు బాగా తెలిసి ఉండవచ్చు. కాని బాధ నిజమని మాత్రం శ్యాంబాబుకి మీకంటె బాగా తెలుసు.
 - రావి శాస్త్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement