
కామెంటేటర్లు రవి శాస్త్రి(Ravi Shastri), కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్(Brendon Mccullum) మండిపడ్డాడు. వీరిద్దరు మాట్లాడిన మాటల్లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. ఆట విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తమకంటూ ఓ విధానం ఉందని.. ఫలితాలు అనుకూలంగా లేనపుడు ఇలాంటివి సహజమేనని పేర్కొన్నాడు.
అసలేం జరిగిందంటే.. టీమిండియా(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో సూర్యసేన చేతిలో 4-1తో చిత్తైన బట్లర్ బృందం.. రోహిత్ సేనతో వన్డేల్లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది.
తద్వారా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభానికి ముందు గట్టి ఎదురుదెబ్బను చవిచూసింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో ఇంగ్లండ్ మూడో వన్డే సందర్భంగా.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఒకే ఒక్క నెట్ సెషన్
ఈ సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో ఇంగ్లండ్ ఒకే ఒక్క నెట్ సెషన్‌లో పాల్గొన్నదంటూ బట్లర్ బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట పట్ల అంకితభావం లేదంటూ విమర్శలకు దిగారు. ఈ విషయంపై ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తాజాగా స్పందించాడు.
టాక్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘మేము అసలు శిక్షణా శిబిరంలో పాల్గొననేలేదన్న వారి మాటలు పూర్తిగా అవాస్తవం. సిరీస్ ఆసాంతం మేము నెట్ సెషన్స్‌లో బిజీగా ఉన్నాం.
అంతకు ముందు కూడా మా వాళ్లు వరుస సిరీస్‌లు ఆడారు. ఎదుటివారి విషయంలో ఆధారాలు లేకుండా ఇష్టారీతిన మాట్లాడటం సులువే. ఫలితాలు మాకు అనుకూలంగా లేవు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మాకంటూ ఒక విధానం ఉంది
ఏ ఫార్మాట్లో ఎలా ఆడాలో మాకంటూ ఒక విధానం ఉంది. దానినే మేము అనుసరిస్తాం. ఇక ఇప్పటికే జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు తెలుసు. ముందుగా చెప్పినట్లు వాళ్లు మాట్లాడిన మాటలు అబద్దాలు’’ అని మెకల్లమ్ రవిశాస్త్రి, పీటర్సన్ వ్యాఖ్యలను తిప్పికొట్టాడు.
ఇక ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం వీరి మాటలను ఖండించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రయాణాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఒకటీ రెండు సెషన్లు మాత్రమే మిస్సయ్యామని తెలిపాడు. అంతేతప్ప రవిశాస్త్రి, పీటర్సన్ అన్నట్లుగా తామేమీ పూర్తిగా ప్రాక్టీస్‌కు దూరంగా లేమని పేర్కొన్నాడు.
కాగా టెస్టుల్లో ‘బజ్‌బాల్’ విధానంతో దూకుడైన ఆటను పరిచయం చేసిన బ్రెండన్ మెకల్లమ్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గానూ నియమితుడయ్యాడు. అయితే, తొలి ప్రయత్నంలోనే ఘోర పరాజయాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు.
చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment