
భారత్- న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటు చేసుకోవచ్చని అంచనా వేశాడు. పిచ్ పరిస్థితికి తగ్గట్లుగా టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేశాడు.
అయితే, ఎవరిపై వేటు వేస్తారు? ఎవరిని తీసుకువస్తారన్న విషయంపై మాత్రం రవిశాస్త్రి స్పష్టతనివ్వలేకపోయాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగుస్తుంది.
ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ సహా భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ వన్డే టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి రోహిత్ సేన.. సౌతాఫ్రికాను చిత్తు చేసి సాంట్నర్ బృందం టైటిల్ పోరుకు అర్హత సాధించాయి.
ఇక టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడగా.. కివీస్‌కు కూడా ఇక్కడ ఓ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి తమకూ పిచ్ పరిస్థితులపై అవగాహన ఉందని కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు.
భారత తుదిజట్టులో ఓ మార్పు
ఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు వాడిన పిచ్‌నే భారత్- కివీస్ ఫైనల్‌కు తిరిగి ఉపయోగించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఫైనల్ మ్యాచ్‌లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటుచేసుకున్నా ఆశ్చర్యం లేదు. పిచ్ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం ఉంటుంది.
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన పిచ్ ఈ టోర్నమెంట్లోనే అత్యుత్తమైనది. మళ్లీ అలాంటి హోరాహోరీ చూడాలని ఉంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్స్‌మెన్‌కి దాదాపు ఐదు రోజుల విరామం లభించింది. 280- 300 పరుగుల మేర రాబట్టగలిగే పిచ్ తయారు చేసి ఉండవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికే
ఇక ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఆల్‌రౌండర్ ఉండబోతున్నాడని రవిశాస్త్రి ఈ సందర్భంగా అంచనా వేశాడు. ‘‘అక్షర్ పటేల్ లేదంటే రవీంద్ర జడేజా టీమిండియా తరఫున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవబోతున్నారు.
ఒకవేళ న్యూజిలాండ్‌కు అవకాశం ఉంటే మాత్రం నేను గ్లెన్ ఫిలిప్స్ వైపు మొగ్గుచూపుతాను. అతడు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో 4- 50 పరుగులు రాబట్టగలడు. ఒకటీ లేదా రెండు వికెట్లు తీసి ఆశ్చర్యపరచనూగలడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఆసీస్‌తో సెమీస్ ఆడిన భారత తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ.