
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తుంటే.. న్యూజిలాండ్ మాత్రం మరోసారి టీమిండియాను మట్టికర్పించాలని పట్టుదలతో ఉంది.
ఇప్పటివరకు భారత్-కివీస్ రెండు సార్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలపడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీ-2000, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్-2021 ఫైనల్లో కివీస్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. ఇక ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకున్నాయి.
మరోసారి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు కూడా స్పిన్నర్లను నెట్స్‌లో ఎక్కువగా ఎదుర్కొన్నారు. న్యూజిలాండ్ అయితే ప్రత్యేకంగా శశ్వత్ తివారీ అనే ఓ స్పిన్నర్‌ను నెట్‌బౌలర్‌గా ఎంపిక చేసి మరి ప్రాక్టీస్ చేసింది.
వరుణ్ కాదు.. అతడితోనే ముప్పు?
అయితే న్యూజిలాండ్ టీమ్ ఆందోళన చెందుతుంది మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం కాదంట. రవీంద్ర జడేజా వంటి ఎడమచేతి వాటం స్పిన్నర్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వారు సిద్దమవుతున్నారంట. ఈ విషయాన్ని స్వయంగా కివీస్ నెట్‌బౌలర్‌గా ఉన్న శశ్వత్ తివారీ వెల్లడించాడు.
"ఈ రోజు న్యూజిలాండ్ జట్టుకు నెట్స్‌లో చాలా సమయం పాటు బౌలింగ్ చేశాను. వారు రవీంద్ర జడేజాను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారు. జడేజా బౌలింగ్‌లో వేరియేషన్స్ ఉంటాయి. అతడు చాలా వేగంతో బంతిని స్పిన్ చేస్తాడు. ఆ స్పీడ్‌ను అలవాటు చేసుకునేందుకు నన్ను 18 యార్డ్స్ నుంచి బౌలింగ్ చేయమన్నారు.
నేను వారి చెప్పినట్లగానే ఆ పాయింట్ నుంచి బౌలింగ్ చేశారు. కొద్దిసేపు వారు ప్రాక్టీస్ చేశారు. కానీ బంతి చాలా త్వరగా డెలివరీ అవుతుండడంతో 22 గజాల నుంచే తిరిగి బౌలింగ్ చేయమని చెప్పారు. వారు ముఖ్యంగా ఎడమచేతి వాటం బౌలర్లపై ఎక్కువగా దృష్టిపెట్టారు. ప్రాక్టీస్‌లో స్పిన్‌ను ఎదుర్కొవడంలో వారు ఎక్కడా ఇబ్బంది పడలేదు.
కానీ భారత జట్టులో టాప్-క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి భారత స్పిన్నర్ల నుంచి మరోసారి వారికి కఠిన సవాలు ఎదురు కానుంది" అని శశ్వత్ తివారీ ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా కివీస్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చక్రవర్తి 5 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో అతడి నుంచి మరోసారి కివీస్‌కు ముప్పు పొంచి ఉందని అంతా భావిస్తున్నారు.
చదవండి: చాంపియన్ నువ్వా.. నేనా
Comments
Please login to add a commentAdd a comment