పిచ్చుకలు | Sparrows story | Sakshi
Sakshi News home page

పిచ్చుకలు

Published Sun, Sep 27 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

పిచ్చుకలు

పిచ్చుకలు

క్లాసిక్ కథ
రహీమ్‌ఖాన్ పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి, గ్రామానికి పశ్చిమ దిక్కులో, మామిడి తోపు వెనుక భాస్కరుడు నక్కుతున్నాడు. రహీమ్‌ఖాన్ తన ఏభై పైచిలుకు జీవితములో ఆ వీధిగుండా, భుజం మీద నాగలితో, తన రెండెడ్లను తోలుకుంటూ నిర్లక్ష్యంగా నడిచాడు. అతను కచేరీ సమీపించేసరికి అక్కడ ఓ పదీ పన్నెండుమంది రైతులు పొగ త్రాగేందుకు గుమిగూడి వున్నారు. వృథా ప్రలాపాలతో, ఉల్లాసకరంగా వున్న వారి గొంతులు అతన్ని చూసేసరికి గుసగుసల్లోకి దిగిపోయాయి.
 
అతను ఆ వీధిమలుపు తిరిగాక కల్లు... తన చేతిలోని హుక్కాను మరొకరికి అందిస్తూ, ‘‘అదిగో, పాషాణం వెళుతోంది’’ అన్నాడు.
 దానికి లావుపాటి నన్నా... ‘‘వాడు రోజురోజుకీ మరీ దుర్మార్గంగా తయారౌతున్నాడు. నిన్నటికి నిన్న తన ఎడ్లమీదికి చిన్న రాయి విసిరాడని, పాపం ఆ రాముగాడి కొడుకును చావగొట్టాడు,’’ అన్నాడు.
 ‘‘మరోరోజు వాడి పొలంలో నా గుర్రం పడిందని, దాన్ని చచ్చేంతగా బాదాడనుకోండి’’ అన్నాడు రామనాథ్. అది తన కొడుకులు పెంకితనంతో చేసిన పనని చెప్పడం అసంగతం అని అతని అభిప్రాయం.
 
అదే సమయానికి వాళ్ల కబుర్లలో కర్త తన యింటికి జేరాడు. అతని యిల్లూ అతని జీవితానికి చిహ్నంగా ఇరుగు పొరుగు ఇళ్లకు దూరంగా ఉంది. ఎడ్లను కట్టేసి ఇంట్లోకెళ్లబోతూంటే, పొరుగింటి ముసలమ్మ అంది, ‘‘రహీమ్‌ఖాన్... మీ ఆవిడ...’’ ఇంకా వాక్యం పూర్తి కాలేదు.
 ‘‘పారిపోయింది. అంతేనా!’’ పళ్లికిలిస్తూ అన్నాడు.
 ‘‘అబ్బెబ్బే! కాదు, కాదు ఆవిడ ‘మరుపూరు’లోని తన అన్నగారింటికెళ్లింది. కొద్దిరోజుల్లో వచ్చేస్తుంది’’ అంది.
 
‘‘ఆ’’ అని తలుపు దడాలున తెరిచి, భగభగ మండే హృదయంతో, ఇంట్లో మంచం మీద చతికిలబడ్డాడు. అతనికి తెలుసు, ఆమె ఇంక తిరిగిరాదని. ఓ మూల ఏదో పిల్లి ‘‘మ్యావ్’’ అంది.
 అక్కడ అతని కోసమంటూ ఎవ్వరూ లేరు. అతను ఎంతో అసౌఖ్యంగా బాధపడ్డాడు వాళ్ల ముప్ఫై సంవత్సరాల దాంపత్య జీవితంలో. అతను ఎప్పుడూ అనుకుంటూనే వున్నాడు ఆమె ఏదో రోజున, ఏదో సమయాన తనను విడిచి పోతుందని. అలా చేస్తుందని ఆశపడ్డాడు కూడా. తను రోజూ కొట్టే దెబ్బలు భరించలేక, ఆరేళ్ల క్రితం తన పెద్దకొడుకు బుందు ఇల్లు విడిచి పారిపోయాడు.

మూడేళ్ల క్రితం రెండవ కొడుకు నురు కూడా తన అన్నను కలిశాడు. అప్పట్నించి రహీమ్ అనుకొంటూనే వున్నాడు, ఇలా జరుగుతుందని. అలాగే జరిగింది.
 దానికి అతనికెంతో అసంతృప్తిగా వుంది. విచారం మాత్రం కాదు. ఎంచేతనంటే, అతనెప్పుడూ తన భార్యను ప్రేమించలేదు. అది కేవలం అసౌకర్యం మాత్రమే - ఏదో తనకవసరమైన వస్తువులలో ఒక వస్తువు పోయినట్టు. ఇప్పుడు ఎవరిపై తన కోపాన్ని వెళ్లగ్రక్కుతాడు?!
 ఈ ముప్ఫయి ఏళ్ల నుంచి అతని కుటుంబానికి, సంఘానికి, జీవితానికి వ్యతిరేకముగా... అతని కష్టాలకు, అతని భార్య ఒక చిహ్నంగా, గురుతుగా ఉంది.
 
రహీమ్‌ఖాన్ యువకుడుగా ఉన్నప్పుడు, సాము, గరిడీలలో గాని, కుస్తీలో గాని అతన్ని గెలిచేవాడు ఎవ్వడూ ఆ గ్రామంలో లేడు. ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించేందుకు తన గ్రామం గుండా వెడుతున్న సర్కసులో చేరుదా మనుకొన్నాడు. అతను రాధ అనే హిందువుల అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. కాని, అతని తల్లిదండ్రులు తన రెండు ఆశలను వమ్ము చేశారు.

సర్కసు పని గౌరవనీయుడైన రైతుకు చాలా నీచమైనది. తన తండ్రి, తాత పూర్వీకులు భూమి దున్ని బ్రతికేవారు. కాబట్టి తను కూడా అలానే చేయాలి. హిందువుల అమ్మాయి రాధను పెళ్లిచేసుకోవడం అనే తలంపే చాలా సిగ్గుమాలినది, మత విద్రోహమైనదీను. ఈ రెండూ ఆ రెండు ఆశలను నాశనం చేశాయి.
 
రహీమ్ తన యవ్వనోద్రేకంలో కొంతకాలం వ్యతిరేకించాడు. అయితే శతాబ్దాల నుంచి అనూచానంగా వస్తున్న బానిసత్వం అతని రక్తంలో ప్రవహిస్తోంది. తన తండ్రి క్రూరత్వానికి ఉద్రేకపడినా, సాంఘికాచారాలను, పైతృకాధికారమును ఎదిరించే ధైర్యం లేకపోయింది.
 కొన్ని రోజులకు ఆ సర్కసు ఆ గ్రామాన్ని, రహీమ్‌ను విడిచి వెళ్లిపోయింది. రాధతో ప్రేమ కూడా అకస్మాత్తుగా ముగిసింది, తన తండ్రి మోసం వలన రామలాల్ అనే మధ్యవయస్కునితో రాధకు పెళ్లి జరిగిపోయింది. రాధ అరడజను పిల్లలకు తల్లిగా కన్నీటితో వెళ్లింది.
 
రహీమ్‌కూ పెళ్లయింది. ఈ విషయంలో అతని ఇష్టం లేనే లేదు. తన తల్లిదండ్రులే పిల్లను ఎంపిక చేసేరు - ముహూర్తం నిశ్చయించారు - తనకి పెళ్లిబట్టలు తీయించారు - గుర్రం మీద పెళ్లికూతురింటికి తీసికెళ్లారు. ఖాజీ అడిగిన ప్రశ్నలకు రహీమ్ యాంత్రికంగా తల ఊపాడు.
 తొలి రాత్రి, కసాయివాడి కోసం వేచివున్న మేకపిల్లలా, తనకోసం తన భార్య వేచి వున్న గది ముందు రహీమ్ ఖాన్ నిలిచివున్నాడు.

తన తల్లిదండ్రుల మీద, తన కుటుంబం మీద, సంఘం మీద పగ తీర్చుకొనేందుకు భయంకరమైన నిర్ణయాన్ని గైకొన్నాడు. తన జీవితం గురించి తను కన్న కలలన్నీ నిరాశామయమవడానికి వాళ్లందరూ కారణమని తలచాడు. అతని వేదనాపూరితమైన, అతార్కికమైన మనస్సులో, తన భార్యను తను పెట్టే హింసకు గురుతుగా భావించాడు. అప్పటినుంచి అతని మల్లెవంటి మెత్తని, దయగల మనస్సు, ఇనుపరాయిగా మారింది.
 
ఇది ముప్ఫై ఏళ్లనాటి మాట. అప్పటినుంచీ తన భార్యని, పిల్లల్ని, తన ఎద్దుల్ని ఎంతగానో హింసించాడు. గ్రామంలోని ప్రతి వ్యక్తితో పోట్లాడాడు. ప్రజలందరూ తనని అసహ్యించుకొనేట్టు చేసుకున్నాడు. ‘‘అందరిచేతా అసహ్యింపబడుతున్నాను’’ అనే ఆలోచన అతనికి ఎంతో తృప్తినిచ్చేది. ఉత్సాహవంతుడు, దయాపరుడైన యువకుడు. ఒక్కసారిగా మృగంలాగ మారడానికి కారణం ఏమిటాని, గ్రామములో ఒక్కరూ అర్థం చేసుకోలేదు - అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు.

అతనంటే ఏ ఒక్కరికీ దయలేదు. అందరి చేత బహిష్కరింపబడ్డాడు. దుఃఖం అతని హృదయాన్ని ప్రతి నిత్యం కొరుక్కుతింటోంది. అందుకు రహీమ్‌ఖాన్, సంఘమిచ్చిన భార్యపై తన అధికారాన్ని చూపించి ఓదార్పు పొందేవాడు.
 
ఈ ముప్ఫయి ఏళ్ల నుంచీ అతను పెట్టే హింసకు బానిసగా తలవొగ్గింది. ఆమె దీనికెంతగా అలవాటు పడిందంటే ఒక వారం దెబ్బలు లేకుండా గడిస్తే, అసహజమనిపించేటంతగా అలవాటు పడింది. తను అంతగా హింసించే భార్య తన బ్రతుకులో భాగం అని అతడెప్పుడూ అనుకోలేదు. ఆ రాత్రి అతను తినకుండానే నిదురపోయాడు.
 
మర్నాడు ఆలస్యంగా లేచాడు. గతరోజు మిగిలిన చపాతీలు తిన్నాడు. ఇంటికి పట్టిన బూజు దులుపుదామని పొలం వెళ్లడం మానివేశాడు. దులిపేటప్పుడు, ఇంటికప్పులో ఓ పిచ్చుక గూడు కనిపించింది. రెండు పిచ్చుకలు అరుస్తూ దాని చుట్టూ తిరుగుతున్నాయి, ఇవన్నీ చూసి మొదట్లో ఆ గూటిని తీసేద్దామనుకున్నవాడు మానేశాడు. స్టూలు పెకైక్కి అందులో పుట్టి ఒకరోజు కూడా దాటని రెండు పిచ్చుక పిల్లల్ని చూశాడు. తల్లి పిచ్చుక రహీమ్‌ని ఎదుర్కొంది. తమ గూటిని, తమ పిల్లల్ని రక్షించుకోవడానికి ఆ చిన్న పక్షులు చూపే సాహసానికి రహీమ్ ఎంతో అబ్బురపడ్డాడు. ఆ రోజు రహీమ్‌ఖాన్ గుడిసెలో శాంతి రాజ్యమేలింది.
 
మర్నాడు యథాప్రకారంగా దైనందిన జీవితం ప్రారంభమైంది. రోజూ పొలం పనులు చూసుకొని, సూర్యాస్తమయానికి ముందే ఇంటికి చేరుకొనేవాడు. మంచంపై పడుకొని, హుక్కా పీలుస్తూ, ఆ పిచ్చుకలను శ్రద్ధగా తిలకించేవాడు. ఆ కూనలు రెండూ ఇప్పుడు పెద్దవయ్యాయి. వాటిని నురు, బుందు అని తన కొడుకుల పేర్లతో పిలుస్తున్నాడు. ప్రపంచంలో అతనికి ఈ పక్షులే బంధుమిత్రాదులు.
 
ఇప్పుడు రహీమ్ తన ఎడ్లను హింసించడం లేదు. ప్రజలకి అతనంటే, ఇప్పటికీ భయమే. ఇప్పటి అతని ప్రవర్తన గ్రామస్తులకు సందేహంగానే వుంది.
 ఒక సాయంకాలం రహీమ్ ఇంటికొస్తున్న సమయానికి ఆకాశమంతా మేఘాలు దట్టంగా అలుముకున్నాయి, ఆడుకుంటున్న పిల్లలు, ఇతన్ని చూసేసరికి, తమ జోళ్లను కూడా వదిలి పారిపోయారు.
 ‘‘ఎందుకు పరిగెడుతున్నారు? నేను మిమ్మల్ని కొట్టను’’ అని రహీమ్ పిలిచినా వృథా అయింది.
 
అతను ఇంట్లోకి వెళ్లేసరికి కుండపోతగా వర్షం మొదలయింది. నూనెదీపం వెలిగించి, తన భోజనానికి ముందు పిచ్చుకల కోసమని రొట్టెముక్కలు పెట్టి, ‘‘ఓ నూరూ, ఓ బుందూ!’’ అని పిలిచాడు.
 అయినా పిచ్చుకలు బయటికి రాలేదు. తన సహచరులకు ఏం జరిగిందోనని గూటిలోనికి ఆతృతగా తొంగిచూశాడు. ఆ నాలుగు పిచ్చుకలు ఓ చోట మునగదీసుకొని వున్నాయి. ఆ గూడు ఉన్నచోట ఇంటికప్పు కారుతోంది.
 
రహీమ్‌ఖాన్ ఒక నిచ్చెన తీసుకొని, ఆ కుండపోత వర్షంలోనే ఆ కారే ప్రదేశాన్ని బాగుచేసేందుకు వెళ్లాడు. పని అయ్యేసరికి అతను పూర్తిగా తడిసిపోయాడు కాని అతనికి ఏదో తృప్తి మిగిలింది. ఖాన్ మంచం మీద కూర్చునేటప్పుడు ఓ తుమ్ము తుమ్మాడు. ఐనా, దాన్ని గురించేమీ పట్టించుకోక నిద్రపోయాడు. మరుసటి ఉదయం రహీమ్ తీవ్రమైన జ్వరంతో లేచాడు.
 కొన్ని రోజుల నుంచి ఖాన్ పొలం వెళ్లకపోవడం చూసేసరికి గ్రామస్తులు కంగారుపడ్డారు. కొందరు అతనింటికి వెళ్లారు.
 
రహీమ్ మంచం మీద పడుకొని, ‘‘ఓ నురూ, బుందూ! నేను పోయాక మిమ్మల్నెవరు చూస్తారమ్మా?’’ అని అంటూ వుంటే తలుపు కన్నం ద్వారా చూసేరు.
 ‘‘పాపం, నిర్భాగ్యుడికి పిచ్చిపట్టింది’’ అని రైతులు జాలిగా తల తాటించారు. ఆ రోజే అతన్ని చూసుకొనేందుకు అతని భార్యకు కబురంపారు.
 
మర్నాడు రహీమ్‌ఖాన్ భార్య ఏడుస్తూ తన కొడుకులతో సహా వచ్చింది. తలుపులు లోపల గడవేసి వున్నాయి. గట్టిగా తలుపు కొట్టినా ఎవ్వరూ తీయలేదు. తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లారు.
 భయంకరంగా కనిపిస్తున్న రహీమ్ భారీ దేహం నిశ్శబ్దంగా వున్న ఆ గదిలో నిర్జీవంగా వున్నది. దానిచుట్టూ ఎగురుతున్న పిచ్చుకలు మాత్రమే ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ, రోదిస్తున్నాయి.
ఆంగ్ల మూలం: కె.ఎ.అబ్బాస్
అనువాదం: జమ్ము సత్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement