ఇరుకు
క్లాసిక్ కథ
‘‘అనంతపురం హాస్పిటల్లో రంగనాథం అడ్మిట్ అయ్యాడు’’ అన్న వార్త తాడిపత్రి అంతా పాకిపోయింది. దాంతో తాడిపత్రికీ, అనంతపురానికీ ఉన్న రోడ్డుకు సగం ఆయుష్షు మూడింది. అతన్ని పరామర్శించి రావడానికి బంధుమిత్రులంతా ఒకటే ప్రయాణాల్లో పడ్డారు. అతడు నాకు చిరకాలమిత్రుడూ - ప్రస్తుతం ఒకే హైస్కూల్లో సహోపాధ్యాయుడూ అవటం చేత నేనూ అనంతపురం వెళ్ళాను. వాడికి ఏ జబ్బూ లేదనీ, తిండి కాస్త తగ్గించడమే మందనీ, ఆ మరసటి రోజే డిశ్చార్జి అయిపొమ్మని అన్నారట డాక్టరు.
ఎలాగూ ఇంత దూరం వచ్చాను కదా మా సొంత ఊరు వెళ్ళి మా అమ్మానాన్నలని చూసి వస్తే బావుంటుందనిపించింది నాకు. ఆ మాటే రంగనాథంతో చెప్పేసి గబగబ హాస్పిటల్ మెట్లు దిగేసి వరండాలోకి వచ్చాను.
నెత్తురుతో కడిసిన ఓ మనిషిని స్ట్రెచర్ మీద తీసికెళుతున్నారు ఆస్పత్రి ఉద్యోగులు. వాళ్ళ వెనకాల ఓ ఆడమనిషి ఏడుస్తూ వెళుతోంది. బహుశా ఆమె గాయపడ్డ వ్యక్తి భార్య అయ్యుంటుంది. గ్రామ కక్షల కారణంగా విరోధులెవరో అతన్ని పొడిచారుట. ఆ విషయం అక్కడ గుమికూడిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి దృశ్యాలు చూస్తే మనుషుల మీద విరక్తి కలుగుతుంది నాకు. మనుషుల మధ్య, దేశాల మధ్య రగులుకుంటున్న కక్షలూ, యుద్ధాలూ ఎప్పటికీ పోవేమోనని దిగులేస్తుంది.
వరండాదిగి అటు పక్కగా వెళ్ళి వేపచెట్టు నీడన నిలుచుని సిగరెట్టు వెలిగించాను. నాకు ఎదురుగా ఓ డజను రిక్షాలున్నాయి. వాటి తాలూకు డ్రైవర్లు చెట్టు కింద హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూచుని వున్నారు.
‘‘ఏవయ్యా హరీ బావున్నావా? ఏమిటి విశేషం?’’ అంటూ వెంకటేశ్వర్లు పలుకరించేసరికి ఆలోచనల్లోంచి తేరుకున్నాను. అతనిది మా పక్క ఊరే. దూరపు బంధుత్వం కూడా ఉంది. నేను వచ్చిన పని మూడు ముక్కల్లో చెప్పేశాను.
‘‘మా అమ్మాయిని డెలివరీకి చేర్పించాను’’ అన్నాడు వేంకటేశ్వర్లు. నేనతన్ని ‘‘విశేష మేమిటి?’’ అని అడగకనే చెప్పినందుకు చాలా సంతోషం వేసింది.
ఎందుకో.... మాటాడుతూ ఉన్న నేను హాస్పిటల్ వరండాలోకి చూశాను. అక్కడ సుబ్బులు వస్తూ ఉండటం కనిపించింది. ఎడమ బుజం మీద మూడేళ్ళున్న పిల్లవాడిని వేసుకుని రెండు చేతులతోనూ పట్టుకుని నడుస్తూ ఉంది. పిల్లవాడు నిద్రపోయాడేమో తల బుజానికి ఆన్చి ఉంది. అసలు సుబ్బులు అక్కడ కనిపించడమే ఆశ్చర్యంగా ఉంది నాకు.
ఆమె ఇక్కడికి ఎప్పుడొచ్చిందో కనుక్కోవాలనిపించింది. అయితే, ఎదురుగాఉన్న వెంకటేశ్వర్లు ఏమనుకుంటాడోనని నాలోని మర్యాదస్తుడు నన్ను అడ్డుకున్నాడు.
చూస్తున్నట్టే ఓ రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది సుబ్బులు. నన్ను చూడలేదు కానీ చూసుంటే కనీసం ఒక్క మాటయినా మాటాడకుండా వెళ్ళిపోయేదా!
‘‘మావయ్యా... సుజాతకీ కాపీ తేవాలిట’’ అంటూ వేంకటేశ్వర్ల మేనకోడలు వచ్చి పని పురమాయించేసరికి ఆయన వెళ్ళిపోయాడు.
చివరి దమ్మును లాగేసి, సిగరెట్టును అవతలకు గిరవాటు పెట్టి, నేనూ ఓ రిక్షాలో బస్టాండుకు బయల్దేరాను.
ఆ రోజు సంత అవటం వల్లనేమో బస్టాండు మరీ రద్దీగా ఉంది. మా ఊరు వెళ్ళాల్సిన బస్సు అప్పటికి ఇంకా రాలేదు. వాచీ చూసుకున్నాను, మూడు గంటలయింది. సూర్యుడు మబ్బుల్లో ఉన్నా చెమటలు పట్టేస్తున్నాయి ఒళ్ళంతా. ఇంత ఉక్కగా ఉందంటే రాత్రికి వాన వస్తుందేమో! అనిపిస్తోంది.
‘‘ఇదే ఊరు పోతుందయ్యా!’’ ఓ ఆడ గొంతు వినిపించింది. తిరిగి చూడకుండానే చెప్పాను. ‘‘ఉరవకొండకు పోతుందమ్మా!’’
కొత్తపలికి పోయే బస్సు ఎప్పుడొస్తుందయ్యా!’’ అదే గొంతు అడిగే సరికి తిరిగి చూశాను.... సుబ్బులు!!
‘‘ఇంకా కొంచెం సేపటికి రావొచ్చు సుబ్బులు!’’ అన్నాను. అంతటితో ఊరుకోవాలనిపించలేదు. ‘‘ఏం సుబ్బులూ! ఆస్పత్రికెందుకొచ్చావు? కుర్రాడికి జ్వరమా?’’ అని అడిగాను.
నేను వేసిన రెండు ప్రశ్నలకీ ‘‘అవు’’నన్నట్టు తల ఊపింది నా వేపు చూడకుండానే.
‘‘ఇప్పుడు నయమయిందా?’’
‘‘ఊ’’ అంది సుబ్బులు.
‘‘అదిగో సుబ్బులూ! మన ఊరికి వెళ్ళాల్సిన బస్సు వచ్చేస్తోంది!’’ అప్రయత్నంగానే సుబ్బులుకు చెబుతున్నందుకు నాకే ఎలాగో అనిపించింది. విలువైన టెర్లిన్ దుస్తుల్లో, మర్యాదస్తుడుగా అవుపించే నాకూ, మాసిపోయీ, అక్కడక్కడ చిరుగుల్తో ఉన్న బట్టల్లో సరిగ్గా దువ్వుకోని జుత్తుతో ఉన్న సుబ్బులుకీ మధ్య నాగరికత అంత అంతరాల్ని ఏర్పరచింది మరి.
బస్సు వచ్చి నిలబడటం తోటే డోర్ వద్ద ముసిరారు ఎక్కవలసిన వారు. ఐదు నిమిషాలు ఆ రద్దీని ఛేదించడానికి కొంత పోరాడక తప్పింది కాదు. ఏమైతేనేం నాకూ ఓ సీటు సంపాయించి, ఆడవాళ్ళ సీట్లలో కిటికీ పక్కగా సుబ్బులుకీ ఓ సీటు జేబురుమాలతో రిజర్వు చేశాను.
సుబ్బులు వచ్చి తన సీటులో కూచుంది.
తమకు సీటు ఉంచినందుకు కృతజ్ఞతగా నవ్వుతుందనుకున్నాను. ఊహూ... నేనేమైనా అతిగా ఆశించానేమో!
అరగంటలో బస్సు బయల్దేరింది.
సుబ్బులు కిటికీలోంచి ఎటో చూస్తోంది. పిల్లవాడికి పాలు ఇస్తోందేమో కొంగుని నిండుగా కప్పుకొని ఉంది.
పదేళ్ళ క్రితం చూసిన సుబ్బులుకీ ఇప్పుడు చూస్తున్న సుబ్బులుకీ లేశ మాత్రమైనా పోలిక ఉందా! ప్రఖ్యాత శిల్పి తీర్చిదిద్దిన శిల్పంలాగు ఉండేది సుబ్బులు. ఆమె ఎంత నలుపో, ఆ నలుపులో అంత కాంతి పొంగుతుండేది. నవ్విందా? ఆషాడమాసపు మేఘాల మెరుపుకి పిల్లకాలువ చప్పుడు నేపథ్యం పలికినట్టు అనిపించేది.
మా ఊళ్లో పీర్ల పండగనాడు చూడాలి. ఒక్కోకుర్ర వెదవ తప్ప తాగి సుబ్బులు మెచ్చుకోలు కోసం గుణిసే తీరు. ఒక్కొక్కడు కళ్ళకి నల్లటి చలవద్దాలు పెట్టుకుని, తలకి అరలీటరు ఆముదం దట్టించి నీటుగా దువ్వి, విచ్చుకున్న గొడుగుల్ని ఎత్తి పట్టుకుని మెడలో బంతిపూల దండలు వేసుకుని, కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, సారా కైపులో ఎగురుతూ ఉంటే బాగా పెంచుకుని ఉన్న గిరజాల జుట్టులు లయగా ఎగిరేవి. అదంతా సుబ్బులు చూస్తోందన్న తలంపుతో మరింత కైపు పెరిగేది వాళ్ళకి.
నిజానికి సుబ్బులు వాళ్ళెవర్నీ చూడటం లేదనీ, చూస్తున్నది మా రామచంద్రుడినని చాలా మందికి తెలీదు.
మా రామచంద్రుడికి సుబ్బులంటే ఎంతిష్టమో!.... ‘‘ఒరే, ఆ పిల్ల తక్కువ కులంలో పుట్టకుండా ఉంటే ఎప్పుడో మీసం మీద పూలేసుకొని పెండ్లి చేసుకొని ఉండునురా! ఇప్పటికైనా నాకేం అబ్బెంతరం లేదు కానీ.... మా నాయన ఒక్కమాట అననీ... యాడన్నా పాడైపోరా నాకేం పట్టదు అని. వెంటనే పెండ్లి చేసుకోనూ!’’ అన్నాడు ఓ రోజు మా రామచంద్రుడు.
‘‘అట్లా అంటాడని కలలు కంటూ ఉండు సరిపోతుంది. ఒరే రామచంద్రిగా! మీదేం పేద్ద ఎక్కువ కులం కూడా కాదు లేవోయ్!’’ అని సన్నగా చురుకు వేశాను.
‘‘నోర్మోయవోయ్! మా కులమంటే నీకు తక్కువగా కనబడుతోందా?’’ అన్నాడు కాస్త ఉడుక్కుని.
‘‘మీ కులానికీ కొమ్ములేం రాలేదు కానీ... చూస్తూ చూస్తూ మీ నాయన మీ కులం కాని పిల్లను నీకు కట్టబెడతాడా... మంచి ఆస్తులన్నీ, కట్నాల్ని తెచ్చే కుల మింటి పిల్ల యాడుందా అని రెండేండ్ల నుంచి దుర్భిణీ వేసి చూస్తున్నాడు గదా? పోనీ ఓ పని చేద్దాం- నువ్వు సుబ్బుల్ని చేసుకుంటాను అంటే పట్నంలో నాకు మంచి మిత్రులున్నారు. వాళ్ళ సాయంతో మీ ఇద్దరికీ రిజిష్టరు పెళ్ళి జరిపించే పూచీ నాది. సరేనా! అన్నాను. వాణ్ణి ఆ రకంగా సుబ్బులతో పెళ్ళికి రెడీ చేయించాను. సుబ్బులుకి కూడా ఈ విషయం తెలిపాము. సరేనంది సుబ్బులు.
సరిగ్గా అదే సమయంలోనే సుబ్బులు మేనమామ నర్సిమ్ముడు పంచాయతీ పెట్టాడు - తన కొడుక్కి సుబ్బుల్నిచ్చి పెళ్ళిచేయాలని. ఆ పంచాయితీలోని పెద్ద మనుషులకి అప్పటికే సారా బాగా తాగించాడు నర్శిమ్ముడు. దాంతో పెద్ద మనుషులు నర్శిమ్ముడి మాట సరైందని తీర్పు చెప్పారు. అంతే.... ఒక్క వారం తిరిగే సరికి నర్శిమ్ముడి కొడుకుతో సుబ్బులు పెళ్ళి జరిగిపోయింది. మా రామచంద్రుడు ఈ దెబ్బ నుంచి ఓ ఆర్నెలలకి కాని కోలుకోలేక పోయాడు.
మూడు సంవత్సరాల క్రితం సుబ్బులుకి కొడుకు పుట్టాడు. అదే నెలలోనే సుబ్బులు భర్త చెట్టు మీద నుంచి పడి చనిపోయాడు. సుబ్బులు దురదృష్టవంతురాలు కాకపోతే మా రామచంద్రుడునే పెళ్ళి చేసుకుని వుంటే ఆమె బ్రతుకు ఎంత మారిపోయుండేదో అనిపిస్తుంది.
కొత్తపల్లి వచ్చేసింది.
నేను బస్సు దిగాను. రద్దీని దాటుకుంటూ బస్సు దిగే ప్రయత్నంలోనే ఉంది సుబ్బులు.
మా కొత్తపల్లి రోడ్డుకు ఏడు పర్లాంగుల దూరం ఉంది. సూర్యుడి కిరణాల్లో తీక్షణత లేదు. కరువు బాగా ముదిరి ఉండటం వల్ల చేలన్నీ బోసిపోయి ఉన్నాయి.
నన్నూ, సుబ్బుల్నీ దించిన బస్సు వెళ్ళిపోయింది.
రెండు మూడు అడుగులు ముందుకు వేసాను. పెద్ద పెట్టున ఏడుపు వినిపిస్తే తిరిగి చూశాను. సుబ్బులు ఏడుస్తోంది. దారి పక్కన ఉన్న రావి చెట్టుకిందే కూలబడి పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని ఏడ్చేస్తోంది. నాకేం పాలు పోలేదు. అసలేమయింది సుబ్బులికి! ఇంతవరకూ బావుందే!
‘‘ఏం సుబ్బులూ ఏమయింది పిల్లాడికి?’’
‘‘నా పిల్లోడు పోయెనే... నా బంగారు కొండ సచ్చిపాయె గదమ్మా! ఇంగెట్లాగమ్మా నేను బతికేది?’’ అంటూ బిగ్గరగా ఏడుస్తోంది సుబ్బులు.
నేను దిమ్మెరపోయి చూస్తున్నాను.
ఒళ్ళోని కుర్రాడు చలన రహితంగా ఉన్నాడు!
‘‘ఎప్పుడు చనిపోయాడు? బస్సు దిగాక చనిపోయాడా సుబ్బులూ? నా ప్రశ్నలు ఆమెకేమీ వినబడ్డం లేదు. ఎదను బాదుకుంటూ ఒకటే ఏడుస్తోంది.
మళ్ళీ గొంతు పెంచి అడిగాను.
లేదన్నట్టు తలను ఊపింది - ఏడుస్తూ చెప్పింది సుబ్బులు....
‘‘ఆస్పత్రిలోనే సచ్చిపోయినాడు సామీ!’’.....
నేను షాక్ తిన్నాను ఆ మాటకి.
‘‘మరి నాకు బస్టాండులో కానీ, బస్సులోకానీ, ఈ విషయం చెప్పలేదేం సుబ్బులూ?’’ అన్నాను ఆందోళనతో.
పెద్ద పెట్టున ఏడుస్తూనే చీలిపోతున్న కంఠంతో చెప్పింది సుబ్బులు, అసలు విషయమంతా. వారం రోజుల నించి ఈనికి అగ్గి మాదిరి జరం వచ్చింది సామీ! నిన్న పొద్దున్న బతకడేమోనని అనుమానంవచ్చి ఆస్పత్రిలో జేర్పిస్తి. అయినా, ఈ పొద్దుటికి ఈనికి ఆయుస్సు సెల్లిపోయింది సామీ.
నా బంగారు కొండ సచ్చిపాయెనే అని, నాకెంత దుక్కం వస్తున్నా ఏడ్చలేదు సామీ.... ఆస్పత్రిలో ఏడిస్తే నర్సులూ, డాకటేర్లు తిడ్తారని బయం... ఆస్పత్రి బయటికి వచ్చినాక ఏడ్సుదామనిపించింది. కానీ! ఆడ ఏడిస్తే రిక్షాకు డబ్బులెక్కువ అడుగతారేమోనని ఏడుపు బిగ పట్టుకున్నా... బస్సు కాడ ఏడిస్తే పీనుగతో బస్సులోకి ఎక్కనియ్యరని ఆడా ఏడుపుని అనుసుకున్నా. యింక నా వల్ల కాదు
సామీ..... కరువు తీరా నా సిట్టి తండ్రికోసరం ఏడుస్తా.... నా నాయన నాకి దూరమైపోతే నాకేంది ఉంది... సామీ! నేనింక ఊర్లోకి రాలేను నా సేత కాదు. నువ్వే మావోల్లందరికీ సెప్పుసామీ! నీకు పున్నెముంటుంది!! అంటూ చేతులెత్తి మొక్కుతూ ఉంది సుబ్బులు.
నేనొక్కడినే ఊరి దారి పట్టాను, అంతకన్నా ఏం చేయాలో తెలీక.
- చిలుకూరి దేవపుత్ర (ఆరుగ్లాసులు సంకలనం నుంచి)