Chilukuri devaputra
-
కుర్చీ కరిచింది!
ఆ మరుసటి రోజు జరుగనున్న పంచాయతీ ఎలక్షన్లకు గానూ ఆ సాయంత్రానికల్లా వీరాపురం చేరుకున్నాం. జనరల్ ఎలక్షన్ అయితే తక్కువ సిబ్బందే ఉండేది. పంచాయతీ ఎలక్షను అయినందువల్ల మా సిబ్బందే చిన్నసైజు బెటాలియనంత ఉంది. లెక్క ప్రకారం ముప్పయి మందన్నమాట! పోలింగు కేంద్రమైన ఎలిమెంటరీ స్కూలు ముందు ఓ బోరింగు ఉండటంతో అందరం దానిమీదికి దాడి జరిపాం, ముఖ ప్రక్షాళన కోసం. అప్పటికే పొద్దు కుంకింది. చీకట్లు ఆ పల్లెనంతటినీ ఆక్రమించుకోవడం ప్రారంభించాయి. మా పోలింగు కేంద్రానికి కరెంటు లేదు. ఊళ్లో నించి రెండు పెట్రోమాక్స్ లైట్లను మోసుకొచ్చారు తలార్లు. ‘‘మనందరికీ భీమప్ప గారింట్లో భోజనాలు అరేంజ్ చేశారట’’ అంటూ అందర్నీ ఉద్దేశించి చెప్పాడు ఎలక్షను ఆఫీసరు. ‘‘అలాగే సార్! కవర్ల మీద పంచాయతీ పేరు రాయడం, బ్యాలెట్ పేపర్ల వెనుక సీలు కొట్టడం అవీ పూర్తి చేసుకుంటే భోంచేసి వచ్చాక తక్కిన పనులు చేసుకోవచ్చు’’ అన్నాను నేను. ‘‘భోంచేశాకే ఏ పని అయినా మొదలుపెట్టగలం’’ అన్నాడు నీరసంగా మా హనుమంత రాయుడు. ఆయనా నేనూ సహోపాధ్యాయులం. నేను తెలుగు టీచర్ని, ఆయన హిందీ టీచరు. నా మూలవేతనం ఆయన మూలవేతనం కంటే తక్కువ కావడంతో ఆయన్ని పోలింగు ఆఫీసరుగానూ, నన్ను అసిస్టెంటు పోలింగు ఆఫీసరుగానూ వేశారు. హనుమంత రాయుడు అన్నది ఎలక్షన్ ఆఫీసరు విన్నారేమో– ‘‘భోంచేసుకుని వచ్చాకే పని మొదలు పెట్టవచ్చులెండి’’ అంటూనే దూరంలో నిలుచుని బాతాఖానీ కొడుతున్న కానిస్టేబుల్స్‌ని ఉద్దేశించి ‘‘మేం ఒక అరగంటలో భోజనాలు చేసుకుని వచ్చేస్తాం. జాగ్రత్త, ఎవర్నీ రానీయకండి. మీకు భోజనాలని తలారితో ఇక్కడికే పంపే ఏర్పాటు చేస్తాం’’ అంటూనే అడుగులు వేయసాగాడు. అందరం ఉత్సాహంగా ఆయన్ని అనుసరించాం. రెండు పంక్తులు తీరి ఆవురావురుమంటూ భోంచేస్తున్నాం. కొద్ది దూరంలో ఘనమైన చెక్కకుర్చీలో కూచుని ఉన్నాడు భీమప్ప. ‘‘సర్పంచు పదవికి ముప్పయి అయిదేళ్లుగా నేనే పోటీ చేస్తూ గెలుస్తూ వచ్చినాను సార్. గవర్నమెంటోళ్లు ఈసారి షెడ్యూల్డు కులాల వాళ్లకి రిజర్వు చేసినారు కదా, అందుకే పోటీ చేయడం లేదు’’ అన్నాడు. భీమప్ప ఆకారంలో భీముడిలాగానే ఉన్నాడు. నిండుపాటి విగ్రహం, బుర్రమీసాలు, రోల్డుగోల్డ్ ఫ్రేమ్ కళ్లజోడు. మెర్క్యూరీ లైట్ వెలుతుర్లో అతని పంచె, చొక్కా మరింత తెల్లగా మెరిసిపోతున్నాయి. ‘‘ఇంతకీ మీ క్యాండిడేట్ని చూపనేలేదు’’ అడిగాడు ఎలక్షన్ ఆఫీసరు. పెళ్లికి వెళ్లి పెళ్లి కొడుకును చూడకుండా ఎవరైనా ఉంటారా? ఆఫీసరుకి ఉన్న కుతూహలమే నాకూ ఉంది. అందరం భోజనాలు చేసేసి వరండాలో వేసివున్న నల్లకంబళి మీద కూచున్నాం. వరండా ముందున్న గాటిపట్లకు నాలుగు జతల దేశపు ఎద్దులు కట్టేసి ఉన్నాయి. ట్యూబ్‌లైట్ వెలుతుర్లో వాటి కొమ్ములు నిగనిగలాడుతున్నాయి. పెద్ద స్టీలు కంచంలో తాంబూలం ఉంచారు. ఇష్టమున్నవాళ్లు తాంబూలం వేసుకుంటున్నారు. మరికొందరు సిగరెట్లు వెలిగించారు. నేను రెంటినీ సేవించడానికి ఉపక్రమించాను. ‘‘ఏం సార్, మా కాండేట్ చూడాల్లంటిరే. అగ్గో వాడే. పేరు ఓబులుగాడు’’ అన్నాడు భీమప్ప– ఎద్దులకి పొట్టు వేస్తున్న జీతగాడిని చూపిస్తూ. పాతకాలపు సల్లాడం, చిరిగిన బనియను, చింపిరి నెత్తికి మాసిపోయిన ఎరుపుగళ్ల తువ్వాలు చుట్టి ఉన్నాడు. వయసు ఏభై లోపే ఉండవచ్చు. ‘‘మీరంతా ఆశ్చర్యపోతున్నారు అవునా? ఈ గుడ్డి గవర్నమెంటు రిజర్వేషను పెట్టిందే. ఏం జేసేదిమల్ల. ఎట్లా ఈ నా కొడుకు మాలనాయాలే. ఈడయితే మనం యాడుండమంటే ఆడ పడి ఉంటాడు’’ అంటూ భీమప్ప చెప్పుకుపోతున్నాడు. మా వాళ్లందరూ నోళ్లు వెల్లబెట్టి వింటున్నారు. ఓబులేసు– భీమప్ప మాటలు కానీ, మా చూపుల్ని కానీ పట్టించుకునే స్థితిలో లేడు. ఎలక్షన్ గెలుస్తానా, లేదా అన్న ఆందోళన, ఆదుర్తా నామమాత్రంగానైనా లేవు. భీమప్ప దగ్గర్నించి సెలవు తీసుకుని మళ్లీ పోలింగు కేంద్రానికి చేరుకున్నాం. ‘‘మొత్తానికి భీమప్ప అసాధ్యుడప్పా! ఈ ఊర్లో ఆయప్పకి మాంచి పలుకుబడి ఉంది. అవతల అభ్యర్థికి డిపాజిట్లు గల్లంతయినా ఆశ్చర్యం లేదు’’ అన్నాడు హనుమంత రాయుడు. ‘‘అప్పుడే ఎంక్వయిరీ చేసినావా? అసాధ్యుడప్పా నువ్వూ’’ అన్నాను. ∙∙ పోలింగు ఉదయం ఎనిమిదికి ప్రారంభమయి ఒంటిగంటకి ముగిసింది. 90 శాతం ఓట్లు పోలయినాయి. మధ్యాహ్నం భోజనం అక్కడికే పంపించాడు భీమప్ప. 2 గంటల నుంచీ ఓట్ల లెక్కింపు మొదలయింది. సాయంత్రం నాలుగున్నర అవుతున్నట్లే ఊరు ఊరంతా స్కూలు ముందర నిలబడింది. అందరి మొహాల్లోనూ ఫలితాలు తెలుసుకోవాలనే ఆత్రం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. అయిదు గంటలు అవుతున్నట్టే ఫలితాలు ప్రకటించారు మా ఆఫీసరు. ‘‘ఓబులేసు 800 ఓట్ల మెజారిటీతో గెలిచాడు’’ అంటూ. విజిల్స్, చప్పట్లు, వెర్రికేకలు– ఏం చేయాలో తోచని జనం భీమప్పకి ‘జై’ కొడుతున్నారు. అంతమంది హర్షధ్వానాలూ, కేరింతలూ మిన్నుముడుతున్నా ఎక్కడా ఓబులేసు జాడలేదు. ‘‘ఎక్కడండీ గెలిచిన అభ్యర్థి? అతను తొందరగా వస్తే సర్పంచుగా ప్రమాణ స్వీకారం చేయించేస్తే మా పని పూర్తి అయిపోతుంది’’ అంటూ ఆఫీసరు భీమప్పతో అంటున్నాడు. ‘‘వస్తాడు లెండి సార్’’ అన్నాడు భీమప్ప. అతని మొహంలో ప్రత్యర్థి రామానాయుడి క్యాండేట్‌ని దెబ్బతీసిన ఆనందం తొణికిసలాడుతోంది. ఎక్కడినుంచో రానే వచ్చాడు ఓబులేసు. రాత్రి ఎట్లా చూశానో అట్లానే ఉన్నాడు. కాకపోతే తలకు కొంచెం చమురు రాసి దువ్వుకొని, తువ్వాల్ని భుజనా వేసుకొని ఉన్నాడు. సల్లాడంలోనూ, బట్టబనియన్లోనూ మార్పేమీ లేదు. ‘‘రండి ఓబులేసు గారూ! లోపలికి’’ అంటున్నాడు ఎలక్షన్ ఆఫీసరు. అతడు గదిలోకి అడుగు పెట్టడం లేదు, సిగ్గు పడటం లేదు, అలాగని భయపడుతున్నాడని చెప్పడానికీ లేదు. ‘‘నేను బళ్లోకి రాగూడదు సారూ! అదీగాక అక్కడ మా అయ్య ఉండాడు ఎట్ల సారూ? నన్ను ఈడనే ఉణ్ణీయండ్రి’’ అన్నాడు. ‘‘చూడండి ఓబులేసు గారూ! మనది ప్రజాస్వామ్య దేశం. కులాలకీ, మతాలకీ అతీతంగా ఉండే లౌకిక రాజ్యం. పెద్దోళ్లూ చిన్నోళ్లూ అన్న తేడాలు ఉండనేకూడదు. తక్కువ కులాలని పైకి తేవాలనే ప్రభుత్వం ఇలా రిజర్వేషన్లని పెట్టింది. మీరు ఎన్నికయినారు, నా మాట విని రండి’’ ఆఫీసరు ఓ మినీ లెక్చరిచ్చాడు. చివరి వాక్యం తప్ప ఓబులేసుకు ఒక్క ముక్క కూడా అర్థమయివుండదు. ‘‘సర్పంచుగా గెలిచాక ప్రమాణ స్వీకారం చేయక తప్పదు పదండీ’’ అంటూ పోలింగు ఆఫీసర్లంతా చెప్పేటప్పటికి– ‘‘మా అయ్య ఎదురుంగ నేను కూసోవల్లా? నా వల్ల గాదు సామీ’’ అంటూ ఏడుపుమొహం పెట్టాడు ఓబులేసు. ‘‘మీరయినా చెప్పండి భీమప్ప గారూ’’ ఆఫీసరు నిస్సహాయంగా చూస్తూ అన్నాడు. ‘‘నేనేంది చెప్పేది. వాన్ని పట్టుకోని అండీ, గుండీ, గారూ, గీరూ అంటే ఇంటాడా ఆ నా కొడుకు. ఓబుళుగా! రావోయ్’’ భీమప్ప పలుకు వినబడేసరికి ఠక్కున లోపలికి వచ్చేశాడు ఓబులేసు. ‘‘ఆఫీసరు గారూ! నాదొక్కమాట. ఈ గది పెద్దదే కదా, చాపలూ కంబళ్లూ తెప్పిస్తానూ. కింద కూచుని ప్రమాణ స్వీకారం చేయించండి సరిపోతుంది. అందరికీ సరిపోయేటన్ని కుర్చీలు లేవు కదా’’ అన్నాడు భీమప్ప. ‘‘సారీ అండీ భీమప్ప గారూ! ప్రమాణ స్వీకారం చేయించడం నేల మీద కాదు. అది సాంప్రదాయం కూడా కాదు. మీరు ఏమనుకోకుండా ప్రేక్షకుల్లో కూచోండి’’ అంటూ భీమప్పకి చాప చూపించాడు ఆఫీసరు. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు గుడ్లు మిటకరిస్తూ ప్రేక్షకుల్లో కూలబడ్డాడు భీమప్ప. ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఉపసర్పంచి ఎన్నిక కూడా పూర్తయింది. జనం అంతా వెళ్లిపోయారు. ఇక జరగాల్సిందల్లా ఓట్ల పెట్టెల్నీ, మెటీరియల్నీ తిరిగి లారీలోకి ఎక్కించి మేము బయల్దేరడమే. అక్కడే వచ్చింది చిక్కు. చావు కబురు చల్లగా చెప్పాడు లారీడ్రైవరు, చెడిపోయిందంటూ. అప్పటికే ఏడున్నర అవుతోంది. చీకటి ముసురుకుంది. మధ్యాహ్నం ఎప్పుడో తిన్న అన్నం ఎప్పుడో అరిగిపోయింది. మరో లారీ తేవడానికి పట్నానికి వెళ్లాలన్నా సాయంత్రం అయిదు తర్వాత ఆ ఊరికి బస్సు లేదాయె. ఆ రాత్రి భీమప్ప మమ్మల్ని భోజనానికి ఆహ్వానించలేదు. రాత్రి పదిగంటలయింది. ఏదో మాటలు వినబడితే లేచి చూశాను. తలారి చుట్టూ గుమిగూడారు మా వాళ్లు. ‘‘భలే తన్నిరిలే సారూ! వానికి అట్లే జరగాల్సింది’’ అంటున్నాడు తలారి రాముడు. ‘‘ఎందుకు తన్నడం?’’ ‘‘ఏంది సార్ అట్లంటావు? భీమప్ప అయ్యంటే ఏందనుకుంటివి? ఎంత పేరూ ఏం కత? అట్లా అయ్య ముందర కుర్చీలో కూచ్చుంటాడా వాడు?’’ అంటూ సాధారణమైన విషయంగా చెబుతున్నాడు తలారి. నా మనసు చివుక్కుమంది. చిలుకూరి దేవపుత్ర చిలుకూరి దేవపుత్ర (24 ఏప్రిల్ 1952 – 18 అక్టోబర్ 2016) ‘ఊడల మర్రి’ కథకు సంక్షిప్త రూపం ఇది. పాతికేళ్ల క్రితం 1993లో ఆహ్వానం పత్రికలో అచ్చయింది. దేవపుత్ర అనంతపురంలో జన్మించారు. రచనల్లో దళిత జీవన చిత్రణ చేశారు. వంకర టింకర, ఆరు గ్లాసులు, ఏకాకి నౌక చప్పుడు, బందీ లాంటి సంపుటాలుగా ఆయన కథలు వెలువడ్డాయి. అద్దంలో చందమామ, పంచమం, కక్షశిల, చీకటిపూలు ఆయన నవలలు. -
ఉన్నాడున్నాడు దేవపుత్ర
వెన్నెల క్లినిక్కులో మేం కవులు రచయితలుగా రెక్కలు తొడుక్కునేటప్పుడు! వచన కవిత్వాన్ని హేళన చేసే పద్యకర్తలనూ, ఫ్యూడల్ అష్టావధానులనూ ఎదుర్కొనే మా యువకుల మధ్య ఉన్నాడున్నాడు దేవపుత్ర! అది నాలుగు దశాబ్దాల కిందటి అనంతపురం వాతావరణం. స్వాతంత్య్రానంతరం కొత్తగా చదువరులైన శూద్రులు సాహిత్యంలో ఈకలు మొలిపించుకుంటున్న కాలం! అప్పటికే తన తొలి కథను రంగనాయకమ్మ అచ్చువేస్తే, మంచిరెడ్డి శివరామిరెడ్డి యువకవుల సైన్యంలో ఆధునిక వచనాస్త్రంగా నిలిచిన వాడు దేవపుత్ర! జిల్లా గ్రంథాలయం ఆవరణలో శిరీష కుసుమాల పరిమళాల మధ్య మాకు తారసపడేది అతడే! చిరుమామిళ్ల లిటెరరీ మీట్లో చర్చోపచర్చల మధ్య నిశ్శబ్దంగా అతడే! రోడ్డు పక్కన చెట్టు కింద చెడిపోయిన బీగాలు సరిజేసే చెక్కపెట్టె మీద మా మిత్రులతో అతడే! అవును, మనమంతా చెట్టు కింద మిత్రులం కదా! ఎన్ని కథలు! ఎన్ని సాహిత్య విశేషాల చిట్చాట్లు! సంగీతమూ, చిత్రలేఖనమూ మా మధ్యలోకి దిగుమతి చేసేవాడు రఘుబాబు. అటు నుండి వస్తూ వస్తూ జేకేనీ, యూజీనీ పట్టుకొచ్చేవాడు రాయుడు. కానీ కథకు అన్యమైన దాన్ని ప్రేమించడానికి దేవపుత్ర ఇష్టపడేవాడు కాదు. అప్పటికింకా చెట్టుకింద మిత్రులు ఏర్పడనప్పటి మాట. ఆరామ్ హోటల్లో పంచాది నిర్మల, సుబ్బారావు పాణిగ్రాహి మా చర్చలో పచ్చపచ్చగా మొలకెత్తుతూ ఉన్నారు. లలిత కళాపరిషత్‌లో– చారు మజుందార్ నుండీ తరిమెల నాగిరెడ్డి విడిపోతే, తరిమెల నాగిరెడ్డి నుండీ దేవులపల్లి విడిపోతే, ఆ రాజకీయ పరిణామాలలో పోరాటోద్యమ కవులు కూడా రెండుగా విడిపోయిన క్రమమంతా మా చర్చలలో నలుగుతూ ఉండేది. హోటల్ సన్మాన్లో దిగంబర కవిత్వాల పలవరింతలతో మా సామాజిక క్రోధం విడుదల అవుతూ ఉండేది. శ్రీశ్రీ ఎమర్జెన్సీ సమర్థన మీద మాటల తూటాలు పేలుతూ ఉండేవి. ఒక వ్యక్తి మరణం ఆ వ్యక్తి గురించిన జ్ఞాపకం మాత్రమే. కానీ ఒక రచయిత గురించిన జ్ఞాపకం అతడు పుట్టిన ప్రదేశం యొక్క సాంస్కృతిక వాతావరణమవుతుంది. అతడు జీవించిన ప్రాంతపు రాజకీయ వాతావరణమవుతుంది. కొన్ని దశాబ్దాల వర్తమాన జీవితానికి ఒక కాలదర్పణమే అవుతుంది. దేవపుత్ర కూడా అంతే. ఏ కాలంతో కలిసి ప్రవహించినవాడు ఆ కాలానికే చారిత్రక సాక్ష్యమవుతాడు కదా! పెన్నా నది ఒడ్డున కాలువ పల్లెలో పుట్టినవాడు అతనికి కరువు కోరలకంటిన నెత్తురు తెలుసు నిమ్నకులంలో పుట్టినవాడు అతనికి దళిత జీవిత రక్తస్పర్శ తెలుసు రెండు మూడు ఉద్యోగాలు మారినవాడు తాను జీవించిన ఉద్యోగాన్ని తిరిగి కథలోకి ఎత్తిరాయడమూ అతనికి తెలుసు. సముద్రమంత జీవనోత్సాహం అతనిది. కాఫీని కూడా ప్రేమించగల అధికాధిక చిన్న సంతోషాలు అతనివి. చిన్నచిన్న అలలతో పులకరించే నది అతడు. తాలుకా ఆఫీసులో ఆర్.ఐ.గా చేస్తూ చక్కెర కిరోసిన్‌ల కోసం స్టోరు ముందు నిలబడిన శిశు అమాయకత్వం కూడా అతనిదే. తన జేబులోని కాలాన్ని దేనికి ఖర్చుపెట్టాలో, దేనికి ఖర్చు పెట్టకూడదో తెలిసినవాడు దేవపుత్ర. అందుకే సాహిత్య సృజనను తన మొత్తం జీవితపు వ్యాపారంగా మలుచుకున్నవాడు. అందుకందుకే కదా, రాయలసీమ నలుగురు రచయితల్లో ఒకనిగ తళుక్కుమని మెరిసినవాడు. అంతేనా సాకం నాగరాజ గారూ? నేను తత్వమూ కవిత్వంలో కొట్టుకొచ్చి అతని గదిలో పడితే, లేపి కూర్చోబెట్టి నాకు కథా రచనలో అన్నప్రాశన చేసినవాడు దేవపుత్ర. మల్లెల కవిత్వాన్ని తన ఇంటి గోడల పైకి ఎక్కించుకున్న కవితా ప్రియుడూ అతడే. మిత్రమా, శ్రీకృష్ణదేవరాయ ఉత్సవాలలో పెనుగొండ కొండపైన నువ్వు కొట్టిన ఈల ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. అవునా దీవెనా? పెనక చెర్ల డామ్ మీద నీ పిల్లనగ్రోవి పాట ఇంకా మారు మ్రోగుతూనే ఉంది. అవునా బద్వేలీ! భాషలో అనుమానాలొస్తే ఇప్పుడు నీ కోసం ఏ అంకెలకు ఫోను చెయ్యను! నవల మొదలు పెడదామా అని పరస్పరం కూడ బలుక్కోవడానికి ఇప్పుడు నాకెవరున్నారు? ... అన్నట్టు, గుర్రం మీద పల్లెలు తిరుగుతూ, వైద్యం చేసే ఆ మాల మహావైద్యగాడు మీ ముత్తాత గురించిన చారిత్రక నవల ఎంతవరకూ వచ్చింది? ఎవరికైనా– బోధించే మనుషులు దొరకడం సులభం. కాని పంచుకునే మనుషులు దొరకడమే అతి కష్టం! అలకలు కూడా ఇద్దరు మనుషుల మధ్య, ఆదాన ప్రదానాలే కదా! స్నేహితుడా! సమవయస్కుడా! నా కథక గురువా! ఇదే నీకు సకల తెలుగు భాషా ప్రాంతాల అక్షర నివాళి! బండి నారాయణ స్వామి 8886540990 -
దళిత బహుజన కలల రేడు
నివాళి చాలామంది మాతృభాష మీద ప్రేమను ఒక పక్క వెళ్లబోసుకుంటూ, ఇంకొక పక్క తమ పిల్లలని ఇంగ్లీష్ చదువులు చదివించుకుంటున్న సందర్భంలో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించి తన పిల్లలను తెలుగు బడుల్లోనే చదివించిన ఆచరణవాది దేవపుత్ర. సమాధుల తోటలో ఓ పువ్వు పూసింది. ఆ పువ్వు పేరు చిలుకూరి దేవపుత్ర. నా నల్లని చందమామ చిలుకూరి దేవపుత్ర. ఆయనకు నివాళులర్పిస్తున్న బండి నారాయణస్వామి అనే ఈ కథకుడికి గురువు దేవపుత్ర. నా గురువుగారిప్పుడు లేరు. ఈ నేల మీద లేకపోవచ్చు. కానీ, జీవితమంతా నేల గురించే కథలు రాసినవాడు కదా నా దేవపుత్ర. అద్దంలో చందమామ(దళితుడు రాసిన తొలి దళిత నవల), పంచమం, కక్షశిల, చీకటిపూలు దేవపుత్ర రాసిన దళిత బహుజన నవలలు. దాదాపు 100 కథలు రాసినాడు. అవి ‘వంకర టింకర’, ‘ఆరు గ్లాసులు’, ‘ఏకాకి నౌక చప్పుడు’, ‘బందీ’ లాంటి సంకలనాలుగా వెలువడినాయి. ఈ కథల్లో దళిత బహుజన కథలున్నాయి, రాయలసీమ ప్రాదేశిక కథలున్నాయి, మధ్య తరగతి కథలున్నాయి, హాస్య కథలూ ఉన్నాయి. ఈ నాలుగు రకాల కథలూ చాలా ప్రతిభావంతంగా రాసినవాడు నా దేవపుత్ర. ఆయన మరణంలోనూ విషాదంతోపాటు ఒక సంతోషం కూడా వున్నది. దేవపుత్ర పొద్దున్నే మామూలుగా ఆరుగంటలకు లేచినాడు, వాకింగ్‌కు పోయినాడు, స్నేహితుడింటికి పోయి కాఫీ తాగినాడు. ఇంటికి వచ్చి భార్యతో నాలుగు మాటలు మాట్లాడి కుప్పకూలిపోయినాడు. ఆమె భయంతో అరిచింది. ఆయన్ను బతికించడానికి ఛాతీపై ఒత్తిడి చేస్తుంటే, నిద్రలోంచి లేచి కూచున్నట్టుగా లేచి, అప్పుడేమన్నాడో తెలుసా? ‘‘నేను నిద్ర పోతున్నాను, నాకు అందమైన కలలు వస్తున్నాయి. ప్లీజ్ పాడు చేయవద్దండి నా కలల్ని’’. ఇదీ నా దేవపుత్ర ప్రయాణం. అది 1975వ సంవత్సరం. అనంతపురానికి అష్టావధానాల ఫ్యూడల్ కళ తప్ప, ఆధునిక వచన కవిత్వం గుర్తింపులేని సందర్భం. అప్పటిలో కుందుర్తి గారు వచన కవిత్వానికి పీరు ఎత్తేవాడు. ఆ సందర్భంలో అనంతపురం బ్రాహ్మణ పండితులు ఆధునిక వచన కవిత్వాన్ని ఎద్దేవా చేసేవారు. ఎట్లంటే- ‘‘అదిగదిగో బుడ్డి, వెలుగుచున్నది బుడ్డి’’ అని. ఈ క్రమంలో పాండిత్య గంధం లేని శూద్ర యువకులందరు కూడానూ ఏకమైనారు. ఈ యువ రచయితల్లోనే అప్పటికే సామాజిక పరంగా, సాహిత్య పరంగా, వామపక్ష భావజాలాల సూత్రంతోనే అనంతపురం యువ రచయితల పద్య ప్రక్రియ మారింది. సామాజిక దృష్టి కూడా మారింది. ఈ క్రమంలోనే పరిచయమైన మిత్రుడు చిలుకూరి దేవపుత్ర. ఈ క్రమమంతా జరిగిన పదియేండ్ల తర్వాత, నా మిత్రుడు నాకు గురువు అవుతాడని అనుకోలేదు. ఎందుకంటే, అవధాన సాహిత్యాన్ని చీల్చి చెండాడుతున్న సమయంలో దేవపుత్ర అప్పటికే మాకంటే ప్రోగ్రెసివ్. ఆయన మొదటి కథని రంగనాయకమ్మ అప్పటికే అచ్చువేసింది. అప్పటికి మేము ఆధునికమైన వచన కవిత్వంలోనే కాల్పనిక కవిత్వాలు రాసుకునేవాళ్లం. ఇంతకుముందు చెప్పినట్టుగానే పదియేండ్లలో కవులు, ఒకానొక రాయలసీమ నిష్ఠుర పరిస్థితుల్లో ఆకాశం నుంచీ భూమ్మీదకు రాక తప్పలేదు. కవిత్వం నుంచీ వాస్తవికమైన కథకూ రాక తప్పలేదు. అప్పటికే దేవపుత్ర, ఆధునిక వచన సాహిత్యంలో కథలు రాసీ రాసీ, వివిధ పత్రికలతో యుద్ధం చేస్తూ విఫలమవుతూ వున్నవాడు. పట్టువదలని విక్రమార్కుడి మాదిరి, చెట్టు వదలని బేతాళుడి మాదిరి... విక్రమార్కుడు జయించాడో లేదో కాశీ మజిలీ కథలకే తెలియవలె కానీ, దేవపుత్ర కథలని పత్రికలవాళ్లు వేసుకోక తప్పింది కాదూ, బహుమతులివ్వకా తప్పింది కాదు. దేవపుత్ర ఇంతగా రెక్కలలో ఈకలు మొలిపించుకుని, బలిపించుకుని ఎదుగుతూవున్న క్రమంలో బండి నారాయణస్వామి వంటి కవులు ఎక్కడున్నారు? నిజానికి, అనంతపురం ప్రాంతీయ అస్తిత్వ ధోరణిని మొదట ప్రెజెంట్ చేసిన పెద్దమనుషులు గుత్తి రామకృష్ణ, సింగమనేని నారాయణగార్లు అయిప్పటికిన్నూ, ఒక మిత్రుడు అదే వయసు గల ఇంకొక మిత్రుడికి గురువుగా మారే సంఘటన ఈ రచయితకే సంభవించింది. నేను అప్పుడు అనంతపురానికి 75 కిలోమీటర్ల బయట బ్రహ్మసముద్రంలో ఒక అయ్యవారిగా వున్నా. నా దేవపుత్ర నాకు 16 కిలోమీటర్ల దూరంలోని రాయదుర్గంలో వున్నాడు కదా అని, ఆయనతో ఒకపూట గడపవచ్చులే అని పోయినా. అప్పటికి సెల్ఫోన్లు లేవు. ఆయనకు చెప్పాపెట్టకుండా ఆయనింటికి పోవడం అభ్యాగతినే. ఆయన రూములోకి అడుగు పెడితే, ఆయన తెల్లకాగితాలకు మూర్తిమంతమిచ్చిన ఒక సందర్భం నాకు కనపడింది. అప్పుడు ఈ రొమాంటిక్ ఫెల్లో బండి నారాయణస్వామి, ఆయన రూపమిచ్చిన తెల్లకాగితాలు చదివి మూర్ఛపోవడమొకటే తక్కువ. వెంటనే, ఐ! దేవపుత్రా, ఇట్లాంటి కథలు నేనూ రాయవచ్చు కదా!! అంటే, దేవపుత్ర నల్లని మొఖంలోంచి తెల్లగా నవ్వి, ‘‘మన అనుభవాలు మనం రాసుకోవచ్చు కదా నారాయణస్వామీ’’ అన్నాడు. అక్కడే, దేవపుత్ర బండి నారాయణస్వామికి కథాసాహిత్య అన్నప్రాశన చేసినవాడు అయినాడు. దేవపుత్ర, బయటకు ఒకటి చెప్పి, వ్యక్తిగత జీవితంలో ఇంకొకరకంగా జీవించినవాడు కాడు. చాలామంది మాతృభాష మీద ప్రేమను ఒక పక్క వెళ్లబోసుకుంటూ, ఇంకొక పక్క తమ పిల్లలని ఇంగ్లీష్ చదువులు చదివించుకుంటున్న సందర్భంలో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించి (ఇంగ్లీష్ భాషను కాదు) తన పిల్లలను తెలుగు బడుల్లోనే చదివించిన ఆచరణవాది దేవపుత్ర. 1990లో తెలుగు భాష అస్తిత్వం గురించి మాట్లాడుతుంటే, దేవపుత్రను భాషాపరంగా దండించిన మహా మహా అనంతపురం కమ్యూనిస్టులు కూడా నాకు తెలుసు. సమాజంలో చేపపిల్ల మాదిరి బతికిన దేవపుత్రకి, ఒడ్డున ఈతకొట్టే కమ్యూనిస్టులు సరిపోజాలరని ఈ పాతికేళ్ల జీవితం రుజువు చేసింది. ఆయన సెల్‌ఫోన్‌ను ఒక్కసారి చూడండి, తెలుగు మీద ఆయన భక్తి మీకే అర్థమవుతుంది. మా దేవపుత్ర కాఫీ ప్రియుడు. ఒక పెద్ద లోటాతో కాఫీ తాగుతాడు. ఆ తరువాత ఒక సిగరెట్ వెలిగించుకుంటాడు. అప్పుడు చూస్తాం గదా, ఆ నల్లటి మొఖంలో చందమామై ఉదయిస్తాడు. ఆయన, తన జూనియర్ రచయితలు ఏం రాసినా, ఏం మాట్లాడినా తెలుగులో తప్పులు దిద్దుతూనే వుంటాడు. తెలుగు భాషను బతికించాలనే వాదానికి ఆయన బ్రాహ్మణిక్ క్రమంలో పరిమితం కాలేదు. తెలుగు భాషను ఇంటిభాషగా నేర్చుకోండి అనే ఆయన కోరిక తెలుగు భాషను కాపాడేదిగా వుంటుంది. ఎందుకంటే, ‘‘కట్టె, కొట్టె, తెచ్చె’’ అనే తెలుగుభాషను కాపాడుకోవడం వరకే పరిమితమైన బ్రాహ్మణ భాషోద్యమాన్ని ఈయన అంగీకరించలేదు. ఉత్పత్తి కులాల భాషే తెలుగు భాషని పునర్నిర్మిస్తుందని ఆయన భావించినాడు. చిలుకూరి దేవపుత్ర బజాజ్ స్కూటర్ పైవున్న రిజిస్ట్రేషన్ నంబర్‌ను పరిశీలిస్తే చాలు, తెలుగు భాష మీద ఆయనకున్న విరహం ఇట్టే అర్థమవుతుంది. నంబర్ ప్లేట్‌పై హిందూ అరబిక్ అంకెలుండవు. తెలుగు భాషోద్యమకారుడు స.వెం.రమేశ్ దేవపుత్రకు అనుంగు మిత్రుడు. కథకుడిగా, నవలాకారుడిగా, పత్రికలలో ఫీచరిస్టుగా, మంచిగా, గొప్పగా పనిచేసి తన సామాజిక వర్గాన్ని ప్రతిబింబించిన దేవపుత్రకు రాయలసీమ నివాళి. - బండి నారాయణస్వామి 8886540990 -
ఇరుకు
క్లాసిక్ కథ ‘‘అనంతపురం హాస్పిటల్లో రంగనాథం అడ్మిట్ అయ్యాడు’’ అన్న వార్త తాడిపత్రి అంతా పాకిపోయింది. దాంతో తాడిపత్రికీ, అనంతపురానికీ ఉన్న రోడ్డుకు సగం ఆయుష్షు మూడింది. అతన్ని పరామర్శించి రావడానికి బంధుమిత్రులంతా ఒకటే ప్రయాణాల్లో పడ్డారు. అతడు నాకు చిరకాలమిత్రుడూ - ప్రస్తుతం ఒకే హైస్కూల్లో సహోపాధ్యాయుడూ అవటం చేత నేనూ అనంతపురం వెళ్ళాను. వాడికి ఏ జబ్బూ లేదనీ, తిండి కాస్త తగ్గించడమే మందనీ, ఆ మరసటి రోజే డిశ్చార్జి అయిపొమ్మని అన్నారట డాక్టరు. ఎలాగూ ఇంత దూరం వచ్చాను కదా మా సొంత ఊరు వెళ్ళి మా అమ్మానాన్నలని చూసి వస్తే బావుంటుందనిపించింది నాకు. ఆ మాటే రంగనాథంతో చెప్పేసి గబగబ హాస్పిటల్ మెట్లు దిగేసి వరండాలోకి వచ్చాను. నెత్తురుతో కడిసిన ఓ మనిషిని స్ట్రెచర్ మీద తీసికెళుతున్నారు ఆస్పత్రి ఉద్యోగులు. వాళ్ళ వెనకాల ఓ ఆడమనిషి ఏడుస్తూ వెళుతోంది. బహుశా ఆమె గాయపడ్డ వ్యక్తి భార్య అయ్యుంటుంది. గ్రామ కక్షల కారణంగా విరోధులెవరో అతన్ని పొడిచారుట. ఆ విషయం అక్కడ గుమికూడిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి దృశ్యాలు చూస్తే మనుషుల మీద విరక్తి కలుగుతుంది నాకు. మనుషుల మధ్య, దేశాల మధ్య రగులుకుంటున్న కక్షలూ, యుద్ధాలూ ఎప్పటికీ పోవేమోనని దిగులేస్తుంది. వరండాదిగి అటు పక్కగా వెళ్ళి వేపచెట్టు నీడన నిలుచుని సిగరెట్టు వెలిగించాను. నాకు ఎదురుగా ఓ డజను రిక్షాలున్నాయి. వాటి తాలూకు డ్రైవర్లు చెట్టు కింద హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూచుని వున్నారు. ‘‘ఏవయ్యా హరీ బావున్నావా? ఏమిటి విశేషం?’’ అంటూ వెంకటేశ్వర్లు పలుకరించేసరికి ఆలోచనల్లోంచి తేరుకున్నాను. అతనిది మా పక్క ఊరే. దూరపు బంధుత్వం కూడా ఉంది. నేను వచ్చిన పని మూడు ముక్కల్లో చెప్పేశాను. ‘‘మా అమ్మాయిని డెలివరీకి చేర్పించాను’’ అన్నాడు వేంకటేశ్వర్లు. నేనతన్ని ‘‘విశేష మేమిటి?’’ అని అడగకనే చెప్పినందుకు చాలా సంతోషం వేసింది. ఎందుకో.... మాటాడుతూ ఉన్న నేను హాస్పిటల్ వరండాలోకి చూశాను. అక్కడ సుబ్బులు వస్తూ ఉండటం కనిపించింది. ఎడమ బుజం మీద మూడేళ్ళున్న పిల్లవాడిని వేసుకుని రెండు చేతులతోనూ పట్టుకుని నడుస్తూ ఉంది. పిల్లవాడు నిద్రపోయాడేమో తల బుజానికి ఆన్చి ఉంది. అసలు సుబ్బులు అక్కడ కనిపించడమే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఆమె ఇక్కడికి ఎప్పుడొచ్చిందో కనుక్కోవాలనిపించింది. అయితే, ఎదురుగాఉన్న వెంకటేశ్వర్లు ఏమనుకుంటాడోనని నాలోని మర్యాదస్తుడు నన్ను అడ్డుకున్నాడు. చూస్తున్నట్టే ఓ రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది సుబ్బులు. నన్ను చూడలేదు కానీ చూసుంటే కనీసం ఒక్క మాటయినా మాటాడకుండా వెళ్ళిపోయేదా! ‘‘మావయ్యా... సుజాతకీ కాపీ తేవాలిట’’ అంటూ వేంకటేశ్వర్ల మేనకోడలు వచ్చి పని పురమాయించేసరికి ఆయన వెళ్ళిపోయాడు. చివరి దమ్మును లాగేసి, సిగరెట్టును అవతలకు గిరవాటు పెట్టి, నేనూ ఓ రిక్షాలో బస్టాండుకు బయల్దేరాను. ఆ రోజు సంత అవటం వల్లనేమో బస్టాండు మరీ రద్దీగా ఉంది. మా ఊరు వెళ్ళాల్సిన బస్సు అప్పటికి ఇంకా రాలేదు. వాచీ చూసుకున్నాను, మూడు గంటలయింది. సూర్యుడు మబ్బుల్లో ఉన్నా చెమటలు పట్టేస్తున్నాయి ఒళ్ళంతా. ఇంత ఉక్కగా ఉందంటే రాత్రికి వాన వస్తుందేమో! అనిపిస్తోంది. ‘‘ఇదే ఊరు పోతుందయ్యా!’’ ఓ ఆడ గొంతు వినిపించింది. తిరిగి చూడకుండానే చెప్పాను. ‘‘ఉరవకొండకు పోతుందమ్మా!’’ కొత్తపలికి పోయే బస్సు ఎప్పుడొస్తుందయ్యా!’’ అదే గొంతు అడిగే సరికి తిరిగి చూశాను.... సుబ్బులు!! ‘‘ఇంకా కొంచెం సేపటికి రావొచ్చు సుబ్బులు!’’ అన్నాను. అంతటితో ఊరుకోవాలనిపించలేదు. ‘‘ఏం సుబ్బులూ! ఆస్పత్రికెందుకొచ్చావు? కుర్రాడికి జ్వరమా?’’ అని అడిగాను. నేను వేసిన రెండు ప్రశ్నలకీ ‘‘అవు’’నన్నట్టు తల ఊపింది నా వేపు చూడకుండానే. ‘‘ఇప్పుడు నయమయిందా?’’ ‘‘ఊ’’ అంది సుబ్బులు. ‘‘అదిగో సుబ్బులూ! మన ఊరికి వెళ్ళాల్సిన బస్సు వచ్చేస్తోంది!’’ అప్రయత్నంగానే సుబ్బులుకు చెబుతున్నందుకు నాకే ఎలాగో అనిపించింది. విలువైన టెర్లిన్ దుస్తుల్లో, మర్యాదస్తుడుగా అవుపించే నాకూ, మాసిపోయీ, అక్కడక్కడ చిరుగుల్తో ఉన్న బట్టల్లో సరిగ్గా దువ్వుకోని జుత్తుతో ఉన్న సుబ్బులుకీ మధ్య నాగరికత అంత అంతరాల్ని ఏర్పరచింది మరి. బస్సు వచ్చి నిలబడటం తోటే డోర్ వద్ద ముసిరారు ఎక్కవలసిన వారు. ఐదు నిమిషాలు ఆ రద్దీని ఛేదించడానికి కొంత పోరాడక తప్పింది కాదు. ఏమైతేనేం నాకూ ఓ సీటు సంపాయించి, ఆడవాళ్ళ సీట్లలో కిటికీ పక్కగా సుబ్బులుకీ ఓ సీటు జేబురుమాలతో రిజర్వు చేశాను. సుబ్బులు వచ్చి తన సీటులో కూచుంది. తమకు సీటు ఉంచినందుకు కృతజ్ఞతగా నవ్వుతుందనుకున్నాను. ఊహూ... నేనేమైనా అతిగా ఆశించానేమో! అరగంటలో బస్సు బయల్దేరింది. సుబ్బులు కిటికీలోంచి ఎటో చూస్తోంది. పిల్లవాడికి పాలు ఇస్తోందేమో కొంగుని నిండుగా కప్పుకొని ఉంది. పదేళ్ళ క్రితం చూసిన సుబ్బులుకీ ఇప్పుడు చూస్తున్న సుబ్బులుకీ లేశ మాత్రమైనా పోలిక ఉందా! ప్రఖ్యాత శిల్పి తీర్చిదిద్దిన శిల్పంలాగు ఉండేది సుబ్బులు. ఆమె ఎంత నలుపో, ఆ నలుపులో అంత కాంతి పొంగుతుండేది. నవ్విందా? ఆషాడమాసపు మేఘాల మెరుపుకి పిల్లకాలువ చప్పుడు నేపథ్యం పలికినట్టు అనిపించేది. మా ఊళ్లో పీర్ల పండగనాడు చూడాలి. ఒక్కోకుర్ర వెదవ తప్ప తాగి సుబ్బులు మెచ్చుకోలు కోసం గుణిసే తీరు. ఒక్కొక్కడు కళ్ళకి నల్లటి చలవద్దాలు పెట్టుకుని, తలకి అరలీటరు ఆముదం దట్టించి నీటుగా దువ్వి, విచ్చుకున్న గొడుగుల్ని ఎత్తి పట్టుకుని మెడలో బంతిపూల దండలు వేసుకుని, కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, సారా కైపులో ఎగురుతూ ఉంటే బాగా పెంచుకుని ఉన్న గిరజాల జుట్టులు లయగా ఎగిరేవి. అదంతా సుబ్బులు చూస్తోందన్న తలంపుతో మరింత కైపు పెరిగేది వాళ్ళకి. నిజానికి సుబ్బులు వాళ్ళెవర్నీ చూడటం లేదనీ, చూస్తున్నది మా రామచంద్రుడినని చాలా మందికి తెలీదు. మా రామచంద్రుడికి సుబ్బులంటే ఎంతిష్టమో!.... ‘‘ఒరే, ఆ పిల్ల తక్కువ కులంలో పుట్టకుండా ఉంటే ఎప్పుడో మీసం మీద పూలేసుకొని పెండ్లి చేసుకొని ఉండునురా! ఇప్పటికైనా నాకేం అబ్బెంతరం లేదు కానీ.... మా నాయన ఒక్కమాట అననీ... యాడన్నా పాడైపోరా నాకేం పట్టదు అని. వెంటనే పెండ్లి చేసుకోనూ!’’ అన్నాడు ఓ రోజు మా రామచంద్రుడు. ‘‘అట్లా అంటాడని కలలు కంటూ ఉండు సరిపోతుంది. ఒరే రామచంద్రిగా! మీదేం పేద్ద ఎక్కువ కులం కూడా కాదు లేవోయ్!’’ అని సన్నగా చురుకు వేశాను. ‘‘నోర్మోయవోయ్! మా కులమంటే నీకు తక్కువగా కనబడుతోందా?’’ అన్నాడు కాస్త ఉడుక్కుని. ‘‘మీ కులానికీ కొమ్ములేం రాలేదు కానీ... చూస్తూ చూస్తూ మీ నాయన మీ కులం కాని పిల్లను నీకు కట్టబెడతాడా... మంచి ఆస్తులన్నీ, కట్నాల్ని తెచ్చే కుల మింటి పిల్ల యాడుందా అని రెండేండ్ల నుంచి దుర్భిణీ వేసి చూస్తున్నాడు గదా? పోనీ ఓ పని చేద్దాం- నువ్వు సుబ్బుల్ని చేసుకుంటాను అంటే పట్నంలో నాకు మంచి మిత్రులున్నారు. వాళ్ళ సాయంతో మీ ఇద్దరికీ రిజిష్టరు పెళ్ళి జరిపించే పూచీ నాది. సరేనా! అన్నాను. వాణ్ణి ఆ రకంగా సుబ్బులతో పెళ్ళికి రెడీ చేయించాను. సుబ్బులుకి కూడా ఈ విషయం తెలిపాము. సరేనంది సుబ్బులు. సరిగ్గా అదే సమయంలోనే సుబ్బులు మేనమామ నర్సిమ్ముడు పంచాయతీ పెట్టాడు - తన కొడుక్కి సుబ్బుల్నిచ్చి పెళ్ళిచేయాలని. ఆ పంచాయితీలోని పెద్ద మనుషులకి అప్పటికే సారా బాగా తాగించాడు నర్శిమ్ముడు. దాంతో పెద్ద మనుషులు నర్శిమ్ముడి మాట సరైందని తీర్పు చెప్పారు. అంతే.... ఒక్క వారం తిరిగే సరికి నర్శిమ్ముడి కొడుకుతో సుబ్బులు పెళ్ళి జరిగిపోయింది. మా రామచంద్రుడు ఈ దెబ్బ నుంచి ఓ ఆర్నెలలకి కాని కోలుకోలేక పోయాడు. మూడు సంవత్సరాల క్రితం సుబ్బులుకి కొడుకు పుట్టాడు. అదే నెలలోనే సుబ్బులు భర్త చెట్టు మీద నుంచి పడి చనిపోయాడు. సుబ్బులు దురదృష్టవంతురాలు కాకపోతే మా రామచంద్రుడునే పెళ్ళి చేసుకుని వుంటే ఆమె బ్రతుకు ఎంత మారిపోయుండేదో అనిపిస్తుంది. కొత్తపల్లి వచ్చేసింది. నేను బస్సు దిగాను. రద్దీని దాటుకుంటూ బస్సు దిగే ప్రయత్నంలోనే ఉంది సుబ్బులు. మా కొత్తపల్లి రోడ్డుకు ఏడు పర్లాంగుల దూరం ఉంది. సూర్యుడి కిరణాల్లో తీక్షణత లేదు. కరువు బాగా ముదిరి ఉండటం వల్ల చేలన్నీ బోసిపోయి ఉన్నాయి. నన్నూ, సుబ్బుల్నీ దించిన బస్సు వెళ్ళిపోయింది. రెండు మూడు అడుగులు ముందుకు వేసాను. పెద్ద పెట్టున ఏడుపు వినిపిస్తే తిరిగి చూశాను. సుబ్బులు ఏడుస్తోంది. దారి పక్కన ఉన్న రావి చెట్టుకిందే కూలబడి పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని ఏడ్చేస్తోంది. నాకేం పాలు పోలేదు. అసలేమయింది సుబ్బులికి! ఇంతవరకూ బావుందే! ‘‘ఏం సుబ్బులూ ఏమయింది పిల్లాడికి?’’ ‘‘నా పిల్లోడు పోయెనే... నా బంగారు కొండ సచ్చిపాయె గదమ్మా! ఇంగెట్లాగమ్మా నేను బతికేది?’’ అంటూ బిగ్గరగా ఏడుస్తోంది సుబ్బులు. నేను దిమ్మెరపోయి చూస్తున్నాను. ఒళ్ళోని కుర్రాడు చలన రహితంగా ఉన్నాడు! ‘‘ఎప్పుడు చనిపోయాడు? బస్సు దిగాక చనిపోయాడా సుబ్బులూ? నా ప్రశ్నలు ఆమెకేమీ వినబడ్డం లేదు. ఎదను బాదుకుంటూ ఒకటే ఏడుస్తోంది. మళ్ళీ గొంతు పెంచి అడిగాను. లేదన్నట్టు తలను ఊపింది - ఏడుస్తూ చెప్పింది సుబ్బులు.... ‘‘ఆస్పత్రిలోనే సచ్చిపోయినాడు సామీ!’’..... నేను షాక్ తిన్నాను ఆ మాటకి. ‘‘మరి నాకు బస్టాండులో కానీ, బస్సులోకానీ, ఈ విషయం చెప్పలేదేం సుబ్బులూ?’’ అన్నాను ఆందోళనతో. పెద్ద పెట్టున ఏడుస్తూనే చీలిపోతున్న కంఠంతో చెప్పింది సుబ్బులు, అసలు విషయమంతా. వారం రోజుల నించి ఈనికి అగ్గి మాదిరి జరం వచ్చింది సామీ! నిన్న పొద్దున్న బతకడేమోనని అనుమానంవచ్చి ఆస్పత్రిలో జేర్పిస్తి. అయినా, ఈ పొద్దుటికి ఈనికి ఆయుస్సు సెల్లిపోయింది సామీ. నా బంగారు కొండ సచ్చిపాయెనే అని, నాకెంత దుక్కం వస్తున్నా ఏడ్చలేదు సామీ.... ఆస్పత్రిలో ఏడిస్తే నర్సులూ, డాకటేర్లు తిడ్తారని బయం... ఆస్పత్రి బయటికి వచ్చినాక ఏడ్సుదామనిపించింది. కానీ! ఆడ ఏడిస్తే రిక్షాకు డబ్బులెక్కువ అడుగతారేమోనని ఏడుపు బిగ పట్టుకున్నా... బస్సు కాడ ఏడిస్తే పీనుగతో బస్సులోకి ఎక్కనియ్యరని ఆడా ఏడుపుని అనుసుకున్నా. యింక నా వల్ల కాదు సామీ..... కరువు తీరా నా సిట్టి తండ్రికోసరం ఏడుస్తా.... నా నాయన నాకి దూరమైపోతే నాకేంది ఉంది... సామీ! నేనింక ఊర్లోకి రాలేను నా సేత కాదు. నువ్వే మావోల్లందరికీ సెప్పుసామీ! నీకు పున్నెముంటుంది!! అంటూ చేతులెత్తి మొక్కుతూ ఉంది సుబ్బులు. నేనొక్కడినే ఊరి దారి పట్టాను, అంతకన్నా ఏం చేయాలో తెలీక. - చిలుకూరి దేవపుత్ర (ఆరుగ్లాసులు సంకలనం నుంచి)