ఆ మరుసటి రోజు జరుగనున్న పంచాయతీ ఎలక్షన్లకు గానూ ఆ సాయంత్రానికల్లా వీరాపురం చేరుకున్నాం.
జనరల్ ఎలక్షన్ అయితే తక్కువ సిబ్బందే ఉండేది. పంచాయతీ ఎలక్షను అయినందువల్ల మా సిబ్బందే చిన్నసైజు బెటాలియనంత ఉంది. లెక్క ప్రకారం ముప్పయి మందన్నమాట! పోలింగు కేంద్రమైన ఎలిమెంటరీ స్కూలు ముందు ఓ బోరింగు ఉండటంతో అందరం దానిమీదికి దాడి జరిపాం, ముఖ ప్రక్షాళన కోసం.
అప్పటికే పొద్దు కుంకింది. చీకట్లు ఆ పల్లెనంతటినీ ఆక్రమించుకోవడం ప్రారంభించాయి. మా పోలింగు కేంద్రానికి కరెంటు లేదు. ఊళ్లో నించి రెండు పెట్రోమాక్స్ లైట్లను మోసుకొచ్చారు తలార్లు.
‘‘మనందరికీ భీమప్ప గారింట్లో భోజనాలు అరేంజ్ చేశారట’’ అంటూ అందర్నీ ఉద్దేశించి చెప్పాడు ఎలక్షను ఆఫీసరు.
‘‘అలాగే సార్! కవర్ల మీద పంచాయతీ పేరు రాయడం, బ్యాలెట్ పేపర్ల వెనుక సీలు కొట్టడం అవీ పూర్తి చేసుకుంటే భోంచేసి వచ్చాక తక్కిన పనులు చేసుకోవచ్చు’’ అన్నాను నేను.
‘‘భోంచేశాకే ఏ పని అయినా మొదలుపెట్టగలం’’ అన్నాడు నీరసంగా మా హనుమంత రాయుడు. ఆయనా నేనూ సహోపాధ్యాయులం. నేను తెలుగు టీచర్ని, ఆయన హిందీ టీచరు. నా మూలవేతనం ఆయన మూలవేతనం కంటే తక్కువ కావడంతో ఆయన్ని పోలింగు ఆఫీసరుగానూ, నన్ను అసిస్టెంటు పోలింగు ఆఫీసరుగానూ వేశారు.
హనుమంత రాయుడు అన్నది ఎలక్షన్ ఆఫీసరు విన్నారేమో– ‘‘భోంచేసుకుని వచ్చాకే పని మొదలు పెట్టవచ్చులెండి’’ అంటూనే దూరంలో నిలుచుని బాతాఖానీ కొడుతున్న కానిస్టేబుల్స్‌ని ఉద్దేశించి ‘‘మేం ఒక అరగంటలో భోజనాలు చేసుకుని వచ్చేస్తాం. జాగ్రత్త, ఎవర్నీ రానీయకండి. మీకు భోజనాలని తలారితో ఇక్కడికే పంపే ఏర్పాటు చేస్తాం’’ అంటూనే అడుగులు వేయసాగాడు. అందరం ఉత్సాహంగా ఆయన్ని అనుసరించాం.
రెండు పంక్తులు తీరి ఆవురావురుమంటూ భోంచేస్తున్నాం. కొద్ది దూరంలో ఘనమైన చెక్కకుర్చీలో కూచుని ఉన్నాడు భీమప్ప.
‘‘సర్పంచు పదవికి ముప్పయి అయిదేళ్లుగా నేనే పోటీ చేస్తూ గెలుస్తూ వచ్చినాను సార్. గవర్నమెంటోళ్లు ఈసారి షెడ్యూల్డు కులాల వాళ్లకి రిజర్వు చేసినారు కదా, అందుకే పోటీ చేయడం లేదు’’ అన్నాడు.
భీమప్ప ఆకారంలో భీముడిలాగానే ఉన్నాడు. నిండుపాటి విగ్రహం, బుర్రమీసాలు, రోల్డుగోల్డ్ ఫ్రేమ్ కళ్లజోడు. మెర్క్యూరీ లైట్ వెలుతుర్లో అతని పంచె, చొక్కా మరింత తెల్లగా మెరిసిపోతున్నాయి.
‘‘ఇంతకీ మీ క్యాండిడేట్‌ని చూపనేలేదు’’ అడిగాడు ఎలక్షన్ ఆఫీసరు. పెళ్లికి వెళ్లి పెళ్లి కొడుకును చూడకుండా ఎవరైనా ఉంటారా? ఆఫీసరుకి ఉన్న కుతూహలమే నాకూ ఉంది.
అందరం భోజనాలు చేసేసి వరండాలో వేసివున్న నల్లకంబళి మీద కూచున్నాం. వరండా ముందున్న గాటిపట్లకు నాలుగు జతల దేశపు ఎద్దులు కట్టేసి ఉన్నాయి. ట్యూబ్‌లైట్ వెలుతుర్లో వాటి కొమ్ములు నిగనిగలాడుతున్నాయి.
పెద్ద స్టీలు కంచంలో తాంబూలం ఉంచారు. ఇష్టమున్నవాళ్లు తాంబూలం వేసుకుంటున్నారు. మరికొందరు సిగరెట్లు వెలిగించారు. నేను రెంటినీ సేవించడానికి ఉపక్రమించాను.
‘‘ఏం సార్, మా కాండేట్ చూడాల్లంటిరే. అగ్గో వాడే. పేరు ఓబులుగాడు’’ అన్నాడు భీమప్ప– ఎద్దులకి పొట్టు వేస్తున్న జీతగాడిని చూపిస్తూ.
పాతకాలపు సల్లాడం, చిరిగిన బనియను, చింపిరి నెత్తికి మాసిపోయిన ఎరుపుగళ్ల తువ్వాలు చుట్టి ఉన్నాడు. వయసు ఏభై లోపే ఉండవచ్చు.
‘‘మీరంతా ఆశ్చర్యపోతున్నారు అవునా? ఈ గుడ్డి గవర్నమెంటు రిజర్వేషను పెట్టిందే. ఏం జేసేదిమల్ల. ఎట్లా ఈ నా కొడుకు మాలనాయాలే. ఈడయితే మనం యాడుండమంటే ఆడ పడి ఉంటాడు’’ అంటూ భీమప్ప చెప్పుకుపోతున్నాడు. మా వాళ్లందరూ నోళ్లు వెల్లబెట్టి వింటున్నారు.
ఓబులేసు– భీమప్ప మాటలు కానీ, మా చూపుల్ని కానీ పట్టించుకునే స్థితిలో లేడు. ఎలక్షన్ గెలుస్తానా, లేదా అన్న ఆందోళన, ఆదుర్తా నామమాత్రంగానైనా లేవు.
భీమప్ప దగ్గర్నించి సెలవు తీసుకుని మళ్లీ పోలింగు కేంద్రానికి చేరుకున్నాం.
‘‘మొత్తానికి భీమప్ప అసాధ్యుడప్పా! ఈ ఊర్లో ఆయప్పకి మాంచి పలుకుబడి ఉంది. అవతల అభ్యర్థికి డిపాజిట్లు గల్లంతయినా ఆశ్చర్యం లేదు’’ అన్నాడు హనుమంత రాయుడు.
‘‘అప్పుడే ఎంక్వయిరీ చేసినావా? అసాధ్యుడప్పా నువ్వూ’’ అన్నాను.
∙∙
పోలింగు ఉదయం ఎనిమిదికి ప్రారంభమయి ఒంటిగంటకి ముగిసింది. 90 శాతం ఓట్లు పోలయినాయి. మధ్యాహ్నం భోజనం అక్కడికే పంపించాడు భీమప్ప. 2 గంటల నుంచీ ఓట్ల లెక్కింపు మొదలయింది.
సాయంత్రం నాలుగున్నర అవుతున్నట్లే ఊరు ఊరంతా స్కూలు ముందర నిలబడింది. అందరి మొహాల్లోనూ ఫలితాలు తెలుసుకోవాలనే ఆత్రం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది.
అయిదు గంటలు అవుతున్నట్టే ఫలితాలు ప్రకటించారు మా ఆఫీసరు. ‘‘ఓబులేసు 800 ఓట్ల మెజారిటీతో గెలిచాడు’’ అంటూ.
విజిల్స్, చప్పట్లు, వెర్రికేకలు– ఏం చేయాలో తోచని జనం భీమప్పకి ‘జై’ కొడుతున్నారు.
అంతమంది హర్షధ్వానాలూ, కేరింతలూ మిన్నుముడుతున్నా ఎక్కడా ఓబులేసు జాడలేదు.
‘‘ఎక్కడండీ గెలిచిన అభ్యర్థి? అతను తొందరగా వస్తే సర్పంచుగా ప్రమాణ స్వీకారం చేయించేస్తే మా పని పూర్తి అయిపోతుంది’’ అంటూ ఆఫీసరు భీమప్పతో అంటున్నాడు.
‘‘వస్తాడు లెండి సార్’’ అన్నాడు భీమప్ప. అతని మొహంలో ప్రత్యర్థి రామానాయుడి క్యాండేట్‌ని దెబ్బతీసిన ఆనందం తొణికిసలాడుతోంది.
ఎక్కడినుంచో రానే వచ్చాడు ఓబులేసు. రాత్రి ఎట్లా చూశానో అట్లానే ఉన్నాడు. కాకపోతే తలకు కొంచెం చమురు రాసి దువ్వుకొని, తువ్వాల్ని భుజనా వేసుకొని ఉన్నాడు. సల్లాడంలోనూ, బట్టబనియన్‌లోనూ మార్పేమీ లేదు.
‘‘రండి ఓబులేసు గారూ! లోపలికి’’ అంటున్నాడు ఎలక్షన్ ఆఫీసరు.
అతడు గదిలోకి అడుగు పెట్టడం లేదు, సిగ్గు పడటం లేదు, అలాగని భయపడుతున్నాడని చెప్పడానికీ లేదు. ‘‘నేను బళ్లోకి రాగూడదు సారూ! అదీగాక అక్కడ మా అయ్య ఉండాడు ఎట్ల సారూ? నన్ను ఈడనే ఉణ్ణీయండ్రి’’ అన్నాడు.
‘‘చూడండి ఓబులేసు గారూ! మనది ప్రజాస్వామ్య దేశం. కులాలకీ, మతాలకీ అతీతంగా ఉండే లౌకిక రాజ్యం. పెద్దోళ్లూ చిన్నోళ్లూ అన్న తేడాలు ఉండనేకూడదు. తక్కువ కులాలని పైకి తేవాలనే ప్రభుత్వం ఇలా రిజర్వేషన్లని పెట్టింది. మీరు ఎన్నికయినారు, నా మాట విని రండి’’ ఆఫీసరు ఓ మినీ లెక్చరిచ్చాడు. చివరి వాక్యం తప్ప ఓబులేసుకు ఒక్క ముక్క కూడా అర్థమయివుండదు.
‘‘సర్పంచుగా గెలిచాక ప్రమాణ స్వీకారం చేయక తప్పదు పదండీ’’ అంటూ పోలింగు ఆఫీసర్లంతా చెప్పేటప్పటికి–
‘‘మా అయ్య ఎదురుంగ నేను కూసోవల్లా? నా వల్ల గాదు సామీ’’ అంటూ ఏడుపుమొహం పెట్టాడు ఓబులేసు.
‘‘మీరయినా చెప్పండి భీమప్ప గారూ’’ ఆఫీసరు నిస్సహాయంగా చూస్తూ అన్నాడు.
‘‘నేనేంది చెప్పేది. వాన్ని పట్టుకోని అండీ, గుండీ, గారూ, గీరూ అంటే ఇంటాడా ఆ నా కొడుకు. ఓబుళుగా! రావోయ్’’
భీమప్ప పలుకు వినబడేసరికి ఠక్కున లోపలికి వచ్చేశాడు ఓబులేసు.
‘‘ఆఫీసరు గారూ! నాదొక్కమాట. ఈ గది పెద్దదే కదా, చాపలూ కంబళ్లూ తెప్పిస్తానూ. కింద కూచుని ప్రమాణ స్వీకారం చేయించండి సరిపోతుంది. అందరికీ సరిపోయేటన్ని కుర్చీలు లేవు కదా’’ అన్నాడు భీమప్ప.
‘‘సారీ అండీ భీమప్ప గారూ! ప్రమాణ స్వీకారం చేయించడం నేల మీద కాదు. అది సాంప్రదాయం కూడా కాదు. మీరు ఏమనుకోకుండా ప్రేక్షకుల్లో కూచోండి’’ అంటూ భీమప్పకి చాప చూపించాడు ఆఫీసరు.
గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు గుడ్లు మిటకరిస్తూ ప్రేక్షకుల్లో కూలబడ్డాడు భీమప్ప.
ప్రమాణ స్వీకారం పూర్తయింది.
ఉపసర్పంచి ఎన్నిక కూడా పూర్తయింది.
జనం అంతా వెళ్లిపోయారు.
ఇక జరగాల్సిందల్లా ఓట్ల పెట్టెల్నీ, మెటీరియల్నీ తిరిగి లారీలోకి ఎక్కించి మేము బయల్దేరడమే. అక్కడే వచ్చింది చిక్కు. చావు కబురు చల్లగా చెప్పాడు లారీడ్రైవరు, చెడిపోయిందంటూ. అప్పటికే ఏడున్నర అవుతోంది. చీకటి ముసురుకుంది. మధ్యాహ్నం ఎప్పుడో తిన్న అన్నం ఎప్పుడో అరిగిపోయింది. మరో లారీ తేవడానికి పట్నానికి వెళ్లాలన్నా సాయంత్రం అయిదు తర్వాత ఆ ఊరికి బస్సు లేదాయె. ఆ రాత్రి భీమప్ప మమ్మల్ని భోజనానికి ఆహ్వానించలేదు.
రాత్రి పదిగంటలయింది. ఏదో మాటలు వినబడితే లేచి చూశాను. తలారి చుట్టూ గుమిగూడారు మా వాళ్లు.
‘‘భలే తన్నిరిలే సారూ! వానికి అట్లే జరగాల్సింది’’ అంటున్నాడు తలారి రాముడు.
‘‘ఎందుకు తన్నడం?’’
‘‘ఏంది సార్ అట్లంటావు? భీమప్ప అయ్యంటే ఏందనుకుంటివి? ఎంత పేరూ ఏం కత? అట్లా అయ్య ముందర కుర్చీలో కూచ్చుంటాడా వాడు?’’ అంటూ సాధారణమైన విషయంగా చెబుతున్నాడు తలారి.
నా మనసు చివుక్కుమంది.
చిలుకూరి దేవపుత్ర
చిలుకూరి దేవపుత్ర (24 ఏప్రిల్ 1952 – 18 అక్టోబర్ 2016) ‘ఊడల మర్రి’ కథకు సంక్షిప్త రూపం ఇది. పాతికేళ్ల క్రితం 1993లో ఆహ్వానం పత్రికలో అచ్చయింది. దేవపుత్ర అనంతపురంలో జన్మించారు. రచనల్లో దళిత జీవన చిత్రణ చేశారు. వంకర టింకర, ఆరు గ్లాసులు, ఏకాకి నౌక చప్పుడు, బందీ లాంటి సంపుటాలుగా ఆయన కథలు వెలువడ్డాయి. అద్దంలో చందమామ, పంచమం, కక్షశిల, చీకటిపూలు ఆయన నవలలు.
Comments
Please login to add a commentAdd a comment