జోరున వర్షం కురుస్తోంది.. ఆకాశానికి చిల్లు పడిందాన్నట్టుంది. దట్టంగా మేఘాలు అలుముకోవడంతో పగలే చీకటి ఆవరించింది. సాయంత్రం నాలుగింటికే అర్ధరాత్రిని తలపిస్తోంది. అచ్చం నా మనఃస్థితిలానే ఉంది వాతావరణం కూడా! ఆ వర్షానికి తడిచిన చీర.. కాళ్ళకడ్డం పడుతున్నా అలానే నడుస్తున్నాను. చినుకులు సూదంటు రాళ్ళలా గుచ్చుతున్నాయి. అవి నా మనసుకు తగులుతున్నాయి. రోడ్డుకి అడ్డంగా నడుస్తున్న నా ముందు, కార్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ‘ఏమ్మా.. చావాలనుకుంటున్నావా? పక్కనే సముద్రముంది, వెళ్ళి అందులో దూకు. మమ్మల్నెందుకు చంపుతావ్?’ విసుగ్గా అని వెళ్ళిపోయాడు.
కార్ డ్రైవర్ మాటలకి పక్కకు తిరిగి చూశాను. వర్షానికి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గమ్యం లేని నా నడకకు, అదే చివరి మజిలీ అనిపించిందా క్షణం. నా అడుగులు అటువైపు పడ్డాయి. వర్షంలో సముద్రాన్ని చూడాలనేది ఒకప్పటి నా కోరిక. ప్రళయకాల రుద్రుడిలా విరుచుకుపడుతున్న అలలు.. నన్నేం భయపెట్టడం లేదు. నిన్నటి వరకు చిన్న బొద్దింక కనబడినా భయపడే ఆ మహిత ఇప్పుడు లేదు. చేతిలో ఫోన్ రింగ్ అవుతుండటంతో తీసి చూశాను. 143వ కాల్ కట్ అయ్యి, మిస్డ్ కాల్‌గా మారిపోయింది.
∙∙
ఒకప్పుడు ఆ నంబరంటే విపరీతమైన క్రేజ్. ఆ నంబర్ వెనుకున్న శౌర్య అంటే ఇష్టం. శౌర్యతో జీవితం, ఇదిగో ఇక్కడే మొదలైంది. నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో కలసి చదువుకున్న క్లాస్‌మేట్. ఈ అనంతసాగరం ఒడ్డున ఫైనలియర్‌లో చుట్టూ స్నేహితుల సాక్షిగా.. మోకాళ్ళపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. అందరూ చెయ్యడం వేరు.. శౌర్య ప్రపోజ్ చెయ్యడం వేరు అనిపించింది నాకు. అందగాడు.. చదువుల బిడ్డ.. అమ్మాయిలు కోరుకునే లక్షణాలన్నీ శౌర్యలో పుష్కలంగా ఉన్నాయి. అలాంటి శౌర్య.. నాకు ప్రపోజ్ చెయ్యడమనేది నేను ఉహించనిది కావడంతో వెంటనే ఎగిరి గంతేసి కౌగిలించుకుని మరీ ఒప్పుకున్నాను.
ఆ తరువాత ఐస్‌క్రీమ్ పార్లర్ నుంచి బీచ్, కొత్త సినిమా ఇలా ప్రతిచోటా తిరిగి, ప్రేమికులుగా మా ముద్ర వేశాం. నాకు అందంగా కనిపించిన ప్రేమ.. నా తల్లిదండ్రులకు కనిపించలేదు. కులం నుంచి అంతస్తుల వరకు ఎత్తి చూపించారు. ఏడు తరాలు చూడాలన్నారు. అరే..మనిషి ఎదురుగా తన గుణం కనిపిస్తుంటే, కనబడని ఏడు తరాలు గురించి మీకెందుకన్నాను. వాళ్ళు మెట్టు దిగలేదు. నేను మాత్రం ఆ ఇంటి మెట్లు దిగి, శౌర్య భార్యగా మెట్టినింట అడుగుపెట్టాను తల్లిదండ్రులను వద్దనుకుని!
నేనంటే ఎంతో ప్రేమ చూపించే అత్తగారు, ప్రాణంలా చూసుకునే శౌర్య. నా అంత అదృష్టవంతురాలు లేదనుకున్నాను. నా ఆనందాన్ని కాలదన్నబోయిన తల్లిదండ్రులపై ద్వేషం పెంచుకుని, కనీసం ఫోనైనా చెయ్యలేదు. ఈనాడు శౌర్య కాకుండా నాకు మరో కుటుంబం, స్నేహం ఏదీ లేదు. నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నానేమో, ఇప్పుడిక కన్నీళ్ళు రావడం లేదు. మనిషికి ఎక్స్‌పైరీ డేట్ ముందే తెలిస్తే అది ఇంత బరువుగా ఉంటుందని నాకిప్పుడే తెలిసింది. అవును!! నేను చనిపోబోతున్నాను. నాకున్నది కొన్ని సంవత్సరాలు మాత్రమే.
ఎన్ని కోరికలు, ఆశలు, ఆశయాలుండేవో వాటన్నిటికీ తెర పడింది. ఇంత బాధను అనుభవిస్తూ పోయేకన్నా ఇప్పుడే పోతే? నా ఆలోచనలానే విశాలమైన సంద్రం, రెండు చేతులు చాచి.. ‘నా గర్భంలో నీకు చోటుంది మహితా’ అని చెబుతున్నట్టుంది. వర్షం తగ్గి, మనుషులు తిరగడం ఎప్పుడు మొదలుపెట్టారో గమనించలేదు. సాగర గర్భంలోకి వెళుతున్న నా చేతిని పట్టుకుందో చిట్టి చెయ్యి. బోడిగుండుతో ముద్దుగా, బుజ్జి వామనుడిలా ఉన్నాడు. కిందికి వంగి కళ్ళెగరేశాను. వర్షానికి తడవకుండా, తన చొక్కాలో దాచుకున్న డిబ్బీ తీసి చూపించాడు వాడు.
‘కల్పతరువు’ దాని మీద ఉన్న పేరు అదే! ‘అనాథాశ్రమమా?’ మాట జారి బాధపడ్డాను. బుజ్జి వామనుడు తలూపాడు. మెడలో వేలాడుతున్న మంగళ సూత్రాలతాడు తీసి, డిబ్బీలో వేసేశాను. వాడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. నవ్వి తల నిమిరాను. చేతికి కుట్లు తాలుకు గోతులు తగిలాయి. వామనుడ్ని వెనక్కి తిప్పి చూసి, ‘ఏంటివి?’ అడిగాను. ‘ఇంకొద్ది క్షణాల్లో చనిపోయే నీకెందుకు?’ అంటూ అంతరాత్మ ప్రశ్నించింది. ‘వాడికి బ్రెయిన్‌లో కణితి ఉందంట అక్కా! ఆపరేషన్ చేసి తీశారు. కానీ మళ్ళీ ఇంకొకటి వచ్చిందట. ఈసారి ఆపరేషన్ అనవసరమంటా’ అంది.. వాడి కూడా వచ్చిన అమ్మాయి వాడిని ఎత్తుకుని వెళుతూ. ఎక్స్‌పైరీ డేట్ మెడలో వేసుకుని కూడా నవ్వుతూ తిరుగుతున్న బుజ్జి వామనుడు.. తనవంకే చూస్తుండిపోయాను.
‘నిన్ను వ్యాన్ దిగొద్దని చెప్పాను కదా? ఈ సారి ఇలా చేశావంటే బయటకు తీసుకురాను చెబ్తున్నా’ అంది ఆ అమ్మాయి వాడిని బెదిరిస్తూ. బుజ్జి వామనుడు నవ్వుతున్నాడు. ఎక్స్‌పైరీ డేట్ పూర్తయ్యేవరకు కూడా నవ్వుతూ బతకచ్చని చెప్పిన వాడి పరిచయంతో నా గమ్యం మారింది.వాళ్ళ వెనకే వెళ్ళాను. వాళ్ళందరినీ జాగ్రత్తగా వ్యాన్ ఎక్కిస్తున్న వాలంటీర్ ‘ఏమ్మా, ఆశ్రమానికి వస్తావా?’ అడిగింది. ఆమెకది అలవాటనుకుంటా.. బహుశా విధివంచితలెందర్నో చూసిన అనుభవమయ్యుంటుంది. అప్రయత్నంగానే తలూపాను.
∙∙
వ్యాన్ పెద్ద ఆశ్రమంలోకడుగుపెట్టింది. కల్ప తరువు పేరు మెరుస్తోంది. ఊరికి దూరంగా, విశాలంగా ఉంది. చాలా బిల్డింగ్స్ తరువు శాఖల్లా విస్తరించాయి.‘పేరేంటమ్మా?’ నా కన్నా చిన్నదే రిసెప్షనిస్ట్.. ఆత్మీయంగా అడిగింది. నా పేరు చెప్పాను.ఒక గదిలోకి తీసుకెళ్ళి.. ‘ఇక్కడే కూర్చోండి! మేడమ్‌గారు వచ్చి మీతో మాట్లాడతారు’ అని వెళ్ళిపోయింది.
మళ్ళీ మొదలైన వర్షాన్ని, కిటికీలోంచి చూస్తున్నాను. నాలానే వర్షం కూడా ఆగి ఆగి తన బాధను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్టుంది. ‘నీ మజిలీ ఈ అనాథాశ్రమమా!’ అంతరాత్మ ప్రశ్నిస్తోంది.
‘హాయ్ మహితా! ఐయాం గౌరీ’ చక్కటి కాటన్ చీరలో పొందికగా ఉంది వచ్చినామె. నా కన్నా ఐదేళ్ళు పెద్దదేమో బహుశా! నా చూపులో నిర్లిప్తత చూసి.. నా పక్కకొచ్చి నుంచుంది గౌరీ.‘నేను.. నీలానే ఈ కల్పతరువుకి వచ్చాను. వర్షం చూస్తూ ఇదే గదిలో బెరుగ్గా, భయంగా నుంచున్నాను. ఇప్పుడిక్కడే పని చేస్తున్నాను. ఇక్కడ మనలా చాలా మంది ఉంటారు మహితా! అదిగో ఆ బ్లాక్‌లో అనాథపిల్లలు ఉంటారు.. దాంట్లో వృద్ధులు.. ఇదిగో ఇందులో మోసపోయిన ఆడవాళ్ళుంటారు. అందులోనేమో హెచ్‌ఐవీ బాధితులు ఉంటారు.’ఉలిక్కిపడ్డాను ఆమాటకు! ‘నువ్వు ఏ బ్లాక్‌లో ఉంటావ్ మహితా?’ మాట సౌమ్యంగా ఉన్నా..‘ నువ్వు ఏ జాతి పక్షివి’ అని నన్ను ప్రశ్నిస్తున్నట్టే ఉంది.
భయంగా చివర్లో చెప్పిన బ్లాక్ వైపు చూపించాను. ఓదార్పుగా నా చుట్టూ చెయ్యి వేసి ‘ఎప్పటినుంచి?’ అడిగింది గౌరీ. ‘నిన్నటి నుంచి’ నా ప్రమేయం లేకుండానే బుగ్గలను కన్నీళ్ళు తడిపాయి.‘చూడు మహితా.. నువ్వు బాధపడుతుంటే ఓదార్చగలను. కానీ పరిష్కారం చూపించలేను. జరిగింది చెప్పు. చెప్పలేనంటవా అదిగో అక్కడ చాలా మంది ఉన్నారు. నీలానే వాళ్ళకూ కథలున్నాయి. వెళ్ళు.. కలువు, మాట్లాడు. నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు సరేనా!’ అనునయించింది గౌరీ. తలూపాను కానీ వెళ్ళలేదు. ఏం చెప్పాలి? నాలాంటి కథ ఇంకొకరికి ఉంటుందా? ఈ లోకంలో నా అంత చెత్త కథ ఎవరికీ ఉండదేమో..!?
∙∙
మూడు వారాల ముందు ఆఫీసులో, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అందరిలానే నేనూ ఇచ్చాను. కానీ వచ్చిన రిజల్ట్స్ నన్ను షాక్ చేశాయి. ఆ విషయం శౌర్యకి ఎలా చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతూ, ఏడుపును దిగమింగుకుంటూ నాకసలు హెచ్‌ఐవీ ఎలా అంటుకుందో అర్థంకాక ప్రతీ సందర్భాన్ని గుర్తుచేసుకుంటుంటే.. రెండు నెలల క్రితం నేను బ్లడ్ డొనేట్ చెయ్యబోతే అడ్డుకున్న శౌర్య గుర్తొచ్చాడు.
‘ఆడవాళ్ళకు పీరియడ్స్ సమయంలోనే బోలెడంత బ్లడ్ పోతుంది. మళ్ళీ నువ్వేం ఇవ్వక్కర్లేదు’ అని అందరిముందు నుంచి నన్ను లాక్కొచ్చాడు. శౌర్యకి నా మీదున్న ప్రేమకి మురిసిపోయాను ఆ క్షణం. కాని సన్నగా మొదలైన అనుమానం.. నన్ను గదంతా వెతికేలా చేసింది. నా అనుమానం నిజమయ్యే సాక్ష్యాలు కనబడటంతో శౌర్య మీదకు విసిరికొట్టి అడిగాను అవేంటని!‘మహా.. సారీ మహా! కావాలని చేసిందికాదు’ కోపంగా మూసేసిన తలుపులు బాదుతూ, బతిమాలడం మొదలుపెట్టాడు.
‘నీకెప్పుడు తెలుసు శౌర్యా?’ ఇంకా ఎక్కడో మిణుకుమంటూ ఆశ.. కన్నీళ్ళను తుడుచుకుని, కిటికీ దగ్గరకొచ్చి అడిగాను.‘మన పెళ్ళికి రెండు రోజుల ముందు. కానీ, నేను తప్పు చెయ్యలేదు మహా! ఇదిగో ఈ టాటూ వలన వచ్చింది. ప్రామిస్! నా జీవితంలో ఉన్న అమ్మాయివి నువ్వొక్కదానివే. ప్లీజ్ మహా, తలుపు తీయ్యి’ కిటికీ దగ్గర నుంచుని అడిగాడు. మరి నన్నెలా పెళ్ళి చేసుకోవాలనిపించింది శౌర్యా? నిన్నట్నుంచి నేనెంత బాధపడుతున్నానో తెలుసా! నీకెక్కడ నా వలన వస్తుందో, ఇప్పటికే వచ్చిందో తెలియక.. నరకం అనుభవిస్తున్నాను.
నాకు హెచ్‌ఐవీ అని తెలిసినప్పటి నుంచి నాకన్నా నీకోసమే ఎక్కువ ఆలోచించాను. నన్నెలా మోసం చెయ్యాలనిపించిందిరా?’ ఏడుస్తూ చేరగిలపడ్డాను.‘చెప్పాలనే అనుకున్నాను మహా..! ధైర్యం సరిపోలేదు. అప్పటికే నువ్వు నా కోసం ఇంటి నుంచి వచ్చేశావ్. నిన్ను వదిలి నేనుండలేను. అందుకే పెళ్ళి చేసుకున్నాను. కానీ నీకు గుర్తుందా మహా..! రెండు నెలల వరకు నిన్ను కనీసం ముట్టుకోలేదు. ఆ తరువాత డాక్టర్‌ని అడిగి సేఫ్టీ వాడాను. కానీ నా దురదృష్టం.. నీకు వచ్చేసింది’ తల బాదుకుని ఏడుస్తూ చెప్పాడు శౌర్య.
ఎంత సులువుగా చెప్పేశాడో..!?
నిన్నటి నుంచి ఎన్నో ఆలోచనలు! శౌర్యకి టెస్ట్ చేయించి నెగెటివ్ వస్తే.. ఇక అతని జీవితంలో నుంచి తప్పుకోవాలనుకున్నాను. ఆ నిర్ణయం ఎంత బాధ కలిగించినా సరే.. పాజిటివ్ మాత్రం రాకూడదని ఎంతమంది దేవుళ్ళను మొక్కుకున్నాను!? ఇదే మాటా పెళ్ళికి ముందు చెప్పినా నేను ఒప్పుకునేదాన్ని. శౌర్య అంటే నాకంత ఇష్టం. ‘మోసం చేశావ్ శౌర్యా.. దారుణంగా మోసం చేశావ్!’ గోడకానుకుని ఏడుస్తుండగా.. అత్తయ్య వచ్చినట్టుంది. శౌర్య ఏవేవో చెబుతున్నాడు కానీ నాకేం వినిపించడం లేదు. సగం సగం మాటలు.. ఏవో చెబుతుంటే.. అనుమానంగా తలుపు దగ్గర నుంచి విన్నాను. పలుచటి మంచు పొర కరిగిపోయింది.
అత్తయ్య కిటికీ దగ్గరకు వచ్చి ‘అమ్మా మహితా! వాడి మాటలు విను. నిన్ను మోసం చెయ్యాలని కాదు, నిన్ను వదులుకుని బతకలేక అలా చేశాడు.’ శౌర్య కన్నా ఆవిడ మాటలే నాకెక్కువ గుచ్చుకున్నాయి. ఆమెకూ ముందే తెలుసు. ఎంత మోసం! ‘హు..! నేను కోడల్ని కదా?’ చాలా నిస్పృహగా ఉంది. ఇక అక్కడ ఉండబుద్ధవ్వలేదు. బట్టలు, సర్టిఫికెట్స్ అన్నీ సర్దుకుని వెనుక గుమ్మం తలుపు తీసుకుని.. బయటకొచ్చేశాను. ‘మహితక్క అంటే నువ్వేనా?’ చిన్న పాప వచ్చి అడిగింది.
తలూపాను. ‘గౌరీ అక్క నిన్ను మా దగ్గరికి తీసుకెళ్ళమంది. దా.. బ్యాగ్ ఎక్కడుంది?’ చెయ్యి పట్టుకుని లాక్కెళుతూ అడిగింది. ఆ అమ్మాయి వెనుకే అప్రయత్నంగా కదిలాను. చిన్న గది, మూడు మంచాలున్నాయి ఆ గదిలో. ‘అదేమో నాది, ఇదేమో మా తమ్ముడిది. నువ్వు ఈ మంచం తీసుకో!’ ముద్దుగా పంపకాల లెక్కలు చెప్పింది పాప. అవేం పట్టనట్టు పరధ్యానంగా నాకు చూపించిన మంచంపై వాలాను. మనుషుల్ని ఎలా మోసం చేస్తారు? అంత సులువుగా ఎలా మోసపోయాను? ‘నువ్వు నీ తల్లిదండ్రులను చేసింది మోసం కాదా?’ అంతరాత్మ ప్రశ్నించింది. ప్రేమంటేనే మోసమా? సమాధానం లేని ప్రశ్న.
ఒక్క రోజులో మారిపోయిన నా జీవితం.. నాకే విచిత్రంగా అనిపిస్తోంది. మర్నాడు యోగా హాల్ అని.. అక్కడకు తీసుకెళ్ళింది పాప. అందరూ ఆసనాలు వేస్తున్నారు. నేను బయటికొచ్చి బెంచ్‌పై కూర్చున్నాను. మొహం మీద సూర్య కిరణాలు పడుతున్నాయి. ‘హాయ్ ఐయాం కిరణ్’ నా మీద కాస్తా పెద్దవాడేమో.. నవ్వుతూ చెయ్యిచ్చాడు.‘మహిత’ దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ చెప్పాను. కవలలు.. ముద్దుగా ఉన్నారు. ‘వాళ్ళకి అమ్మ, నాన్న లేరా?’ కిరణ్‌ని అడిగాను.
‘ఇద్దరూ చదువుకుని జాబ్ చేస్తున్న వాళ్ళే. డెలివరీ టైమ్‌లో హెచ్‌ఐవీ అని తెలిసింది. ఆమె ఆ దిగులుతో చనిపోతే, అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు.’‘అంటే ఆ పసిపిల్లలకు..?’ లేదని చెప్పాలి అని మనసులోనే వేడుకుంటూ అడిగాను. ‘ఇంచుమించు ఇక్కడున్న ప్రతి పిల్లలవీ ఇలాంటి కథలే మహితా! వాళ్ళకు ఏ మాత్రం సంబంధం లేకుండానే చావును మోస్తూ తిరుగుతున్నారు. కొందరిది అమాయకత్వం, కొందరిది మూర్ఖత్వం. ఇంకొందరు డబ్బు కోసం ఒళ్ళమ్ముకుని ఇప్పుడు ఆ దారి కూడా లేక వీథిపాలైన వాళ్ళు. విచిత్రం ఏమిటంటే చదువుకోని వాళ్ళ కన్నా చదువుకుని మోసపోయిన వాళ్ళే ఎక్కువిక్కడ’ అన్నాడు.
‘నువ్వెందుకున్నావ్ కిరణ్?’ ఆ చిన్న పరిచయం ఇచ్చిన చనువుతో ఏకవచనంలోనే ప్రశ్నించాను. ‘మీరా.. తన పేరు! ప్రేమించుకున్నాం. ఒక మైకంలో హద్దులు దాటాం. తనకి నేనే అంటించానని నా మీద తోసేసి పారిపోయింది. తల్లిదండ్రులు అసహ్యించుకున్నారు. ఇంతమంది వద్దనుకున్న బతుకు నాకు మాత్రం ఎందుకనిపించింది. హెచ్‌ఐవీ అనేది జస్ట్ ఒక చిన్న ఇన్ఫెక్షన్ అంతే మహిత. మందులు వాడితే కొన్ని ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గిపోతాయి, కొన్నింటికి సమయం పడుతుంది. దీని వ్యవధి మాత్రం జీవితకాలం అంతే! మన కోరికలు, ఆశలు ఏవీ నాశనమయిపోవు. హ్యాపీగా మన లైఫ్ మనం లీడ్ చెయ్యొచ్చు. ఇదే నేను తెలుసుకున్నాను. చాలామందికి ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నాను’ అన్నాడు కిరణ్.
కిరణ్ సమాధానం.. నిన్నటి నుంచి భయపడుతున్న నా ప్రశ్నలన్నింటికీ సమాధానమైంది. ఇంచుమించు ఇద్దరం ఒకే సిట్యుయేషన్‌లో ఉన్నామనిపించింది. ‘మీరా మోసం నీకు బాధ కలిగించలేదా?’ అడిగి.. కిరణ్ జవాబు కోసం ఎదురుచూడసాగాను. ‘పుట్టుకతోనే ఎవరూ మోసగాళ్ళు కాదు. పరిస్థితుల దృష్ట్యా కొన్ని జరిగాకనే.. వారు లోకం ముందు మొసగాళ్ళలా నుంచుంటారు’ అంటూ లేచి నిలబడి చేతులు విశాలంగా చాపి ఆ బిల్డింగ్ ఆవరణను చూపిస్తూ ‘మీరా మోసం విలువ ఈ ఫాండేషన్’ అని చెప్పి.. ‘ఐయాం వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ కల్పతరువు.. వెల్కమ్ మహితా!’ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు కర్తవ్య బోధచేస్తున్నట్టుగా అనిపించింది. 420వసారి మోగుతున్న ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి కిరణ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చాను.
-నార్కిడిమిల్లి జ్యోతి శ్రీ
(చదవండి: వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువా!)
Comments
Please login to add a commentAdd a comment