రాజుగోరుల వేట వైభవం | One Of The Best Story Of Pusapati Krishnam Raju | Sakshi
Sakshi News home page

రాజుగోరుల వేట వైభవం

Published Mon, Apr 27 2020 12:03 AM | Last Updated on Mon, Apr 27 2020 12:03 AM

One Of The Best Story Of Pusapati Krishnam Raju - Sakshi

అడవి పందిని పొడుచుకొచ్చేరు. యింకా సూర్యు డుదయించనే లేదు. చావిడి ముందు నీలాటి రేవుకి వెళ్లే పడతులంతా వలయం కట్టి నిలుచున్నారు. పాలికాపులంతా పొలాలకు పోతూ పోతూ తొంగి చూసి మరీ వెళుతున్నారు. చావిడి అరుగుల మీద చినరాజులంతా చతికిలబడి కూర్చున్నారు. రాట్లకూ స్తంభాలకూ వేటకుక్కల్ని కట్టేరు. గోడలకు చేరబెట్టిన యీటెలు తళతళా మెరిసిపోతున్నాయి. వాళ్ల ప్రతాపాలూ కబుర్లు వీరోచిత గాథల్లో జయలక్ష్మిని చేపట్టి వచ్చిన సైనికుల సంభాషణల్ని స్ఫురింప చేస్తున్నాయి.

‘‘ఓలమ్మా! ఎంత బలిసిందే; దాని జిమ్మడా; గరువు మీద ఏరు చనగ చేనంతా దా నెదాన్నెట్టుకుందె’’ అంది బంగారి నోటిలో పందోము పుడక తీసి తుబుక్కున వుమ్ముతూ.
‘‘పెదరాజుగోరు అడివి కెల్లినప్పు డింతకి నాలుగింత లుంటాదె, కోరలు కూడా వొచ్చినయ్యె. పందెప్పుడు దివానానికి వొచ్చినా అయ్యగోరు తోళ్లు పులుసూ కూడా యెట్టీవోరు, ఎంత కమ్మగుండే దనుకున్నావు; మల్లీ జనమలో ఆనాటిది రుసి సూడ్నేదనుకో’’ అంది ముసలి మంగి నోరు చప్పరిస్తూ.

కాసా మంగి వయస్సు మళ్లింది. మనువుకి వెళ్లక పూర్వం ముందు రాజుగారి దివాణంలో అంట్లు తోమేది. వయస్సులో ఉండగానే దివాణం గోడలు జారిపోవడం రాజులు సత్తా సన్నగిల్లడమూను. అప్పటి రాజులు అరుగులు దిగేవారా? యిప్పుడీ చినరాజులు ఎక్కడ చూసినావారె. జారిన గోడల మీద తాటికమ్మతో నిలబెట్టిన కొంజాను చావిడని అంటారు గాని ఆనాటి దివాన్‌ ఖానాకీ దీనికీ పోలికే లేదు.

పదేళ్ల కిందట ఊరు కాలిపోయినప్పుడు సకం సకం కాలి మొరడులా వున్నదాన్ని సింహద్వారమనీ, చావిడి ముందు భాగాన్ని బొంకులు దిబ్బ అనీ, అనుకోవడం లాంఛనప్రాయంగా మిగిలేయి గాని, వాటి స్వరూపమే మారిపోయింది. ఆ తరంలో మిగిలినవారల్లా ఎనభై ఏళ్లు దాటిన రాంభద్రరాజు గారు మాత్రం కనుపిస్తున్నారు. 
ఈ ముసలిరాజు పూనుకుని తుప్పుపట్టిన యీటెలను దులిపించి చినరాజుల నందర్నీ తలోకుక్కని మేపమని, సరంజాం అంతా కూర్చి తరివీజు యిస్తున్నారు. వేట మొదలుపెట్టి ఆరు మాసాలయినా పంది పట్టుబడ్డం యిదే ప్రథమం.

‘‘అదేందె. చూత్తందోలమ్మా! నాకు బయ్యమె. నాను సూడనే నమ్మో’’ అంది, అప్పుడే వచ్చిన ఎంకి, బిందె వయ్యారంగా నడుం మీద తిప్పుతూ.
‘‘ఏటో లొగలాడె, చింగినాదం గాని. చచ్చి వొల్లక తొంగున్న పంది దీనికోసం కన్ను తిప్పిందట’’ అంది సీతాలు విసురుగా.
ఎంకిని చూస్తే తక్కిన ఆడవాళ్లకందరికీ ఏదో అనాలనే వుంటుంది. మంచి యీడులో వుంది. పెద్ద సవరంతో తాటికాయంత కొప్పు ముడివేసి వీధిలో నడిచి వెళుతూవుంటే, చినరాజులంతా వాళ్ల హృదయాల మీద హంసలు నాట్యం చేస్తున్నట్టు మధనపడతారు.
‘‘నా వూసెత్తొద్దంటే సిగ్గేటి’’ అంటూ రేవుకి వెళిపోయింది ఎంకి.

రాంభద్ర రాజుగార్ని అంతా పెదరాజు గారని పిలుస్తారు. దివాణం పడిపోయినా కాలూ చెయ్యీ వొంగినా మీసాలు దువ్వడం, చేపాటి కర్ర వూపడం రాజుగార్ని వదల్లేదు. వెంకడు యీ కబురా కబురూ చెప్పి పెదరాజుగార్ని స్వయంగా తీసుకొస్తున్నాడు. ఆయన కుర్రతనంలో వేటలో ఆరితేరిన చెయ్యి. లేడిని మెప్పించి పరుగెత్తేవారట. చినరాజు లందరికీ భీష్ముడు. రాజుగారిని చూసి వేటకుక్కలన్నీ తోక లాడించాయి. చినరాజులంతా లేచి నిలుచుని గౌరవం వెల్లడించేరు.
‘‘ఏ పొలంలో దూపు డయింది జగన్నాథం?’’ అడిగారు రాజుగారు. జగన్నాథం చినరాజులందరికీ వేటలో సైన్యాధిపతి. ఆయన దగ్గర రెండు కూనలున్నాయి. అందులో ఒకటి గాలి కూన. ఆ కూన పందిజాడ ఏ వైపునుండి వస్తున్నదీ పసిగట్టి తక్కిన కుక్కల్నీ వేటగాళ్లనీ ఆ వైపుకి నడిపిస్తుంది.

‘‘ఎర్రవాని గరువు మీద కూనల్ని విడిచిపెట్టాం బావాజీ’’ జగన్నాథం మనివి చేసేరు.
‘‘బొత్తిగా వరిగలా అవుపిస్తుంది బాబూ!’’ రాజుగారు చేపాటికర్ర బుజాల మీద వేసుకుంటూ అడిగేరు.
‘‘తొగరలో వుండి గిడసదేరిపోయింది. తొగ నిరుటి తొగయి కూడా వుంటది తాతయ్యా’’ సమాధానం చెప్పేడు తాతమ్మ.
‘‘వెళ్లిన గంటకే కూన గాల్లాగింది. అందరం కూనల్ని వెడిచిపెట్టాం. గరువుదాటి బంద అరగడిలోకి దిగుతుంది కుక్క లడ్డాయి. శంకరం యీటె చేసాడు’’ జగన్నాథం మనవి చేసేరు.

‘‘యిదేదో అంత బాగా ఆనడం లేదు జగన్నాథం’’ సందేహించేరు పెదరాజు.
‘‘ఒంటిపంది క్షణంలో తప్పుకుంది, లేకపోతే యీపాటికి తమరు బండి తోలించుకు అడివికి రావలసిందే’’ అన్నాడు సుదర్శనం.
‘‘వీడి కోతలకేం లెద్దు తాతయ్యా; గెడ్డలో చతికిలబడి కూర్చున్నాడు. ఏమిటోయ్‌! యిక్కడున్నావని అడుగుతే ‘ఒంటిపంది నడ్డుకుని యిటొచ్చాను. ఆ బలుసుదుబ్బ చాటుని మాదేసుక్కూర్చుంది. మాట్లాడకు పుటాయించి పోద్ది’ అంటాడు. తీరా చూస్తే అక్కడ పందీ లేదు, వాడి బొందా లేదు’’అన్నాడు తాతమ్మ.
‘‘అవునమ్మా, పంది మిమ్మల్ని పొడవమని అక్కడ కూర్చుంటుందా? క్షణంలో ములుగు ములుగు పోద్ది. పంది ముందయితే అడ్డడం ఫాలాక్షుని తరం కాదు’’ అన్నారు అనుభవజ్ఞులు రాజుగారు.

‘‘మీరు నా మాట నమ్మరు ఏం చేద్దునూ’’అన్నాడు సుదర్శనం.
‘‘కాళ్లు కురసగా వున్నాయోయ్‌’’ అన్నారు రాజుగారే మళ్లీ ముభావంగా.
‘‘అయినా విపరీతమైన బలువు వుంది తాతయ్యా! నలుగురం పాతచేరీ వరకూ మొయ్యలేక గూళ్లు పులిసిపోయినాయి’’ అన్నాడు శంకరం.
‘‘ఏదో అయింది. మంగలి తవిటియ్యకీ పారుసాయీబుకీ వర్తమానం పంపేరా?’’ అంటూ లోగిట్లోకి దయచేసేరు పెదరాజుగారు.
‘‘ఇంక ఆలస్యం ఎందుకూ, పట్టండి నలుగురూ, చావిట్లో వేద్దాం’’ అన్నారు జగన్నాథం.
‘‘శంకరం! తాటికమ్మలు కోసుకు రావద్దటోయ్‌’’ అడిగేడు తాతమ్మ.
‘‘సుదర్శనం వాళ్ల పాలికాపుని పంపించాడు’’ అన్నాడు శంకరం.

‘‘నేనూ వెళ్లనా ముంగాల కమ్మలికి?’’ అడిగేడు బంగార్రాజుగారి అబ్బాయి నిక్కరు మీదకు లాక్కుంటూను.
‘‘వొద్దు. అరుగుమీద చాపలు తీసి వరండాలో వెయ్యమ్మా’’ అన్నారు జగన్నాథం. బంగార్రాజు కుమారుడు తారాజువ్వలా పరుగెత్తేడు.
మంగలి తవిటియ్యా, పీరుసాయీబూ చూరకత్తులు జిగజిగా మెరిసేలా పదును పెట్టుకుని వచ్చేరు. సుదర్శనం, తాతమ్మ, బంగారం, మంగలి తవిటియ్యా పందిని తెచ్చి అమాంతం చావిడి వెకన వసారాలో చాపల మీద దించారు. పావుగంటలో పందిని ముక్కలు ముక్కలుగా తరిగేరు. చకచకా దుమ్ముల నన్నిటినీ తాతమ్మ విడమర్చీసేడు.
‘‘డాక్టరు గారికి ఒక వాటా పంపించండోయ్‌’’ అనుకుంటూ పెదరాజుగారు స్నానం చేసి యిస్తిరీ పంచె కట్టుకుని చావిట్లోకి వచ్చేరు.
సాయీబు చాపమీద చిన్న వాటాలు వేసేడు. తవిటియ్య వాటాలూ తాటికమ్మల్లో అందంగా ముంగాలు కట్టేడు. ఊళ్లో రాజులంతా తలా వాటా పట్టుకుపోయేరు. ఒక గంటకి పూర్వం పెద్ద కమేలా వలే వున్న చావిడి మళ్లా యధాస్థాయికి వచ్చింది.

రాజులంతా వేటపంది మాంసము సుష్టుగా భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. మధ్యాహ్నం నాలుగు దాటింది. ఒక్కొక్కరే వచ్చి చావిట్లో ఆసీనులవుతున్నారు. పెదరాజుగారి పాలికాపు వెంకడు, మరో ఇద్దరు కూడా వచ్చేరు. అందులో ఒకడు పెదరాజు గారికి నమస్కరించేడు.
‘‘కొండకాడ గొల్లపాలెం బావూ’’ వెంకడు చెప్పేడు.
‘‘నాను బావూ చంద్రాయిని. ఏలినవోరు మరిసిపోనారు గానె, నాను తవరేట కొచ్చినొప్పుడు తాటికాయా, మట్టాకొట్టి మకాంనో కొట్టుకొచ్చీ వోడ్ని’’ అన్నాడు.
‘‘నువ్వు చెంద్రిగాడవటరా! మీ బాబు అప్పిగాడు కులాసాగా వున్నాడా?’’ అన్నారు రాజుగారు పోల్చుకుని.
‘‘నేదు బావూ, మూనేడు శనక్కాయల రోజుల్లో కాలం చేసినాడు’’ అన్నాడు విచారంగా.
‘‘అవు నెప్పటివాడు, నాకంటే పెద్దవాడు.’’

‘‘ఏలినవారు కరునించాల బావూ. పొరపాటు జరిగిపోనాది. దివానం రేతిరి సిన్రాజులంతా వొచ్చి నా కొంపదీసినారు’’ అన్నాడు చంద్రాయ.
‘‘మేం నిన్నేం చేశామురా?’’ అడిగేరు జగన్నాథం.
‘‘మా తమ్ముడు చరదా పడితేనె నిరుడీ రోజుల్లో పందుల్లోకాడ జిగిని పందికూన నుచ్చుకున్నాను. రేత్తిరి గూటికి రానేదు. సిన్రాజులంతా బేపిల్నీ ఎంటేసుకొచ్చె గరువుకాడ సిక్కడ్డ కూన్నె పొడుసుకొచ్చినారంట. మూనాల కిందట చాకలోల్లొచ్చె డెభై రూపాయలిత్తానంటే యిచ్చేండు కాడు మావోడు. ఏలినవోరు కటాచ్చించాల’’ అన్నాడు గుడ్లలో నీరు నింపుకుని.
‘‘మేము అడవి పందిని పొడుచుకొస్తే మీ పంది అని వేషాలు వేసుకొస్తారా?’’ అంటూ శంకరం లేచేడు.
నీలాటి రేవుకి వచ్చే జనం నిలుచున్నారు. పశువులన్నీ దొడ్లకు తిరిగివస్తున్నాయి.
రాజుగారు మెల్లగా అరుగు దిగొచ్చేరు. చంద్రాయిని చెయ్యి పట్టుకుని లేవనెత్తి లోవిట్లోకి తీసికెళ్లి ఏబై రూపాయలు చేతికిచ్చి పొమ్మన్నారు. చినరాజులంతా కిక్కురుమనలేదు.
‘‘ఛీ! వెధవలు, వేటా లేదు పాటా లేదు. రాచ పుట్టుక పుట్టి ఊరపందిని తిన్నారు’’ అనుకుంటూ రాజుగారు కోనేటివైపు వెళిపోయారు. పది నిమిషాల్లో ఒకరితో ఒకరు చెప్పకుండా చావిడంతా కాళీ చేసేరు.

‘‘కాళ్లు కురసగా వున్నాయోయ్‌’’ అన్నారు రాజుగారే మళ్లీ ముభావంగా. ‘‘అయినా విపరీతమైన బలువు వుంది తాతయ్యా! నలుగురం పాతచేరీ వరకూ మొయ్యలేక గూళ్లు పులిసిపోయినాయి’’ అన్నాడు శంకరం.

పూసపాటి కృష్ణంరాజు (1928–1994) కథ దివాణం సేరీ వేటకు సంక్షిప్త రూపం ఇది. ప్రచురణ కాలం: 1955. ఆయన సుమారు పదిహేను కథలు రాశారు. ఇది మొదటిదీ, బాగా పేరొచ్చినదీ. రాజుల గతకాలపు వైభవాన్ని నవ్విస్తూ, వెక్కిరిస్తూ, బాధపడుతూ చెప్పిన కథ. రెండు బంట్లు పోయాయి, సీతాలు జడుపడ్డది ఆయన కథల్లో కొన్ని. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement