వరద కాలం, కవన కుతూహలం అనేవి అబ్బూరి రాజేశ్వరరావు గారి సాహితీ కాలమ్స్. అబ్బూరి గారి నడకతో, శైలితో దీటుగా నడిచిన తెలుగు సాహితీ కబుర్ల రస గుళికలు అత్యంత పరమ అరుదు. సాహిత్య విస్తరి ముందు కూచున్న వారి భోజనం అబ్బూరి కాలమ్స్ చదవకుండా ఎప్పటికీ పూర్తి కానే కాదు.
అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం” నుండి చిన్న ముక్క.
వెంకటశాస్త్రి గారంటే శ్రీశ్రీకి అపార గౌరవభక్తులుండేవి. శాస్త్రి గారితో పరిచయమయిన తరువాత శ్రీశ్రీ కొంచెం తడబడుతూ “కవిత్వం మీద తమ అభిప్రాయమేఁవి” టన్నాడు. అప్పటికే వయోవృద్ధులూ, అస్వస్థులూ అయిన శాస్త్రిగారు మందహాసం చేసి “నేను కవి నేనా?” అని అడిగారు. తనలా అడగటంతో ఏమన్నా పొరబాటు చేశానా అని సందేహిస్తూ “మీరు కాకపోతే ఈ ఆంధ్రదేశంలో మరెవ్వరండీ కవి?” అన్నాడు శ్రీశ్రీ గట్టిగా. శాస్త్రిగారు నవ్వారు.
“కవిత్వం అంటే ఏదికాదో చెప్పటం సులభం కానీ, ఏది కవిత్వమో చెప్పటం కష్టం… మన కవిత్వానికి లక్షణం కంఠవశం కాగల రచన. మననం చేసుకోవటానికి అనువయిన పద సంచయనం చెయ్యాలి. కర్ణపేయంగా ఉండాలి. రసనాగ్ర నర్తకి! అంతవరకూ నేను సాధించాను”. శాస్త్రి గారు తనలో తాను నవ్వుకుంటూ పడకకుర్చీ మీద వెనక్కి తలపెట్టారు. ఆకస్మాత్తుగా ముందుకు వంగి “అయితే అంతమాత్త్రాన అది కవిత్వం అయిపోదు…” శాస్త్రిగారెవర్నో లోపలినుంచి పిలిచారు. మేము లేచాం.
శ్రీశ్రీని చూస్తూ శాస్త్రి గారన్నారు. -“నువ్వు చెప్పు కవిత్వం అంటే ఏఁవిటో… అంత సులభఁవటయ్యా? అసలు నిర్ణయించేవారే లేరే ఈ దేశంలో. నీకు నేనూ నాకు నువ్వూ తప్ప…అంచేతనే కాబోలు మనం అనువాదాలూ, అనుసరణలతో ప్రారంభించాం… పోయిరండి” అన్నారు.
-అన్వర్ సాక్షి
Comments
Please login to add a commentAdd a comment