చిలుకూరి దేవపుత్ర
నివాళి
చాలామంది మాతృభాష మీద ప్రేమను ఒక పక్క వెళ్లబోసుకుంటూ, ఇంకొక పక్క తమ పిల్లలని ఇంగ్లీష్ చదువులు చదివించుకుంటున్న సందర్భంలో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించి తన పిల్లలను తెలుగు బడుల్లోనే చదివించిన ఆచరణవాది దేవపుత్ర.
సమాధుల తోటలో ఓ పువ్వు పూసింది. ఆ పువ్వు పేరు చిలుకూరి దేవపుత్ర. నా నల్లని చందమామ చిలుకూరి దేవపుత్ర. ఆయనకు నివాళులర్పిస్తున్న బండి నారాయణస్వామి అనే ఈ కథకుడికి గురువు దేవపుత్ర. నా గురువుగారిప్పుడు లేరు. ఈ నేల మీద లేకపోవచ్చు. కానీ, జీవితమంతా నేల గురించే కథలు రాసినవాడు కదా నా దేవపుత్ర.
అద్దంలో చందమామ(దళితుడు రాసిన తొలి దళిత నవల), పంచమం, కక్షశిల, చీకటిపూలు దేవపుత్ర రాసిన దళిత బహుజన నవలలు. దాదాపు 100 కథలు రాసినాడు. అవి ‘వంకర టింకర’, ‘ఆరు గ్లాసులు’, ‘ఏకాకి నౌక చప్పుడు’, ‘బందీ’ లాంటి సంకలనాలుగా వెలువడినాయి. ఈ కథల్లో దళిత బహుజన కథలున్నాయి, రాయలసీమ ప్రాదేశిక కథలున్నాయి, మధ్య తరగతి కథలున్నాయి, హాస్య కథలూ ఉన్నాయి. ఈ నాలుగు రకాల కథలూ చాలా ప్రతిభావంతంగా రాసినవాడు నా దేవపుత్ర.
ఆయన మరణంలోనూ విషాదంతోపాటు ఒక సంతోషం కూడా వున్నది.
దేవపుత్ర పొద్దున్నే మామూలుగా ఆరుగంటలకు లేచినాడు, వాకింగ్‌కు పోయినాడు, స్నేహితుడింటికి పోయి కాఫీ తాగినాడు. ఇంటికి వచ్చి భార్యతో నాలుగు మాటలు మాట్లాడి కుప్పకూలిపోయినాడు. ఆమె భయంతో అరిచింది. ఆయన్ను బతికించడానికి ఛాతీపై ఒత్తిడి చేస్తుంటే, నిద్రలోంచి లేచి కూచున్నట్టుగా లేచి, అప్పుడేమన్నాడో తెలుసా? ‘‘నేను నిద్ర పోతున్నాను, నాకు అందమైన కలలు వస్తున్నాయి. ప్లీజ్ పాడు చేయవద్దండి నా కలల్ని’’. ఇదీ నా దేవపుత్ర ప్రయాణం.
అది 1975వ సంవత్సరం. అనంతపురానికి అష్టావధానాల ఫ్యూడల్ కళ తప్ప, ఆధునిక వచన కవిత్వం గుర్తింపులేని సందర్భం. అప్పటిలో కుందుర్తి గారు వచన కవిత్వానికి పీరు ఎత్తేవాడు. ఆ సందర్భంలో అనంతపురం బ్రాహ్మణ పండితులు ఆధునిక వచన కవిత్వాన్ని ఎద్దేవా చేసేవారు. ఎట్లంటే- ‘‘అదిగదిగో బుడ్డి, వెలుగుచున్నది బుడ్డి’’ అని. ఈ క్రమంలో పాండిత్య గంధం లేని శూద్ర యువకులందరు కూడానూ ఏకమైనారు. ఈ యువ రచయితల్లోనే అప్పటికే సామాజిక పరంగా, సాహిత్య పరంగా, వామపక్ష భావజాలాల సూత్రంతోనే అనంతపురం యువ రచయితల పద్య ప్రక్రియ మారింది. సామాజిక దృష్టి కూడా మారింది.
ఈ క్రమంలోనే పరిచయమైన మిత్రుడు చిలుకూరి దేవపుత్ర. ఈ క్రమమంతా జరిగిన పదియేండ్ల తర్వాత, నా మిత్రుడు నాకు గురువు అవుతాడని అనుకోలేదు. ఎందుకంటే, అవధాన సాహిత్యాన్ని చీల్చి చెండాడుతున్న సమయంలో దేవపుత్ర అప్పటికే మాకంటే ప్రోగ్రెసివ్. ఆయన మొదటి కథని రంగనాయకమ్మ అప్పటికే అచ్చువేసింది. అప్పటికి మేము ఆధునికమైన వచన కవిత్వంలోనే కాల్పనిక కవిత్వాలు రాసుకునేవాళ్లం. ఇంతకుముందు చెప్పినట్టుగానే పదియేండ్లలో కవులు, ఒకానొక రాయలసీమ నిష్ఠుర పరిస్థితుల్లో ఆకాశం నుంచీ భూమ్మీదకు రాక తప్పలేదు. కవిత్వం నుంచీ వాస్తవికమైన కథకూ రాక తప్పలేదు. అప్పటికే దేవపుత్ర, ఆధునిక వచన సాహిత్యంలో కథలు రాసీ రాసీ, వివిధ పత్రికలతో యుద్ధం చేస్తూ విఫలమవుతూ వున్నవాడు. పట్టువదలని విక్రమార్కుడి మాదిరి, చెట్టు వదలని బేతాళుడి మాదిరి... విక్రమార్కుడు జయించాడో లేదో కాశీ మజిలీ కథలకే తెలియవలె కానీ, దేవపుత్ర కథలని పత్రికలవాళ్లు వేసుకోక తప్పింది కాదూ, బహుమతులివ్వకా తప్పింది కాదు. దేవపుత్ర ఇంతగా రెక్కలలో ఈకలు మొలిపించుకుని, బలిపించుకుని ఎదుగుతూవున్న క్రమంలో బండి నారాయణస్వామి వంటి కవులు ఎక్కడున్నారు? నిజానికి, అనంతపురం ప్రాంతీయ అస్తిత్వ ధోరణిని మొదట ప్రెజెంట్ చేసిన పెద్దమనుషులు గుత్తి రామకృష్ణ, సింగమనేని నారాయణగార్లు అయిప్పటికిన్నూ, ఒక మిత్రుడు అదే వయసు గల ఇంకొక మిత్రుడికి గురువుగా మారే సంఘటన ఈ రచయితకే సంభవించింది.
నేను అప్పుడు అనంతపురానికి 75 కిలోమీటర్ల బయట బ్రహ్మసముద్రంలో ఒక అయ్యవారిగా వున్నా. నా దేవపుత్ర నాకు 16 కిలోమీటర్ల దూరంలోని రాయదుర్గంలో వున్నాడు కదా అని, ఆయనతో ఒకపూట గడపవచ్చులే అని పోయినా. అప్పటికి సెల్‌ఫోన్లు లేవు. ఆయనకు చెప్పాపెట్టకుండా ఆయనింటికి పోవడం అభ్యాగతినే. ఆయన రూములోకి అడుగు పెడితే, ఆయన తెల్లకాగితాలకు మూర్తిమంతమిచ్చిన ఒక సందర్భం నాకు కనపడింది. అప్పుడు ఈ రొమాంటిక్ ఫెల్లో బండి నారాయణస్వామి, ఆయన రూపమిచ్చిన తెల్లకాగితాలు చదివి మూర్ఛపోవడమొకటే తక్కువ. వెంటనే, ఐ! దేవపుత్రా, ఇట్లాంటి కథలు నేనూ రాయవచ్చు కదా!! అంటే, దేవపుత్ర నల్లని మొఖంలోంచి తెల్లగా నవ్వి, ‘‘మన అనుభవాలు మనం రాసుకోవచ్చు కదా నారాయణస్వామీ’’ అన్నాడు. అక్కడే, దేవపుత్ర బండి నారాయణస్వామికి కథాసాహిత్య అన్నప్రాశన చేసినవాడు అయినాడు.
దేవపుత్ర, బయటకు ఒకటి చెప్పి, వ్యక్తిగత జీవితంలో ఇంకొకరకంగా జీవించినవాడు కాడు. చాలామంది మాతృభాష మీద ప్రేమను ఒక పక్క వెళ్లబోసుకుంటూ, ఇంకొక పక్క తమ పిల్లలని ఇంగ్లీష్ చదువులు చదివించుకుంటున్న సందర్భంలో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించి (ఇంగ్లీష్ భాషను కాదు) తన పిల్లలను తెలుగు బడుల్లోనే చదివించిన ఆచరణవాది దేవపుత్ర. 1990లో తెలుగు భాష అస్తిత్వం గురించి మాట్లాడుతుంటే, దేవపుత్రను భాషాపరంగా దండించిన మహా మహా అనంతపురం కమ్యూనిస్టులు కూడా నాకు తెలుసు. సమాజంలో చేపపిల్ల మాదిరి బతికిన దేవపుత్రకి, ఒడ్డున ఈతకొట్టే కమ్యూనిస్టులు సరిపోజాలరని ఈ పాతికేళ్ల జీవితం రుజువు చేసింది. ఆయన సెల్‌ఫోన్‌ను ఒక్కసారి చూడండి, తెలుగు మీద ఆయన భక్తి మీకే అర్థమవుతుంది.
మా దేవపుత్ర కాఫీ ప్రియుడు. ఒక పెద్ద లోటాతో కాఫీ తాగుతాడు. ఆ తరువాత ఒక సిగరెట్ వెలిగించుకుంటాడు. అప్పుడు చూస్తాం గదా, ఆ నల్లటి మొఖంలో చందమామై ఉదయిస్తాడు. ఆయన, తన జూనియర్ రచయితలు ఏం రాసినా, ఏం మాట్లాడినా తెలుగులో తప్పులు దిద్దుతూనే వుంటాడు. తెలుగు భాషను బతికించాలనే వాదానికి ఆయన బ్రాహ్మణిక్ క్రమంలో పరిమితం కాలేదు. తెలుగు భాషను ఇంటిభాషగా నేర్చుకోండి అనే ఆయన కోరిక తెలుగు భాషను కాపాడేదిగా వుంటుంది. ఎందుకంటే, ‘‘కట్టె, కొట్టె, తెచ్చె’’ అనే తెలుగుభాషను కాపాడుకోవడం వరకే పరిమితమైన బ్రాహ్మణ భాషోద్యమాన్ని ఈయన అంగీకరించలేదు. ఉత్పత్తి కులాల భాషే తెలుగు భాషని పునర్నిర్మిస్తుందని ఆయన భావించినాడు. చిలుకూరి దేవపుత్ర బజాజ్ స్కూటర్ పైవున్న రిజిస్ట్రేషన్ నంబర్‌ను పరిశీలిస్తే చాలు, తెలుగు భాష మీద ఆయనకున్న విరహం ఇట్టే అర్థమవుతుంది. నంబర్ ప్లేట్‌పై హిందూ అరబిక్ అంకెలుండవు. తెలుగు భాషోద్యమకారుడు స.వెం.రమేశ్ దేవపుత్రకు అనుంగు మిత్రుడు.
కథకుడిగా, నవలాకారుడిగా, పత్రికలలో ఫీచరిస్టుగా, మంచిగా, గొప్పగా పనిచేసి తన సామాజిక వర్గాన్ని ప్రతిబింబించిన దేవపుత్రకు రాయలసీమ నివాళి.
- బండి నారాయణస్వామి
8886540990