మల్లిపురం జగదీశ్ రచించిన 13 కథల సంపుటి ‘గురి’. గిరిజనుల జీవితాల్లోని ఆనందాలు, ఆవేశాలు, అవమానాలు, ఆక్రందనలు, సాహసాలు, బ్రతుకు పోరాటాలు, నీతి న్యాయాలు, ఆచార క్రమాలు, సాంస్కృతిక ధర్మాలు... ‘పరి ముళ్ళకంప మీద ఆరేసిన నారచీరను బయటకు తీసిన రీతిగా’ ముళ్ళు గుచ్చుకోకుండా, చీర చిరగకుండా జాగ్రత్తగా రాసిన కథలు ఇవి. ఆదివాసీ జీవితాలను నాలుగు దిక్కుల స్పృశించి, స్వీయ అనుభవంతో, బాధ్యతల బరువులో క్రుంగిన బాల్యాన్నీ, బంధాల కొంగులో దాగిన నిజాన్నీ, బ్రతుకు పరుగులో అలసిన అమాయకత్వాన్నీ కలిపి, భవిష్యత్తును ఊహించి రాసిన కథలు.
‘నేను మానవుణ్ణి, నేను ఆదివాసిని. గోచీ గుడ్డ, చేతిలో చుట్ట నాకు ఆనవాళ్లు. నాకు మతం లేదు, నాకు తల్లి ఉంది, ఆమె అడవి తల్లి.’ జగదీష్ కథలలో గట్టి రాజకీయ కంఠస్వరం వినిపిస్తుంది. విద్యా లోపాలను ఎలుగెత్తి చాటే నినాదం కనపడుతుంది. ఉత్తరాంధ్రలోని ఆదివాసీలను అభివృద్ధి పేరుతో తొలగించే విధ్వంసం ప్రతిబింబిస్తుంది. అడవితనాన్ని కోల్పోయిన గిరిపుత్రుల ఆవేదన కనిపిస్తుంది. మతమార్పిడి స్థావరంగా మారిపోయిన అడవి కనిపిస్తుంది. అభివృద్ధి అనే రాజకీయ ప్రహసనాన్ని ఈ కథలు ప్రశ్నిస్తాయి. స్థానికతను నిర్దిష్టంగా రచయిత ఉపయోగించాడు. కాలమేదైనా భూములు లాక్కోవడం, ఆదివాసీలను నిర్వాసితులుగా మార్చేయడం, ఇదే కదా చరిత్ర? ఇదే కదా వర్తమాన కథ? ఒకటి భూసేకరణ, రెండు భూ ఆక్రమణ.
మా బతుకు, మా ఉనికి, మా చిరునామా మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలి అంటాడు రచయిత. గత చరిత్రకు గుర్తు లాంటి మంగుల్ని సిల్లిగోడు అని చంపేశారు. ‘డోలి చేతపట్టిన’ సత్యాన్ని ఇన్‌ఫార్మర్ అని చంపేశారు. కానీ భవిష్యత్ తరమైన గీత, విల్లు ఎక్కుపెట్టింది. లక్ష్యం ఆమె ఎంచుకోగలదు. గీత గురి తప్పదు.
- డా‘‘ చింతపల్లి ఉదయ జానకిలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment