సహచరుడు, సాహితీవేత్త రామతీర్థతో జగద్ధాత్రి(ఫైల్)
ఒంటరితనం పెను శత్రువైంది. పీడకలగా పరిణమించింది. పొగలా కమ్ముకుంది. పడగలా, మృత్యునీడలా వెంటాడింది. ఆత్మీయుడి అస్తమయం కారణంగా అంతా శూన్యమైతే.. ఆమె ఒంటరి హృదయం నిండా దిగులు కమ్మేసింది. కన్నీటి సంద్రంలో తానొక ఒంటరి నౌక కాగా.. చేరాల్సిన తీరం దరిదాపుల్లో కానరాకపోగా.. ఎవరి ఆప్త వచనాలూ సహించకపోగా.. చివరికి వ్యథాభరిత హృదయంతో ఆమె మృత్యువు సాహచర్యాన్నే కోరుకుంది. జీవిత పయనంలో ఎంతో ఆత్మీయతను పంచి ఇచ్చిన సన్నిహితుడు, సాహితీవేత్త, సృజనశీలి రామతీర్థ హఠాన్మరణంతో తీవ్ర కుంగుబాటుకు లోనైన రచయిత్రి జగద్ధాత్రి ఇక సెలవంటూ ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఒంటరితనం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు లేఖరాసి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.
సాక్షి, విశాఖ సిటీ: సాహిత్యలోకం మరోసారి విషాదంలో మునిగిపోయింది. సాహిత్యలోకానికి చిరపరిచితులైన ప్రముఖ రచయిత, సాహితీవేత్త రామతీర్థ ఆకస్మిక మరణం మరుపులోకి జారకముందే.. మళ్లీ కన్నీటి కెరటాలు ముంచెత్తడంతో చింతాక్రాంతమైంది. రామతీర్థ సన్నిహితురాలు, ఆయన సహచరి జగద్ధాత్రి (55) విషాదకర పరిస్థితుల్లో లోకం విడిచివెళ్లారు. ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతినిధి అయిన జగద్ధాత్రి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకోజీపాలెంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆమె నివసిస్తున్న ఫ్లాట్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. రామతీర్థ మరణంతో కొన్ని నెలలుగా తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆమె మానసిక క్షోభతో తనువు చాలించారు.
ఒంటరితనం, మనోవేదన కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు జగద్ధాత్రి సూసైడ్ నోట్ రాశారు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ నగర పోలీస్ కమిషనర్‌కు మరో నోట్ ద్వారా తెలిపారు. తనకు సంబంధించిన వస్తువులను తనకు చేదోడువాదోడుగా ఉన్న రాజేష్ అనే యువకుడికి ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. జగద్ధాత్రి మృతదేహాన్ని గతంలోనే ఆమె కోరిన ప్రకారం ఆంధ్ర మెడికల్ కళాశాల అనాటమీ విభాగానికి విద్యార్థుల ప్రయోగాల నిమిత్తం అప్పగించారు. ఉత్తరాంధ్రలోని పలువురు సాహితీవేత్తలు, రచయితలు, కవులు ఆమె మృతదేహానికి ఘన నివాళి అర్పించారు.
తొలి రచనతోనే ప్రశంసలు..
1964లో జన్మించిన జగద్ధాత్రి విద్యార్థి దశ నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఆంధ్ర విశ్వవిదాలయం నుంచి ఏంఎలో బంగారు పతకం సాధించిన ఆమె సాహిత్యంపై అనురక్తితో మొజాయిక్ సాహిత్య సంస్థలో సభ్యురాలిగా చేరారు. బహుభాషల సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. తొలి కవితా సంపుటి ‘సహచరణం’తోనే ఆమె సాహితీప్రియుల మన్ననలు పొందారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో సమాంతర అధ్యయనంతో సాహితీ పరిజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకున్నారు. లెక్చరర్‌గా పనిచేస్తూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రచనలు చేశారు. ఆమె కవిత్వంతో పాటు పలు విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. కావ్యజ్యోతి పేరుతో ఆమె చేసిన అనేక రచనలు ఓ దినపత్రికలో ప్రముఖంగా ప్రచురితమయ్యేవి. రామతీర్థ బాటలోనే ఆమె కూడా సాహితీలోకంలో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎంతో బాధాకరం..
ఇద్దరు సాహితీమిత్రులను కోల్పోవడం బాధాకరంగా ఉంది.రామతీర్థకు ఆమె ఎప్పుడూ చేదోడువాదోడుగా ఉండేవారు. సాహిత్యంలో ఇద్దరూ ఓ జంటగా మెసలేవారు. రచనాప్రక్రియలో ఒకరికొకరు సహకరించుకునేవారు. ఇప్పుడు ఇద్దరూ లేరన్న విషయం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
-చెన్నా తిరుమలరావు, ఘంటశాల స్పోర్ట్స్, కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి
సాహితీ యాత్రికురాలు..
జీవితపు సంచారిణీ దీప శిఖ. సంవాదినీ, సంభాషిణి దీపశిఖగా ఒక దశాబ్దపు నడక జగద్ధాత్రిది. శివమెత్తి ప్రసగించిన, సిరాక్షరాలు ఒలికించి సమీక్షలు చేసిన, కుందనపు బొమ్మలతో కొలువు కట్టిన యాత్రికురాలు ఆమె. జిజ్ఞాసే ఆమె శ్వాస. తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ, ఒడియా, బెంగాలీ భాషలలో పరిచయంవున్న సాహిత్య శుశ్రూష.
-మేడా మస్తాన్ రెడ్డి, సాహిత్యకారుడు
బహుభాషా ప్రజ్ఞాశాలి..
ఉభయ రాష్ట్రాలలో మూడు భాషలు (తెలుగు,హిందీ,ఆంగ్లం)లో రచనలు చేయలగ అతికొద్ది మంది మహిళల్లో జగద్ధాత్రి ఒకరు. పెద్ద సదస్సుల్లో కీలకమైన ఉపన్యాసాలు చేయగల దిట్ట.అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి తనువు చాలించడం బాధకరం.
-ఫణిశయన సూరి, పరవస్తు పీఠం అధ్యక్షుడు
తీరని లోటు..
జగద్ధాత్రి మృతి సాహితీ రంగానికి తీరనిలోటు. సాహితీ రంగానికి ఎనలేని సేవలు అందించిన రామతీర్థకు ఆమె చేదోడుగా ఉండేవారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరూ కనుమూయడం బాధాకరం. వారిద్దరూ కలసి అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లేవారు ఆయన మృతి ఆమెను బాగా కుంగదీసింది. ఇటీవల ఆమె ఎక్కడికి వెళ్లినా ఆయన కోసమే అంతా ప్రస్తావించడం ఆమెను మరింతగా కలచివేసింది.
-ప్రజాగాయకుడు దేవిశ్రీ
Comments
Please login to add a commentAdd a comment