
ఓసారి ఆకాశంపై లుక్కేద్దాం!
అన్నమయ్య ఎలా ఉంటారు? త్యాగయ్య, క్షేత్రయ్య ఎలా ఉంటారు? పాతరాగాలను స్థిరపరచి, కొత్తరాగాలను కట్టిన వారెలా ఉంటారు? కర్ణాటక-హిందుస్తానీ-రవీంద్ర-అరబిక్-వెస్ట్రన్ సంగీతాలను రంగరించి తెలుగువారి కోసం లలితసంగీతపు మంచిగంధాన్ని తీసినవారెలా ఉంటారు! మనకు స్వాతంత్య్రం వచ్చీరాగానే అర్ధరాత్రి పాటరాసి, స్వరపరచి ‘మాదీ స్వతంత్ర దేశం’ అని టంగుటూరి సూర్యకుమారితో పాడించినవారెలా ఉంటారు? ఉషశ్రీతో ధర్మసందేహాలను తీర్పించిన వారెలా ఉంటారు? సంగీతము - సాహిత్యము ఉచ్వాసనిశ్వాసాల్లా జీవిస్తోన్న వారెలా ఉంటారు? ఎలా ఉంటారెలా ఉంటారంటే బాలాంత్రపు రజనీకాంతరావు గారిలా ఉంటారు! బెజవాడ సీతారామపురం వెళ్లండి. వారణాసివారి వీధిలో ఆహ్లాదకరమైన నివాసం. ‘ఆ తోటలోనొకటి ఆరాధనాలయము’ అన్నట్లుగా ఊయలలూగుతూ కన్పిస్తారు రజని. రజని అంటే చీకటి. మనకు తెలియని ఆయన మనో ఆకాశంలో ఎన్నెన్ని పాటల పాలపుంతలున్నవో! 95వ పుట్టినరోజు సందర్భంగా...
లెటజ్ హేవ్ ఎ లుక్ ఎట్ ద స్కై!
శివనారాయణ తీర్థుల పరంపరలో వేంకటపార్వతీశ కవులలో ఒకరైన వేంకటరావు-వేంకటరమణమ్మల ద్వితీయ పుత్రుడుగా 29 జనవరి 1920లో బాలాంత్రపు రజనీకాంతరావు జన్మించారు. టీనేజ్‌లో వానచినుకు రజనిలో సంగీత-సాహిత్యాలను మొలకెత్తించింది. ‘చినుకు కన్నియల పరికిణీ చెంగున/చెంగున మెరిశాయె చిన్ని ముత్తెసరులు/టిప్ టాప్ టాప్’ అన్నారు. పదాలను కూర్చేవారు వాక్కారులు. రాగమును బయలు పరచేవారు బయకారులు. రెండు విద్యలు తెలిసిన వారు ఉభయకారులు. వాగ్గేయకారులన్నమాట. ‘వాగ్గేయం’ అంటే ‘యవ్వనంలో బయలుపడే శృంగార చేష్ట’ అనే అర్ధం కూడా ఉంది. జానపదులు అసలు సిసలు వాగ్గేయకారులంటారు రజనీ.
ఆది ‘చరిత్ర’ కారుడు!
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బి.ఎ. ఆనర్స్, తెలుగు-సంస్కృతాలు అభిమాన విషయాలుగా మూడేళ్ల ఎం.ఏ. కోర్సు చదువుతూ పాటలు కట్టి, పాడే రజనితో విశ్వవిద్యాలయ కులపతి కట్టమంచి రామలింగారెడ్డి గొంతుకలిపేవారు. శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాల్ని-పఠాభి ఫిడేల్ రాగాల్ని జరుక్ శాస్త్రి ద్వారా విన్న రజనీ రాజ్యస్వభావాన్ని నిరసిస్తూ ‘పూషా’ అనే కలం పేరుతో (షాను ఊదేసే కవి ) కవితలు రాశారు.
1955-56లో తెలుగు భాషా సమితి ప్రచురించిన రజనీ కృత సర్వసమగ్ర గ్రంధం ‘ఆంధ్ర వాగ్గేయకార చరిత్రం’ 1961లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందింది. కర్ణాటకసంగీతంలో పరిశోధన చేస్తోన్న వారికి ఇప్పటికీ రజనీ ‘చరిత్రం’ ఆదికావ్యమే! ‘కృష్ణకర్ణామృత’ కర్త లీలాశుకుడు, ‘సంగీతసార’ కర్త పార్శ్వనాధుడు, ‘రాగవిబోధి’ కర్త సోమనాథులు తెలుగువారని, ఆంధ్రభైరవి క్రమేణా ఆనందభైరవిగా మారిందని రజనీ ప్రతిపాదించారు. 1940ల్లో గోవిందరాజుల సుబ్బారావుగారు ‘నల్లవాడే గొల్ల॥పిల్లవాడే చెలియ’ అని పాడేవారు. రజనీ పద్ధతి ‘నల్లవాడే-గొల్ల పిల్లవాడే-చెలియ’! పాటను పంక్తులలో విభజించడం, సాహిత్యం లోని ఉద్వేగాన్ని పరిరక్షిస్తూ వన్నెతేవడం లలిత సంగీతానికి బాలాంత్రపు కంట్రిబ్యూషన్.
రాగమయ్య!
ఇప్పుడు బాగా పాపులర్ అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ కంటే ముందు రజనీ ‘పసిడి మెరుగుల తళతళలు’ తెలుగుతల్లి గీతంగా ప్రాచుర్యంలో ఉండేది. ఈ పాటను భానుమతితో కలసి పాడారు. చిత్తూరు నాగయ్య, కృష్ణశాస్త్రి, సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల, టంగుటూరి వలెనే భానుమతికీ రజనీ అంటే ఎంతో గౌరవం. అరేబియా రాగాలతో రజనీ రచించి స్వరపరచిన ‘ఓహోహో పావురమా’ ఆమెకు ఉత్తమగాయనిగా కేంద్రప్రభుత్వపు అవార్డును లభింపజేసింది. అన్నమయ్య కీర్తనల్లోని ‘దేశాటం-నాటగౌళ-మాళవి’ తదితర రాగాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. రజనీ రాగాల స్వరూపాన్ని ఆవిష్కరించి అన్నమయ్యను తొలిసారిగా రేడియో ద్వారా తెలుగు వారికి పరిచయం చేశారు. ‘జో అచ్యుతానంద’ శ్రీమతి రజనీ పాడడం విశేషం!
నాగాలాండ్, డార్జిలింగ్, సూరత్ తదితర ప్రాంతాలలో రేడియోలో పనిచేసిన రజని ప్రకృతి ధ్వనులను రేడియోలో ప్రతిధ్వనించారు. స్వాతంత్య్రానంతరం ఇప్పటి వరకూ మరే ఇతర రేడియో కార్యక్రమానికి రాని అంతర్జాతీయ బహుమతి రజని రూపొందించిన ‘కొండనుంచి కడలి దాకా....’ కార్యక్రమాన్ని మాత్రమే వరించింది. రేడియో ప్రసంగానికి పిలిస్తే ‘గో టు హెల్’ అన్న గుడిపాటి వేంకటాచలం ఒకే ఒక్కసారి ఆలిండియా రేడియోకు 1972లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అదీ రజనిపై గల గౌరవంతో. చలాన్ని రజని పువ్వులా ప్రశ్నలడిగారు! చలం... పరిమళంలా సమాధానమిచ్చారు. ఎన్.ఆర్.నంది ‘మరోమొహెంజదారో’ ప్రారంభగీతం ‘మరుగున పడిందొక మహీధరం’ ద్వారా రజనీ నాటకం ఆత్మను పలికించారు!
రాగాల ‘చినుకులు’
వానచినుకు రజనిలో సంగీత-సాహిత్యాలను మొలకెత్తిసాయి. పిఠాపురంలో వింజమూరి సీతాదేవి, సుభద్ర వర్షంలో ఆనందిస్తోండగా టీనేజ్‌లో రజని అప్పటికప్పుడు‘చినుకు కన్నియల పరికిణీ చెంగున’ గేయం రాశారు. ట్యూన్ కట్టారు. ఆ పాటను 1938లో వింజమూరి సిస్టర్స్ (అనసూయ-సీతాదేవి)ఆలిండియా రేడియోలో పాడేరు. ఆ తర్వాత ‘చినుకుల’ సుభద్ర, రజనీ అర్ధాంగి అయ్యారు. రజని సంతానం... రమణకుమారి, హేమచంద్ర, నిరుపమకుమారి, శరత్‌చంద్ర, వెంకోబ్‌లు తండ్రికి కోరస్ పాడే రాగాల ‘చినుకులే’!
మృత్యువును పరిహసించిన ‘ముత్యం’!
సముద్రంలో సాధారణ రాచిప్పలో స్వాతి చినుకు కురిస్తే ముత్యం అవుతుందట. అది కల్పన. వాస్తవం ఏమిటి? రాచిప్పలో ఇసుక రేణువు చేరితే తోసేయటానికి ‘ప్రాణి’ నిర్విరామంగా ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో విడుదలైన స్రావాలు ఘనీభవించి మంచి ముత్యాలవుతాయి. రజనీ జీవితంలోకీ ‘ఇసుక రేణువు’ ప్రవేశించింది. రేడియోలో పనిచేస్తోండగా కొందరు ఆత్మీయ సహచరులు వరుసగా చనిపోయారు. ‘మృత్యువు’ రజనిని కలవర పరచింది. తన మీద ఆధారపడ్డ పసికూనలకు రెక్కలు వచ్చేదాకా జీవించాలి కదా. అంతటితో సరా? జీవించినందుకు ‘విలువలను నిలువ చేయాలి కదా’ అని ఒక కవితలో రాసుకున్నారు. తన హృదయస్రావాల నుంచి రజని జీవితపరమార్ధాన్ని సాధించారు. మనకూ, రాబోయే తరాలకూ కానుకగా అందించారు. ఇక నీ ఇష్టం అని మృత్యువుతో పరాచికాలాడుతూ. రాగాలతో సరాగం చేస్తోన్న ‘చిరంజీవి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారా! అలాగే!! వాళ్లబ్బాయి హేమచంద్ర (9247387192) ద్వారా కన్వే చేయండి!
- పున్నా కృష్ణమూర్తి
ఫొటో: కె.ఎస్.కోటేశ్వరరావు, విజయవాడ
రేడియోలో ‘కాలం’
అచ్చులో ‘స్థలం’ ఎంత ముఖ్యమో రేడియోలో ‘కాలం’ అంత ముఖ్యం. స్థలకాలాదులను తెలిసిన రజని... పైకి చదువుతూ రాయడం అనే ప్రక్రియను బసవరాజు అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు వంటి మహా రచయితందరి చేత పాటింపచేశారు. శ్రోతలకు వీనులవిందు చేశారు.
మాదీ స్వతంత్ర దేశం...
అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సుబ్రహ్మణ్యభారతి తమిళగీతం, ఆ వెంటనే ప్రసారమైన తొలి తెలుగు దేశభక్తి గీతం... రజని రచించి స్వరపరచిన ‘మాదీ స్వతంత్ర దేశం...’. ఆ పాటను టంగుటూరి సూర్యకుమారి గానం చేశారు.
బాలాంత్రపు...95వ పుట్టిన రోజు సందర్భంగా...