Potturi Venkateswara Rao
-
మైత్రీపురి పొత్తూరి
ఆయన పేరు పొత్తూరి. మైత్రీపురి అని తన ఈమెయిల్ పేరు పెట్టుకున్నారు. 86 సంవత్సరాల జీవన సంఘర్షణ తరువాత ప్రశాంతంగా మృత్యువు ఒడిలోకి ఒరిగి పోయారు. ఆధ్యాత్మిక జీవనం, తత్వం, భక్తి, వేదాంతం అలవరుచుకుంటున్న రోజులలో ఆయనను అన్యాయంగా క్యాన్సర్ రక్కసి ఆవరించింది. ఆ రాకాసితో ఓపికగా పోరాడి, ఆస్పత్రినుంచి విడుదలై నిజనివాసంలో స్వేచ్ఛావాయు వులు పీల్చుకుంటూ దోసపండువలె రాలిపోయారు. సమాజం కోసం పోరాడుతున్న నక్సలైట్లను ప్రధాన జీవనస్రవంతివైపు మళ్లించాలన్న తపన. వారికీ, ప్రభుత్వానికీ మధ్య సయోధ్య సాధించడానికి అకుంఠిత దీక్షతో కృషి చేశారు. ఇవన్నీ ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. 1983–84లో ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వరంగల్ విలేకరిగా ఉన్నప్పుడు నాకు పొత్తూరితో సన్నిహిత పరిచయం. వరంగల్లులో సమాచార భారతి విలేకరిగా ఉన్న ప్పుడు నేను రాసిన వార్తలు, పరిశోధనా వ్యాసాలు ఆంధ్రప్రభలో వచ్చేవి. సంచలనం కలిగించే వార్తలు అనేకం వచ్చాయి. అవి కొన్ని సమస్యలు కూడా తెచ్చిపెట్టాయి. వాటిని చాలా హుందాగా ఎదుర్కొన్నారు. పొత్తూరి ఉదయం పత్రిక సంపాదకులుగా రావడంతో మళ్లీ ఆయనతో మాకు సన్ని హిత సంబంధాలు ఏర్పడ్డాయి. పత్రికా సంపాదకుడుగా, విమర్శకుడుగా, రచయితగా పొత్తూరి ఎప్పుడూ సంచలనాలను నమ్ముకోలేదు. జాగ్రత్తగా ఎవరినీ నొప్పించకుండా రాయడం, నిర్మాణాత్మకమైన విమర్శలను చేయడం, సున్నితంగా మందలించడమే గానీ పరుష పదజాలం వాడడం అవసరం లేదనే సౌమ్యుడైన పత్రికా రచయిత. ఒకసారి నేను, సాయిబాబా రాసిన పరిశోధనా వార్తను ఆయన చర్చించి ఆమోదించి ప్రచురించారు. తొలి ఎడిషన్ ప్రతులు జిల్లాల కోసం ట్రక్కులు ఎక్కించాక, రాత్రికి రాత్రి వాటిని వెనక్కు రప్పించి, ఆ వ్యాసం తొలగించి కొత్త పత్రికలు ముద్రించి పంపారు. ఆ వార్త ఆగిపోవడం వెనుక కథ పొత్తూరికి తెలుసు. ఎవరితో ఘర్షణ పడకుండా మౌనంగా రాజీనామా చేశారు. ఇప్పటికీ ఆయన రాజీనామాకు మేమే పరోక్షంగా కారణమని బాధపడుతూనే ఉంటాం. పొత్తూరి వినియోగదారుల ఫోరంలో సామాజిక ప్రతినిధిగా, న్యాయమూర్తిగా హైకోర్టులో న్యాయపీఠం పైన కూర్చున్నారు. నన్నొకరోజు సహజ న్యాయసూత్రాల గురించి అడిగారు. నేను చదివింది, నేను తరగతి గదిలో చెప్పేది నాకు తెలిసింది చెప్పాను. ఆయన నాకు చిన్న పరీక్ష పెట్టారనీ నేను అందులో ఉత్తీర్ణుడినైనాననీ నాకు ఆ తరువాత తెలిసింది. పొత్తూరి ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిన తరువాత పిలిచి, పత్రికా రచన, కోర్టు ధిక్కారం, పరువు నష్టంపైన పుస్తకం రాయమన్నారు. తను స్వయంగా చదివి న్యాయధిక్కారం అనే మాటపై విశ్లేషణ చేశారు. మా నాన్నగారు ఎంఎస్ ఆచార్య స్మారక ప్రసంగం 2017లో పొత్తూరి ఇచ్చారు. పొత్తూరి లేని లోటు తీరదు. తెలంగాణ తన శ్రేయోభిలాషిని, తెలుగు రాష్ట్రాలు ఉత్తమ పాత్రికేయుడిని, ఒక చింతనాపరుడిని కోల్పోయాయి. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
పాత్రికేయ ప్రముఖుడు ‘పొత్తూరి’ అస్తమయం
సాక్షి, హైదరాబాద్: విలువలతో కూడిన సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానంతో పాటు చివరి శ్వాస వరకు పౌరహక్కులు, బలహీనుల పక్షాన నిలిచిన సీనియర్ జర్నలిస్టు, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు (86) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాసబ్‌ట్యాంక్ విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆయన కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చివరి కోరిక మేరకు మూడు రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య సత్యవాణి, కుమారులు ప్రేమ్గోపాల్, రహీ ప్రకాష్, కుమార్తెలు వాత్సల్య, డాక్టర్ పద్మజ ఉన్నారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పలువురు జర్నలిస్టులు, పాత్రికేయ సంఘాల ప్రతినిధులు మాసబ్‌ట్యాంక్ విజయనగర్ కాలనీలోని ఆయన నివాసానికి వచ్చి నివాళులర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయనకు కుమారుడు గోపాల్ అంత్యక్రియలు నిర్వహించారు. సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానం గుంటూరు జిల్లా పొత్తూరులో 1934 ఫిబ్రవరి 8న జన్మించిన పొత్తూరి వెంకటేశ్వరరావు.. 1957లో తన సమీప బంధువైన బీవీ రాజు సారథ్యంలో వెలువడిన ఆంధ్రజనత పత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఈనాడు, ఉదయం పత్రికల్లో కీలక హోదాల్లో పనిచేశారు. జర్నలిజంలో విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఆయన తన అభీష్టానికి భిన్నంగా ఓ పత్రిక యాజమాన్యం ఒక వార్తను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సంపాదక బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2005లో అప్పటి ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన చర్చల్లోనూ పొత్తూరి ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆయన వ్యాసప్రభ, చింతన, నాటి పత్రికలు–మేటి విలువలు తదితర పుస్తకాలతో పాటు ‘విధి నా సారథి’ పేరుతో ఆత్మకథను రాశారు. పొత్తూరి ఓ మైలురాయి : గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సాక్షి, అమరావతి: సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం సంతాపం వ్యక్తంచేశారు. ఐదు దశాబ్దాలకు పైగా పాత్రికేయునిగా సమాజానికి సేవలందించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన పొత్తూరి వెంకటేశ్వరరావు తెలుగు పాత్రికేయరంగంలో మైలురాయి వంటివారని పేర్కొన్నారు. పత్రికారంగంలో పొత్తూరి సేవలు ఎనలేనివి: సీఎం వైఎస్ జగన్ సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు పాత్రికేయరంగంలో పొత్తూరి పాత్ర మరువలేనిదన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఐదు దశాబ్ధాలకు పైగా పత్రికా రంగంలో సేవలందించిన పొత్తూరి వెంకటేశ్వరరావు తెలుగు జర్నలిజంలో అందరికీ ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. పొత్తూరి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రముఖుల సంతాపం సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కె.రామకృష్ణ, వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు, కుర్తాళం సిద్దేశ్వరీ పీఠం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ స్వామి సంతాపం వ్యక్తం చేశారు. -
పెద్దదిక్కు ‘పొత్తూరి’
నాలుగు అక్షరాలే కానీ, నాలుగు రాళ్ళు వెనకేసుకోలేని పరిస్థితి తెలుగు పత్రికారంగంలో గతంలో ఎక్కువగా ఉండేది. ఆదాయం తక్కువై శ్రమ ఎక్కువైనా, వేళాపాళా లేకపోయినా చాలామంది పత్రికారంగాన్ని పట్టుకుని వేళ్లాడడానికి కారణం, ఆ వృత్తిపట్ల ఆసక్తి, దాని విలువలపట్ల నిబద్ధతే. పొత్తూరి వెంకటేశ్వరరావు అలాంటి తరానికి చెందిన పాత్రికేయులు. ఆంధ్రజనత, ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికలలో సబ్–ఎడిటర్ నుంచి సంపాదకుని వరకు వివిధ హోదాలలో పనిచేసిన పొత్తూరిగారు పాత్రికేయ కులపతులలో ఒకరుగా పరిణమించి తదుపరి తరాలవారికి మార్గదర్శి అయ్యారు. ఆయన తొంభైల ప్రారంభంలోనే పదవీవిరమణ చేసినప్పటికీ ఆ తర్వాత కూడా ఏనాడూ కలం దించలేదు, నడుము వాల్చలేదు. మధ్యలో కొన్నేళ్లు ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా ఉన్నారు. ‘ఆంధ్రజాతి అక్షరసంపద తెలుగుపత్రికలు’ అనే పరిశోధనాత్మక గ్రంథం పత్రికారంగానికి వారిచ్చిన అమూల్యమైన కానుక. అలాగే, సామాజిక, రాజకీయ పరిణామాలను పట్టించుకున్నారు. డెబ్బై, ఎనభై దశకాలలో పత్రికారంగంలోకి వచ్చినవారిలో ఆయన దగ్గర తర్ఫీదైనవారు చాలామంది ఉన్నారు. వారి మృతి వారందరిలోనూ వారి జ్ఞాపకాలను రేపే విషాద సందర్భం. రామ్‌నాథ్ గోయెంకా సారథ్యంలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్–ఆంధ్రప్రభ గ్రూపులో పనిచేయడం వల్ల సంపాదకునిగా తన స్వేచ్ఛను ప్రకటించుకుని, తన ముద్రను స్థాపించుకునే అవకాశం పొత్తూరిగారికి లభిం చింది. గోయెంకా తన సంస్థలో దిద్దిన ఒరవడి అది. సంపాదకుల విధులు, విధానాలలో ఆయన జోక్యం చేసుకునేవారు కాదు, ఇంకొకరిని చేసుకొనిచ్చేవారు కాదు. ఎందులోనైనా సంపాదకునిదే తుదిమాట కావాలని శాసించేవారు. పత్రిక విధానాన్ని రూపొందించుకునే తన స్వేచ్ఛను యజమాని ప్రశ్నిస్తున్నారని పొత్తూరిగారు శంకించి రాజీనామా చేయడం, ఒక పాఠకునిగా నా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ నాకు లేదా అని గోయెంకా ప్రశ్నిస్తూ రాజీనామాను చించి చెత్తబుట్టలో వేయడం ఒకటి రెండుసార్లు సంభవించాయి. ‘విధి నా సారథి’ పేరుతో తను రచించిన ఆత్మ కథలో పొత్తూరి తెలిపిన ఇలాంటి ఉదంతాలు సంపాదకునికీ–యజమానికీ మధ్య ఉండాల్సిన ఆదర్శబంధాన్ని వెల్లడిస్తాయి. సంపాదకునిగా పొత్తూరిగారు చాలా విషయాలలో చాలా ఉదారవాదిగా వ్యవహరించేవారు. సిబ్బందిని నియమించుకోవడంలో అది స్పష్టంగా కనిపించేది. అతివాదులు, మితవాదులు, మతవాదులు, మధ్యేవాదులతో సహా అన్ని రకాల ఆలోచనాపంథాల వారికీ; అన్ని సామాజికవర్గాల వారికీ పత్రికలో చోటు ఇచ్చేవారు. ప్రోత్సాహం, పదోన్నతి అందించడంలో సామర్థ్యానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయన ఇచ్చిన అవకాశంతో ప్రతిభకు సానపెట్టుకుని తర్వాతి కాలంలో ఎందరో సంపాదకులు, బ్యూరో చీఫ్‌లు అయ్యారు. నాటి నార్ల వేంకటేశ్వరరావుగారిలా నీలం రాజు వెంకటశేషయ్యగారిలా ఆంధ్రప్రభ దినపత్రిక, వారపత్రికలు రెండింటికీ సంపాదకత్వం వహించే అవకాశం పొత్తూరిగారికి కూడా లభించింది. వారపత్రిక సంపాదకీయ రచనలో విషయ సేకరణకు ఎంతో సమయం వెచ్చించి, ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. దాంతో అవి సాహిత్యపు విలువను సంతరించుకునేవి. వారపత్రిక సంపాదకీయమైనా, దినపత్రిక సంపాదకీయమైనా చెప్పదలచుకున్న అంశాన్ని సరళమైన భాషలో, చిన్న చిన్న మాటలలో చెప్పడం ఆయన శైలి. సంపాదకీయాన్ని విధిగా మరొకరి చేత చదివించిగానీ పత్రికలో పెట్టించేవారు కాదు. చదివిన వ్యక్తి ఎక్కడైనా సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు తను రాసింది సక్రమమే అనుకున్నా సరే సవరించడానికి వెనుకాడేవారు కాదు. మనం రాసేది పాఠకునిలో ఎలాంటి సందేహాలకు, అస్పష్టతకు తావు ఇవ్వకూడదనేవారు. పొత్తూరిగారి తరంలో, అంతకుముందు తరంలో సంపాదకుని విధి పత్రికా నిర్వహణకు మాత్రమే పరిమితమయ్యేది కాదు. రాజకీయ, సామాజిక రంగాలతో సహా వివిధ రంగాలకు వారి సలహాలు, సూచనలు అవసరమయ్యేవి. అది సంపాదకునిపై అదనపు బాధ్యత అయ్యేది. పొత్తూరిగారి వృత్తిజీవితంలోనూ అలాంటి ఘట్టాలు అనేకం ఉన్నాయి. ఆత్మకథలో వాటిని పొందుపరచుకున్నారు. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నక్సలైట్లతో శాంతి చర్చలను ఫలప్రదం చేయడానికి కృషిచేసిన ప్రముఖులలో పొత్తూరి ఒకరు. తను ఆంధ్ర ప్రాంతానికి చెందినా, తెలంగాణ జిల్లాల్లో అనేకసార్లు పర్యటించిన పాత్రికేయునిగా ఇక్కడ ప్రత్యేక రాష్ట్రవాదం ఎంత బలంగా ఉందో గుర్తించి మొదటినుంచీ తెలంగాణ ఏర్పాటును బలంగా కోరుతూవచ్చిన ప్రజాస్వామికవాది ఆయన. అర్థశతాబ్దికి పైగా తెలుగువారి చరిత్రతో తన జీవితాన్ని పెనవేసుకున్న అక్షర సంపాదకుడు ఆయన. - కల్లూరి భాస్కరం వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మొబైల్ : 97034 45985 -
సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావుతో మనసులో మాట
-
పొత్తూరికి జాతీయ పురస్కారం
ప్రెస్ కౌన్సిల్ స్వర్ణోత్సవం సందర్భంగా ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంక టేశ్వరరావును ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం జాతీయ పురస్కారంతో సత్కరించింది. కౌన్సిల్ స్వర్ణోత్సవం సందర్భంగా గత 50 ఏళ్లుగా పత్రికారంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొత్తూరి ఒత్తిళ్లకు గురికాకుండా నిక్కచ్చిగా తన భావాలను వ్యక్త పరిచేవారు. 82 ఏళ్ల వెంకటేశ్వరరావు ఆంధ్ర జనత పత్రికలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఉదయం, ఈనాడు పత్రికల్లో సంపాదకులుగా పనిచేశారు. టీటీడీ పబ్లికేషన్‌సలో గౌరవ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా, నాగార్జున వర్సిటీల్లో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స విభాగం బోర్డు మెంబర్‌గానూ వ్యవహరించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జర్నలిజం కోర్స్ మెటీరియల్‌కు సంబంధించి చీఫ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా మండలి సభ్యుడిగా.. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సుల్లో సమూల మార్పులకు కృషి చేశారు. ప్రెస్ కౌన్సిల్ పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని పొత్తూరి చెప్పారు. ప్రస్తుత సమాజంలో స్వేచ్ఛా జర్నలిజం అవసరం ఎంతో ఉందని, పత్రికల యజమానులు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కాకుండా స్వేచ్ఛగా వ్యవహరించాలని సూచించారు. -
ఒక సంపాదకుడి స్వీయచరిత్ర
విధి నా సారథి (స్వీయచరిత్ర) రచన: పొత్తూరి వెంకటేశ్వరరావు పేజీలు: 384; వెల: 175 ప్రతులకు: సాహితి ప్రచురణలు, 29-13-53, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ-2; ఫోన్: 0866-2436643 ‘బీఎస్సీ తరువాత ఏమి చేయాలని అనుకొంటున్నారు?’ అని అడిగిన లెక్చరర్‌తో, ‘జర్నలిస్టును కావాలనుకొంటున్నాను’ అని చెప్పారు పొత్తూరి. ‘ఓ! యు వాంట్ టు బికమ్ ఎ నార్ల’ అన్నారాయన. అన్నట్టుగానే, ‘నార్ల’(వెంకటేశ్వరరావు) లాగే ఎడిటర్ అయ్యారు పొత్తూరి(వెంకటేశ్వరరావు). ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన 81 ఏళ్ల పొత్తూరి ప్రయాణం సుదీర్ఘమైనది. గూడబండ్ల ప్రయాణం చూశారు. బొగ్గుతో నడిచే బస్సుల్లో ప్రయాణించారు. ‘పప్పు తినే బేంబడి’గా సహ విద్యార్థుల హేళనకు గురయ్యారు. ఆ కారణంగా వస్తాదులా బాడీ పెంచారు. పాత్రికేయం మీద ఆసక్తితో గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. ‘చిట్టి రాష్ట్రానికి పొట్టి గవర్నర్’ అని బూర్గుల రామకృష్ణారావు గురించి పెట్టిన తమాషా హెడ్డింగుకు ‘ఆంధ్రజనత’లో తిట్లు తిన్నారు. ఆంధ్రభూమిలో పనిచేస్తూనే రేడియోలో ప్రాంతీయ వార్తలు చదివారు. ఈనాడులో జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు. పోటీ వారపత్రికలో వస్తున్న ‘క్షుద్ర’రచనకు అదే రచయితతో ప్రభ వీక్లీలో పేరడీ రాయించారు. రాజీవ్‌గాంధీ- అంజయ్య వివాదంలో అసలు జరిగిందేమిటో రాజీవ్‌గాంధీనే ఇంటర్వ్యూ చేసి తెలుసుకున్నారు. ‘లా’ చదవకపోయినా స్టేట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ కమిషన్‌లో పనిచేయగలిగారు. ‘పేలుడు పదార్థాల స్టోరీ’ ఆపించినందుకు ఆత్మగౌరవంతో ఉదయం నుంచి బయటికి వచ్చారు. నక్సలైట్లతో శాంతి చర్చలు విఫలమైనందుకు కన్నీరు కార్చారు. ప్రత్యేక తెలంగాణను సమర్థించారు. తిరుమల నగల లెక్కింపు కమిటీలో ఉన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పాతపత్రికల డిజిటైజేషన్ చేయించారు. పారమార్థిక పదకోశం వెలువరించారు. వీటితోపాటు, ఆయనపడ్డ ఆర్థిక ఇబ్బందులు, ఆయన్ని ఆదరించిన పెద్దల వివరాలు ఈ ‘స్వీయచరిత్ర’లో తెలుస్తాయి. ఎంత ఎత్తులో ఉన్నా తన నిజస్థితిని గురించిన ‘ఎరుక’ కూడా కనిపిస్తుంది. స్థూల స్థాయిలో ఇవన్నీ ఒక ఎత్తయితే, ఆయనలోని సూక్ష్మస్థాయి పరిణామం మరో ఎత్తు. కేరళలోని అనంతపద్మనాభస్వామి దర్శనానికి విధిగా చొక్కా తీయాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ లోనికి కూడా వెళ్లని ఈ నాస్తికుడు... తదనంతర కాలంలో కూతురి మరణంతో జిల్లెల్లమూడి అమ్మ దగ్గర సాంత్వన పొందారు; ఏదీ తన చేతిలో లేదనే అభిప్రాయంలోకి వచ్చారు. అందువల్లే ‘ఎమెస్కో’ ప్రచురించిన ఈ పుస్తకం పేరు ‘విధి నా సారథి’ అయింది. పాత్రికేయులతోపాటు, పత్రికల వ్యవహారాలు తెలుసుకోగోరే పాఠకులకు ఆసక్తికర పుస్తకం. ఈతరం కోసం కథాస్రవంతి ఈతరం కోసం కథాస్రవంతి (10 పుస్తకాల సీరిస్) ప్రధాన సంపాదకుడు: వల్లూరు శివప్రసాద్ ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ, 101,బృందావన్ పార్క్ రెసిడెన్సీ, 7వ లేన్, ఎస్.వి.ఎన్. కాలనీ, గుంటూరు-522006; ఫోన్: 9291530714 ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ చేసిన ఒక పద్ధతైన పని ఇది. వల్లూరు శివప్రసాద్ ప్రధాన సంపాదకుడిగా ‘సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ పాఠకుడి హృదయానికి సన్నిహితమైన’ పదిమంది కథకుల ఎంపిక చేసిన కథలు కథాస్రవంతి పేరిట పునర్ముద్రణయ్యాయి. అన్నీ సుమారు నూరు పేజీల పుస్తకాలు. ఒక్కోటీ యాభై రూపాయలు. వేర్వేరు సంపాదకులు. వేర్వేరు విశ్లేషణలు. కొడవటిగంటి కుటుంబరావు కథలు (కృష్ణాబాయి), చాసో కథలు (చాగంటి తులసి), మధురాంతకం రాజారాం కథలు (ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు), పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (రాచపాళెం చంద్రశేఖరరెడ్డి), కేతు విశ్వనాథరెడ్డి కథలు (సింగమనేని నారాయణ), కొలకలూరి ఇనాక్ కథలు (మేడిపల్లి రవికుమార్), ఓల్గా కథలు (కె.శ్రీదేవి), పి.సత్యవతి కథలు (కె.ఎన్.మల్లీశ్వరి), అల్లం శేషగిరిరావు కథలు (జగన్నాథశర్మ), అల్లం రాజయ్య కథలు (ముక్తవరం పార్థసారథి); ‘ఈయన కథలు ఫార్ములా కథలు కావు. అంటే ఖాయంగా ఒకే పద్ధతిలో అన్ని కథలూ పరిణామం చెందాలి. చివర ఒక నిర్ణయం ఉండాలనడం చాసోకథలోని నియమం కాదు’(చాసో గురించి తులసి). పినిశెట్టి ముఖచిత్రాల ఈ సీరిస్‌లో కమ్మ తెమ్మెర, జీవన్ముక్తుడు(రాజారాం), చీకటి, వఱడు(శేషగిరిరావు), మనిషి లోపలి విధ్వంసం, మహాదేవుని కల(రాజయ్య), ఇంగువ, ఏస్ రన్నర్(సుబ్బరామయ్య), సూపర్‌మామ్ సిండ్రోమ్, ఇల్లలకగానే(సత్యవతి) లాంటి ఎన్నో చక్కటి కథలు చదవొచ్చు. సూర్యోదయం ‘నిషిద్ధం’ అన్న అలెగ్జాండర్‌కు 1886లో రాసిన లేఖలో చెహోవ్ (1860-1904) కథలో ప్రకృతి వర్ణన ఏమేరకు ఎలా ఉండాలో ఇలా రాశారు(అనువాదం: ముక్తవరం పార్థసారథి): ‘‘నా అభిప్రాయంలో ప్రకృతి వర్ణన వీలైనంత తక్కువగా ఉండాలి. ప్రకృతి కూడా కథలో ఒక పాత్ర కావాలి. అయితే, ‘సూర్యోదయ సూర్యాస్తమయ వర్ణనలు, బాలభానుని బంగారు కిరణాలు, నీలాకాశంలో బారులు తీరిన పక్షుల గుంపులు, కిలకిలారావాలు’ నిషిద్ధం. ప్రకృతిలోని ఏ అంశాన్ని ప్రత్యేకంగా చిత్రిస్తే కథమీద అది ప్రభావాన్ని కలిగించబోతున్నదో తెలుసుకోగలగాలి కథకుడు. మన వర్ణనను బట్టి పాఠకుడు ఆ దృశ్యాన్ని వూహించుకోగలడా? ‘వెన్నెల కిరణం ఒకటి పెంకుటింటి చూరులోంచి గదిలో ఉన్న గాజుసీసా మీద పడి మెరిసింది’ అంటే కథా, వర్ణనా కలిసిపోవూ! పాత్రలు చేసే పనులతో కలసిపోవాలి ప్రకృతి వర్ణన. పాఠకుడు ముందే వూహించగలిగింది మళ్లీ చెప్పడం రచయిత ప్రతిభకు నిదర్శనం కానేరదు. పాత్రల మనస్తత్వం వాళ్ల ప్రవర్తన ద్వారా తెలియాలి. సంబంధాలలో ఓ టెన్షన్ - గురుత్వాకర్షణ శక్తితో గ్రహాలు తమ తమ స్థానాలలో ఉన్నట్టుగా పరస్పర సంబంధం - ఓ బిగువు - ఏ క్షణాన ఏ మార్పు వస్తుందోనన్న వుత్కంఠ, ఉద్విగ్నత కథ పండటానికి సహాయం చేస్తాయి. మనిషికి అద్దం పట్టటమే కళ చెయ్యాల్సిన పని. సత్యాన్ని గ్రహించిన మనిషి తనే మారతాడు. ప్రతిభ ఒక్కటే సరిపోదు. శ్రమించగలిగే స్వభావం లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా వృథా. పైగా, ప్రతిభ జన్మసిద్ధం. అందులో నీ ప్రమేయం ఏముంది?’’ నేర్పుడు అల్కగ అతిసున్నితంగ మెసిలే బాధల్లోకి తొంగిచూసే తీరికలేనితనం ముద్దుగ పొందికగ చూపుల్ని మైదానంమీద పర్చలేనితనం సోయితోని సోపతితోని తొవ్వలనడుస్తున్న మనుషుల్ని మందలించలేనితనం గదిల మతిల జ్ఞాపకాలని పలవరించనితనం సుఖంగ దుఃఖంగ కండ్లు చెమ్మగిల్లనితనం ఇప్పుడు నడుస్తున్న ఈకాలం ఠి వేముగంటి మురళీకృష్ణ ఫోన్: 9676598465 తెల్లపువ్వుల మధ్య నుంచి బయటికొచ్చింది తెల్లసీతాకోకచిలక గింజలు వేసి కోళ్ల కేదో చెప్పి వెళ్లాడు ముసలాయన పొగమంచు- ‘‘వృద్ధాశ్రమం ఇటేనా?’’ ఎవరో అడుగుతున్నారు నిండు చంద్రుడు- గుడిసెపై నుంచున్న కోళ్ల నిశ్శబ్దం ఈ రాత్రి వాన- ఇస్మాయిల్ లేరు కదా అన్న తలపు -గాలి నాసరరెడ్డి కొత్త పుస్తకాలు సమర సమయ విచార వివేకము (ఉద్యోగపర్వం-3 భాగాలు) వ్యాఖ్యానం: సాంప్రతి సురేంద్రనాథ్ పేజీలు: 338+276+316; వెల: 400 (మూడింటికీ) ప్రతులకు: భారత ధర్మ ప్రచార పరిషత్, పుచ్చా లలిత - రమణ చారిటబుల్ ట్రస్ట్, 601, సెంటర్ పాయింట్, 18 రోడ్, చెంబూర్, ముంబై-400071; (డాక్టర్ లలిత, హైదరాబాద్- ఫోన్: 9848060579). అక్షర గోదావరి పురస్కారాలు మొజాయిక్ సాహిత్య సంస్థ, సాహిత్య సురభి, రిత్విక్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో విశాఖ పౌరగ్రంథాలయంలో నేడు ఉదయం 10 నుంచి గోదావరి పుష్కర ప్రత్యేక కవి సమ్మేళనం జరగనుంది. రామతీర్థ (ఫోన్: 9849200385) అధ్యక్షత వహించే ఈ కార్యక్రమంలో అద్దేపల్లి రామ్మోహనరావు, దాట్ల దేవదానం రాజు, ఎల్.ఆర్.స్వామికి ‘అక్షర గోదావరి’ పురస్కారాల ప్రదానం కూడా చేయనున్నారు. ఆకెళ్ల రవిప్రకాష్, ద్రోణంరాజు శ్రీనివాస్, చలసాని ప్రసాద్ విశిష్ట అతిథులు. మీ అభిప్రాయాలూ, రచనలూ పంపవలసిన మా చిరునామా: సాహిత్యం, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34; ఫోన్: 040-23256000 sakshisahityam@gmail.com -
వాళ్ళ ఇంటి కుక్క కూడా సంగీతం పాడింది!
పొత్తూరి వెంకటేశ్వరరావు, సీనియర్ పత్రికా సంపాదకులు, రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు గారి గురించి రాయడానికీ, చెప్పడానికీ నాకున్న అర్హత ఏమిటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నాకు సంగీతం రాదు. అయితే, సంగీతాన్నీ, మంచి పాటనూ ఆస్వాదించడం వచ్చు. నేను టీనేజ్‌లో ఉండగా విన్న ఒక సినిమా గీతం ఆయన పట్ల నాకు ఆరాధనను పెంచింది. అది - ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహోహో పావురమా...’ పాట. ఆయన స్వరకల్పన చేసిన ఆ పాట తలుచుకుంటే, ఇవాళ్టికీ భలేగా ఉంటుంది. ముఖ్యంగా, ఆ పాటకు ముందుగా వచ్చే ఆ ‘హమ్మింగ్’ లాంటిది భానుమతి పాడిన తీరు, ఆ రకంగా దానికి వరుస కట్టిన రజనీ గారి ప్రావీణ్యం ఇప్పటికీ నిత్యనూతనమే. ఆ రకంగా ఆ రోజుల నుంచే నేను ఆయన సంగీతానికీ, పాటకూ అభిమానిని. ఆ తరువాత జర్నలిజమ్‌లోకి వచ్చాక బెజవాడకు వెళ్ళినప్పుడు జర్నలిస్టు మిత్రులు నండూరి రామమోహనరావు, సి. రాఘవాచారి, ఉషశ్రీ లాంటి వారితో కలుస్తుండేవాణ్ణి. అలా రజనీగారిని కూడా చాలాసార్లు వ్యక్తిగతంగా కలిశాను. అయితే, ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కువ అనుబంధం ఏర్పడింది. పైగా అప్పట్లో నేను ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో పనిచేసేవాణ్ణి. అందువల్ల కొంత వెసులుబాటు ఉండేది. రజనీ గారిని ఎప్పుడు కలిసినా, కేవలం పది నిమిషాలే మాట్లాడుకున్నా సరే, అందులోనూ సంగీతం వినిపించకుండా, మాట్లాడేవారు కాదు. సామాన్య సంభాషణల్లో కూడా అలా సంగీతాన్ని ప్రస్తావించడం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపించే లక్షణం. నిజం చెప్పాలంటే, సంగీతం లేని రజనీని ఊహించలేమంటే నమ్మండి. మనకున్న కళాకారుల్లో, సాహిత్యవేత్తల్లో ఇటు సంగీతం, అటు సాహిత్యం - రెండింటిలోనూ ప్రావీణ్యం ఉన్నవారు ఈ తరంలో, నాకు తెలిసినంత వరకు రజనీ ఒక్కరే! ఒక తరం వెనక్కి వెళ్ళి చూస్తే, సంగీత, సాహిత్యాల్లో అంతటి మహానుభావుడు - హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు. రజనీ గారిలో మరో గొప్పదనం - ప్రకృతిలో, పశుపక్ష్యాదులలో కూడా సౌందర్యాన్నీ, కవిత్వాన్నీ చూసే విభిన్నమైన చూపు. పశువులు, పక్షుల అరుపులో కూడా సంగీతం చూశారాయన. అందుకు ఆయన చేసిన సంగీత రూపకం ‘కొండ నుంచి కడలి దాకా’ ఒక ఉదాహరణ. కీచురాళ్ళ చప్పుడులోనూ సౌందర్యం, సంగీతం, శ్రావ్యతను చూడడం రజనీ ప్రత్యేకత. 1970లలో అనుకుంటా... ఆ సంగీత రూపకానికి గాను ఆయనకు జపాన్ వాళ్ళదనుకుంటా... అవార్డు కూడా వచ్చింది. ఇక్కడ నాకు ఎదురైన ఒక స్వీయానుభవం ప్రస్తావించాలి. ఒకరోజు మాటల సందర్భంలో ఆయన మా ఇంట్లోని కుక్కకు కూడా సంగీతం వచ్చు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నాకొకసారి వినిపించండి అన్నాను. సరే అన్నారు. వాళ్ళింటికి వెళ్ళాను. అప్పుడు ఆయన ఆ పెంపుడు కుక్కను పక్కనపెట్టుకొని, ‘సా’ అని రాగం తీశారు. గమ్మత్తుగా అది కూడా ‘సా’ అంటూ ఆ ఫక్కీలోనే అంది. అలాగే, ‘రి’. ఎక్కడా ఎగుడుదిగుళ్ళు లేకుండా రజనీ గారి ఇంటి పెంపుడు కుక్క ‘సరిగమ పదనిస’లు అన్నీ పలికినట్లు నాకు అనిపించింది. పాటలైతే పాడలేదు కానీ, ఆ కుక్క స్వరాలు పలుకుతున్నట్లు గ్రహించాను. ఆ వెంటనే ‘ఆంధ్రప్రభ’ వారపత్రికలో ఆ ‘సంగీతం పాడే కుక్క’ గురించి ప్రత్యేకంగా ఒక ఫీచర్ రాసి, ప్రచురించాను. ‘ఏ గూటి చిలక ఆ గూడి పలుకు’ అని మనకో జాతీయం ఉంది. సరిగ్గా అలాగే, ఇక్కడ సంగీతపు గూటి కుక్క, ఆ గూటిలోని సంగీతాన్నే పలికిందన్నమాట. ఇవాళ ఒక్కసారి తెలుగునాట సంగీత పరిణామక్రమాన్ని సింహావలోకనం చేసుకుంటే, శాస్త్రీయ సంగీతం కాస్తా లలితసంగీతంగా రూపం మార్చుకొని, ప్రవర్తిల్లడం ఒక పరిణామ దశ. ఆ పరిణామంలో దేవులపల్లి కృష్ణశాస్త్రితో సహా కొందరు సాహిత్యకారులు, సంగీతజ్ఞుల పాత్ర ఉంది. వారితో పాటు రజనీ గారిది కూడా లలిత సంగీతావిర్భావంలో ఒక ముఖ్యపాత్ర. అలాగే, విజయవాడ ఆకాశవాణి కేంద్రం డెరైక్టర్‌గా కూడా ఆయన నూతన పథగామి అయ్యారు. ఆకాశవాణిలో మామూలు స్థాయిలో మొదలైన ఆయన కేంద్ర సంచాలకుడి స్థాయి వరకు ఎదిగారు. సాధారణంగా ఆ స్థాయికి వచ్చాక, చాలామంది మునుపు చేసినవారి మార్గాన్నే అనుసరిస్తూ, ఒక మూసలో వెళ్ళిపోతుంటారు. కానీ, రజనీ గారు అలా కాదు. వినూత్నమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ‘భక్తి రంజని’ లాంటివెన్నో రజని గారి కంట్రిబ్యూషనే! అలాగే, యువకులు, కొత్తవాళ్ళలోని ప్రతిభను పసిగట్టి, వాళ్ళను ప్రోత్సహించే ప్రత్యేక లక్షణం ఆయన సొంతం. అలా ప్రతిభకు పట్టం కట్టే సంప్రదాయానికి ఆయన ఒరవడి పెట్టారు. ఇతరులకు కూడా ఆ విషయంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వ్యక్తిగతంగా చూస్తే, వయసులో నా కన్నా రజనీ గారు చాలా పెద్ద. అయినా, నన్నెప్పుడూ ఆయన స్నేహదృష్టితో చూసేవారు. ఆయన, రచయిత మహీధర రామమోహనరావు, నేను కలిసి, సరదాగా మాట్లాడుకున్న క్షణాలు, ఫోటోలు దిగిన క్షణాలు నాకిప్పటికీ గుర్తే! ఆయనకు వయసు మీద పడ్డాక ఎప్పుడైనా కలిసినప్పుడు, ‘కులాసాగా ఉన్నారా’ అని నేను అడిగితే, ఆయన నన్ను గుర్తుపట్టానని చెప్పడానికి బదులుగా కావాలని - ‘నేను... పొత్తూరి వెంకటేశ్వరరావును’ అంటూ ఉంటారు. నేను వెంటనే, ‘అవును. మరి నేనేమో బాలాంత్రపు రజనీకాంతరావును’ అని నమస్కరిస్తుంటా. ఆ మాటతో ఇద్దరం హాయిగా నవ్వుకుంటాం. నిండు చంద్రుడి లాంటి ఆయన నవ్వుకు మరో వసంతం నిండుతున్నందుకు ఆనందిస్తున్నాను. స్నేహసంగీతం పరిమళించే ఈ శతాయువు తెలుగు లలిత సంగీత ప్రపంచంలో చిరాయువు! (సంభాషణ - రెంటాల జయదేవ) -
ఆకాశమంతెత్తు ఆ రెండు శిఖరాలు!
తాజా పుస్తకం: ఒకప్పుడు బెజవాడ చుట్టూ చాలా కొండలుండేవి. వాటి సిగపాయల్లో మరెన్నో శిఖరాలు మెరుస్తుండేవి. కాలపురుషుడు వాటిలో చాలావాటిని -ఉల్లిపాయలు తరిగినట్లు- నరికిపారేశాడు. కానీ, కొన్ని శిఖరాలు ఇప్పటికీ ఠీవిగా తలెత్తుకు తిరుగుతూనే ఉన్నాయి. కాలపురుషుడే కాదు- కాలయముడు కూడా మమ్మల్నేం చెయ్యలేడు అన్నట్లు నిటారుగా నిలిచివుండే శిఖరాలవి. ఈ మధ్యన బెజవాడ వెళ్లినప్పుడు అలాంటి శిఖరాల్ని చూసి ముచ్చటించి ఆనందపడ్డాను. ఏలూరు రోడ్డులోని సీతారాంపురంలో కనకదుర్గా సినిమాటాకీసు ఉండేది. అదిప్పుడు లేదు. అక్కడ కట్టిన అపార్టుమెంట్లలో పెద్దిభొట్ల సుబ్బరామయ్య ఉంటున్నారు. ఎంచేతో గానీ, సుబ్బరామయ్యగారు మాచవరం, మారుతీనగర్, చుట్టుగుంట, సీతారాంపురం - ఆ చుట్టుపక్కలే ఉంటుంటారు. ‘ఇది ఈ మధ్యన మొదలయిందేం కాదు- నేను ఎస్సారార్‌లో చదివే రోజుల్నించీ నాకిక్కడే అలవాటు. అప్పట్లో (విశ్వనాథ) సత్యనారాయణగారు ఇక్కడ ఉండడం వల్ల కావచ్చు. విశాలాంధ్రలో నా స్నేహితులు చాలామంది ఉద్యోగాలు చేస్తూండడం వల్ల కావచ్చు. నాకే కాదు- ఇంట్లో వాళ్లందరికీ ఈ ప్రాంతం అలవాటయిపోయినందువల్ల కావచ్చు. మొత్తానికి ఎక్కువభాగం ఇక్కడే ఉండిపోయాం. ఆ మాటకొస్తే, నా డెబ్బయ్యారేళ్ల జీవితంలో గట్టిగా పదేళ్లు తప్పిస్తే మిగతాదంతా బెజవాడలోనే గడిచిపోయింది. ఎన్నో చేదు అనుభవాలూ మరెన్నో తియ్యని అనుభూతులూ ఇక్కడే ఎదురయ్యాయి నాకు’ అన్నారు పెద్దిభొట్ల. ‘నేనీ ప్రపంచానికి ఏమివ్వగలిగానో ఎప్పుడూ పరామర్శించుకోలేదు. కానీ, ప్రపంచం మాత్రం నాపైన బోలెడంత కరుణ కురిపించింది. నేను డిగ్రీ ఇలా పూర్తి చేశానోలేదో లయోలా కాలేజ్ యాజమాన్యం నన్ను పిల్చి ట్యూటరు ఉద్యోగమిచ్చింది. అప్పట్లో రెవెన్యూ డిపార్టుమెంటులో గుమాస్తాలకు 48 రూపాయలిచ్చేవాళ్లు. అలాంటిది, లయోలావాళ్లు నాకు 116 రూపాయల నెలజీతంమీద ఉద్యోగమిచ్చారు. నిజానికి నాకు విశాఖ వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీలో ఫోర్తానర్సు చెయ్యాలని ఉండేది. కానీ, మా అమ్మ మాటమీద లయోలాలో చేరాలని -ఓ శనివారం ఉదయం- బయల్దేరా. దార్లో లీలా మహల్ బయట ఓ బోర్డు పెట్టిఉంది. సత్యజిత్ రాయ్ తీసిన ‘పథేర్ పాంచాలీ’ ఆ పూట ఒకే ఒక్క షో వేస్తున్నారట. బస్సుదిగి తిన్నగా వెళ్లి హాల్లో కూర్చుని, ఆటయ్యాక ఇంటికెళ్లిపోయా. సోమవారం నాడు లయోలాకు వెళ్లి ట్యూటరుగా చేరిపోయాను. అక్కడే రిటైరయినాను. ఈ మధ్యే మా కాలేజ్ వాళ్లు నన్ను పిల్చి సన్మానం చేసి -అదిగో, ఆ జ్ఞాపిక చేతికిచ్చి పంపించారు’ అంటున్నప్పుడు సుబ్బరామయ్యగారి మొహం -సంతృప్తితో కాదు, సంతోషంతో- తళతళలాడింది. ‘విషయమేమిటంటే, నాకు విశాఖ వెళ్లాలనుకున్నా వెళ్లివుండలేకపోవచ్చు. కానీ, పథేర్ పాంచాలీ సినిమా చూడదల్చుకున్నప్పుడు చూసేశాను! అంటే మంచి కథో మంచి సినిమానో అంటే ఉండే పిచ్చి అది. ఆ పిచ్చిని అర్థం చేసుకున్నారు కాబట్టే చెప్పిన టైముకు రాకపోయినా లయోలా ఫాదర్లు నా మీద కోపగించలేదు. సరిగదా, మా కాలేజ్‌లో ఓ మంచి రైటరున్నాడర్రా అని కేరళలో అందరికీ మచ్చటగా చెప్పుకునే వారట కూడా. అలాగే, నేనేదో నా బుద్ధికి తోచిన కథలేవో రాసుకుపోయానంతే. సెంట్రల్ సాహిత్య అకాడెమీ వాళ్లు బహుమతిచ్చారు. ఓ రోజు మధ్యాహ్నం భోంచేసి కూర్చున్నా. ఎవరో అపరిచితులు ఫోన్ చేశారు. ‘నా పేరు అప్పాజోస్యుల సత్యనారాయణ- మా అజోవిభొ ఫౌండేషన్ పురస్కారం మీకివ్వాలనుకుంటున్నాం!’ అన్నారాయన. అది చాలా పెద్దపేరున్న సంస్థ అని తెలుసు తప్ప వాళ్ల అడ్రెస్గానీ, కనీసం ఫోన్ నంబరుగానీ నాకు తెలీవు. అయినా పిల్చి పీటేయడం వాళ్ల ఔదార్యం’ అన్నారు పెద్దిభొట్ల తొణకని బెణకని ఆత్మ గౌరవంతో. ఆ తర్వాత సిద్ధార్థ కాలేజ్ దాటి, సున్నపు బట్టీల మీదుగా, క్రీస్తురాజపురం వైపు వెళ్తుంటే, ఓ సందులో ‘అభ్యాస’ స్కూలు బస్సులు కనిపించాయి. అదే సందులో సి.రాఘవాచారిగారిల్లుంది. వరవరరావులాంటి వాళ్లను మార్క్సిజం ప్రభావ పరిధిలోకి ఆకర్షించిన ప్రతిభ ఆయనది. అరవై దశకంలో పేట్రియాట్, లింక్ పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాఘవాచారిగారు గొప్ప వ్యాఖ్యలను -రిపోర్టుల పేరిట- రాశారు. వాటి గురించి ‘అప్ కంట్రీ’ జర్నలిస్టులు ఇప్పటికీ ప్రస్తావిస్తూ ఉండడం కద్దు. ఇక, విశాలాంధ్ర పత్రికను తెలుగు సాంస్కృతిక జీవిత ప్రతినిధిగా దిద్దితీర్చడంలో ఆయన పాత్ర అందరికీ తెలిసిందే. బెజవాడలో జరిగే చెప్పుకోదగిన సభలన్నింటికీ రాఘవాచారిగారే అధ్యక్షత వహించడం ఓ స్థానిక సంప్రదాయంగా పరిణమించింది. డైలీ జర్నలిజం నుంచి విరమించినప్పటికీ, ఇప్పటికీ, విజయవాడ మేధో జగత్సహోదరులకు పెద్దదిక్కుగా ఆయన కొనసాగుతూనే ఉన్నారు. ‘మాది వరంగల్లు. మా మేనమామలది పశ్చిమగోదావరి జిల్లా పెన్నాడ. తెలుగు సంస్కృతిలోని భిన్నత్వాన్నీ దాన్లోని ఏకత్వాన్నీకూడా చిన్నప్పుడే గ్రహించినవాణ్ణి నేను. వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవనంలో అరుదయిన వ్యక్తులను అతిసన్నిహితంగా చూశాను. అది వరంగల్లులోని కాళోజీలే కావచ్చు- హైదరాబాద్‌లోని మఖ్దూం, రాజ్‌బహదూర్ గౌర్, మొహిత్ సేన్లే కావచ్చు- విజయవాడ వచ్చాకా విశాలాంధ్ర పెద్దలయిన చంద్రంగారూ, బలరామమూర్తిగారే కావచ్చు. సంపాదక ప్రముఖులు నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావుగారే కావచ్చు. రాంభట్ల, మల్లారెడ్డి, బూదరాజులాంటి అభ్యుదయ రచయితలే కావచ్చు. వీళ్లలో ప్రతిఒక్కరితోనూ ఆత్మీయ అనుబంధం ఏర్పడింది నాకు. ఆ బాంధవ్యం ప్రాతిపదికగానే మా స్నేహం మారాకు వేస్తూ వచ్చింది.’ అన్నారు రాఘవాచారి సగర్వంగా. ‘నేనన్నమాటకు అర్థం పైన చెప్పినవాళ్లతో నాకు భిన్నాభిప్రాయాలే లేవని కాదు సుమా!’ అని హెచ్చరించారాయన. ‘ఎప్పుడూ ఎవరితోనూ మూసకట్టు ‘అభిప్రాయభేదాలు’ పెంచుకోలేదన్నది నా పాయింటు. మన గీటురాళ్లు మనం జాగ్రత్తగా పెట్టుకోవడం ముఖ్యం.’ ఆ తర్వాత చాలామాటలే నడిచాయి. ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు. పెద్దిభొట్ల, రాఘవాచారి... ఇద్దరూ వయసు తాలూకు అలసటగాని అనారోగ్యపు అస్థిమితత్వాన్నిగాని లెక్క చేయకుండా హుషారుగా ఉన్నారు. దప్పికేసిన వాళ్లకు దాహం అందించే చలివేంద్రాల్లానే ఉన్నారు. దేశమంటే మట్టికాదు మనుషులు అంటే అర్థం అదే. ఒక ఊరంటే ఆ ఊరి మనుషులే. పర్లేదు. బెజవాడ భేషుగ్గానే ఉంది. - మందలపర్తి కిశోర్ 99122 29931 -
దీక్ష విరమించాలని జగన్ కు పొత్తూరి లేఖ
-
దీక్ష విరమించాలని జగన్ కు పొత్తూరి లేఖ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వెంటనే విరమించాలని సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. వైఎస్ జగన్‌ను అభిమానించే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాకంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దీక్ష ద్వారా జగన్ ఆరోగ్యం దెబ్బ తింటే అభిమానులు తీవ్రంగా కలత చెందుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నట్లు వివిధ పత్రికల్లో వచ్చిన పలు వార్తా కథనాలు చదివినట్లు ఆయన తెలిపారు. ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి నిరాకరించినట్లు ఆ వార్త కథనాల ద్వారా తెలుసుకునీ ఆవేదన కలిగిందని పొత్తూరి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా జగన్‌కు రాసిన లేఖలో వివరించారు.