పొత్తూరికి జాతీయ పురస్కారం
ప్రెస్ కౌన్సిల్ స్వర్ణోత్సవం సందర్భంగా ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంక టేశ్వరరావును ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం జాతీయ పురస్కారంతో సత్కరించింది. కౌన్సిల్ స్వర్ణోత్సవం సందర్భంగా గత 50 ఏళ్లుగా పత్రికారంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొత్తూరి ఒత్తిళ్లకు గురికాకుండా నిక్కచ్చిగా తన భావాలను వ్యక్త పరిచేవారు. 82 ఏళ్ల వెంకటేశ్వరరావు ఆంధ్ర జనత పత్రికలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఉదయం, ఈనాడు పత్రికల్లో సంపాదకులుగా పనిచేశారు.
టీటీడీ పబ్లికేషన్‌సలో గౌరవ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా, నాగార్జున వర్సిటీల్లో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌స విభాగం బోర్డు మెంబర్‌గానూ వ్యవహరించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జర్నలిజం కోర్స్ మెటీరియల్‌కు సంబంధించి చీఫ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా మండలి సభ్యుడిగా.. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సుల్లో సమూల మార్పులకు కృషి చేశారు. ప్రెస్ కౌన్సిల్ పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని పొత్తూరి చెప్పారు. ప్రస్తుత సమాజంలో స్వేచ్ఛా జర్నలిజం అవసరం ఎంతో ఉందని, పత్రికల యజమానులు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కాకుండా స్వేచ్ఛగా వ్యవహరించాలని సూచించారు.