Press council
-
ఇవాళ్టి అవసరం!
ఎవరైనా, ఏదైనా మారుతున్న కాలానికి తగ్గట్టు మారాల్సిందే. నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకొని, దేశంలోని పత్రికా రంగాన్నీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)ను గుర్తుచేసుకున్న పక్షం రోజులకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమర్పించిన నివేదిక మారుతున్న మీడియా ప్రపంచంతో మారాల్సిన విధానాలను స్పష్టం చేసింది. పత్రికలు, ఎలక్ట్రానిక్, డిజిటల్ – ఇలా విస్తరించిన మీడియా అంతటినీ పర్యవేక్షించేలా ‘మీడియా కౌన్సిల్’ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అవ్యవస్థలకూ, అక్రమాలకూ అడ్డుకట్ట వేసేలా కౌన్సిల్‌కు చట్టబద్ధమైన అధికారాలు కట్టబెట్టాలంది. ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్ ఉన్నా, దాని ప్రభావం పరిమితమే. అందుకే, వర్తమానానికి అవసరమైన మీడియా కౌన్సిల్ ఏర్పాటు కోసం నిపుణులతో ఓ కమిషన్ వేయాలంది. ప్రింట్ మీడియాకు ఎప్పటి నుంచో చట్టబద్ధమైన ప్రెస్ కౌన్సిల్ ఉంది. కానీ, టీవీకి అలాంటిది లేదు. సంస్థలుగా వృద్ధి చెందిన జాతీయ బ్రాడ్‌కాస్టింగ్ ప్రమాణాల సంస్థ (ఎన్బీఎస్ఏ), న్యూస్ బ్రాడ్కాస్టర్ల అసోసియేషన్ (ఎన్బీఏ)లకేమో ప్రభుత్వ అధికారిక గుర్తింపు లేదు. మరోపక్క, మన దేశంలో ఎన్ని ఇంటర్నెట్ వెబ్సైట్లున్నాయో ఎలక్ట్రానిక్స్ – ఐటీ శాఖలో రికార్డు లేదు. ఓ లెక్క ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల వెబ్‌సైట్లున్నాయి. వాటిలో కనీసం 20 కోట్ల సైట్లు చురుకుగా పనిచేస్తున్నాయి. మన దేశంలో 1.44 లక్షల వార్తాపత్రికలు, మేగజైన్లున్నాయి. 926 ఉపగ్రహ టీవీ ఛానళ్ళు (387 న్యూస్ ఛానళ్ళు, 539 నాన్–న్యూస్ ఛానళ్ళు), 36 దూరదర్శన్ ఛానళ్ళు, 495 ఆకాశవాణి ఎఫ్.ఎం. కేంద్రాలు, 384 ప్రైవేట్ ఎఫ్.ఎం. రేడియోలు ఉన్నట్టు లెక్క. ఇవి కాక నేటి సోషల్ మీడియా. అందుకే, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సారథ్యంలోని స్థాయీ సంఘం బుధవారం పార్లమెంట్‌కు సమర్పించిన ‘మీడియా కవరేజ్‌లో నైతిక ప్రమాణాలు’ నివేదికలోని అంశాలు కీలకం. నకిలీ వార్తలు, చెల్లింపు వార్తలు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తున్న రోజులివి. వాటితో కుస్తీ సాగుతుండగానే, మరోపక్క సామాజిక మాధ్యమ వేదికల వల్ల పత్రికా రచన పౌరుల చేతుల్లోకి వచ్చింది. కొన్ని లోపాలున్నా పౌర పాత్రికేయం మంచిదే. అయితే, వ్యాప్తి పెరుగుతున్న డిజిటల్ మీడియాలోనూ విశృంఖలత విజృంభిస్తోంది. అందుకే, డిజిటల్ మీడియాలో నిర్ణీత నైతిక నియమా వళిని పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సంఘం సూచించింది. అది కావాల్సిన, రావాల్సిన మార్పు. అదే సమయంలో భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుతూ ఆ పని చేయాలంది. అది ఆమోద యోగ్య మార్గం. అలాగే, ఈ ఏడాదే ప్రకటించిన ‘ఐటీ రూల్స్ 2021’ డిజిటల్ మీడియా వేదికల్లో జవాబుదారీతనం తెస్తాయనీ, కంటెంట్ నియంత్రణలో ఉపకరిస్తాయనీ స్థాయీసంఘం ఆశిస్తోంది. ఇవాళ్టి డిజిటల్ యుగంలోనూ ప్రభుత్వాలు విధిస్తున్న నెట్ నిషేధాలూ చూస్తున్నాం. కానీ, దేశ భద్రత, సమైక్యత పేరిట ఫోన్ సర్వీసులు, ఇంటర్నెట్పై నిషేధంతో ప్రజాస్వామిక హక్కులకు భంగం వాటిల్లుతుంది. ఆర్థిక పురోగతీ దెబ్బతింటుంది. అత్యవసర పరిస్థితులంటూ ఫోన్, నెట్ సేవలను నిషేధించడం వల్ల టెలికామ్ ఆపరేటర్లకు ప్రతి సర్కిల్ ఏరియాలో గంటకు రూ. 2.4 కోట్ల నష్టం వస్తుందని అంచనా. గంపగుత్తగా ఇలా నిషేధం పెట్టి నష్టపరిచే కన్నా, అవసరాన్ని బట్టి ఫేస్బుక్, వాట్సప్, టెలిగ్రామ్ లాంటి సర్వీసులను ఎంపిక చేసుకొని ఆ నిర్ణీత వేళ వాటిని నిషేధించే ఆలోచన చేయాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఇదీ ఆచరణాత్మకమే అనిపిస్తోంది. 1995 నాటి కేబుల్ నెట్వర్క్స్ (నియంత్రణ) చట్టంలో మార్పులు తేవాలనీ స్థాయీ సంఘం అంటోంది. అలా చట్టాన్ని సవరిస్తే– ఫిర్యాదులపై పాలకుల ఇష్టారాజ్యపు కార్యనిర్వాహక ఉత్తర్వుల మేరకు కాక, చట్టప్రకారం వ్యవహరించవచ్చు. ఇక, ‘కేబుల్ నెట్వర్క్ రూల్స్–2014’లోని ‘జాతి వ్యతిరేక వైఖరి’ అనే పదాన్ని సమాచార ప్రసార శాఖ సరిగ్గా నిర్వచించాలన్న మాట స్వాగతనీయం. ప్రైవేట్ టీవీ ఛానళ్ళను అనవసరంగా వేధించడానికి ఆ పదం ఆయుధమవుతున్న సందర్భాలు న్నాయి. ఆ మధ్య కేరళలో రెండు టీవీ ఛానళ్ళకు అదే జరిగింది. ఇటీవల ఓవర్ ది టాప్ (ఓటీటీ) వేదికలూ ఊపందుకుంటున్నాయి. ఆన్లైన్లో, ఓటీటీ వేదికల్లో నియంత్రణ లేని అన్ని రకాల కంటెంట్ అందుబాటులో ఉంటోంది. ఏ పరిధిలోకీ రాకుండా తప్పించుకుంటున్న వీటిపైనా ఈ స్థాయీ సంఘం దృష్టి పెట్టింది. అనియంత్రిత ఓటీటీ కంటెంట్ పిల్లలపైనా ప్రభావం చూపుతుంది. అలాగని ఏది చూడాలి, ఏది వద్దనే వీక్షకుడి స్వేచ్ఛను ప్రభుత్వం కఠిన చర్యలతో కత్తిరించడమూ కరెక్ట్ కాదు. స్థాయీ సంఘం సైతం అంగీకరించిన వీటిని దృష్టిలో పెట్టుకొని నియమావళి చేయాలి. ప్రతిపాదిత ‘మీడియా కౌన్సిల్’ ఏర్పాటుపై ఏకాభిప్రాయ సాధనకు పనిచేసే నిపుణుల కమిషన్ ఆరు నెలల్లో తన నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. ఆపైన ప్రభుత్వం చొరవ చేస్తే, ప్రెస్ కౌన్సిల్‌కు భిన్నంగా అన్ని మీడియాలనూ పర్యవేక్షించే మీడియా కౌన్సిల్ వస్తుంది. డిజిటల్ మీడియాకూ నైతిక వర్తనా నియమావళిని చేశాక, అది అమలయ్యేలా చూడడం మరో ఎత్తు. అందుకు సమాచార, ఐటీ శాఖలు కలసి పనిచేయడం అవసరం. అదే సమయంలో కొత్త కౌన్సిల్, నియమావళి దుర్వినియోగం కాకుండా చూడడమూ అంతే అవసరం. పాలకులు తమ స్వార్థం, కక్ష సాధింపుల కోసం వాటిని వినియోగించుకొంటే అసలు లక్ష్యం పక్కకు పోతుంది. పౌరుల భావప్రకటన స్వేచ్ఛకూ, మీడియాకూ అండనిచ్చిన 14, 19, 21వ రాజ్యాంగ అధికరణాలను ఉల్లంఘించకుండా అదుపాజ్ఞలూ కావాలి. అలాంటి సమగ్ర నియమావళి, సమర్థ మీడియా కౌన్సిల్ ఏర్పడితే మంచిదే! -
‘దళిత్’ మాటను వాడొద్దని చెప్పండి
ముంబై: ‘దళిత్’ అనే మాటను మీడియాలో వాడకుండా తగు సూచనలు చేయాలని ముంబై హైకోర్టు కేంద్ర సమాచార ప్రసార శాఖను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ పత్రాలు, ఉత్తరప్రత్యుత్తరాల్లో ‘దళిత్’ పదాన్ని తొలగించాలంటూ పంకజ్ మెష్రాం అనే వ్యక్తి వేసిన పిల్‌ను ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ విచారించింది. ‘దళిత్’కు బదులు ‘షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి’ అని పేర్కొనాలంటూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్లు జారీ చేసిందని పిటిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మీడియా కూడా దళిత్ అనే మాట వినియోగించకుండా చూడాలని కోరారు. స్పందించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రెస్ కౌన్సిల్‌కు, మీడియాకు కూడా ‘దళిత్’ అనే మాట వాడరాదని సూచనలు ఇవ్వడం సబబని భావిస్తున్నట్లు పేర్కొంది. -
ప్రెస్‌కౌన్సిల్‌లో 19 కేసుల విచారణ పూర్తి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై అందిన ఫిర్యాదులపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది. ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ప్రసాద్ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో సమావేశమయ్యారు. మొత్తం 39కేసులపై విచారణ చేపట్టిన కౌన్సిల్ 19 కేసులపై విచారణను పూర్తిచేసింది. ఆధారాలున్న కేసులకు బాధ్యులకు సమన్లు జారీచేయడంతో పాటు, ఆధారాలు లేని కేసులను డిస్మిస్ చేసింది. మిగిలిన 20 కేసులను బుధవారం విచారించనుంది. పరిష్కరించిన వాటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ రాష్ట్రాలకు చెందిన కేసులు ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యదర్శి విభా భార్గవ, సభ్యులు ఉత్తమ్ చంద్ర శర్మ, ప్రకాశ్‌దూబే, ప్రభాత్‌కుమార్, రాజీవ్ రంజన్‌నాగ్, ఎస్ఎన్ సిన్హా, ప్రజానంద చౌదరి, రవీంద్రకుమార్, సోందీప్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ పోలీసుల తీరుపై ప్రెస్ కౌన్సిల్ ఆగ్రహం
- రాజధాని భూములపై ప్రశ్నించిన ‘సాక్షి’ జర్నలిస్టులకు సమన్లు కేసు.. - విచారణకు హాజరుకాకపోతే కఠిన చర్యలని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఏపీ పోలీసుల తీరుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి రాజధాని భూముల కొను గోలుకు సంబంధించిన వ్యవహారాలను వెలుగు లోకి తెచ్చినందుకు ‘సాక్షి’ దినపత్రిక జర్నలిస్టులకు సమన్లు జారీ చేసిన కేసులో పోలీసులు పదేపదే వాయిదా కోరడంపై పీసీఐ అధ్యక్షుడు సి.కె.ప్రసాద్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చిలో ఈ భూముల వ్యవహారంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే వార్త మూలాలు తెలపాలని జర్నలిస్టులను అడగటం పత్రికా స్వేచ్ఛకు విఘాతమని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ గత ఏడాది మార్చి 22న ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సోమవారం కలకత్తాలో జరిగిన విచారణలో సీఎం చంద్రబాబు పర్యటనను సాకుగా చూపి విచారణకు హాజరుకాకుండా రాష్ట్ర పోలీసులు వాయిదా కోరడంపై జస్టిస్ ప్రసాద్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇది ఆఖరి వాయిదా అని మరోసారి పోలీసులు విచారణకు హాజరు కాని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున విచారణకు హాజరైన దేవులపల్లి అమర్ వాయిదా వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలోనే ఉంటున్నారని, ఆయన పర్యటనను కారణంగా చూపి వాయిదా కోరడం హాస్యా స్పదమని ప్రెస్ కౌన్సిల్‌కు తెలిపారు. గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీలో గత సెప్టెంబర్‌లో జరిగిన విచారణను వాయిదా వేయాలని గుంటూరు పోలీసు సూపరింటెండెంట్ కోరారు. -
పొత్తూరికి జాతీయ పురస్కారం
ప్రెస్ కౌన్సిల్ స్వర్ణోత్సవం సందర్భంగా ప్రదానం సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంక టేశ్వరరావును ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం జాతీయ పురస్కారంతో సత్కరించింది. కౌన్సిల్ స్వర్ణోత్సవం సందర్భంగా గత 50 ఏళ్లుగా పత్రికారంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొత్తూరి ఒత్తిళ్లకు గురికాకుండా నిక్కచ్చిగా తన భావాలను వ్యక్త పరిచేవారు. 82 ఏళ్ల వెంకటేశ్వరరావు ఆంధ్ర జనత పత్రికలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఉదయం, ఈనాడు పత్రికల్లో సంపాదకులుగా పనిచేశారు. టీటీడీ పబ్లికేషన్‌సలో గౌరవ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా, నాగార్జున వర్సిటీల్లో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స విభాగం బోర్డు మెంబర్‌గానూ వ్యవహరించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జర్నలిజం కోర్స్ మెటీరియల్‌కు సంబంధించి చీఫ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా మండలి సభ్యుడిగా.. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సుల్లో సమూల మార్పులకు కృషి చేశారు. ప్రెస్ కౌన్సిల్ పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని పొత్తూరి చెప్పారు. ప్రస్తుత సమాజంలో స్వేచ్ఛా జర్నలిజం అవసరం ఎంతో ఉందని, పత్రికల యజమానులు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కాకుండా స్వేచ్ఛగా వ్యవహరించాలని సూచించారు. -
‘సాక్షి’ ప్రసారాల నిలిపివేతపైప్రెస్ కౌన్సిల్ విస్మయం
- ఏపీ ప్రభుత్వ తీరుపై జర్నలిస్టుల బృందం ఫిర్యాదు - తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ హామీ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ప్రసారాల నిలిపివేతపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ విస్మయం వ్యక్తం చేశారు. ప్రసారాల పునరుద్ధరణకు కౌన్సిల్ పరిధిలో చర్యలకుగల అవకాశాన్ని పరిశీలిస్తామని ఆయన జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిన తీరుపై ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టుల ప్రతినిధి బృందం ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే సాక్షి టీవీ ప్రసారాలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. ప్రజాందోళన లను ప్రసారం చేస్తోందన్న అక్కసుతో ప్రభుత్వం ఈనెల 9 నుంచి ఏపీలోని 13 జిల్లాల్లో సాక్షి ప్రసారాలను నిలుపుదల చేసిందని, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను హరించడమేనని, తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. గతంలో టీవీ ప్రసారాలపై ఆంక్షలు విధించినప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీ వేసిందని ప్రతినిధి బృందం గుర్తుచేయగా.. అన్ని అంశాలను పరిశీలిస్తామని జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ప్రతినిధుల బృందంలో సీనియర్ జర్నలిస్టులు కొమ్మ కైలాష్(ఆంధ్రభూమి), ఎన్.విశ్వనాథ్(నమస్తే తెలంగాణ), లెంకల ప్రవీణ్ కుమార్(సాక్షి), నాగిళ్ల వెంకటేశ్(సాక్షి టీవీ), గాంధారి దీపక్ రెడ్డి(మన తెలంగాణ), అడబాల రాము(ఆంధ్రభూమి), జగదీష్ జరజాపు(ప్రజాశక్తి), గోపీకృష్ణ(10టీవీ), వి.తిరుపతి(టీన్యూస్), కి శోర్(వీ6), మదార్(హెచ్ఎంటీవీ), భరత్‌సింహారెడ్డి(ఐఎన్ఎస్ఎస్) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమ్మ కైలాష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను, ప్రసార మాధ్యమాలను అణచివేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజాందోళనల ద్వారా ప్రభుత్వం ప్రజానాడిని తెలుసుకునే ప్రయత్నం చేయాలని, అందుకు ప్రసార మాధ్యమాలను వాడుకోవాలన్నారు. అంతేగానీ మీడియాపై వివక్ష వైఖరి సరికాదని అభిప్రాయపడ్డారు. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తారా?
♦ వార్త మూలాలు చెప్పాలని విలేకరులను ప్రశ్నిస్తామంటారా? ♦ డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యలపై ఐజేయూ అభ్యంతరం ♦ ప్రెస్ కౌన్సిల్ నోటీసులను పట్టించుకోరా! ♦ జోక్యం చేసుకోవాలని గవర్నర్, సీఎంలకు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ‘రాజధాని దురాక్రమణ’ పేరుతో ప్రచురించిన వార్తల మూలాలు(సోర్స్) చెప్పాలంటూ ‘సాక్షి’ దినపత్రిక విలేకరులను ప్రశ్నిస్తామని డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యానించడంపై ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె.అమర్నాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత జర్నలిస్టులకు పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని ఆక్షేపిస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) నోటీసులు జారీ చేసిన మరుసటి రోజే పత్రికా స్వేచ్ఛను హరించేలా డీజీపీ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రాజధాని అమరావతిలో భూకుంభకోణంపై ‘సాక్షి’ ప్రచురించిన వార్తల మూలాలు చెప్పాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు ఆరుగురు జర్నలిస్టులను సోమవారం పోలీసు స్టేషన్‌కు పిలిపించడాన్ని ప్రెస్ కౌన్సిల్ సుమోటోగా తీసుకుని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీలకు బుధవారం నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. నోటీసులు జారీ చేయడం విలేకరులకు రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు జస్టిస్ సీకే ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారని వివరించారు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి చైర్మన్‌గా ఉండే ప్రెస్ కౌన్సిల్ పోలీసుల తీరును ఆక్షేపించిన మరుసటి రోజు(గురువారం) డీజీపీ జేవీ రాముడు కడపలో మాట్లాడుతూ వార్తల మూలాలు చెప్పాలంటూ జర్నలిస్టులను విచారిస్తామని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. వార్తల విషయంలో వీవీఐపీలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప, జర్నలిస్టులను పోలీసులు ప్రశ్నించడం పత్రికా స్వేచ్ఛపై దాడే అని పేర్కొన్నారు. బలవంతుల, ధనవంతుల ప్రయోజనాలు కాపాడటం కాకుండా పేదల హక్కుల సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల బాధ్యత అని డీజీపీ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. గవర్నర్, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తోన్న పోలీసుల చర్యలను కట్టడి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని, ప్రెస్ కౌన్సిల్‌ను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియా?
పార్లమెంటు కమిటీ సూచన న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ మీడియానూ ప్రెస్‌కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలంటూ.. పార్లమెంటరీ కమిటీ సూచనలు చేసింది. ఓ వర్గం మీడియా అనైతిక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నందున ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావటం అవసరమని సూచించింది. దీంతో పాటు ప్రెస్ కౌన్సిల్ అధికారాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. పలు మీడియా సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నందున కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కఠినచర్యలు తీసుకోలేకపోతోందని.. పెయిడ్ న్యూస్ ను నియంత్రించటంలోనూ స్పష్టమైన చట్టాలుండాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొం ది. కేబుల్ టీవీ నెట్వర్క్ యాక్ట్ (ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ చట్టం పరిధిలోకే వస్తుంది) అమలుకు ఓ చట్టబద్ధమైన సంస్థ ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. -
ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: అవిభక్త కవలలు వీణావాణిలకు వైద్య చికిత్సల పేరుతో సేకరించిన విరాళాలను బాధితులకు ఇవ్వని ఆంధ్రజ్యోతి, ఏబీన్ చానల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ తెలిపింది. జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్, సీహెచ్ ఉపేంద్ర శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఆ విరాళాల లెక్కలను చానల్ యాజమాన్యం చూ పించడం లేదని, విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరామని తెలిపారు. -
'ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తా'