♦ వార్త మూలాలు చెప్పాలని విలేకరులను ప్రశ్నిస్తామంటారా?
♦ డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యలపై ఐజేయూ అభ్యంతరం
♦ ప్రెస్ కౌన్సిల్ నోటీసులను పట్టించుకోరా!
♦ జోక్యం చేసుకోవాలని గవర్నర్, సీఎంలకు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ‘రాజధాని దురాక్రమణ’ పేరుతో ప్రచురించిన వార్తల మూలాలు(సోర్స్) చెప్పాలంటూ ‘సాక్షి’ దినపత్రిక విలేకరులను ప్రశ్నిస్తామని డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యానించడంపై ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె.అమర్‌నాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత జర్నలిస్టులకు పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని ఆక్షేపిస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) నోటీసులు జారీ చేసిన మరుసటి రోజే పత్రికా స్వేచ్ఛను హరించేలా డీజీపీ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
రాజధాని అమరావతిలో భూకుంభకోణంపై ‘సాక్షి’ ప్రచురించిన వార్తల మూలాలు చెప్పాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు ఆరుగురు జర్నలిస్టులను సోమవారం పోలీసు స్టేషన్‌కు పిలిపించడాన్ని ప్రెస్ కౌన్సిల్ సుమోటోగా తీసుకుని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీలకు బుధవారం నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. నోటీసులు జారీ చేయడం విలేకరులకు రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు జస్టిస్ సీకే ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారని వివరించారు.
సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి చైర్మన్‌గా ఉండే ప్రెస్ కౌన్సిల్ పోలీసుల తీరును ఆక్షేపించిన మరుసటి రోజు(గురువారం) డీజీపీ జేవీ రాముడు కడపలో మాట్లాడుతూ వార్తల మూలాలు చెప్పాలంటూ జర్నలిస్టులను విచారిస్తామని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. వార్తల విషయంలో వీవీఐపీలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప, జర్నలిస్టులను పోలీసులు ప్రశ్నించడం పత్రికా స్వేచ్ఛపై దాడే అని పేర్కొన్నారు. బలవంతుల, ధనవంతుల ప్రయోజనాలు కాపాడటం కాకుండా పేదల హక్కుల సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల బాధ్యత అని డీజీపీ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. గవర్నర్, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తోన్న పోలీసుల చర్యలను కట్టడి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని, ప్రెస్ కౌన్సిల్‌ను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పత్రికా స్వేచ్ఛను హరిస్తారా?
Published Sat, Mar 26 2016 1:46 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement