ఏడాది చివర్లో పోలీసు నోటిఫికేషన్
చిత్తూరు (అర్బన్): నూతన రాష్ట్రంలో పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ ఏడాది చివరలోపు నోటిఫికేషన్ విడుదల చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ జె.వెంకటరాముడు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు. అన్నీ కుదిరితే నవంబరు నెలాఖరులోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. శనివారం చిత్తూరు నగరంలో అధునాతన నూతన పోలీసు కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుశాఖలో అనాధిగా వస్తున్న 5 కిలోమీటర్ల పరుగు పందాన్ని రద్దు చేసి, కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టే దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయన్నారు. పోలీసులుగా ఎంపికవడానికి అభ్యర్థుల శారీరక సామర్థ్యంతో పనికిలేకుండా వారి ప్రతిభ ఆధారంగా సెలక్షన్లు నిర్వహిస్తామన్నారు.
కాగా నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కారణంగా మృతి చెందిన విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై ప్రిన్స్‌పాల్ బాబూరావును ఎందుకు అరెస్టు చేయలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు డీజీపీ సమాధానమిచ్చారు. తొలుత ఇది తన స్థాయికి సంబంధించిన ప్రశ్న కాదన్నారు. దీనిపై అసెంబ్లీలో సైతం చర్చకు వచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందని మళ్ళీ ప్రశ్నించగా.. 'ఎవరో ఏదో మాట్లాడితే అరెస్టు చేయలేం. వ్యక్తి అరెస్టు అనేది చాలా ప్రధానమైనది. ఎవరిని పడితే వారిని అరెస్టు చేయలేం. రిషితేశ్వరి మృతిలో ప్రిన్సిపల్ ప్రమేయం ఉందని ఎవరివద్దయినా ఆధారాలున్నాయా..? ' అన్నారు. డీజీపీ వెంట రాయలసీమ ఐజీ వేణుగోపాలక్రిష్ణ, అనంతపురం డీఐజీ కే.సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ ఐజీ కేవీ.రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఎస్పీలు శ్రీనివాస్, గోపినాథ్ తదితరులు ఉన్నారు.