ప్రిపెయిడ్ ఆటో బూత్‌లతో ప్రయాణం సురక్షితం | prepaid auto booths safe for passengers | Sakshi
Sakshi News home page

ప్రిపెయిడ్ ఆటో బూత్‌లతో ప్రయాణం సురక్షితం

Published Thu, May 21 2015 8:01 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

prepaid auto booths safe for passengers

విజయవాడ :నగరంలోని రైల్వేస్టేషన్, పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రిపెయిడ్ ఆటో బూత్‌లను రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు బుధవారం సాయంత్రం ప్రారంభించారు. రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్ నుంచి ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరడానికి ఈ ఆధునిక ప్రిపెయిడ్ ఆటో బూత్‌లు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆటో బూత్‌ల పనితీరును డీజీపీకి పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు వివరించారు. అనంతరం రాముడు మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్, బస్టేషన్లు అతి పెద్దవి కావడంతో పొరుగు ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారని చెప్పారు. అన్ని వేళల్లో ఆటోడ్రైవర్ల వేధింపులకు గురికాకుండా సురక్షితంగా ఇంటికి చేర్చడమే ప్రిపెయిడ్ ఆటోస్టాండ్ల ఏర్పాటు ఉద్దేశమన్నారు. ఈ ఆటోస్టాండ్లలో సేవలన్నింటినీ కంప్యూటరీకరించామని, ప్రయాణికులు వెళ్లాల్సిన ప్రాంతానికి చెల్లించాల్సిన చార్జిని పేర్కొంటూ కంప్యూటర్ స్లిప్ ఇస్తారన్నారు. మార్గ మధ్యలో ఏదైనా ఇబ్బంది కలిగితే కంప్యూటర్ స్లిప్‌లోని మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకుంటే సంబంధిత నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చినట్టయితే కంప్యూటర్‌లో రికార్డు అవుతుందని చెప్పారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని డీజీపీ సూచించారు.

ఆటో బూత్‌లు పనిచేసేది ఇలా..


పిపెయిడ్ ఆటో స్టాండ్‌లను కంప్యూటరీకరించి ప్రిపెయిడ్ బూత్‌లుగా మార్చారు. ఆటోలు, డ్రైవర్ల వివరాలను నమోదు చేశారు. వెబ్ కెమెరాలో డ్రైవర్ల ఫొటో తీసి కంప్యూటర్లలో నిక్షిప్తంచేశారు. అన్ని నిబంధనలు ఉన్న ఆటోలు, డ్రైవింగ్‌లెసైన్స్ ఉన్న డ్రైవర్లనే అనుమతిస్తారు. ఆటోలో ఐదుగురు ప్రయాణికులను మాత్రమే ఎక్కించేందుకు అనుమతిస్తారు. ప్రయాణికులు ఆటోను బుక్‌చేసుకోగానే ప్రింట్ రశీదు ఇస్తారు. దానిని గేట్ వద్ద ఉన్న పోలీసులకు చూపిన తరువాతే ఆటో ముందుకు వెళ్తుంది. మార్గమధ్యంలో ఇతర ప్రయాణికులను ఎక్కించుకోకూడదు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానానికి చేరిన తరువాత రశీదుపై ఉన్న 92489 77888 సెల్ నంబరుకు మిస్డ్‌కాల్ ఇవ్వాలి. ఒకవేళ ఏదైనా జరిగితే వెంటనే 100కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బస్టాండ్ బూత్‌లో 260 ఆటోలను బుక్‌చేశారు. 360 మంది డ్రైవర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆర్టీవో, పోలీసులు సంయుక్తంగా ప్రయాణదూరాన్ని బట్టి చార్జీలు నిర్ణయించారు. ఉదయం 5 నుంచి రాత్రి 11 సమయం వరకు సాధారణ రేటు, రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు మరో రేటు నిర్ణయించారు. ఉదయం సమయంలో బస్‌స్టాండ్ నుంచి వినాయకుని గుడి వరకు రూ.20, రథం సెంటర్‌కు రూ.25గా చార్జీ నిర్ణయించారు. అదే రాత్రి సమయంలో రూ.30, రూ.35 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement