ఆకాశమంతెత్తు ఆ రెండు శిఖరాలు! | Two higest Peaks over Vijayawada city surroundings | Sakshi
Sakshi News home page

ఆకాశమంతెత్తు ఆ రెండు శిఖరాలు!

Published Mon, Nov 25 2013 3:13 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

ఆకాశమంతెత్తు ఆ రెండు శిఖరాలు! - Sakshi

ఆకాశమంతెత్తు ఆ రెండు శిఖరాలు!

తాజా పుస్తకం: ఒకప్పుడు బెజవాడ చుట్టూ చాలా కొండలుండేవి. వాటి సిగపాయల్లో మరెన్నో శిఖరాలు మెరుస్తుండేవి. కాలపురుషుడు వాటిలో చాలావాటిని -ఉల్లిపాయలు తరిగినట్లు- నరికిపారేశాడు. కానీ, కొన్ని శిఖరాలు ఇప్పటికీ ఠీవిగా తలెత్తుకు తిరుగుతూనే ఉన్నాయి. కాలపురుషుడే కాదు- కాలయముడు కూడా మమ్మల్నేం చెయ్యలేడు అన్నట్లు నిటారుగా నిలిచివుండే శిఖరాలవి. ఈ మధ్యన బెజవాడ వెళ్లినప్పుడు అలాంటి  శిఖరాల్ని చూసి ముచ్చటించి ఆనందపడ్డాను.
 
 ఏలూరు రోడ్డులోని సీతారాంపురంలో కనకదుర్గా సినిమాటాకీసు ఉండేది. అదిప్పుడు లేదు. అక్కడ కట్టిన అపార్టుమెంట్లలో పెద్దిభొట్ల సుబ్బరామయ్య ఉంటున్నారు. ఎంచేతో గానీ, సుబ్బరామయ్యగారు మాచవరం, మారుతీనగర్, చుట్టుగుంట, సీతారాంపురం - ఆ చుట్టుపక్కలే ఉంటుంటారు. ‘ఇది ఈ మధ్యన మొదలయిందేం కాదు- నేను ఎస్సారార్‌లో చదివే రోజుల్నించీ నాకిక్కడే అలవాటు. అప్పట్లో (విశ్వనాథ) సత్యనారాయణగారు ఇక్కడ ఉండడం వల్ల కావచ్చు. విశాలాంధ్రలో నా స్నేహితులు చాలామంది ఉద్యోగాలు చేస్తూండడం వల్ల కావచ్చు. నాకే కాదు- ఇంట్లో వాళ్లందరికీ ఈ ప్రాంతం అలవాటయిపోయినందువల్ల కావచ్చు. మొత్తానికి ఎక్కువభాగం ఇక్కడే ఉండిపోయాం. ఆ మాటకొస్తే, నా డెబ్బయ్యారేళ్ల జీవితంలో గట్టిగా పదేళ్లు తప్పిస్తే మిగతాదంతా బెజవాడలోనే గడిచిపోయింది. ఎన్నో చేదు అనుభవాలూ మరెన్నో తియ్యని అనుభూతులూ ఇక్కడే ఎదురయ్యాయి నాకు’ అన్నారు పెద్దిభొట్ల.  
 
 ‘నేనీ ప్రపంచానికి ఏమివ్వగలిగానో ఎప్పుడూ పరామర్శించుకోలేదు. కానీ, ప్రపంచం మాత్రం నాపైన బోలెడంత కరుణ కురిపించింది. నేను డిగ్రీ ఇలా పూర్తి చేశానోలేదో లయోలా కాలేజ్ యాజమాన్యం నన్ను పిల్చి ట్యూటరు ఉద్యోగమిచ్చింది. అప్పట్లో రెవెన్యూ డిపార్టుమెంటులో గుమాస్తాలకు 48 రూపాయలిచ్చేవాళ్లు. అలాంటిది, లయోలావాళ్లు నాకు 116 రూపాయల నెలజీతంమీద ఉద్యోగమిచ్చారు. నిజానికి నాకు విశాఖ వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీలో ఫోర్తానర్సు చెయ్యాలని ఉండేది. కానీ, మా అమ్మ మాటమీద లయోలాలో చేరాలని -ఓ శనివారం ఉదయం- బయల్దేరా. దార్లో లీలా మహల్ బయట ఓ బోర్డు పెట్టిఉంది. సత్యజిత్ రాయ్ తీసిన ‘పథేర్ పాంచాలీ’ ఆ పూట ఒకే ఒక్క షో వేస్తున్నారట. బస్సుదిగి తిన్నగా వెళ్లి హాల్లో కూర్చుని, ఆటయ్యాక ఇంటికెళ్లిపోయా. సోమవారం నాడు లయోలాకు వెళ్లి ట్యూటరుగా చేరిపోయాను. అక్కడే రిటైరయినాను. ఈ మధ్యే మా కాలేజ్ వాళ్లు నన్ను పిల్చి సన్మానం చేసి -అదిగో, ఆ జ్ఞాపిక చేతికిచ్చి పంపించారు’ అంటున్నప్పుడు సుబ్బరామయ్యగారి మొహం -సంతృప్తితో కాదు, సంతోషంతో- తళతళలాడింది.
 
 ‘విషయమేమిటంటే, నాకు విశాఖ వెళ్లాలనుకున్నా వెళ్లివుండలేకపోవచ్చు. కానీ, పథేర్ పాంచాలీ సినిమా చూడదల్చుకున్నప్పుడు చూసేశాను! అంటే మంచి కథో మంచి సినిమానో అంటే ఉండే పిచ్చి అది. ఆ పిచ్చిని అర్థం చేసుకున్నారు కాబట్టే చెప్పిన టైముకు రాకపోయినా లయోలా ఫాదర్లు నా మీద కోపగించలేదు. సరిగదా, మా కాలేజ్‌లో ఓ మంచి రైటరున్నాడర్రా అని కేరళలో అందరికీ మచ్చటగా చెప్పుకునే వారట కూడా. అలాగే, నేనేదో నా బుద్ధికి తోచిన కథలేవో రాసుకుపోయానంతే. సెంట్రల్ సాహిత్య అకాడెమీ వాళ్లు బహుమతిచ్చారు. ఓ రోజు మధ్యాహ్నం భోంచేసి కూర్చున్నా. ఎవరో అపరిచితులు ఫోన్ చేశారు. ‘నా పేరు అప్పాజోస్యుల సత్యనారాయణ- మా అజోవిభొ ఫౌండేషన్ పురస్కారం మీకివ్వాలనుకుంటున్నాం!’ అన్నారాయన. అది చాలా పెద్దపేరున్న సంస్థ అని తెలుసు తప్ప వాళ్ల అడ్రెస్‌గానీ, కనీసం ఫోన్ నంబరుగానీ నాకు తెలీవు. అయినా పిల్చి పీటేయడం వాళ్ల ఔదార్యం’ అన్నారు పెద్దిభొట్ల తొణకని బెణకని ఆత్మ గౌరవంతో.
 
 ఆ తర్వాత సిద్ధార్థ కాలేజ్ దాటి, సున్నపు బట్టీల మీదుగా, క్రీస్తురాజపురం వైపు వెళ్తుంటే, ఓ సందులో ‘అభ్యాస’ స్కూలు బస్సులు కనిపించాయి. అదే సందులో సి.రాఘవాచారిగారిల్లుంది. వరవరరావులాంటి  వాళ్లను మార్క్సిజం ప్రభావ పరిధిలోకి ఆకర్షించిన ప్రతిభ ఆయనది. అరవై దశకంలో పేట్రియాట్, లింక్ పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాఘవాచారిగారు గొప్ప వ్యాఖ్యలను -రిపోర్టుల పేరిట- రాశారు. వాటి గురించి ‘అప్ కంట్రీ’ జర్నలిస్టులు ఇప్పటికీ ప్రస్తావిస్తూ ఉండడం కద్దు. ఇక, విశాలాంధ్ర పత్రికను తెలుగు సాంస్కృతిక జీవిత ప్రతినిధిగా దిద్దితీర్చడంలో ఆయన పాత్ర అందరికీ తెలిసిందే. బెజవాడలో జరిగే చెప్పుకోదగిన సభలన్నింటికీ రాఘవాచారిగారే అధ్యక్షత వహించడం ఓ స్థానిక సంప్రదాయంగా పరిణమించింది. డైలీ జర్నలిజం నుంచి విరమించినప్పటికీ,
 
 ఇప్పటికీ, విజయవాడ మేధో జగత్సహోదరులకు పెద్దదిక్కుగా ఆయన కొనసాగుతూనే ఉన్నారు.  ‘మాది వరంగల్లు. మా మేనమామలది పశ్చిమగోదావరి జిల్లా పెన్నాడ. తెలుగు సంస్కృతిలోని భిన్నత్వాన్నీ దాన్లోని ఏకత్వాన్నీకూడా చిన్నప్పుడే గ్రహించినవాణ్ణి నేను. వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవనంలో అరుదయిన వ్యక్తులను అతిసన్నిహితంగా చూశాను. అది వరంగల్లులోని కాళోజీలే కావచ్చు- హైదరాబాద్‌లోని మఖ్దూం, రాజ్‌బహదూర్ గౌర్, మొహిత్ సేన్‌లే కావచ్చు- విజయవాడ వచ్చాకా విశాలాంధ్ర పెద్దలయిన చంద్రంగారూ, బలరామమూర్తిగారే కావచ్చు. సంపాదక ప్రముఖులు నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావుగారే కావచ్చు. రాంభట్ల, మల్లారెడ్డి, బూదరాజులాంటి అభ్యుదయ రచయితలే కావచ్చు. వీళ్లలో ప్రతిఒక్కరితోనూ ఆత్మీయ అనుబంధం ఏర్పడింది నాకు. ఆ బాంధవ్యం ప్రాతిపదికగానే మా స్నేహం మారాకు వేస్తూ వచ్చింది.’ అన్నారు రాఘవాచారి సగర్వంగా.
 
 ‘నేనన్నమాటకు అర్థం పైన చెప్పినవాళ్లతో నాకు భిన్నాభిప్రాయాలే లేవని కాదు సుమా!’ అని హెచ్చరించారాయన. ‘ఎప్పుడూ ఎవరితోనూ మూసకట్టు ‘అభిప్రాయభేదాలు’ పెంచుకోలేదన్నది నా పాయింటు.  మన గీటురాళ్లు మనం జాగ్రత్తగా పెట్టుకోవడం ముఖ్యం.’
 
 ఆ తర్వాత చాలామాటలే నడిచాయి. ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు. పెద్దిభొట్ల, రాఘవాచారి... ఇద్దరూ వయసు తాలూకు అలసటగాని అనారోగ్యపు అస్థిమితత్వాన్నిగాని లెక్క చేయకుండా హుషారుగా ఉన్నారు. దప్పికేసిన వాళ్లకు దాహం అందించే చలివేంద్రాల్లానే ఉన్నారు. దేశమంటే మట్టికాదు మనుషులు అంటే అర్థం అదే. ఒక ఊరంటే ఆ ఊరి మనుషులే.  పర్లేదు. బెజవాడ భేషుగ్గానే ఉంది.
 - మందలపర్తి కిశోర్ 99122 29931

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement