ఒక సంపాదకుడి స్వీయచరిత్ర | Autobiography of sub editor | Sakshi
Sakshi News home page

ఒక సంపాదకుడి స్వీయచరిత్ర

Published Sun, Jul 5 2015 3:33 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

Autobiography of sub editor

విధి నా సారథి (స్వీయచరిత్ర)
రచన: పొత్తూరి వెంకటేశ్వరరావు
పేజీలు: 384; వెల: 175
ప్రతులకు: సాహితి ప్రచురణలు, 29-13-53, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ-2; ఫోన్: 0866-2436643
 
‘బీఎస్సీ తరువాత ఏమి చేయాలని అనుకొంటున్నారు?’ అని అడిగిన లెక్చరర్‌తో, ‘జర్నలిస్టును కావాలనుకొంటున్నాను’ అని చెప్పారు పొత్తూరి. ‘ఓ! యు వాంట్ టు బికమ్ ఎ నార్ల’ అన్నారాయన. అన్నట్టుగానే, ‘నార్ల’(వెంకటేశ్వరరావు) లాగే ఎడిటర్ అయ్యారు పొత్తూరి(వెంకటేశ్వరరావు).
 
 ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన 81 ఏళ్ల పొత్తూరి ప్రయాణం సుదీర్ఘమైనది. గూడబండ్ల ప్రయాణం చూశారు. బొగ్గుతో నడిచే బస్సుల్లో ప్రయాణించారు. ‘పప్పు తినే బేంబడి’గా సహ విద్యార్థుల హేళనకు గురయ్యారు. ఆ కారణంగా వస్తాదులా బాడీ పెంచారు. పాత్రికేయం మీద ఆసక్తితో గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. ‘చిట్టి రాష్ట్రానికి పొట్టి గవర్నర్’ అని బూర్గుల రామకృష్ణారావు గురించి పెట్టిన తమాషా హెడ్డింగుకు ‘ఆంధ్రజనత’లో తిట్లు తిన్నారు. ఆంధ్రభూమిలో పనిచేస్తూనే రేడియోలో ప్రాంతీయ వార్తలు చదివారు.
 
 ఈనాడులో జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు. పోటీ వారపత్రికలో వస్తున్న ‘క్షుద్ర’రచనకు అదే రచయితతో ప్రభ వీక్లీలో పేరడీ రాయించారు. రాజీవ్‌గాంధీ- అంజయ్య వివాదంలో అసలు జరిగిందేమిటో రాజీవ్‌గాంధీనే ఇంటర్వ్యూ చేసి తెలుసుకున్నారు. ‘లా’ చదవకపోయినా స్టేట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ కమిషన్‌లో పనిచేయగలిగారు. ‘పేలుడు పదార్థాల స్టోరీ’ ఆపించినందుకు ఆత్మగౌరవంతో ఉదయం నుంచి బయటికి వచ్చారు. నక్సలైట్లతో శాంతి చర్చలు విఫలమైనందుకు కన్నీరు కార్చారు. ప్రత్యేక తెలంగాణను సమర్థించారు. తిరుమల నగల లెక్కింపు కమిటీలో ఉన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పాతపత్రికల డిజిటైజేషన్ చేయించారు. పారమార్థిక పదకోశం వెలువరించారు. వీటితోపాటు, ఆయనపడ్డ ఆర్థిక ఇబ్బందులు, ఆయన్ని ఆదరించిన పెద్దల వివరాలు ఈ ‘స్వీయచరిత్ర’లో తెలుస్తాయి. ఎంత ఎత్తులో ఉన్నా తన నిజస్థితిని గురించిన ‘ఎరుక’ కూడా కనిపిస్తుంది.
 
 స్థూల స్థాయిలో ఇవన్నీ ఒక ఎత్తయితే, ఆయనలోని సూక్ష్మస్థాయి పరిణామం మరో ఎత్తు. కేరళలోని అనంతపద్మనాభస్వామి దర్శనానికి విధిగా చొక్కా తీయాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ లోనికి కూడా వెళ్లని ఈ నాస్తికుడు... తదనంతర కాలంలో కూతురి మరణంతో జిల్లెల్లమూడి అమ్మ దగ్గర సాంత్వన పొందారు; ఏదీ తన చేతిలో లేదనే అభిప్రాయంలోకి వచ్చారు. అందువల్లే ‘ఎమెస్కో’ ప్రచురించిన ఈ పుస్తకం పేరు ‘విధి నా సారథి’ అయింది.
 పాత్రికేయులతోపాటు, పత్రికల వ్యవహారాలు తెలుసుకోగోరే పాఠకులకు ఆసక్తికర పుస్తకం.
 
 ఈతరం కోసం కథాస్రవంతి
 ఈతరం కోసం కథాస్రవంతి (10 పుస్తకాల సీరిస్)
 ప్రధాన సంపాదకుడు: వల్లూరు శివప్రసాద్
 ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ, 101,బృందావన్ పార్క్ రెసిడెన్సీ,
 7వ లేన్, ఎస్.వి.ఎన్. కాలనీ, గుంటూరు-522006; ఫోన్: 9291530714
 
 ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ చేసిన ఒక పద్ధతైన పని ఇది. వల్లూరు శివప్రసాద్ ప్రధాన సంపాదకుడిగా ‘సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ పాఠకుడి హృదయానికి సన్నిహితమైన’ పదిమంది కథకుల ఎంపిక చేసిన కథలు కథాస్రవంతి పేరిట పునర్ముద్రణయ్యాయి. అన్నీ సుమారు నూరు పేజీల పుస్తకాలు. ఒక్కోటీ యాభై రూపాయలు. వేర్వేరు సంపాదకులు. వేర్వేరు విశ్లేషణలు.
 
 కొడవటిగంటి కుటుంబరావు కథలు (కృష్ణాబాయి), చాసో కథలు (చాగంటి తులసి), మధురాంతకం రాజారాం కథలు (ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు), పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (రాచపాళెం చంద్రశేఖరరెడ్డి), కేతు విశ్వనాథరెడ్డి కథలు (సింగమనేని నారాయణ), కొలకలూరి ఇనాక్ కథలు (మేడిపల్లి రవికుమార్), ఓల్గా కథలు (కె.శ్రీదేవి), పి.సత్యవతి కథలు (కె.ఎన్.మల్లీశ్వరి), అల్లం శేషగిరిరావు కథలు (జగన్నాథశర్మ), అల్లం రాజయ్య కథలు (ముక్తవరం పార్థసారథి); ‘ఈయన కథలు ఫార్ములా కథలు కావు. అంటే ఖాయంగా ఒకే పద్ధతిలో అన్ని కథలూ పరిణామం చెందాలి. చివర ఒక నిర్ణయం ఉండాలనడం చాసోకథలోని నియమం కాదు’(చాసో గురించి తులసి). పినిశెట్టి ముఖచిత్రాల ఈ సీరిస్‌లో కమ్మ తెమ్మెర, జీవన్ముక్తుడు(రాజారాం), చీకటి, వఱడు(శేషగిరిరావు), మనిషి లోపలి విధ్వంసం, మహాదేవుని కల(రాజయ్య), ఇంగువ, ఏస్ రన్నర్(సుబ్బరామయ్య), సూపర్‌మామ్ సిండ్రోమ్, ఇల్లలకగానే(సత్యవతి) లాంటి ఎన్నో చక్కటి కథలు చదవొచ్చు.
 
 సూర్యోదయం ‘నిషిద్ధం’
 అన్న అలెగ్జాండర్‌కు 1886లో రాసిన లేఖలో చెహోవ్ (1860-1904) కథలో ప్రకృతి వర్ణన ఏమేరకు ఎలా ఉండాలో ఇలా రాశారు(అనువాదం: ముక్తవరం పార్థసారథి):  ‘‘నా అభిప్రాయంలో ప్రకృతి వర్ణన వీలైనంత తక్కువగా ఉండాలి. ప్రకృతి కూడా కథలో ఒక పాత్ర కావాలి. అయితే, ‘సూర్యోదయ సూర్యాస్తమయ వర్ణనలు, బాలభానుని బంగారు కిరణాలు, నీలాకాశంలో బారులు తీరిన పక్షుల గుంపులు, కిలకిలారావాలు’ నిషిద్ధం. ప్రకృతిలోని ఏ అంశాన్ని ప్రత్యేకంగా చిత్రిస్తే కథమీద అది ప్రభావాన్ని కలిగించబోతున్నదో తెలుసుకోగలగాలి కథకుడు. మన వర్ణనను బట్టి పాఠకుడు ఆ దృశ్యాన్ని వూహించుకోగలడా?
 ‘వెన్నెల కిరణం ఒకటి పెంకుటింటి చూరులోంచి గదిలో ఉన్న గాజుసీసా మీద పడి మెరిసింది’ అంటే కథా, వర్ణనా కలిసిపోవూ! పాత్రలు చేసే పనులతో కలసిపోవాలి ప్రకృతి వర్ణన. పాఠకుడు ముందే వూహించగలిగింది మళ్లీ చెప్పడం రచయిత ప్రతిభకు నిదర్శనం కానేరదు. పాత్రల మనస్తత్వం వాళ్ల ప్రవర్తన ద్వారా తెలియాలి. సంబంధాలలో ఓ టెన్షన్ - గురుత్వాకర్షణ శక్తితో గ్రహాలు తమ తమ స్థానాలలో ఉన్నట్టుగా పరస్పర సంబంధం - ఓ బిగువు - ఏ క్షణాన ఏ మార్పు వస్తుందోనన్న వుత్కంఠ, ఉద్విగ్నత కథ పండటానికి సహాయం చేస్తాయి.
 
 మనిషికి అద్దం పట్టటమే కళ చెయ్యాల్సిన పని. సత్యాన్ని గ్రహించిన మనిషి తనే మారతాడు. ప్రతిభ ఒక్కటే సరిపోదు. శ్రమించగలిగే స్వభావం లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా వృథా. పైగా, ప్రతిభ జన్మసిద్ధం. అందులో నీ ప్రమేయం ఏముంది?’’
 
 నేర్పుడు
 అల్కగ
 అతిసున్నితంగ
 మెసిలే బాధల్లోకి తొంగిచూసే తీరికలేనితనం
 ముద్దుగ
 పొందికగ
 చూపుల్ని మైదానంమీద పర్చలేనితనం
 సోయితోని
 సోపతితోని
 తొవ్వలనడుస్తున్న మనుషుల్ని మందలించలేనితనం
 గదిల
 మతిల
 జ్ఞాపకాలని పలవరించనితనం
 సుఖంగ
 దుఃఖంగ
 కండ్లు చెమ్మగిల్లనితనం
 ఇప్పుడు నడుస్తున్న ఈకాలం
 
 ఠి వేముగంటి మురళీకృష్ణ
 ఫోన్: 9676598465
 
 తెల్లపువ్వుల మధ్య నుంచి
 బయటికొచ్చింది
 తెల్లసీతాకోకచిలక
 
 గింజలు వేసి
 కోళ్ల కేదో చెప్పి వెళ్లాడు
 ముసలాయన
 
 పొగమంచు-
 ‘‘వృద్ధాశ్రమం ఇటేనా?’’
 ఎవరో అడుగుతున్నారు
 
 నిండు చంద్రుడు-
 గుడిసెపై నుంచున్న
 కోళ్ల నిశ్శబ్దం
 
 ఈ రాత్రి వాన-
 ఇస్మాయిల్ లేరు కదా
 అన్న తలపు
 
 -గాలి నాసరరెడ్డి
 
  కొత్త పుస్తకాలు
 సమర సమయ విచార వివేకము
 (ఉద్యోగపర్వం-3 భాగాలు)
 వ్యాఖ్యానం: సాంప్రతి సురేంద్రనాథ్
 పేజీలు: 338+276+316; వెల: 400 (మూడింటికీ)
 ప్రతులకు: భారత ధర్మ ప్రచార పరిషత్, పుచ్చా లలిత - రమణ చారిటబుల్ ట్రస్ట్, 601, సెంటర్ పాయింట్, 18 రోడ్, చెంబూర్, ముంబై-400071; (డాక్టర్ లలిత, హైదరాబాద్- ఫోన్: 9848060579).
 
 అక్షర గోదావరి పురస్కారాలు
 మొజాయిక్ సాహిత్య సంస్థ, సాహిత్య సురభి, రిత్విక్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో విశాఖ పౌరగ్రంథాలయంలో నేడు ఉదయం 10 నుంచి గోదావరి పుష్కర ప్రత్యేక కవి సమ్మేళనం జరగనుంది. రామతీర్థ (ఫోన్: 9849200385) అధ్యక్షత వహించే ఈ కార్యక్రమంలో అద్దేపల్లి రామ్మోహనరావు, దాట్ల దేవదానం రాజు, ఎల్.ఆర్.స్వామికి ‘అక్షర గోదావరి’ పురస్కారాల ప్రదానం కూడా చేయనున్నారు. ఆకెళ్ల రవిప్రకాష్, ద్రోణంరాజు శ్రీనివాస్, చలసాని ప్రసాద్ విశిష్ట అతిథులు.
 
 మీ అభిప్రాయాలూ, రచనలూ   పంపవలసిన మా చిరునామా:
 సాహిత్యం, సాక్షి తెలుగు దినపత్రిక,
 6-3-249/1, రోడ్ నం.1,
 బంజారాహిల్స్, హైదరాబాద్-34;
 ఫోన్: 040-23256000
 sakshisahityam@gmail.com
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement