
అక్రమ సంతానం మరాఠీ రచయిత శరణ్‌కుమార్ లింబాళె స్వీయచరిత్ర. అనువాదం రంగనాథ రామచంద్రరావు. శరణ్‌కుమార్ తల్లి మాసామాయీ. ఈమెది మహర్ కులం. తండ్రి హనుమంత లింబాళె. మాసామాయీ మొదటి భర్త విఠల్ కాంబ్లే. నాటి భూస్వామ్య వ్యవస్థలో జమీందారులు, పటేళ్లు దళిత స్త్రీలను ఉంపుడుగత్తెలుగా చేసుకునేవారు. అట్లా మాసామాయీ హనుమంత లింబాళె ఉంపుడుగత్తెగా శరణ్‌కుమార్‌ను కనడం జరిగింది. ఇలా పుట్టిన పిల్లలకు చట్టబద్ధమైన తండ్రి పేరు నమోదుకు అవకాశం లేక, పాఠశాలలో చేరినప్పుడు శరణ్‌కుమార్ పడిన ఆవేదన కర్ణుని తలపిస్తుంది. మాసామాయీ మొదటి భర్త విఠల్ కాంబ్లే ద్వారా ఇద్దరు పిల్లలనూ, హనుమంత లింబాళె ద్వారా శరణ్‌కుమార్‌నూ, తరువాత మరో పటేల్ ద్వారా మరికొంతమంది పిల్లలను కనడమూ– ఇదంతా సవర్ణుల చేతిలో నిక్షిప్తమైన రొట్టె కోసమా? ఆకలికీ కామానికీ మధ్య బంధింపబడటమా? ఏమిటీ ఫ్యూడల్ నికృష్ట దోపిడీ అని పలుమార్లు వాపోతారు రచయిత.
పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు తోటి పిల్లలు రాళ్లు విసురుతూ ‘మహర్, మహర్’ అని పిలిచిన పరిస్థితులూ, మహర్ అంటూ జుట్టు కత్తిరించడానికి నిరాకరించిన క్షురకుడి అవమానమూ, జారపుత్రుడు– అక్రమ సంతానం అంటూ హేళన చేసిన రోజులూ– వీటన్నింటినీ అధిగమించి లింబాళె చదువు కోసం పడ్డ పెనుగులాట, ఒకరిద్దరు వ్యక్తుల సహకారం ఫలితంగా బీఏ, ఎంఏ పూర్తి చేయడం, కొల్హాపూర్‌లోని శివాజీ యూనివర్సిటీ ద్వారా పీహెచ్‌డీ పొంది, ప్రస్తుతం నాసిక్ కేంద్రంగా పనిచేస్తున్న యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ పూనా ప్రాంతీయ కేంద్రానికి అధిపతి కావడం... ఈ ప్రయాణమంతా ఆత్మకథ వెల్లడిస్తుంది.
రచయిత అమ్మమ్మ సంతామాయీ. ఆమె మొదటి భర్త చనిపోయాక ఆమెతో జీవితం గడిపిన వ్యక్తి మహమ్మద్ దస్తగిర్ జమీర్(దాదా). తన జీవితాన్ని మార్చటంలో దాదా సహకరించిన గొప్ప గుణం తెలియజేస్తూ, ప్రజా జీవితంలో ఉన్న సంక్లిష్టత వివరించారు రచయిత. దాదా మరణం తర్వాత ముస్లింలు అతని ఖననానికి వస్తారా? సంతామాయీ, మాసామాయీలు చనిపోయినప్పుడు కర్మకాండలకు జనం వస్తారా? తన పుట్టుకే అనైతికంగా ఘోషింపబడిన తర్వాత తాను ఏ నియమాలు పాటించాలి? ఇలా అనేక ప్రశ్నలతో వ్యవస్థ అవలక్షణాలను ఇందులో కళ్లకు కట్టారు రచయిత.
-ఎస్ శంకరరావు