Mandalaparti kishore
-
Rachamallu Ramachandra Reddy: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!
విమర్శకుడిగా, కథకుడిగా, సమీక్షకుడిగా, సంపాదకుడిగా, అనువాదకుడిగా రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా.) తెలుగు మేధావుల ప్రశంసలకు పాత్రమ య్యారు. తాను స్వయంగా చక్కని కథానికలు రాయడమే కాదు ఒక తరం కథకులను తర్ఫీదు చేశారు. మంచి విమర్శకుడిగా తాను రాణించడమే కాదు ఎందరో విమర్శకులకు పదును పెట్టారాయన. ప్రత్యేకించి విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండ గలదో చేసి, చూపించారు. ప్రాక్పశ్చిమ దేశాల సాహి త్యాన్ని క్షుణ్ణంగా చదివిన కొద్దిమంది విమర్శకుల్లో రా.రా. ఒకరు. మార్క్స్, ఎంగెల్స్, గ్రామ్సీ, గియోర్గీ లూకాస్ లాంటి సిద్ధాంతవేత్తల రచనలు చదివిన రచయితలు చాలా తక్కువ. రా.రా. వారిలో ఒకరు! తెలుగు సాహితి నిస్తబ్ధంగా పడివుండిన దశలో 1968లో ‘సంవేదన’ పత్రిక మొదలుపెట్టి చైతన్యం తీసుకొచ్చిన వాడు రా.రా. ఆయన కథా సంపుటి ‘అలసిన గుండెలు’ కొడవటిగంటి కుటుంబరావుకు బాగా నచ్చింది. రా.రా.ను విమర్శకుడిగానే కాక, కథక శిల్పిగా కూడా... కథాశిల్పం గురించి లోతుగా అధ్యయనం చేసి, పుస్తకం రాసిన వల్లంపాటి గౌరవించేవారు. ఇక, సొదుం జయరాం, కేతు విశ్వనాథరెడ్డి తదితరుల మాట చెప్పనక్కర్లేదు. వాళ్లను రా.రా. అంతేవాసులనవచ్చు. ‘అనువాదకుడిగానూ, అను వాద ప్రక్రియ అధ్యయనశీలిగానూ’ ఒక్కమాటలో చెప్తే రా.రా. కృషి అనన్యసాధ్యం! విమర్శకుల్లో రా.రా. మెథడాలజీని, మెథడ్ను రెండింటినీ ఒకమేరకు ఒంటపట్టించుకున్నవారు ఆర్వీయార్ . ‘సంవేదన’ సంపాదకుడిగా రా.రా. ఆ పత్రికలో సుదీర్ఘ సమీక్షలు చేసేవారు; చేయించేవారు కూడా! అయితే, రా.రా. విమర్శచేసే తీరుతెన్నులపై పూలే కాదు రాళ్లు కురిపించినవాళ్ళూ కొంద రున్నారు! ఆయన విమర్శను కొందరు ‘వ్యక్తిగత’ విమర్శగా పరిగణించారు! అందులో వ్యక్తమయ్యే ధర్మాగ్రహమే అందుకు కారణం. రా.రా. అభిమాన కవి శ్రీశ్రీయే ఆయన్ను ‘క్రూరమయిన విమర్శకుడ’ని అన్న సంగతి మన కందరికీ తెలుసు. ఇలాంటిది ప్రతి రచయిత విషయంలోనూ జరగదు. కాన్సిక్వెన్సియల్ రచయితల విషయంలోనే అలా జరుగుతుంది! ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పవలసివుంది. రా.రా. ఏ రంగంలో కృషి చేసినా దానిపై తన ముద్ర బలంగా వేసిన వారు. వాటిల్లో అనువాదం కూడా ఒకటి! ‘అనువాదం అంటే ఏమిటి?’ అనే ప్రశ్న ఎంత సరళమైందో దానికి వచ్చిన సమాధానాలు అంతే జటిలంగా ఉన్నాయి! ‘మూలభాషలోని పాఠాన్ని, లక్ష్యభాషలోకి మార్చడమే అనువాదం’ అనేది అతి సరళమైన నిర్వచనం అనిపించు కుంటుందేమో! అయితే, రాబర్ట్ ఫ్రాస్ట్ అనే ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ కవి అనువాదం విషయంలో అంత ‘సరళంగా’ ఆలోచిం చినట్లు కనబడదు. కవిత్వానికి ఓ నిర్వచనం చెప్పవయ్యా మహానుభావా అంటే ‘అనువాదంలో లుప్తమైపోయేదే కవిత్వం’ అన్నాడు ఫ్రాస్ట్! ఈ విష యంలో ఫ్రాస్ట్కు మరెందరో మద్దతుదారులు కూడా వున్నారు; అసలు అనువాదాల ‘శీలాన్నే’ శంకించారు కొందరు. అలాంటి ఫ్రెంచ్ సామెత ఒకదాన్ని రా.రా. తన పుస్తకం ‘అనువాద సమస్యలు’ మొదట్లోనే పేర్కొ న్నారు. ఆ పాటి హాస్య ప్రియత్వం లేకుండానే ఆయన అన్నేళ్ళు అనువాద రంగంలో గడపగలిగారంటారా? రా.రా. పెద్దగా మెచ్చని ఓ మాటతోనే ఆయన్ని అభివర్ణించగలం. అది (బాగా అరిగిపోయిన మాటే అనుకోండి) బహుముఖ ప్రజ్ఞావంతుడు! ‘సారస్వత వివేచన’ అనే విమర్శ వ్యాసాల సంకలనం వెలువరించిన గొప్ప విమర్శకుడు రా.రా. నన్నయ, తిక్కన, పోతన, పెద్దన, ఏనుగు లక్ష్మణకవి, గురజాడ, దువ్వూరి రామిరెడ్డి, చలం, విశ్వనాథ, శ్రీశ్రీ, మహీధర, కాళోజీ, ఆర్.ఎస్. సుదర్శనం, బంగోరె, కేవీఆర్, అద్దేపల్లి రామమోహనరావు లాంటి తెలుగు వాళ్ళ కృషితో పాటు ఉమర్ ఖయావ్ు, రబీంద్రనాథ్ టాగోర్ తదితరుల రచనలను కూడా విమర్శనాత్మకంగా విశ్లేషించి నిష్కర్ష చేసిన వాడు రా.రా. ఆయన వ్యాసాలన్నింట్లో ముఖ్యంగా ‘అనువాద సమ స్యలు’లో మెటా ఫర్ను (ఆలంకారిక అభి వ్యక్తిని) విస్తృతంగా వాడడం కనిపిస్తుంది. ఇది, మనకో మాట చెప్తుంది. ‘హృదయ వాది’ రా.రా. ‘మనసులో కవి’ (ఎ పొయెట్ ఎట్ హార్ట్) అయివుండాలి!! దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించి చెప్తూ ‘‘తిలక్లోని ప్రముఖమైన గుణం భావు కత్వం. కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. శ్రీశ్రీ తర్వాత ఇంత భావుకత్వంగల కవి మనకు లేడేమో!’ అన్నారు రా.రా. ‘అలౌకిక సౌందర్య శోభితమయిన ఐంద్రజాలికుని అంతఃపురం లాగుంది అతని కవితా చందన శాల’ అని కూడా అన్నారాయన. ఆ వ్యాసం తిలక్ ‘వస్తుతః భావకవి’ అని సాదరంగా స్థాపించిందని గుర్తుంచుకోవాలి! అలాంటి వ్యాసానికి అలాంటి భాష ఉపయోగించడానికి అంతో ఇంతో కవి అయివుండాలి! ‘మల్లారెడ్డి గేయాలు’ పరిచయ వాక్యాల్లో వ్యక్తమయిన ‘అనన్యత లాంటి అన్యోన్యత’ లాంటి అలంకారాలూ ఆ విషయాన్నే పట్టిస్తాయి. ‘రేపటికోసం’ సంకలనంలో, బెర్టోల్ట్ బ్రెష్ట్ రాసిన ‘మృత సైనికోపాఖ్యానం’ అనే పాటకి రా.రా. చేసిన అనువాదం చూస్తే, గేయ రచనలోనూ ఆయన సిద్ధహస్తుడని రుజువ వుతుంది. అదృష్టదీపక్ కవితా సంపుటి ‘ప్రాణం’ పుస్తకానికి రా.రా. ముందు మాట కూడా కవిత్వం పట్ల ఆయన అభిమానానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్తే, విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండగలదో చూపించా డాయన. మరీ ముఖ్యంగా ఆయన రాసిన సమీక్ష వ్యాసాలు విమర్శ రంగాన్ని కొత్త మలుపు తిప్పాయి. ‘చుక్కలు చీకటి’, ‘నీతి గానుగ’ లాంటి గొప్ప కథలు రాసిన రా.రా., సొదుం జయరాం (వాడిన మల్లెలు), కేతు విశ్వనాథరెడ్డి (జప్తు), కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి (కుట్ర) లాంటి కథకులనూ పదునుపెట్టి, తెలుగు సాహితికి పరిచయం చేశారు. ‘సంవేదన’ పత్రికలో జయరాం కథానిక ‘వాడిన మల్లెలు’ పై చేసిన ప్రయోగం, దాన్ని సవిమర్శకంగా విశ్లేషిస్తూ కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసమూ కథానిక రచయితల పాలిట పెద్దబాలశిక్ష లాంటివి! పిల్లల కోసం ‘చంద్ర మండలం శశిరేఖ’, ‘విక్రమార్కుని విడ్డూరం’, ‘అన్నంపెట్టని చదువు’ లాంటి విలువైన ఆసక్తికరమైన రచనలు చేసినవారు రా.రా. రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య జీవితంలో పత్రికలదీ పెద్దపాత్రే! ‘సవ్యసాచి’, ‘సంవేదన’ లాంటి పత్రికలకు ‘సంపాదకుడిగా’ ఉండిన ప్రతిభా వంతుడాయన. ‘వ్యక్తి స్వాతంత్య్రం సమాజ శ్రేయస్సు’ లాంటి సైద్ధాంతిక విషయాలను ఏనాడో చర్చించిన మేధావి రా.రా. తర్వాతి రోజుల్లో పుస్తక రూపంలో వచ్చిన ఈ దీర్ఘ వ్యాసం ‘సందేశం’ పత్రికలో మొదటిసారి అచ్చయినట్టుంది. దినపత్రి కల్లో స్పష్టంగానూ, స్ఫుటంగానూ, నిర్దుష్టంగానూ ఉండే అనువాదాలు చేసేలా విద్యార్థులకు ఒరవడి నిచ్చిన శిక్షకులు రా.రా. ఇక, రాచమల్లు రామచంద్రారెడ్డి రెండున్నర దశాబ్దాల కాలం కేంద్రీకరించి పనిచేసిన రంగం అనువాదం! అంతేకాదు రచనా ప్రక్రియ గానూ, శాస్త్రం గానూ అనువాదాన్ని సాధన చేశారాయన. పరిశోధకుల పరిభాషలో వాటిని మెథడ్గానూ, మెథడాలజీగానూ ఆయన సాధన చేశారని చెప్పొచ్చు! రా.రా. ‘అనువాద సమస్యలు’ పుస్తకానికి 1988లో కేంద్ర సాహిత్య ఎకాడెమీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే! భారతీయ భాషల్లో అలాంటి పుస్తకం అంతవరకూ రాలేదని అప్పట్లో ఓ సమీక్షకుడు పేర్కొన్నారు! - మందలపర్తి కిశోర్ సీనియర్ పాత్రికేయుడు (నేడు కేంద్ర సాహిత్య అకాడమీ, యోగి వేమన విశ్వవిద్యాలయం, బ్రౌన్ గ్రంథాలయం రా.రా. శతజయంతి సదస్సు నిర్వహిస్తున్నాయి) -
శ్రావ్యంగా సొంత గొంతు!
పుస్తక పరిచయం రెండు పీహెచ్డీ పట్టాలు పుచ్చుకుని, తెలుగు విశ్వవిద్యాలయం తులనాత్మక పరిశోధన విభాగం అధిపతిగా ఉన్న ఆచార్య కర్రి సంజీవరావును తెలిసినవాళ్లు కొన్ని వందల్లో ఉంటారేమో. కానీ, దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రగాఢమైన, అనుభూతి ప్రధానమైన కవిత్వం రాస్తూ, సొంత గొంతులో దళితానుభూతిని ఆవిష్కరిస్తూ, అప్పుడప్పుడు సాహితీమూర్తులకు శ్రద్ధాంజలి సమర్పించుకుంటూ వస్తున్న శిఖామణిని ఎరిగినవాళ్లు అనేక వేలల్లో ఉంటారు. ఈ మధ్యనే శిఖామణి మూడు పుస్తకాలు అచ్చేసి, విడుదల చేశాడు. వాటిల్లో ఒకటి 2013-15 మధ్యకాలంలో అచ్చయిన కవితల సంకలనం (పొద్దున్నే కవి గొంతు). మరొకటి, పీహెచ్డీ కోసం హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి తను సమర్పించిన పరిశోధన పత్రం (తెలుగు మరాఠి దళిత కవిత్వం). వేరొకటి ముప్పయి నాలుగు మంది సాహిత్య జీవులకు ఘటించిన నివాళి (స్మరణిక). వీటిల్లో చివరి పుస్తకాన్ని తన ‘పంచమాతృకల స్మృతికి’, ‘తెలుగు మరాఠి దళిత కవిత్వం’ కలేకూరి ప్రసాద్ (యువక) స్మృతికి అంకితమివ్వడం బావుంది. ఎన్ని రచనా రూపాల్లో తన ఉనికిని చాటుకున్నప్పటికీ, శిఖామణి ప్రాయికంగా కవి. అతని కవితా సంకలనాన్ని సాకల్యంగా పరిశీలిస్తే, శిఖామణి సాహితీ మూర్తిమత్వం ఆవిష్కృతమవుతుంది. అంతెందుకు -‘పొద్దున్నే కవిగొంతు’ పుస్తకంలోని ‘పులస స్వగతం’ కవిత చదివితే చాలు - అతని కవితాత్మ అర్థమైపోతుంది. (నా దగ్గిర ఇలాంటి మోక్షదాయికమైన సూక్ష్మాలు డజన్లకొద్దీ ఉన్నాయి. అవసరమైనవాళ్లు ఎప్పుడైనా సంప్రదించవచ్చు). కవి ఈ కవితా సంకలనాన్ని తన ‘గురువుగారు’ ఇస్మాయిల్కి అర్పించుకున్నాడు. తత్తుల్యుడైన కె.శివారెడ్డి గురించి రాసిన కవిత పేరే ఈ సంకలనానికి పెట్టుకుని తన ప్రపత్తి చాటుకున్నాడు. ఇస్మాయిల్ నుంచి శివారెడ్డి వరకూ విస్తరించిన సువిశాల కవితాత్మ శిఖామణిది. తర్వాత తర్వాత అది దళిత కవిత్వం వరకూ సాగింది, అది వేరే విషయం. తన రచనా సంవిధానం గురించి కవిగారు ఈ సంకలనంలో ఓ కవిత రాశాడు (వాక్యం పలకాలి). శిఖామణి రాసే పద్ధతిని నరేటివ్ రీతి అనొచ్చునేమో. ఇది కవిత్వం కట్టినట్లు ఉండదు. కథ చెప్పినట్లు ఉంటుంది. ఈ సంకలనంలోని తొట్టతొలి కవిత ‘మురమళ్ల రేవు’ దీనికి నిదర్శనంగా ఉంది. జానపద, పౌరాణిక రచనల్లో ఎక్కువ భాగం ఈ రీతిలో రాసినవే. మన భావుకవుల్లోనూ చాలామంది ఈ పద్ధతిలో రాశారు. శ్రీశ్రీ రాసిన ‘భిక్షు వర్షీయసి’, ‘బాటసారి’ లాంటివి కూడా ఇదే కోవకి చెందుతాయి. ఇక కుందుర్తి కథా కావ్యాలు రాయగా, శీలా వీర్రాజు ఏకంగా నవలా కావ్యమే(!) రాశారు. అయితే, శిఖామణి కవితలకీ ఇక్కడ చెప్పుకున్నవాటికీ రూపం వరకే పోలిక. సారం విషయానికొస్తే ఇతగాడు సమకాలీనుడు. ఈ సంకలనంలోని చిట్టచివరి కవిత ‘భీమ్ పాటే పాడతాను’ ఇందుకు రుజువు. ముప్పయ్యేళ్లలో పది కవితా సంకలనాలు విడుదల చేసిన శిఖామణి అదే ఉత్సాహం ఇక ముందు కూడా ప్రదర్శిస్తాడని ఆశ. ఒక చిన్నమాట - ఈ మూడు పుస్తకాల్లోనూ అడుగడుగునా అచ్చుపుచ్చులు వేధిస్తున్నాయి. ఆచార్యులవారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. - మందలపర్తి కిషోర్ 8179691822 -
ఆకాశమంతెత్తు ఆ రెండు శిఖరాలు!
తాజా పుస్తకం: ఒకప్పుడు బెజవాడ చుట్టూ చాలా కొండలుండేవి. వాటి సిగపాయల్లో మరెన్నో శిఖరాలు మెరుస్తుండేవి. కాలపురుషుడు వాటిలో చాలావాటిని -ఉల్లిపాయలు తరిగినట్లు- నరికిపారేశాడు. కానీ, కొన్ని శిఖరాలు ఇప్పటికీ ఠీవిగా తలెత్తుకు తిరుగుతూనే ఉన్నాయి. కాలపురుషుడే కాదు- కాలయముడు కూడా మమ్మల్నేం చెయ్యలేడు అన్నట్లు నిటారుగా నిలిచివుండే శిఖరాలవి. ఈ మధ్యన బెజవాడ వెళ్లినప్పుడు అలాంటి శిఖరాల్ని చూసి ముచ్చటించి ఆనందపడ్డాను. ఏలూరు రోడ్డులోని సీతారాంపురంలో కనకదుర్గా సినిమాటాకీసు ఉండేది. అదిప్పుడు లేదు. అక్కడ కట్టిన అపార్టుమెంట్లలో పెద్దిభొట్ల సుబ్బరామయ్య ఉంటున్నారు. ఎంచేతో గానీ, సుబ్బరామయ్యగారు మాచవరం, మారుతీనగర్, చుట్టుగుంట, సీతారాంపురం - ఆ చుట్టుపక్కలే ఉంటుంటారు. ‘ఇది ఈ మధ్యన మొదలయిందేం కాదు- నేను ఎస్సారార్లో చదివే రోజుల్నించీ నాకిక్కడే అలవాటు. అప్పట్లో (విశ్వనాథ) సత్యనారాయణగారు ఇక్కడ ఉండడం వల్ల కావచ్చు. విశాలాంధ్రలో నా స్నేహితులు చాలామంది ఉద్యోగాలు చేస్తూండడం వల్ల కావచ్చు. నాకే కాదు- ఇంట్లో వాళ్లందరికీ ఈ ప్రాంతం అలవాటయిపోయినందువల్ల కావచ్చు. మొత్తానికి ఎక్కువభాగం ఇక్కడే ఉండిపోయాం. ఆ మాటకొస్తే, నా డెబ్బయ్యారేళ్ల జీవితంలో గట్టిగా పదేళ్లు తప్పిస్తే మిగతాదంతా బెజవాడలోనే గడిచిపోయింది. ఎన్నో చేదు అనుభవాలూ మరెన్నో తియ్యని అనుభూతులూ ఇక్కడే ఎదురయ్యాయి నాకు’ అన్నారు పెద్దిభొట్ల. ‘నేనీ ప్రపంచానికి ఏమివ్వగలిగానో ఎప్పుడూ పరామర్శించుకోలేదు. కానీ, ప్రపంచం మాత్రం నాపైన బోలెడంత కరుణ కురిపించింది. నేను డిగ్రీ ఇలా పూర్తి చేశానోలేదో లయోలా కాలేజ్ యాజమాన్యం నన్ను పిల్చి ట్యూటరు ఉద్యోగమిచ్చింది. అప్పట్లో రెవెన్యూ డిపార్టుమెంటులో గుమాస్తాలకు 48 రూపాయలిచ్చేవాళ్లు. అలాంటిది, లయోలావాళ్లు నాకు 116 రూపాయల నెలజీతంమీద ఉద్యోగమిచ్చారు. నిజానికి నాకు విశాఖ వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీలో ఫోర్తానర్సు చెయ్యాలని ఉండేది. కానీ, మా అమ్మ మాటమీద లయోలాలో చేరాలని -ఓ శనివారం ఉదయం- బయల్దేరా. దార్లో లీలా మహల్ బయట ఓ బోర్డు పెట్టిఉంది. సత్యజిత్ రాయ్ తీసిన ‘పథేర్ పాంచాలీ’ ఆ పూట ఒకే ఒక్క షో వేస్తున్నారట. బస్సుదిగి తిన్నగా వెళ్లి హాల్లో కూర్చుని, ఆటయ్యాక ఇంటికెళ్లిపోయా. సోమవారం నాడు లయోలాకు వెళ్లి ట్యూటరుగా చేరిపోయాను. అక్కడే రిటైరయినాను. ఈ మధ్యే మా కాలేజ్ వాళ్లు నన్ను పిల్చి సన్మానం చేసి -అదిగో, ఆ జ్ఞాపిక చేతికిచ్చి పంపించారు’ అంటున్నప్పుడు సుబ్బరామయ్యగారి మొహం -సంతృప్తితో కాదు, సంతోషంతో- తళతళలాడింది. ‘విషయమేమిటంటే, నాకు విశాఖ వెళ్లాలనుకున్నా వెళ్లివుండలేకపోవచ్చు. కానీ, పథేర్ పాంచాలీ సినిమా చూడదల్చుకున్నప్పుడు చూసేశాను! అంటే మంచి కథో మంచి సినిమానో అంటే ఉండే పిచ్చి అది. ఆ పిచ్చిని అర్థం చేసుకున్నారు కాబట్టే చెప్పిన టైముకు రాకపోయినా లయోలా ఫాదర్లు నా మీద కోపగించలేదు. సరిగదా, మా కాలేజ్లో ఓ మంచి రైటరున్నాడర్రా అని కేరళలో అందరికీ మచ్చటగా చెప్పుకునే వారట కూడా. అలాగే, నేనేదో నా బుద్ధికి తోచిన కథలేవో రాసుకుపోయానంతే. సెంట్రల్ సాహిత్య అకాడెమీ వాళ్లు బహుమతిచ్చారు. ఓ రోజు మధ్యాహ్నం భోంచేసి కూర్చున్నా. ఎవరో అపరిచితులు ఫోన్ చేశారు. ‘నా పేరు అప్పాజోస్యుల సత్యనారాయణ- మా అజోవిభొ ఫౌండేషన్ పురస్కారం మీకివ్వాలనుకుంటున్నాం!’ అన్నారాయన. అది చాలా పెద్దపేరున్న సంస్థ అని తెలుసు తప్ప వాళ్ల అడ్రెస్గానీ, కనీసం ఫోన్ నంబరుగానీ నాకు తెలీవు. అయినా పిల్చి పీటేయడం వాళ్ల ఔదార్యం’ అన్నారు పెద్దిభొట్ల తొణకని బెణకని ఆత్మ గౌరవంతో. ఆ తర్వాత సిద్ధార్థ కాలేజ్ దాటి, సున్నపు బట్టీల మీదుగా, క్రీస్తురాజపురం వైపు వెళ్తుంటే, ఓ సందులో ‘అభ్యాస’ స్కూలు బస్సులు కనిపించాయి. అదే సందులో సి.రాఘవాచారిగారిల్లుంది. వరవరరావులాంటి వాళ్లను మార్క్సిజం ప్రభావ పరిధిలోకి ఆకర్షించిన ప్రతిభ ఆయనది. అరవై దశకంలో పేట్రియాట్, లింక్ పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాఘవాచారిగారు గొప్ప వ్యాఖ్యలను -రిపోర్టుల పేరిట- రాశారు. వాటి గురించి ‘అప్ కంట్రీ’ జర్నలిస్టులు ఇప్పటికీ ప్రస్తావిస్తూ ఉండడం కద్దు. ఇక, విశాలాంధ్ర పత్రికను తెలుగు సాంస్కృతిక జీవిత ప్రతినిధిగా దిద్దితీర్చడంలో ఆయన పాత్ర అందరికీ తెలిసిందే. బెజవాడలో జరిగే చెప్పుకోదగిన సభలన్నింటికీ రాఘవాచారిగారే అధ్యక్షత వహించడం ఓ స్థానిక సంప్రదాయంగా పరిణమించింది. డైలీ జర్నలిజం నుంచి విరమించినప్పటికీ, ఇప్పటికీ, విజయవాడ మేధో జగత్సహోదరులకు పెద్దదిక్కుగా ఆయన కొనసాగుతూనే ఉన్నారు. ‘మాది వరంగల్లు. మా మేనమామలది పశ్చిమగోదావరి జిల్లా పెన్నాడ. తెలుగు సంస్కృతిలోని భిన్నత్వాన్నీ దాన్లోని ఏకత్వాన్నీకూడా చిన్నప్పుడే గ్రహించినవాణ్ణి నేను. వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవనంలో అరుదయిన వ్యక్తులను అతిసన్నిహితంగా చూశాను. అది వరంగల్లులోని కాళోజీలే కావచ్చు- హైదరాబాద్లోని మఖ్దూం, రాజ్బహదూర్ గౌర్, మొహిత్ సేన్లే కావచ్చు- విజయవాడ వచ్చాకా విశాలాంధ్ర పెద్దలయిన చంద్రంగారూ, బలరామమూర్తిగారే కావచ్చు. సంపాదక ప్రముఖులు నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావుగారే కావచ్చు. రాంభట్ల, మల్లారెడ్డి, బూదరాజులాంటి అభ్యుదయ రచయితలే కావచ్చు. వీళ్లలో ప్రతిఒక్కరితోనూ ఆత్మీయ అనుబంధం ఏర్పడింది నాకు. ఆ బాంధవ్యం ప్రాతిపదికగానే మా స్నేహం మారాకు వేస్తూ వచ్చింది.’ అన్నారు రాఘవాచారి సగర్వంగా. ‘నేనన్నమాటకు అర్థం పైన చెప్పినవాళ్లతో నాకు భిన్నాభిప్రాయాలే లేవని కాదు సుమా!’ అని హెచ్చరించారాయన. ‘ఎప్పుడూ ఎవరితోనూ మూసకట్టు ‘అభిప్రాయభేదాలు’ పెంచుకోలేదన్నది నా పాయింటు. మన గీటురాళ్లు మనం జాగ్రత్తగా పెట్టుకోవడం ముఖ్యం.’ ఆ తర్వాత చాలామాటలే నడిచాయి. ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు. పెద్దిభొట్ల, రాఘవాచారి... ఇద్దరూ వయసు తాలూకు అలసటగాని అనారోగ్యపు అస్థిమితత్వాన్నిగాని లెక్క చేయకుండా హుషారుగా ఉన్నారు. దప్పికేసిన వాళ్లకు దాహం అందించే చలివేంద్రాల్లానే ఉన్నారు. దేశమంటే మట్టికాదు మనుషులు అంటే అర్థం అదే. ఒక ఊరంటే ఆ ఊరి మనుషులే. పర్లేదు. బెజవాడ భేషుగ్గానే ఉంది. - మందలపర్తి కిశోర్ 99122 29931