నాలుగు అక్షరాలే కానీ, నాలుగు రాళ్ళు వెనకేసుకోలేని పరిస్థితి తెలుగు పత్రికారంగంలో గతంలో ఎక్కువగా ఉండేది. ఆదాయం తక్కువై శ్రమ ఎక్కువైనా, వేళాపాళా లేకపోయినా చాలామంది పత్రికారంగాన్ని పట్టుకుని వేళ్లాడడానికి కారణం, ఆ వృత్తిపట్ల ఆసక్తి, దాని విలువలపట్ల నిబద్ధతే. పొత్తూరి వెంకటేశ్వరరావు అలాంటి తరానికి చెందిన పాత్రికేయులు. ఆంధ్రజనత, ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికలలో సబ్–ఎడిటర్ నుంచి సంపాదకుని వరకు వివిధ హోదాలలో పనిచేసిన పొత్తూరిగారు పాత్రికేయ కులపతులలో ఒకరుగా పరిణమించి తదుపరి తరాలవారికి మార్గదర్శి అయ్యారు.
ఆయన తొంభైల ప్రారంభంలోనే పదవీవిరమణ చేసినప్పటికీ ఆ తర్వాత కూడా ఏనాడూ కలం దించలేదు, నడుము వాల్చలేదు. మధ్యలో కొన్నేళ్లు ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా ఉన్నారు. ‘ఆంధ్రజాతి అక్షరసంపద తెలుగుపత్రికలు’ అనే పరిశోధనాత్మక గ్రంథం పత్రికారంగానికి వారిచ్చిన అమూల్యమైన కానుక. అలాగే, సామాజిక, రాజకీయ పరిణామాలను పట్టించుకున్నారు. డెబ్బై, ఎనభై దశకాలలో పత్రికారంగంలోకి వచ్చినవారిలో ఆయన దగ్గర తర్ఫీదైనవారు చాలామంది ఉన్నారు. వారి మృతి వారందరిలోనూ వారి జ్ఞాపకాలను రేపే విషాద సందర్భం.
రామ్‌నాథ్ గోయెంకా సారథ్యంలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్–ఆంధ్రప్రభ గ్రూపులో పనిచేయడం వల్ల సంపాదకునిగా తన స్వేచ్ఛను ప్రకటించుకుని, తన ముద్రను స్థాపించుకునే అవకాశం పొత్తూరిగారికి లభిం చింది. గోయెంకా తన సంస్థలో దిద్దిన ఒరవడి అది. సంపాదకుల విధులు, విధానాలలో ఆయన జోక్యం చేసుకునేవారు కాదు, ఇంకొకరిని చేసుకొనిచ్చేవారు కాదు. ఎందులోనైనా సంపాదకునిదే తుదిమాట కావాలని శాసించేవారు. పత్రిక విధానాన్ని రూపొందించుకునే తన స్వేచ్ఛను యజమాని ప్రశ్నిస్తున్నారని పొత్తూరిగారు శంకించి రాజీనామా చేయడం, ఒక పాఠకునిగా నా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ నాకు లేదా అని గోయెంకా ప్రశ్నిస్తూ రాజీనామాను చించి చెత్తబుట్టలో వేయడం ఒకటి రెండుసార్లు సంభవించాయి. ‘విధి నా సారథి’ పేరుతో తను రచించిన ఆత్మ కథలో పొత్తూరి తెలిపిన ఇలాంటి ఉదంతాలు సంపాదకునికీ–యజమానికీ మధ్య ఉండాల్సిన ఆదర్శబంధాన్ని వెల్లడిస్తాయి.
సంపాదకునిగా పొత్తూరిగారు చాలా విషయాలలో చాలా ఉదారవాదిగా వ్యవహరించేవారు. సిబ్బందిని నియమించుకోవడంలో అది స్పష్టంగా కనిపించేది. అతివాదులు, మితవాదులు, మతవాదులు, మధ్యేవాదులతో సహా అన్ని రకాల ఆలోచనాపంథాల వారికీ; అన్ని సామాజికవర్గాల వారికీ పత్రికలో చోటు ఇచ్చేవారు. ప్రోత్సాహం, పదోన్నతి అందించడంలో సామర్థ్యానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయన ఇచ్చిన అవకాశంతో ప్రతిభకు సానపెట్టుకుని తర్వాతి కాలంలో ఎందరో సంపాదకులు, బ్యూరో చీఫ్‌లు అయ్యారు. నాటి నార్ల వేంకటేశ్వరరావుగారిలా నీలం రాజు వెంకటశేషయ్యగారిలా ఆంధ్రప్రభ దినపత్రిక, వారపత్రికలు రెండింటికీ సంపాదకత్వం వహించే అవకాశం పొత్తూరిగారికి కూడా లభించింది.
వారపత్రిక సంపాదకీయ రచనలో విషయ సేకరణకు ఎంతో సమయం వెచ్చించి, ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. దాంతో అవి సాహిత్యపు విలువను సంతరించుకునేవి. వారపత్రిక సంపాదకీయమైనా, దినపత్రిక సంపాదకీయమైనా చెప్పదలచుకున్న అంశాన్ని సరళమైన భాషలో, చిన్న చిన్న మాటలలో చెప్పడం ఆయన శైలి. సంపాదకీయాన్ని విధిగా మరొకరి చేత చదివించిగానీ పత్రికలో పెట్టించేవారు కాదు. చదివిన వ్యక్తి ఎక్కడైనా సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు తను రాసింది సక్రమమే అనుకున్నా సరే సవరించడానికి వెనుకాడేవారు కాదు. మనం రాసేది పాఠకునిలో ఎలాంటి సందేహాలకు, అస్పష్టతకు తావు ఇవ్వకూడదనేవారు.
పొత్తూరిగారి తరంలో, అంతకుముందు తరంలో సంపాదకుని విధి పత్రికా నిర్వహణకు మాత్రమే పరిమితమయ్యేది కాదు. రాజకీయ, సామాజిక రంగాలతో సహా వివిధ రంగాలకు వారి సలహాలు, సూచనలు అవసరమయ్యేవి. అది సంపాదకునిపై అదనపు బాధ్యత అయ్యేది. పొత్తూరిగారి వృత్తిజీవితంలోనూ అలాంటి ఘట్టాలు అనేకం ఉన్నాయి. ఆత్మకథలో వాటిని పొందుపరచుకున్నారు. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నక్సలైట్లతో శాంతి చర్చలను ఫలప్రదం చేయడానికి కృషిచేసిన ప్రముఖులలో పొత్తూరి ఒకరు. తను ఆంధ్ర ప్రాంతానికి చెందినా, తెలంగాణ జిల్లాల్లో అనేకసార్లు పర్యటించిన పాత్రికేయునిగా ఇక్కడ ప్రత్యేక రాష్ట్రవాదం ఎంత బలంగా ఉందో గుర్తించి మొదటినుంచీ తెలంగాణ ఏర్పాటును బలంగా కోరుతూవచ్చిన ప్రజాస్వామికవాది ఆయన. అర్థశతాబ్దికి పైగా తెలుగువారి చరిత్రతో తన జీవితాన్ని పెనవేసుకున్న అక్షర సంపాదకుడు ఆయన.
- కల్లూరి భాస్కరం
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
మొబైల్ : 97034 45985
Comments
Please login to add a commentAdd a comment