
ఎనభై సంవత్సరాలు నిండిన జీవితంలో అరవై సంవత్సరాల ప్రజా జీవితం, అందులో నలభై సంవత్సరాల పాత్రికేయ జీవితం గడిపి, విలువలతో, విద్వత్తుతో, విస్పష్టమైన దృక్పథంతో, ప్రపంచం పట్ల అపారమైన ప్రేమతో అజాత శత్రువుగా జీవించి సోమవారం ఉదయం హైదరాబాద్‌లో మరణించిన చక్రవర్తుల రాఘవాచారి (సెప్టెంబర్ 10, 1939 – అక్టోబర్ 28, 2019) జీవితమూ, కృషీ, ప్రవర్తన ఉదాహరణప్రాయమైనవి, ఆదర్శప్రాయమైనవి. పాత వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం గ్రామంలో సంపన్న భూస్వామ్య శ్రీవైష్ణవ కుటుంబంలో చక్రవర్తుల వెంకట వరదాచార్యులు, కనకవల్లి దంపతుల సంతానంలో చివరివాడుగా జన్మించిన రాఘవాచారి కుటుంబ ఆచారాన్ని అనుసరించి ఇంట్లోనే సంస్కృతం, ఉర్దూ, తెలుగు, తమిళం చదువుకున్నారు. మతాచార పరులైనప్పటికీ కుటుంబానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పట్ల సానుభూతి ఉండడం, గెరిల్లాలకు ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం, సమీప బంధువు ఒకరు గెరిల్లాగా పనిచేస్తూ పోలీసు కాల్పుల్లో చనిపోవడం ఆయన తొమ్మిది, పదేళ్ల వయసు నాటికే కలిగిన అనుభవాలు. పాఠశాల విద్య హనుమకొండలో, పీయూసీ హైదరాబాదులో చదివి, బీఎస్సీ కోసం 1957లో వరంగల్ ఆర్ట్స్ కాలేజి చేరేనాటికే ఆయనలో వామపక్ష భావాలు బలపడ్డాయి.
అక్కడే కళాశాల విద్యార్థి సంఘం కార్యదర్శిగా కూడా ఉండి, ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం చదవడానికి వచ్చేసరికి ఆయన అప్పటి కమ్యూనిస్టు పార్టీ అనుబంధ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులయ్యారు. కులాచారపరంగా వేదాధ్యయనమూ ఉపనయనమూ జరిగి, తొమ్మిదో ఏటి నుంచి పద్దెనిమిదో ఏటి దాకా పూజా పునస్కారాలు చేసిన వ్యక్తే, జంధ్యం ధరించిన వ్యక్తే ఒకటొకటిగా వాటన్నిటినీ వదిలేశారు. ఆ వదిలేయడం కూడా ఏదో ఉద్వేగం కొద్దీ కాదు, క్రమక్రమంగా అధ్యయనంతో దృక్పథం బలోపేతమవుతుండగా కమ్యూనిస్టుగా మారి 1960 నాటికి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అలా బ్రాహ్మణ భూస్వామ్య విలువల్లో పుట్టి పెరిగి, తనలో తాను సంఘర్షణతో, ప్రశ్నలతో, చర్చలతో, అధ్యయనంతో ప్రజానుకూల ప్రగతిశీల వామపక్ష అభిప్రాయాలు పెంపొందించుకుని కొత్త విలు వల కమ్యూనిస్టు కార్యకర్తగా మారారు. ఆ విలువలతోనే అరవై ఏళ్లకు పైగా జీవించారు. ఉద్వేగంతో కొన్ని విలువలు ఏర్పడతాయి, కానీ అధ్యయనంతో వాటిని స్థిరపరచుకోవాలి అని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈ ప్రయాణం సులభంగా సాగిందేమీ కాదు.
చదువుకున్న న్యాయశాస్త్ర విద్యతో న్యాయవాదిగా మారి ఉంటే ఏమై ఉండేవారో తెలియదు గానీ, డిగ్రీ రోజుల నుంచే సామాజిక విషయాల మీద రచన అలవాటు ఉండడంతో పత్రికారచనలోకి వచ్చారు. పార్టీ చీలిక సందర్భంగా మొహిత్ సేన్, తానూ కలిసి రాఘవాచారిని న్యాయవాద వృత్తి ఆలోచన నుంచి తప్పించి విశాలాంధ్రలోకి తీసుకువచ్చామని సంస్మరణ సభలో కందిమళ్ళ ప్రతాపరెడ్డి అన్నారు. అలా ఆయన 1965లో విశాలాంధ్ర దినపత్రికలో విలేకరిగా చేరడం న్యాయవ్యవస్థకు జరిగిన నష్టమేమో గాని, తెలుగులో వామపక్ష పత్రికా రచనకు అందిన అద్భుతమైన కానుక. అప్పటికే ఆయనకు ఇంగ్లిష్ రచనలో కూడా ప్రావీణ్యం ఉండడంతో పేట్రియట్, లింక్ పత్రికలకు హైదరాబాద్ లోనూ, ఢిల్లీలోనూ కూడా కరెస్పాండెంట్‌గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రధాన కార్యదర్శిగా జర్నలిస్టు ఉద్యమ నిర్మాణంలో పనిచేశారు. విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకుడిగా 1972 నుంచి 2000 వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పని చేసి, అతి ఎక్కువ కాలం సంపాదకుడిగా ఉన్న ఏకైక వ్యక్తి అయ్యారు. ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఆయన రాసిన వేలాది సంపాదకీయాలతో పాటు, తీర్చిదిద్దిన పాత్రికేయులు వందల మంది ఉన్నారు.
విశాలాంధ్ర ఒక కమ్యూనిస్టు పార్టీ దినపత్రిక గనుక పత్రికా రచన చరిత్రలో దానికి, సంపాదకుడిగా రాఘవాచారిగారికి దక్కవలసిన స్థానం దక్కకపోయినా, ఆయన వ్యక్తిత్వంలోని ఇతర ప్రభావశీల అంశాలు ఆయనను అపురూపమైన తెలుగు మేధావిగా నిర్ధారించాయి. ఆయన ఒక గొప్ప ఉపన్యాసకుడు. విషయం ఏదైనా, సభా నిర్వాహకులెవరైనా, కొన్నిసార్లు ఆయన భావాలను వ్యతిరేకించేవారైనా ఆయన ఉపన్యాసకుడిగా ఉండాలని కోరుకునేవారు. ఆయన ఉపన్యాసమంటే ఒక ప్రవాహంలా సాగేదేమీ కాదు, నింపాదిగా సాగుతున్నట్టే ఉండేది. కానీ హాస్యం, చమత్కారం, విద్వత్తు నిండిన ఆయన ఉపన్యాసం ఎంతసేపు సాగినా వినాలనిపించేట్టు ఉండేది. అది ఐదు పది నిమిషాల చిన్న ఉపన్యాసమైనా, గంటకు పైగా వివరంగా సాగే ఉపన్యాసమైనా అందులో ఇంగ్లిష్, ఉర్దూ, సంస్కృతం, తెలుగు సాహిత్యాల నుంచీ, సమాజం నుంచీ ఎన్నో ఉటంకింపులు ఉండేవి. ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు ఆయన జ్ఞాపకశక్తి విస్తారమైనది. ఉటంకింపులు షేక్ స్పియర్‌వి అయినా, కాళిదాసువైనా, మార్క్స్, లెనిన్‌లవి అయినా, గాంధీవైనా ఉపన్యాసం మధ్యలో, తెచ్చిపెట్టుకున్నట్టుగా కూడా కాకుండా, చాలా సహజంగా, అనివార్యంగా వచ్చినట్టుగా ఇమిడిపోయేవి. శ్రోతలకు తెలియని సమాచారం, తెలిసిన సమాచారంలోనే కొత్త కోణాలు, అతి సులభమైన, వివరమైన పద్ధతిలో ఉండేవి. అందువల్ల విజయవాడలో ఆయన ఉపన్యాసం లేకుండా జరిగిన సభలు అరుదు. ఆయన శ్రోతగా వచ్చి కూచున్నా మాట్లాడమని పిలిచిన సందర్భాలెన్నో.
అన్నిటికీ మించి ఆయన ఒక అద్భుతమైన మానవీయమైన మనిషి. అంత జ్ఞానసంపన్నుడై కూడా అత్యంత నిరాడంబరంగా, అందరితోనూ ఆప్యాయంగా ఉండేవారు. నడుస్తున్న గ్రంథాలయంగా, విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకుని కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపేవారు. తనకన్న ముప్ఫై నలభై సంవత్సరాల చిన్నవారితో కూడా గౌరవంగా ప్రవర్తించేవారు. పూర్తిగా వ్యతిరేకమైన భావజాలం ఉన్నవారి నుంచి కూడా గౌరవాద రాలు పొందిన అజాతశత్రువు. నలభై సంవత్సరాలుగా నాకు తెలిసి ఆయన ఆహార్యం తెల్లని మల్లెపూవు లాంటి దుస్తులే. ఆహార్యంలో మాత్రమే కాదు ఆయన హృదయంలోనూ, మానవ సంబంధాలలోనూ అటువంటి స్వచ్ఛమైన మల్లెపూల సుగంధాన్నే నింపుకున్నారు. వందల సంపుటాల ఉద్గ్రంథం లాంటి జ్ఞానసంపదను మల్లెపూల పరిమళంలా వ్యక్తిగత సంభాషణల్లోనూ, సభల్లోనూ వెదజల్లారు.
ఎన్ వేణుగోపాల్
వ్యాసకర్త వీక్షణం పత్రిక సంపాదకులు
మొబైల్: 98485 77028