రచయిత కాశీభట్ల వేణుగోపాల్ ఆగస్టు 19న తుదిశ్వాస విడిచారు
కాశీభట్ల వేణుగోపాల్ అనే పేరు తెలుగు సాహిత్యంలో సుపరిచతమే. ఆ పేరుతో పాటు అతను ‘ఏవో మనో చీకటి కోణాల్ని గురించి రాస్తాడట’ అని కూడా పరిచయమే. కాశీభట్లను ఏమీ చదవనివాళ్లు కూడా ఈ మాత్రపు ప్రాథ మిక అవగాహనతో అతడి పట్ల ఒక కొండ గుర్తును ఏర్పరుచుకుంటారు. ఒక ప్రశస్త కుదింపునకు గురైన రచయితలలో కాశీభట్ల ముందుంటాడు.
కాశీభట్ల మొదటి నవల ‘నేనూ–చీకటి’ వచ్చినప్పుడు దానిలోని చైతన్య స్రవంతి శైలి వల్ల అతడిని హత్తుకున్నవాళ్లు కొందరైతే, బండ కేసి బాదిన వాళ్లు కొల్లలు. ఎక్కువ మంది భాషాపాటవానికి అచ్చె రువొందారు. కాశీభట్లకు కవితాత్మకంగా వచనం రాయడం ఇష్టం. అది శేషేంద్ర ప్రభావం. కథా కథ నాన్ని సంక్లిష్టమైన చైతన్య స్రవంతిలో రాయడం ఇష్టం. ఇదేమో జేమ్స్ జాయిస్ ప్రభావం. రెండవ నవల ‘తపన’కు చాలా గుర్తింపు వచ్చింది కానీ మూడో నవల ‘దిగంత తాత్వికంగా ఉన్న నవల. సార్త్రే అస్తిత్వవాద ధోరణి ఈ నవలంతా పరుచుకొని ఉంది.
నవలల్లో నైనా, కథల్లోనైనా కాశీభట్ల ఒకే దృష్టికోణంతో కథాకథనం చేస్తాడు. అది ప్రధాన పాత్ర మానసిక కోణం నుంచి జరుగుతుంది. కాబట్టి రచయిత ఆలోచనల్ని పాత్ర ఆలోచనలకు రంగరించడం సులభమయ్యింది. ఈ సందర్భంగానే చెప్పు కోవాల్సిన విష య మేమంటే... కాశీభట్ల సాహిత్యంలో స్త్రీ పాత్ర గొంతుకతో కథాకథనం జరగలేదు. స్త్రీలుంటారు గానీ స్త్రీల మానసిక కోణం ఉండదు. ఆయా పాత్రల ఒంటరి ఆలోచనలు (వాటినే రచ యిత చీకటి ఆలోచనలు అంటాడు) కథకు ఉత్ప్రేరకాలు. సర్వ సాధారణంగా బాహ్య ప్రపంచానికి అభ్యంతరకరంగా ఉండే ప్రవ ర్తనల్ని సృష్టించుకొని వాటి పర్యవసానాల ఆధారంగా కథను నడపడం కాశీభట్ల శైలి. పాత్ర ఆలోచనలో ఒకానొక మైక్రో సెకెనులో తలెత్తే ఆలోచనా శకలం, సభ్య సమాజ ఆలోచనకు అభ్యంతరకరంగా ఉంటుందనీ, అలా అభ్యంతరంగా ఉన్నప్పటికీ నెగెటివ్ ఆలోచనా శకలాలు పుట్టడమే సహజమనీ, వాటిని చూపించి మానవుడిని నగ్నంగా ఎత్తి చూపడమే తన సాహిత్య లక్ష్య మనీ గట్టిగా నమ్మాడు కాశీభట్ల. తన మొదటి నవల నుంచి చివరి నవల ‘అసంగతం’ దాకా దీన్ని చెప్పడానికే రాశానంటాడు.
ఒకే ఒక్క సత్యం ‘మానవుడి మొదటి ఆలోచన దిగంబరమైనది’ అంటాడు. అదే కాశీభట్ల ఉద్దేశ్యంలో ‘చీకటి’. తన నవలలూ, కథలూ నిండా చీకటిని ఎన్ని రూపాల్లో చెప్పాడో ఎవరైనా పరిశోధన చేయెచ్చు. చీకటి ఒక ప్రలోభం. చీకటి ఒక కోరిక. చీకటి ఒక క్రియ. చీకటి ఒక ప్రయాణం. ఒక్కోసారి కాశీభట్ల సాహిత్యంలో చీకటే వెలుగు. చీకటిని గౌరవంగా తమోనమః అంటాడు. ఇక నేను అనే వాడు అన్ని సంద ర్భాల్లోనూ తన ప్రధాన పాత్ర. ఈ పాత్ర మనసు లోపలి దుర్మార్గ ఆలోచనల్ని, అభ్యంతరకరమైన యోచనల్నీ, అవి చర్యలుగా మారి, పాత్ర చుట్టూ ఉన్న సమాజంలోని చెడు, ప్రలోభం, దుర్మార్గం లాంటి చీకటులకు దోహదపడటాన్ని చిత్రిస్తాడు.
విపరీతంగా ప్రపంచ సాహిత్యాన్ని చదివాడు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, కన్నడ భాషల్లో పట్టు ఉండటం వల్ల... కథన భాష మణిప్రవాళం కావడం, తను రాసే వస్తువు పట్లా, అంశం మీదా గట్టి విషయ సేకరణా, తర్ఫీదు ఉండటంతో తను అనుకున్న వస్తువుతో ఆటలాడినంత సులభంగా రాస్తాడు. తన కేంద్రంగా రాస్తాడు. పాఠక కేంద్రాన్ని ఎట్టి పరిస్థి తుల్లోనూ అంగీకరించడు. కథాకథనంలో వాడే ప్రతీక లనో, అన్వయాలనో ఎవరైనా ప్రశ్నిస్తే, ‘మీరు సోమరి పాఠకులు. నన్ను చదవకున్నా ఫర్వాలేదు’ అంటాడు. అయితే ఈ కఠిన శైలి ‘కాలం కథల’లోనూ ఇటీవల రాసిన ‘చీకటీ గలు’, ‘అసత్యానికి ఆవల’, ‘అసంగతం’ నవలల్లో కొంత సరళమవడం చూడొచ్చు.
కాశీభట్లను తాత్వికంగా చూసినప్పుడు నిరీశ్వర వాది. సొంత జీవితంలో తన బ్రాహ్మణత్వాన్ని తెంచి అవతలకి విసిరి వేసి డీ కాస్ట్ అయినవాడు. తొలి రోజుల్లో నక్సలైట్ భావాల పట్ల కూడా ఆసక్తి చూపినవాడు. ఇదంతా తన పాత్రల రూపంలో రికార్డు అయ్యే వుంది. ఒక ఇంటర్వ్యూలో కాశీభట్ల నిహిలిస్టును అన్నాడు. ప్రతి దాన్నీ అనుమానిస్తానన్నాడు. రేషనాలిటీ ఏదో మేరకు తన ఆలోచనల్లో భాగమైన రచయిత. తెలుగులో సీరియస్ సాహిత్యంతో మనసా కర్మణా నిజాయితీగా నిలబడ్డాడని చెప్పగలం. తనదైన సాహిత్య శైలి అపూర్వం అని అనవచ్చుగానీ అదే సమ యంలో త్రిపురనీ, వడ్డెర చండీదాస్‌నూ అతని ముందువారని గుర్తించకుండానూ ఉండలేం.
– జి. వెంకటకృష్ణ, వ్యాసకర్త కవి, విమర్శకులు
Comments
Please login to add a commentAdd a comment