అలా ఆ కథలు రాశాను...
జ్ఞాపకం
1988 నాటి మాట. అప్పుడు నేను రాసిన ‘అగ్ని సరస్సు’ కథాసంపుటి ఆవిష్కరణ సభకు ప్రముఖ కథకులు మధురాంతకం రాజారాం, విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య వచ్చారు. మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు కూడా ఉన్న ఆ సభలో వాళ్లిద్దరూ నాకో సూచన చేశారు.
‘తెలుగు కథ ఆవిర్భవించి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావొస్తోంది. కానీ ఇంత వరకు మన పక్కనే మనతో పాటే కలసిమెలసి బతుకుతున్న ముస్లిముల జీవన స్థితిగతుల మీద మాత్రం ఎవరూ రాయలేదు. ఆ పని సత్యాగ్ని చేయగలుగుతాడనే నమ్మకం ఉంది. ఇక మీదట ఆయన రాసే కథలు ఆ లోటును పూరిస్తాయి’ అని ప్రకటించారు. అప్పుడే నాలో ముస్లిం కథలు రాయాలనే ఆలోచన మొదలైంది. అప్పటికి తెలుగు కథాసాహిత్యంలో లబ్ధప్రతిష్టులైన రచయితలు అనేకమంది ఉన్నారు కానీ ఎవరూ ముస్లిం కథ రాయడానికి పూనుకోలేదు. వారికి ముస్లిములతో పైపై పరిచయాలు తప్ప వారి జీవితాలపై లోతైన అవగాహన లేకపోవడం కూడా కారణం కావచ్చు. అలాగే ఇస్లాం మతసిద్ధాంతాలు, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న వాళ్ల జీవితాల గురించి రాస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం కూడా కారణం కావచ్చు. అందుకే అప్పటి వరకు అది ఒక చీకటి కోణంగానే మిగిలి పోయిందనేది నా భావన. ఆ లోటు భర్తీ కోసం నేను నా జీవితంలో జరిగిన, నేను అత్యంత సన్నిహితంగా చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ముస్లిం కథలు రాయడానికి ఉపక్రమించాను.
1989లో నేను రాసిన (తొలి ముస్లిం) కథ ‘పాచికలు’ ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో ప్రచురితమైంది. తర్వాత రాసిన కొన్ని కథలు ‘గీటురాయి’ పక్షపత్రికలో ప్రచురితమయ్యాయి. ఇస్లాం మూల సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం లేక విమర్శించడమో పనిగా కాకుండా వాటిని ఆసరా చేసుకొని కొనసాగుతున్న ముస్లిం స్త్రీల బాధల గాథలకు అక్షర రూపమివ్వడమే నా కథల ప్రధాన ఉద్దేశ్యము. అయితే నా కథలకు కొనసాగింపుగా నా తరువాతి రచయితలెవరూ అంత తొందరగా దీన్ని అందుకోలేదు. మూడు సంవత్సరాల తర్వాత బాబ్రీ మసీదు విధ్వంసంతో కొందరు యువ రచయితల హృదయాల్లో అణగారి ఉన్న ఆవేదన, ఆవేశము ఒక్క పెట్టున బహిర్గతమై ముస్లిం సమాజ స్థితిగతుల మీద కథలు రాయడం మొదలుపెట్టారు. అది పెరిగి పెద్దదై ముస్లిం వాదంగా స్థిరపడి ఇప్పటికీ కొనసాగుతోంది.
- షేక్ హుసేన్ సత్యాగ్ని
(తెలుగులో తొలి ముస్లిం కథలు ‘పాచికలు’ రచయిత)