sheikh hussein
-
పెద్దల సభలో ఫిరాయింపుల జోరు
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో రాజకీయాల్లో నైతిక విలువలపై మాట్లాడుతున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిలో బలం లేకపోవడంతో మొదట మండలి సభ్యులపైనే దృష్టి సారించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 50 ఉండగా, అందులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనందున తొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక మిగిలిన 41 మందిలో అధికార పార్టీకి చెందిన వారు కేవలం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌తోసహా ప్రతిపక్షం బలంగా ఉండటంతో జీర్ణించుకోలేని చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేసి పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఆయన 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా... జూన్ 21వ తేదీన ఒకేరోజు ఇతర పార్టీలకు చెందిన ఏడుగురు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్పించుకున్నారు. గవర్నరు కోటా ఎమ్మెల్సీలు ఇందిర, షేక్ హుసేన్, ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన రవి వర్మ, ఉపాధ్యాయ రంగ ఎమ్మెల్సీలు చైతన్యరాజు, గాదె శ్రీనివాసులు నాయుడు, పుల్లయ్యలు ఇలా వరుసగా భారీ ఎత్తున ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకున్నారు. రెండో రోజు మరో ముగ్గురి చేరికతో మండలిలో టీడీపీ బలం 20కి చేరింది. మరికొందరు ఇతర పార్టీల ఎమ్మెల్సీల మద్దతు కూడగట్టుకున్న టీడీపీ ఆ తర్వాత మండలి వైస్ చైర్మన్ స్థానంలో సతీష్‌రెడ్డిని కూర్చోబెట్టింది. ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే... గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన నంద్యాల లోక్‌సభ సభ్యుడు ఎస్పీ వై రెడ్డి కనీసం ప్రమాణ స్వీకారం చేయడానికి ముం దే టీడీపీ కండువా కప్పారు. ప్రలోభాలు, బెదిరింపులతో లొంగదీసుకుని ఆయనను చేర్పించుకున్నారు. అలాగే విశాఖ జిల్లా అరకు నుంచి వైఎస్సార్ కాంగ్రె స్ తరఫున ఎంపీగా ఎన్నికైన కొత్తపల్లి గీతను కూడా బాబు ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్నారు. -
తలుగు: నిరుపేదల బతుకుచిత్రం
కథ బోరేవాలా అనే ఒక సామాజిక వర్గం ఉన్నట్టుగా చాలామందికి తెలియకపోవచ్చు. రాయలసీమలో ముఖ్యంగా కడపజిల్లా చుట్టుపక్కలా పశుమాంసం విక్రయాన్ని జీవనాధారం చేసుకుని బతికే నిరుపేద ముస్లింలు బోరేవాలాలు. అయితే వారిని సొంతవర్గం వారే పూర్తిగా స్వీకరించరు. పరాయివర్గాలవారు అంతగా గౌరవించరు. ఇరువైపులా సంఘర్షణను ఎదుర్కొంటూ జీవిస్తున్న ఈ వర్గం గురించి మాట్లాడేవారే లేరు. కాని ఎవరూ మాట్లాడనప్పుడు కథో కవిత్వమో అలాంటి వారి తరపున వకాల్తా పుచ్చుకుంటుంది. వారి వైపు దీపం వేసి లోకాన్ని అటువైపు చూడమని చూపిస్తుంది. అలా చూపించే కథ వేంపల్లె షరీఫ్ రాసిన ‘తలుగు’. ఈ ఒక్క కథే ఒక పుస్తకంగా వెలువడింది. ‘దౌలూ’ అనే బోరేవాలా కథ ఇది. ‘గొడ్డుసీలు కొట్టుకుని బతికే నా కొడుకువు... నువ్వు కూడా నాకు నీతులు సెప్పబడ్తివే’.... అని మోతుబరి వెంకటప్ప చేత చీదరింపు ఎదుర్కొనే బక్కప్రాణి. వీళ్లిద్దరి మధ్య వచ్చిన తగువు ఎలా పరిష్కారం అయ్యిందనేదే ఈ ‘తలుగు’. నోరు లేనివాడు అన్నిసార్లూ దోపిడికి గురవ్వాల్సిందే. మరికొందరు నోరులేనివాళ్లు అతడికి తోడు నిలిచినా సరే... బలవంతుడు సులభంగా నలిపి పారేస్తాడు. అయితే అన్నీసార్లూ కాదు. కొన్నిసార్లు చలిచీమలు సంకెలలుగా మారతాయి. ఆ మారే సందర్భాన్ని కూడా ఈ కథ చూపించే ప్రయత్నం చేస్తుంది. సులభమైన కథనం... రాయలసీమ భాష... ఒక వర్గపు వేదనా ఈ కథ. తప్పక పరిశీలించదగ్గది. సుప్రసిద్ధ కథకులు షేక్ హుసేన్ ఇచ్ఛాగ్ని ఈ కథకు వెనుకమాట రాయడం విశేషం (అందులోని ఒక జ్ఞాపకాన్ని గతవారం ఇదే పేజీలో చూశారు). షేక్ హుసేన్తో మొదలైన తెలుగు ముస్లిం కథ విస్తరించి మరింత విశాలమై కొనసాగుతున్నదనడానికి మరో ఉదాహరణ వేంపల్ల్లె షరీఫ్- తలుగు. -
అలా ఆ కథలు రాశాను...
జ్ఞాపకం 1988 నాటి మాట. అప్పుడు నేను రాసిన ‘అగ్ని సరస్సు’ కథాసంపుటి ఆవిష్కరణ సభకు ప్రముఖ కథకులు మధురాంతకం రాజారాం, విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్య వచ్చారు. మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు కూడా ఉన్న ఆ సభలో వాళ్లిద్దరూ నాకో సూచన చేశారు. ‘తెలుగు కథ ఆవిర్భవించి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావొస్తోంది. కానీ ఇంత వరకు మన పక్కనే మనతో పాటే కలసిమెలసి బతుకుతున్న ముస్లిముల జీవన స్థితిగతుల మీద మాత్రం ఎవరూ రాయలేదు. ఆ పని సత్యాగ్ని చేయగలుగుతాడనే నమ్మకం ఉంది. ఇక మీదట ఆయన రాసే కథలు ఆ లోటును పూరిస్తాయి’ అని ప్రకటించారు. అప్పుడే నాలో ముస్లిం కథలు రాయాలనే ఆలోచన మొదలైంది. అప్పటికి తెలుగు కథాసాహిత్యంలో లబ్ధప్రతిష్టులైన రచయితలు అనేకమంది ఉన్నారు కానీ ఎవరూ ముస్లిం కథ రాయడానికి పూనుకోలేదు. వారికి ముస్లిములతో పైపై పరిచయాలు తప్ప వారి జీవితాలపై లోతైన అవగాహన లేకపోవడం కూడా కారణం కావచ్చు. అలాగే ఇస్లాం మతసిద్ధాంతాలు, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న వాళ్ల జీవితాల గురించి రాస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం కూడా కారణం కావచ్చు. అందుకే అప్పటి వరకు అది ఒక చీకటి కోణంగానే మిగిలి పోయిందనేది నా భావన. ఆ లోటు భర్తీ కోసం నేను నా జీవితంలో జరిగిన, నేను అత్యంత సన్నిహితంగా చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ముస్లిం కథలు రాయడానికి ఉపక్రమించాను. 1989లో నేను రాసిన (తొలి ముస్లిం) కథ ‘పాచికలు’ ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో ప్రచురితమైంది. తర్వాత రాసిన కొన్ని కథలు ‘గీటురాయి’ పక్షపత్రికలో ప్రచురితమయ్యాయి. ఇస్లాం మూల సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం లేక విమర్శించడమో పనిగా కాకుండా వాటిని ఆసరా చేసుకొని కొనసాగుతున్న ముస్లిం స్త్రీల బాధల గాథలకు అక్షర రూపమివ్వడమే నా కథల ప్రధాన ఉద్దేశ్యము. అయితే నా కథలకు కొనసాగింపుగా నా తరువాతి రచయితలెవరూ అంత తొందరగా దీన్ని అందుకోలేదు. మూడు సంవత్సరాల తర్వాత బాబ్రీ మసీదు విధ్వంసంతో కొందరు యువ రచయితల హృదయాల్లో అణగారి ఉన్న ఆవేదన, ఆవేశము ఒక్క పెట్టున బహిర్గతమై ముస్లిం సమాజ స్థితిగతుల మీద కథలు రాయడం మొదలుపెట్టారు. అది పెరిగి పెద్దదై ముస్లిం వాదంగా స్థిరపడి ఇప్పటికీ కొనసాగుతోంది. - షేక్ హుసేన్ సత్యాగ్ని (తెలుగులో తొలి ముస్లిం కథలు ‘పాచికలు’ రచయిత) -
.విధి వంచితులు!
నాలుగుగంటల వ్యవధిలో వృద్ధదంపతుల మృతి మార్టూరు కష్టసుఖాలు పంచుకుంటూ కలసిమెలిసి జీవిస్తున్న ఆ వృద్ధ దంపతులు చావులోనూ విడిపోలేకపోయారు. ప్రకాశంజిల్లాలో ఈ ఘటన మంగళవారం జరిగిం ది. మార్టూరులో నివాసం ఉంటున్న షేక్మస్తాన్బీ (65), షేక్ హుస్సేన్ (70) దంపతులు వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఒకరికొకరు తోడుగా ఉన్నంతలో ఆనందంగానే జీవిస్తున్నారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మస్తాన్‌బీ మంగళవారం భర్త ఇంట్లోలేని సమయం లో మృతిచెందింది. నాలుగు గంటల తర్వాత ఇంటి సమీపంలోనే ఉన్న హుస్సేన్ సాయంత్రం గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు. వృద్ధ దంపతులిద్దరూ వెనువెంటనే ఒకరికి తెలియకుండా మరొకరు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. -
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ధర్నా
ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వరంగల్ జిల్లా డోర్నకల్‌కు చెందిన షేక్ హుస్సేన్ మృతి చెందాడని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు, మైనార్టీ సంఘం నాయకులు ఆదివారం జిల్లా ఆస్పత్రిలోధర్నా నిర్వహించారు. డోర్నకల్‌కు చెందిన షేక్ హుస్సేన్ ఖమ్మం నగరంలో వాటర్ సర్వీసింగ్ సెంటర్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం రాత్రి అతను జూబ్లీక్లబ్ సమీపంలోని నెహ్రూచౌక్ ప్రాంతంలో మూత్ర విసర్జనకు వెళ్లగా కిందకు వేళాడుతున్న ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందిన విష యం విదితమే. మృతుడు నిరుపేద కుటుంబానికి చెందిన వాడని, అతనిపై తల్లి, ఇద్దరు చెల్లెళ్లు ఆధారపడి జీవిస్తున్నారని, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ ముస్లిం నాయకులు రెండు గంటల పాటు ఆస్పత్రిలో ధర్నా నిర్వహించారు. దీంతో ఖమ్మం త్రీటౌన్ సీఐ రెహమాన్ విద్యుత్‌శాఖ డీఈ ధన్‌సింగ్‌ను ఆస్పత్రికి పిలిపించి ముస్లిం పెద్దలతో చర్చిం చారు. రూ. 10లక్షలు ఎక్స్‌గ్రేషియా, మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముస్లిం పెద్దలు డిమాండ్ చేశారు. చివరకు విద్యుత్‌శాఖ తరఫున రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌తో మాట్లాడి మృతుడి తల్లికి ఏదైనా పార్కులో స్వీపర్ పోస్టు ఇప్పించేలా ఒప్పందం కుదిర్చారు. నెల రోజుల్లో ఈ రెండు హామీలు నెరవేర్చాలని మృతుడి కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో డీఈ ఒప్పుకున్నారు. అనంతరం హుస్సేన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. త్రీటౌన్ సీఐ రెహమాన్, టూటౌన్, త్రీటౌన్ పోలీస్‌సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకురాలు సకీనా, సీపీఐ నాయకుడు మహ్మద్‌సలాం, మైనార్టీ నాయకులు హకీం, సలీం పాల్గొన్నారు.