తలుగు: నిరుపేదల బతుకుచిత్రం | poor survival image | Sakshi
Sakshi News home page

తలుగు: నిరుపేదల బతుకుచిత్రం

Published Fri, Jan 30 2015 11:19 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

తలుగు: నిరుపేదల బతుకుచిత్రం - Sakshi

తలుగు: నిరుపేదల బతుకుచిత్రం

కథ
 
బోరేవాలా అనే ఒక సామాజిక వర్గం ఉన్నట్టుగా చాలామందికి తెలియకపోవచ్చు. రాయలసీమలో ముఖ్యంగా కడపజిల్లా చుట్టుపక్కలా పశుమాంసం విక్రయాన్ని జీవనాధారం చేసుకుని బతికే నిరుపేద ముస్లింలు బోరేవాలాలు. అయితే వారిని సొంతవర్గం వారే పూర్తిగా స్వీకరించరు. పరాయివర్గాలవారు అంతగా గౌరవించరు. ఇరువైపులా సంఘర్షణను ఎదుర్కొంటూ జీవిస్తున్న ఈ వర్గం గురించి మాట్లాడేవారే లేరు. కాని ఎవరూ మాట్లాడనప్పుడు కథో కవిత్వమో అలాంటి వారి తరపున వకాల్తా పుచ్చుకుంటుంది. వారి వైపు దీపం వేసి లోకాన్ని అటువైపు చూడమని చూపిస్తుంది. అలా చూపించే కథ వేంపల్లె షరీఫ్ రాసిన ‘తలుగు’. ఈ ఒక్క కథే ఒక పుస్తకంగా వెలువడింది. ‘దౌలూ’ అనే బోరేవాలా కథ ఇది. ‘గొడ్డుసీలు కొట్టుకుని బతికే నా కొడుకువు... నువ్వు కూడా నాకు నీతులు సెప్పబడ్తివే’.... అని మోతుబరి వెంకటప్ప చేత చీదరింపు ఎదుర్కొనే బక్కప్రాణి. వీళ్లిద్దరి మధ్య వచ్చిన తగువు ఎలా పరిష్కారం అయ్యిందనేదే ఈ ‘తలుగు’. నోరు లేనివాడు అన్నిసార్లూ దోపిడికి గురవ్వాల్సిందే. మరికొందరు నోరులేనివాళ్లు అతడికి తోడు నిలిచినా సరే... బలవంతుడు సులభంగా నలిపి పారేస్తాడు.

అయితే అన్నీసార్లూ కాదు. కొన్నిసార్లు చలిచీమలు సంకెలలుగా మారతాయి. ఆ మారే సందర్భాన్ని కూడా ఈ కథ చూపించే ప్రయత్నం చేస్తుంది. సులభమైన కథనం... రాయలసీమ భాష... ఒక వర్గపు వేదనా ఈ కథ. తప్పక పరిశీలించదగ్గది. సుప్రసిద్ధ కథకులు షేక్ హుసేన్ ఇచ్ఛాగ్ని ఈ కథకు వెనుకమాట రాయడం విశేషం (అందులోని ఒక జ్ఞాపకాన్ని గతవారం ఇదే పేజీలో చూశారు). షేక్ హుసేన్‌తో మొదలైన తెలుగు ముస్లిం కథ విస్తరించి మరింత విశాలమై కొనసాగుతున్నదనడానికి మరో ఉదాహరణ వేంపల్ల్లె షరీఫ్- తలుగు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement