గాయకుడు గోరటి వెంకన్న
కోస్తా, రాయలసీమ, తెలంగాణ.. ప్రాంతాలు, రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒక్కటేనని, తెలుగు భాషలోని భావం ఒక్కటేనని సినీ గేయ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. కుబుసం, బతుకమ్మ, ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, పీపుల్స్.. వంటి 80కుపైగా చిత్రాల్లో పాటలు రాశారాయన. ప్రజా సమస్యలపై తన వాణి వినిపించారు. నిద్రపోతున్న సమాజాన్ని తన కలం, గళంతో తట్టిలేపి, నూతనోత్తేజాన్ని కల్పించటంలో ఆయన తీరే ప్రత్యేకం. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న జెక్‌ఫెస్ట్-15కు వచ్చిన వెంకన్న శుక్రవారం కొద్దిసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు. - గుడ్లవల్లేరు
సాక్షి : గాంధీ సిద్ధాంతాలు ప్రస్తుతం అమలవుతున్నాయంటారా.?
వెంకన్న : ఆధునిక యుగంలో గ్రామాలను నగరాలుగా మార్చేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. దేశంలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ప్రధానమంత్రులు బాగా కృషి చేస్తున్నారంటే అమలవుతున్నట్టే కదా..
సాక్షి : దేశాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
వెంకన్న : అమెరికాలోని ఎక్కువ శాతంగా ఉన్న డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు భారతీయులే. వారిని మనదేశానికి రప్పించాలి. అలాగే, వనరులను సమృద్ధి పరుచుకోవటంలోనూ ప్రభుత్వాలు ముందుకు సాగాలి. విద్య, వైద్య రంగాల్ని వ్యాపార ధోరణితో కాకుండా పవిత్రమైన బాధ్యతగా చేపట్టాలి.
సాక్షి : నేటి సాంకేతిక పరిజ్ఞానంపై మీ కామెంట్..
వెంకన్న : దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడే ఆ పరిజ్ఞానమే నేడు పక్కదారి పడుతోంది. అంతర్జాలంలో అశ్లీలత పెరిగిపోతోంది.
సాక్షి : నేటి యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి?
వెంకన్న : కులమత భావాలను తగ్గించుకుని మానవత్వాన్ని పెంచుకోవాలి. గురజాడ, శ్రీశ్రీ వంటి రచనల సారాన్ని అవపోసన పట్టాలి.
సాక్షి : నేటి సమాజంపై సినిమా ప్రభావం ఉందంటారా..
వెంకన్న : సినిమా కల్చర్ వల్ల అంత ఉపయోగమేమీ లేదు. పిల్లల్లో అతి తగ్గాలి. ఎక్కువ సినిమాల్లో మానవీయత నశిస్తోంది.
సాక్షి : తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం.....
వెంకన్న : కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ.. రాష్ట్రాలు వేరైనా అంతా తెలుగువారమే. తెలుగు ప్రజల నుంచే పుట్టినట్టుగా నేను సినిమాల్లో పాటలు రాశాను. రాజకీయ ఉచ్చులో పడకూడదు. తెలుగు వారమంతా ఒక్కటే అనేది గుర్తుంచు కోవాలి. యాసలు తేడా ఉన్నా తెలుగు భాషలో భావం ఒక్కటే.
సాక్షి : మీరు సానుకూలంగా, వ్యతిరేకంగా స్పందించే అంశాలు ఏమిటి?
వెంకన్న : నేను శ్రమను గౌరవిస్తాను. మనుషుల ప్రాణాలను సైతం హరించే థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాలను వ్యతిరేకిస్తాను. వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది.
గోరటి వెంకన్న
యాసలు వేరైనా.. మనమంతా ఒక్కటే..
Published Sat, Feb 21 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement
Advertisement