
జగత్సర్వం శివమయం. శివునికి అతీతమైనది ఏదీ లేదు ఆకార నిరాకార దివ్యదీపం శివుని రూపం. నిరంజనుడు. నిరూపుడు. నిర్గుణుడు. మేరునగానికి మరుభూమికి తేడా చూడని తత్వమే శివ తత్వం. భస్మలేపనమైనా సుగంధమైనా తనకు ఒక్కటే. జనన.. మరణం లేని ఆది అంతం లేని అనాది ఉనికి శివుడు. గమనానికి వాహకమై ఏ చలనం లేని అచలం శివుడు. సమస్తాన్ని సృష్టించి, తానే సమస్తమైనవాడు. తనలో జనించిన జగత్తు దుఃఖాలకు, సౌఖ్యాలకు తాను అతీతుడు. స్థావర జంగమాత్మక జగత్తులో ఒక జంగముడై అనాది యుగాల నుండి నడయాడే శూన్య సంచారి. నిజమైన సమతా తత్త్వానికిపాదు శివుడే. ముడుపులు, కానుకలకు మురువని వాడు. అభిషేకానికి, బిల్వ పత్రానికి పరవశించే పసివాడు శివుడు.
చరిత్రకారులు ఈమని శివ నాగిరెడ్డి, కన్నడ సాహితీవేత్త ఆచార్య ఏ. శివప్రకాశ్, ఏటుకూరి బలరామ మూర్తి, ఆధ్యాత్మికవేత్త శివానంద మూర్తి వీరి రచనల అధ్యయనం వల్ల, బౌద్ధానికి, శివతత్వానికి ఉన్న ఎన్నో సారూప్యతలను కాంచగలం. జగద్గురు ఆదిశంకరుడు బౌద్ధాన్ని అధ్యయనం చేసి అందులోని ప్రతీత్య సముత్పాద తత్వమునకు ఆకర్షితుడై అద్వైతాన్ని రూపొందించినట్లు తెలుస్తున్నది. శంకరుని అద్వైతానికన్నా ముందే సిద్ధ నాగార్జునుని మాధ్యమిక వాదముంది. ఇంచుమించు అదే కాలంలో కాశ్మీరానికి చెందిన అభినవగుప్తుని పూర్ణాద్వైతం సాత్విక ధోరణిలో ఎంతో ప్రామాణికమైనది. దృశ్యం మిథ్య. సకలం నిష్కలం ... ఈ జగత్ అంతా బుద్బుద ప్రాయం ఈ భావసంచయమంతా బౌద్ధం నుంచి శంకరాచార్యుడు పొందినాడని అనేకులు ప్రస్తావించినారు.
కర్ణాటకలో దేవర దాసమయ్య, బసవన్న, అక్క మహాదేవి, అల్లమా ప్రభు, మదార చెన్నయ్య, శివ నాగమయ్య ఎందరో శివయోగులు కుల, మత, లింగ భేదాలుపాటించలేదు. ఇష్టలింగమే నీలోని శివుడని, కాయకమే కైలాసమన్నారు. నీలో ఉన్న ఇష్ట లింగాన్ని నీకు నీవే పూజించుకొని నిన్ను నీవే తరింప చేసుకోమన్నారు. కర్మకాండలు, క్రతువులు అనివార్యం కాదని బోధించారు. లోకహితమే ఆధ్యాత్మిక తత్వమన్నారు. మహోన్నతమైన ఆలోచనలతో, ఆచరణలతో విశాల ప్రజా రాసులకు దగ్గరైనారు. ఆనాటి బసవన్న నుంచి ఈ మధ్యే లింగైక్యం చెందిన టుముకూరు సిద్ద గంగస్వామి సనాతన శివభక్తిని, ఆధునిక విజ్ఞానాన్ని మిళితం చేశారు.
అందరికి నాణ్యమైన ఉచిత విద్య, ఆధునిక వైద్యసేవలనందించి ఎన్నో జీవితాలను వెలిగించారు. సంపదపై ఏ ఒక్కరి హక్కు ఉండదని దేవర దాసమయ్య వాక్కును ఉటంకించారు రుద్రాక్షమఠం ప్రభు లింగస్వామి. డాక్టర్ భాస్కర యోగి శివతత్వమునెరిగిన అవధూతలెందరినో పరిచయం చేశారు. మరోవైపు శ్రీధరస్వామి, శివరామదీక్షితులు, కంభ బ్రహ్మం, అనుమనగిరి శివరామ యోగి, కాలజ్ఞాని వీరబ్రహ్మం, యోగి వేమన శివతత్వాన్ని అచలంతో మేళవించి పరిపూర్ణమైన ఎరుకను బోధ చేసినారు.
పోరుమామిళ్ల కాశినాయన, అమరాబాద్ సయ్యద్ అబ్దుల్, వారి శిష్యుడు బాలకిషన్, చిన్న రాముడు, కాసిదాసు, కోటకదిరా చంద్ర మౌళీశ్వర స్వామి, చెన్నదాసు, దుర్గి సుబ్బదాసు, కైవారం నారాయణ తాత, అహమదుద్దిన్, ఉత్తరాస్వెల్లి విశ్వద్దీన్, యానగొంది మాణిక్యమ్మ, పూదోట బసవయ్య, ఇమ్మడిజెట్టి చంద్రయ్య, దున్న ఇద్దాసు, హఠయోగి చెన్నదాసు, నడిగడ్డ ఈ్వరయ్య... ఇలా ఎందరో మాన్యులు మహాజ్ఞాన సంపన్నులై నిరాడంబరంగా జీవించి ప్రలోభాలకు, కాసులకు, అధికార పీఠాలకు ఆమడ దూరంలో ఉండినారు. పరిపూర్ణమైన ఎరుకతో లోకాన్ని తరింపజేసినారు. ఈ శివతత్వం మానవులలో ద్వేషం మాపుతుంది. భోగ లాలసతనాపుతుంది. క్రౌర్యానికి కళ్ళెం వేస్తుంది. ఆశా మోహాలను అదుపులో ఉంచుతుంది. ‘‘మేలైన ఆకాశ పృథ్వి, జలం, అగ్ని, గాలితో కూడిన మూలం లేని ఈ జగత్ స్థితిని దాని స్వస్వరూపాన్ని అవగతం చేస్తుంది.
అరూపకుడైన శివుడు నిరాకార సాకారమై భాసిస్తున్నాడు. స్వర్గం నరకం, పునర్జన్మ, కర్మ.. ఇవన్నీ మానవుని పరిమిత అన్వేషణలో జనించినవే. వీటికి అతీతమైనదే శివతత్వం. అంతటా వ్యాపించి, అంతట తానై, ఉండీ లేనట్లుగా ఉండే తత్వమే శివతత్వం. బుద్ధభగవానుడు మొదలుకొని, రమణమహర్షి దాక, జగద్గురు శంకరుడు మొదలుకొని వీరబ్రహ్మం దాక, రామచంద్ర ప్రభు నుండి శివరామ దీక్షితులు దాక... కనకదాసు నుండి కాశీ నాయనదాకా... ఈ తత్త్వాన్ని దర్శించి దారులేసిన వాళ్లే్ల. ఆ దారిని చూపే దీపాన్ని నీలో నీవు వెలిగించుకోవలసిందే. - గోరటి వెంకన్న