
కొండవూరులో అగ్నిప్రమాదం
కాలిపోయిన రూ.1.15 లక్షల నగదు
బూడిదైన మూడు తులాల బంగారం, వెండి
శ్రీకాకుళం జిల్లా: ఆ కుటుంబానికి దీపమే శాపమైంది. కష్టార్జితాన్నంతా బూడిద చేసింది. వజ్రపుకొత్తూరు మండలం కొండవూరుకు చెందిన అడ్డి రమణ, విమల దంపతులు బుధవారం మహా శివరాత్రి పర్వదినాన ఇంట్లో దేవుడికి దీపం వెలిగించి శివాలయానికి వెళ్లారు. తిరిగి వచ్చే లోగా అగ్ని ప్రమాదం సంభవించడంతో తీరని నష్టం వాటిల్లింది. అప్పు తీర్చేందుకు తెచ్చిన రూ.1.15 లక్షల నగదు కాలిపోయింది. మూడు తులాల బంగారం, వెండి, విలువైన పత్రాలు, ఎల్‌ఐసీ పాలసీ బాండ్లు, దుస్తు లు, ఇతర సామగ్రి బూడిదైపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కష్టార్జితం కాలిపోయింది..
మంకినమ్మ దాసుడైన అడ్డి రమణ.. కౌలు రైతు. భార్యాబిడ్డలతో కలిసి రేకుల ఇంట్లోనే నివాసముంటున్నాడు. గ్రామంలో ఓ వ్యక్తికి లక్ష రూపాయలు బాకీ ఉండటంతో గేదెలు అమ్మాడు. రూ.1.15 లక్షలు రావడంతో ఇంటిలోని దేవుడి మూల దాచిపెట్టాడు. రేపోమాపో అప్పు తీర్చుదామనుకోగా ఇంతలో ప్రమాదం జరగడడంతో లబోదిబోమంటున్నాడు. కాగా, ఈ ప్రమాదంలో కొంత సొమ్ము పాక్షికంగా కాలిందని, బ్యాంక్ అధికారులు స్పందించి చెల్లుబాటేయ్యేలా చూసి బాధితుడిని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కొల్లి భాస్కరరావు కోరారు. ఇదే విషయాన్ని వీఆర్‌ఓ, తహసీల్దార్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment