
మిడ్ నైట్ షోలు.. 16 ఎంఎం స్క్రీన్లు కనుమరుగు
పల్లెల్లో కానరాని ఆటపాటలు .. కథాకాలక్షేపాలు
ముక్కోటి దేవతలు ఒక ఎత్తు.. శివయ్య ఒక్కడూ ఒకెత్తు.. అందుకే శివయ్య పండగ శివరాత్రి అంటేనే ఒక ప్రత్యేకత.. అన్ని పండగలకూ ఇంట్లోనే పూజలు. మహా అయితే గుళ్లకు పోయి రావడం.. ఇంట్లో రకరకాల వంటలకు చేసుకుని తినడం.. భుక్తాయాసంతో రోజూకన్నా ఓ గంట ముందుగానే పడుకోవడం సర్వసాధారణం. కానీ శివరాత్రి అంటేనే వేరు.. ఆ పండగ చేసుకునే తీరే వేరు.. ఇష్టాను సారం తినడం. గుర్రుపెట్టి నిద్రపోవడం వంటి రెగ్యులర్ ఫార్మాట్ ఈ శివయ్య పండక్కి ఉండదు.. శివరాత్రికి దాదాపుగా ఉపవాసం ఉంటారు.. పండో.. ఫలమో తిని.. పంచామృతం వంటివి సేవించి రోజూకన్నా తక్కువ ఆహారంతో శివయ్యను సేవిస్తారు..
అన్నిటికి మించి ఆ ముక్కంటి కోసం కోట్లాదిమంది ప్రజలు ఏకంగా జాగరణ చేయడం ఇందులో ప్రత్యేకత. జాగరణ అంటే ఎలా.. రోజూ తొమ్మిది.. పదింటికి నిద్రపోయే జనాలు తెల్లార్లు నిద్రపోకుండా ఉండడం ఎలా ? వారికి నిద్రను దూరం చేసేది ఎలా ? ఇప్పుడంటే రకరకాల చానెళ్లు.. ఓటీటీలు... టీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు వస్తున్నాయి కానీ 2000 సంవత్సరం వరకు జాగరణ అంటే అదొక ప్రత్యేక ప్లాన్ .. దానికోసం రెండురోజుల ముందునుంచే ఏర్పాట్లు.. ఉండేవి...
పేకాడుకుందాం మామా
ఇప్పుడంటే ఏదీ వింతకాదు కానీ ఓ ఇరవయ్యేళ్ళ క్రితం వరకు జాగరణ అంటే అదో పెద్ద ప్రక్రియ. ఊళ్లలో కొన్ని చోట్ల శివకళ్యాణం .. గంగావివాహం వంటి కథాకాలక్షేపాలు ఉండేవి.. ఇంకొందరు జల్దీ ఫైవ్ .. లేదా పేకాట వంటివాటితో జాగరణ చేసేవాళ్ళు.. జగడం ఆడుతూ అయినా సరే జామురాతిరి వరకైనా జాగరణ చేయాలన్నది సూక్తి.. ఈ మేరకు కొందరు అర్థరాత్రి వరకు ఏదోలా ఓపికపట్టి జాగరణ ఉండేవారు..
దానికోసం రకరకాల కార్యక్రమాలు.. కథా కాలక్షేపాలు.. రంగస్థల ప్రోగ్రామ్స్.. వంటివి ఊళ్లలో నిర్వహించేవాళ్ళు.. అది లేనివాళ్లు దగ్గర్లోని శివాలయం వద్ద కూర్చుని భజనలతో గడిపేవాళ్లు... ఆలయాల వద్ద తెల్లార్లు సాంస్కృతిక కాలక్షేపాలు ఉండేవి. కొన్ని పల్లెల్లో గ్రామం మొత్తం చందాలు వేసుకుని 16 ఎంఎం తెరలు కట్టి ఊళ్లలో సినిమాలు వేయించేవాళ్ళు.. కృష్ణ.. శోభన్ బాబు.. ఎన్టీయార్ సినిమాలు ఎక్కువగా ఈ చిన్న స్క్రీన్ మీద వేసి.. గ్రామం మొత్తం జాగరణ చేసేవాళ్ళు.
కేబుల్ ఆపరేటర్ కు ఫోన్ కొట్టు.. నచ్చిన సినిమా పెట్టు
ఆ తరువాతి కాలంలో కేబుల్ టీవీలు వచ్చాయి.. అంటే 1990ల్లో కేబుల్ టీవీలు వచ్చాక జాగరణ తీరు మారింది. కేబుల్ ఆపరేటర్లు తెల్లార్లు తమ కేబుల్ చందాదారులకు సినిమాలు వేసేవాళ్ళు. అందరూ రాత్రి భోజనాలు చేసేశాక తమ టివిల ముందు కూర్చుంటే అయన వరుసగా ఓ నాలుగు సినిమాలు వేసేవాడు.. దీంతో తెల్లారిపోయేది. ఇంటిల్లిపాదీ టివిల ముందు కూర్చుని సినిమా చూస్తూ మధ్యలో నిద్ర వస్తే నాలుగు అడుగులు అటు ఇటు వేసి రావడం.. లేదా మధ్యలో టీ కాపీలు పెట్టుకుని తాగడం.... కొంతమంది అయితే కేబుల్ ఆపరేటరుకు ఫోన్ చేసి ఈ సినిమాలు వేయాలో లిస్ట్ కూడా ఇచ్చేవాళ్ళు. అందులోనూ మళ్ళా రికమెండేషన్లు.. కొంతమందికి మాత్రమే ఆపరేటర్ వద్ద పలుకుబడి ఉండేది.. కాబట్టి ఆ పలుకుబడి ఉన్న పెద్దలతో కేబుల్ ఆపరేటరుకు చెప్పించి.. చిరంజీవి.. నాగార్జున.. బాలకృష్ణ.. సినిమాలు వేయించి మెల్లగా జాగరణ పూర్తి చేసేవాళ్ళు.
మిడ్ నైట్ సినిమాకు పోదాం మామా
పల్లెల్లో జాగరణ చేయడం ఇష్టం లేని యువత మాత్రం నడిచి కొందరు.. సైకిళ్ళ మీద కొందరు దగ్గర్లోని పట్టణాలకు పోయేవాళ్లు. అక్కడ సెకెండ్ షో అయ్యాక అంటే రాత్రి 12 తరువాత ఒక షో సినిమా వేసేవారు. దాన్ని మిడ్ నైట్ షో అనేవారు. అది ముగిసేసరికి దాదాపు మూడు అయ్యేది.. ఒక్కోసారి ఊళ్లలోని టూరింగ్ టాకీసులు ఒకే టిక్కెట్ మీద రెండు సినిమాలు.. వేసి ప్రేక్షకులను రప్పించేవారు.. పట్టణాల్లోని దాదాపు అన్ని థియేటర్లల్లోనూ ఈ మిడ్ నైట్ షోలు వేసేవాళ్ళు.
దీనికి రెండు రోజుల ముందు నుంచే .. పోస్టర్లు.. రిక్షాలో మైక్ పెట్టి ప్రచారం వంటివి చేసేవాళ్ళు.. జాగరణ రోజు ఊళ్లలో తెల్లార్లు టీ స్టాళ్లు నడిచేవి.. తెల్లార్లు సినిమాలు చూసి.. అట్నుంచటే నదీస్నానం చేసి జాతరకు వెళ్ళేవాళ్ళు.. కొందరు జోగుతూ సైకిళ్ళ మీద ఇళ్లకు చేరేవాళ్ళు.. జాతరలో బొమ్మలు.. జీళ్ళు.. ఖజ్జూరం.. సెనగలు.. చేరుకుముక్కలు కొనుక్కుని ఇళ్లకు రావడం ఒక మధురానుభూతి. ఇప్పుడు ఆ జాగరణ తీరు మారింది.. ఎవరింట్లో వాళ్ళు ఓటిటిలు.. బిజీ.. పక్కింటికి వెళ్లి మాట్లాడడం.. వారి ఇంట్లో కూర్చుని పేకాడుకోవడం.. కబుర్లాట అంతా నామోషీ.. ఇప్పుడు ఎవరికీ వారే యమునా తీరు.. ముక్కోటి దేవతలకు మహారాజు అయినా ఈ మనుషులమధ్య దూరాన్ని మాత్రం శివయ్య కూడా తగ్గించలేకపోతున్నాడు.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment