విద్యార్థులు తప్పక చదవాల్సిన రచన | Students must read the writing | Sakshi
Sakshi News home page

విద్యార్థులు తప్పక చదవాల్సిన రచన

Published Wed, Jan 21 2015 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

విద్యార్థులు తప్పక చదవాల్సిన రచన

విద్యార్థులు తప్పక చదవాల్సిన రచన

మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు నవలా రచయితగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం సాక్షి దినపత్రికలో సీరియల్‌గా ప్రచురితమైన త్రీ మంకీస్‌ని నేను కూడా చదివాను. త్రీ మంకీస్ అనగానే చెడు వినవద్దు, మాట్లాడద్దు, చూడద్దు అనే గాంధీ గారి కోతులు గుర్తుకు వస్తాయి. కాని ఏ కవి అయినా కాలానుగుణంగా మారాలి కనుక వీరు కూడా వానర్, మర్కట్, కపీష్‌లని దొంగ పనులు చేసి జైలుకి వెళ్ళేవారుగా చిత్రీకరించారు.

మల్లాది రచనలు అనగానే సస్పెన్స్, థ్రిల్స్, లాజిక్, రీజనింగ్, మేజిక్ మొదలైనవి కలిపి హ్యూమరస్‌గా చిత్రీకరించడమని అందరికీ తెలుసు. ఈ నవలని కూడా అదే పద్ధతిలో రాశారు. పేరుకి వ్యతిరేక లక్షణాలు గల పాత్రలని మొదట్లోనే ప్రవేశపెట్టి పాఠకులని నవ్వించారు. ఉదాహరణకి లక్ష్మీపతి, గుండూరావు, లావణ్య. గొలుసు మింగిన దొంగకి అరటిపళ్ళ తీర్పు, దుర్యోధన్ నామకరణం, తర్వాత వచ్చే పాత్రలు పేరుకి తగ్గట్టుగా మూలిక, వైతరణి, రుధిర. కోర్టు సీన్‌లు, దొంగలు, పోలీసులు అత్యంత రక్తి కట్టించాయి. సత్తి పండు కేసు బీర్బల్ కథని గుర్తుకి తెచ్చింది. నవల చదివాక పరవస్తు చిన్నయసూరి గారు పంచతంత్రం ద్వారా రాజకుమారులకి నీతిని బోధించినట్లుగా మల్లాది గారు చెడిపోతున్న సమాజానికి, యువతకి ఈ కథని విష్ణశర్మ గారిలా అందించారు అనిపిస్తోంది. ఈనాటి సమాజాన్నంతటినీ పట్టి పీడిస్తున్న పెద్ద జబ్బు డబ్బు. దానికోసమే ఈ సమాజంలో అనేక అక్రమాలు. కష్టపడకుండా జల్సా చేయడం అలవాటైంది. విద్యార్థి స్థాయి నుంచి మంచి లక్షణాలు రావాలంటే ఇలాంటి రచనలు విద్యార్థులు తప్పకుండా చదవాలి. ఇందులో ముఖ్యమైన విషయాలు సెల్‌ఫోన్ వాడటం, ఫేస్‌బుక్. వీటి దుర్వినియోగం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ప్రతి చిన్నదానికి నెట్ మీద ఆధారపడటం (పలుగు, పార కోసం గూగుల్ చేయడం) కథలో చూపించారు. నైతికంగా నేటి యువతీయువకులు ఎలా పతనమైపోతున్నారో చక్కగా వివరించారు. పెద్ద చదువులు చదివి తక్కువ ఉద్యోగాలు చేయలేక, అర్హతగల ఉద్యోగాలు దొరక్క, దశాదిశా చూపించేవారు లేక యువత పడే ఇబ్బందులు ఈ నవలకి పునాది అనే చెప్పాలి.
 ‘తన కోసం బతికే వాడు కుక్కని పెంచుతాడు. సమాజం కోసం బతికేవాడు మొక్కని పెంచుతాడు’ లాంటి కొటేషన్స్ బావున్నాయి.
 - ఐ. వి. సుబ్బాయమ్మ,
 విశ్రాంత ఉపాధ్యాయని, లక్సెట్టిపేట,
 (ఆదిలాబాద్ జిల్లా)
 
త్రీమంకీస్ సీరియల్‌పై పాఠకుల అభిప్రాయాలు
 
మా ప్రకటనకు స్పందనగా త్రీ మంకీస్ సీరియల్ మీద చాలామంది పాఠకులు తమ విలువైన అభిప్రాయాలను పంపించారు. వాటిలో నుంచి ఉత్తమమైనవిగా రచయితమల్లాది వెంకట కృష్ణమూర్తి ఎంపిక చేసిన మూడిటిలో ఇది చివరిది. ఎంపిక చేసిన ముగ్గురికి ముందుగా ప్రకటించినట్లు తలో రూ. 500/- నగదు బహుమతి రచయిత పంపుతారు. వీటిని పుస్తక రూపంలో వచ్చే నవలలో  కూడా ప్రచురిస్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement