యద్దనపూడి శైలి చాలా తీపి...
తీపి: తెలుగు సాహిత్యంలో నాకు సంబంధించి ఆ మాధుర్యాన్ని తలపించే రచన యద్దనపూడిగారి ‘సెక్రటరీ’. అది ప్రేమలోని మాధుర్యాన్ని సమతూకంలో ప్రదర్శించిన నవల. అలాగే మంచి హాస్యం ఉన్న పుస్తకాన్ని కూడా నేను తీపిగానే భావిస్తా.
పులుపు: సామర్‌సెట్ మామ్ రాసిన ‘రేజర్స్ ఎడ్జ్’ పులుపు రుచికి చక్కని ఉదాహరణ. కారణం హిందూమతానికి సంబంధించిన వైరాగ్యాన్ని దీంట్లో బాగా రాశారు.
వగరు: నేను రాసిన ‘అనగనగా అతిథి’. ఇది అతీంద్రయ శక్తులు, ఊజాబోర్డ్ (మరణించిన వారిని పిలిపించి సంభాషించే బోర్డ్) వంటి విషయాల మీద రాసిన నవల. చెడ్డ విషయాల మీద రాశానని చాలా ఆలస్యంగా గ్రహించాను. అందుకే ఈ నవల నాకు వగరును తలపిస్తుంది.
ఉప్పు: ఆనె ఫ్రాంక్స్ డైరీ మంచి ఉదాహరణ. ఆహారంలో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా తినలేం. మనిషికి స్వేచ్ఛ అలాంటిదే. ఎక్కువైనా, తక్కువైనా సమస్యే. అలా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో స్వేచ్ఛ విలువను చక్కగా చెప్పిన నవల ఇది. కరువైన స్వేచ్ఛకు సోవియెట్ యూనియన్ ఒక ఉదాహరణైతే, దుర్వినియోగమవుతున్న స్వేచ్ఛకు మనదేశం ఉదాహరణ.
కారం: ఓ టిబెటియన్ మాంక్ రాసిన ‘ఆర్ట్ ఆఫ్ డైయింగ్’ పుస్తకం. మరణించబోయే ఆర్నెల్ల ముందు నుంచి మనిషి ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పే రచన ఇది. షడ్రుచుల్లో కారం ఎంత అవసరమో జీవితంలో అలాంటి రుచిని పోలిన ఇలాంటి రచనలూ అంతే ముఖ్యం. అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
చేదు: నేను రాసిన తేనేటీగ. నాకు మంచి నవలగా అనిపించినా సమాజం నుంచి చాలా విమర్శలెదుర్కొన్న రచన ఇది.
ముక్తాయింపు: ప్రతి యేడూ ఉగాది పండుగ కోసం ఎదురుచూస్తూ దాన్ని ఎంత ఆనందంగా స్వాగతిస్తామో సాహిత్యానికి సంబంధించి కొత్త రచనల కోసమూ అంతే ఉత్సాహంగా ఎదురుచూడాలి. కొత్త రచయితలనూ అంతే సాదరంగా ఆదరించాలి.
- మల్లాది వెంకటకృష్ణమూర్తి