
దేశానికి ఎదురయ్యే నానా సమస్యల్లో కరవు ఒకటి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధ వరకు ఎదిగినా, కరవు కాటకాలను పూర్తిగా రూపుమాపే స్థాయికి మాత్రం ఇంకా చేరుకోలేదు. రాజ్యానికి వాటిల్లే అనేకానేక ఆపదల్లో దుర్భిక్షాన్ని కూడా ఒకటిగా మన ప్రాచీన సాహితీవేత్తలు గుర్తించారు. అయితే, ఇందులో మానవ ప్రమేయాన్ని మాత్రం పాపం వారు గుర్తించలేకపోయారు. ‘అమానుషోగ్నిః, అవర్షం, అతివర్షం, మారకః, దుర్భిక్షం, సస్యోపఘాతః, జంతుసర్గః, వ్యాధిః, భూత పిశాచ శాకినీ సర్ప వ్యాళ మూషక క్షోభాశ్చేత్యాపదః’ అన్నాడు సోమదేవుడు.
ఈ శ్లోకం ఆయన రాసిన ‘నీతి వాక్యామృతం’లోనిది. అంటే, మనుషుల వల్ల కాకుండా, ఇతర కారణాల వల్ల వాటిల్లే అగ్నిప్రమాదాలు, వర్షాలు లేకపోవడం, అతి వర్షాలు, మహమ్మారి వ్యాధులు, దుర్భిక్షం, పంటలకు నష్టం కలగడం, అడవి జంతువుల సంఖ్య విపరీతంగా పెరగడం, రోగాలు, భూత పిశాచాదులు, పాములు, అదుపు తప్పిన ఏనుగులు, ఎలుకలు– ఇవీ రాజ్యంలో కలిగే ఆపదలు. పురాతన రాజ్యాల్లోనే కాదు, దుర్భిక్ష పరిస్థితులు వర్తమాన దేశాల్లోనూ ఉన్నాయి.
పురాతన కాలంలో ఆనకట్టలు కట్టే పరిజ్ఞానం లేకపోవడంతో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కోవడం కష్టంగా ఉండేది. ఆధునిక కాలంలో ఆనకట్టలు కట్టడం నేర్చుకున్నాం. నీటిపారుదలను మెరుగుపరచుకున్నాం. అయినా ఎక్కడో ఒకచోట కరవు తాండవిస్తూ ఉండటమే విచారకరం. ముందుచూపు లేకుండా అడవులను నరికివేయడం వల్లనే ప్రపంచంలో చాలా చోట్ల కరవు కాటకాలు తలెత్తుతున్నాయి.
ఒకప్పటి పచ్చని నేలలు ఇప్పుడు బీడు భూములుగా, ఎడారులుగా మారుతున్నాయి. ‘విచారకరమైన సంగతేమిటంటే, అడవిని సృష్టించడం కంటే ఎడారిని సృష్టించడం సులువు’ అన్నాడు ఇంగ్లిష్ పర్యావరణ శాస్త్రవేత్త జేమ్స్ లవ్‌లాక్. కష్టమైన పనులు చేపట్టే బదులు సులువైన పనులు చేయడమే కదా మనుషుల సహజ లక్షణం. అందుకే సునాయాసంగా ఎక్కడికక్కడ ఎడారులను సృష్టిస్తున్నారు.
కరవు సాహిత్యం మనకు కరవు కాదు. దుర్భిక్ష వర్ణన తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడితో మొదలైంది. అప్పట్లో కరవు కాటకాలకు ఆలవాలమైన పలనాటి సీమలో ఆకుకూరలతో జొన్నకూడు తినలేక శ్రీనాథుడు నానా తిప్పలు పడ్డాడు. చివరకు ఉక్రోషం అణచుకోలేక ‘ఫుల్ల సరోజనేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా/డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేమొ? తింత్రిణీ/పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటిలో/ మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్’ అంటూ సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడికే సవాలు విసిరాడు.
కేవలం పలనాడులోనే కాదు, రేనాటి సీమలో కూడా శ్రీనాథుడికి కారం కలిపిన జొన్నకూడు తినవలసిన దుర్గతి తటస్థించింది. అప్పుడు ‘గరళము మ్రింగితి ననుచుం/బురహర గర్వింపబోకు పో పో పో నీ/ బిరుదింక గానవచ్చెడి/ మెరసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ’ అని పరమశివుడిని సవాలు చేశాడు. దుర్భిక్ష దుర్గతిని అనుభవించి పలవరించిన తొలి తెలుగు కవి శ్రీనాథుడు.
ఆధునికులలో విద్వాన్ విశ్వం రాయలసీమలోని పెన్నా పరివాహక ప్రాంతంలోని పల్లెల కరవు కష్టాలకు చలించిపోయి, ‘అదే పెన్న! అదే పెన్న!/ నిదానించి నడు/ విదారించు నెదన్, వట్టి/ ఎడారి తమ్ముడు’ అంట ‘పెన్నేటి పాట’ను హృదయ విదారకంగా రాశారు. కరవు మనిషిని నానా రకాలుగా దిగజారుస్తుంది. నేరాలకు పురిగొల్పుతుంది.
‘కరవు కాలంలో రొట్టెముక్కను దొంగిలించిన మనిషిని దొంగగా చూడరాదు’ అన్నాడు బ్రిటిష్ గీత రచయిత క్యాట్ స్టీవెన్స్. అయితే, కరవు కాలంలో మనుషుల్లో అంత ఔదార్యం మిగిలి ఉంటుందా అన్నది అనుమానమే! మొదటి ప్రపంచయుద్ధం దెబ్బకు 1914–23 కాలంలో భారత్ సహా నలబై ఐదు దేశాలు కరవు కాటకాలతో అల్లాడిపోయాయి. అప్పటి కరవుకాలంలో అమెరికా ఈ దేశాలను ఆదుకున్న తీరును, ఆనాటి కరవు తీవ్రతను వివరిస్తూ అమెరికన్ రచయిత, సామాజిక కార్యకర్త హెర్బర్ట్ హూవర్ ‘యాన్ అమెరికన్ ఎపిక్: ఫేమిన్ ఇన్ ఫార్టీ ఫైవ్ నేషన్స్’ అనే పుస్తకం రాశాడు.
నేటి ప్రపంచంలో కరవు కరాళనృత్యం చేసే దేశాల్లో సోమాలియా ముందు వరుసలో ఉంటుంది. ప్రకృతి కారణాలే కాకుండా; యుద్ధాలు, సంక్షోభాలు అక్కడి కరవును మరింత కర్కశంగా మారుస్తున్నాయి. ‘ఆకలి నా అనుదిన ఆహారం/ కరవు నా ఊపిరి/ నిర్లక్ష్యమే నా సంరక్షణ/ దాతల జోలపాటకు నేను నిద్రపోతాను/ ఆ పాట ఎలా పాడాలో వితరణ సంస్థలకు తెలుసు’ అంటాడు ‘నేను సోమాలీ శిశువును’ అనే కవితలో సోమాలీ కవి అబ్ది నూర్ హజీ మహమ్మద్.
నేడు కరవు, ఎడారీకరణలపై పోరాట దినం. ప్రస్తుత ప్రపంచంలో ఇరవై మూడు దేశాలు గడచిన ఆర్థిక సంవత్సరంలో కరవు ఆత్యయిక పరిస్థితిని ప్రకటించాయి. వీటిలో మూడు ఆఫ్రికన్ దేశాలైతే, వరుసగా నలభై ఏళ్ల నుంచి కరవుతోనే సతమతమవుతున్నాయి. కరవు కాటకాలు ఉన్నచోట అశాంతి, అలజడులు తప్పవు. మనుషుల్లో హింసా ప్రవృత్తి పెరుగుతుంది.
‘హింస కలుపుమొక్కలాంటిది. ఎంతటి కరవు వాటిల్లినా అది చావదు’ అన్నాడు ఆస్ట్రియన్ రచయిత సైమన్ వీసెంతాల్. నాజీల మారణకాండ నుంచి తప్పించుకుని, బతికి బట్టకట్టిన వాడాయన. కరవు కాటకాలు కనుమరుగైతే తప్ప ప్రపంచంలో శాంతి సామరస్యాలు సాధ్యంకావు. అయితే, అలాంటి రోజు ఎప్పటికైనా వస్తుందా? మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ‘నిజంగానే నిఖిలలోకం / నిండు హర్షం వహిస్తుందా?/ మానవాళికి నిజంగానే/ మంచికాలం రహిస్తుందా?’
Comments
Please login to add a commentAdd a comment