ఇంగితం సంగతేంటి? | Sakshi Editorial On Common sense | Sakshi
Sakshi News home page

ఇంగితం సంగతేంటి?

Published Mon, Jan 27 2025 1:05 AM | Last Updated on Mon, Jan 27 2025 6:14 AM

Sakshi Editorial On Common sense

ఇంగితజ్ఞానం ఇంగితజ్ఞానమే, చదువులు చదువులే! చదువు పరమావధి జ్ఞానమే అయినా, చదువుకున్న వారందరూ జ్ఞానులు కాలేరు. అత్యంత దురదృష్టకరమైన విషయమేమిటంటే, చదువు కున్న వారిలో కొందరు కనీసం ఇంగితజ్ఞానులు కూడా కాలేరు. విపరీతంగా చదువుకుని, బహు పట్టభద్రులై, పాఠాలు బోధించే స్థాయిలో ఉన్నా, ఇలాంటివారు ఎప్పటికప్పుడు తమ ఇంగితజ్ఞాన రాహిత్యాన్ని బయటపెట్టుకుంటూ జనాలను విభ్రాంతికి గురిచేస్తుంటారు. ‘విద్యలేనివాడు వింత పశువు’ అంటూ నిరక్షరాస్యులను ఎద్దేవా చేసే పెద్దలు – అతి విద్యావంతులైన ఇంగితజ్ఞాన రహితులను ఏమంటారో!

‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్‌/ బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/ పొదవెడు నుప్పు లేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని శతకకారుడు వాపోయాడు. రసజ్ఞత లేని చదువును ఉప్పులేని కూరతో పోల్చాడు. బహుశా, ఎంత చదువు చదువుకున్నా, కాస్తంతైనా ఇంగితజ్ఞానం లేనివారు ఆయనకు తారసపడి ఉండరు. అలాంటి అతి చదువరులే తారసడితే ఆయన ఇంకెంతలా వాపోయేవాడో! 

ఈ రోజుల్లో చదువుకున్న వాళ్లలో రసజ్ఞత సంగతి దేవుడెరుగు, ఇంగితజ్ఞానం కూడా కొరవడు తోందంటే, మన చదువులు ఎలా అఘోరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు మన చదువులు ఇలా ఎందుకు అఘోరిస్తున్నాయో, అందుకు గల కారణాలను అన్వేషించే వాళ్లు బహు అరుదు. ‘చాలామందికి, పిల్లల్ని చదువంటే బెదరగొట్టడం చాతనయినంత బాగా వాళ్లకి చదువు మీద ఇష్టం కలిగించడం చాతకాదు’ అంటారు కొడవటిగంటి కుటుంబరావు. ‘చదువు’ నవలలో ఆయన వెలి బుచ్చిన అభిప్రాయం ఇది. 

బెదరగొట్టి మరీ పిల్లలకు చదువు చెప్పే బడిపంతుళ్ల ధోరణి కూడా చదువుకున్న వాళ్లలో ఇంగితజ్ఞాన లోపానికి ఒక కీలక కారణం. బెదరగొట్టి పిల్లలకు చదువు చెప్పే దండోపాయ నిపుణులు పురాణకాలం నుంచే ఉన్నారు. ప్రహ్లాదుడికి చదువు చెప్పిన చండా మార్కుల వారసత్వాన్ని కొందరు నేటికీ కొనసాగిస్తున్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో చండా మార్కుల వారసులకే గిరాకీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి గురువులు పిల్లల బుర్రల్లోకి పాఠాల నైతే ఎక్కించగలరేమో గాని, చిటికెడు ఇంగితజ్ఞానాన్ని మాత్రం అలవరచలేరు. 

‘ఇంగితజ్ఞానం మరీ అంత సర్వసాధారణమైనది కాదు’ అంటాడు ఫ్రెంచ్‌ తత్త్వవేత్త వోల్టేర్‌. ఇంగితజ్ఞానాన్ని ఇంగ్లిష్‌లో ‘కామన్‌సెన్స్‌’ అంటారు. అలాగని, ఇది మనుషులందరికీ ఉండే లక్షణ మని అనుకుంటే పొరపాటే! ‘మనుషులందరిలోనూ ఇంగితజ్ఞానం ఉందనే నమ్మకంతో కొన్నిసార్లు మనం ప్రమాదంలో పడుతుంటాం’ అన్నాడు ఐరిష్‌ సంగీతకారుడు హోజీర్‌.

ఒకప్పుడు సమాజంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు అక్షరాస్యులు బాగా పెరిగారు. అక్షరాస్యత పెరిగితే, జనాల్లో బుద్ధి జ్ఞానాలు, తెలివితేటలు పెరగడం సర్వసహజ పరిణా మమనేది ఒక అమాయకపు అంచనా. సమాజంలో అక్షరాస్యత పెరిగింది, నిజమే! తత్ఫలితంగా మూర్ఖత్వం తగ్గిందనుకుంటే పారపాటే! ‘చదవేస్తే ఉన్న మతి పోయింద’నే నానుడి ఉంది. ఇప్పటి చదువులను చూస్తే, పరిస్థితి అలాగే ఉందనిపిస్తుంది. ఈ చదువులతో కొందరిలో ఇంగితజ్ఞానం లోపిస్తుంటే, ఇంకొందరిలో చావుతెలివి పెచ్చుమీరుతోంది. బొటాబొటి చదువుల సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఉన్నత విద్యావంతులు సైతం బోల్తాపడుతున్న ఉదంతాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

ఒకవైపు శాస్త్రవేత్తలు కృత్రిమ మేధతో కుస్తీలు పడుతున్న రోజులు వచ్చిపడ్డాయి గాని, మనుషుల్లో ఇంగితాన్ని పెంచే చదువులే కరవవుతున్నాయి. ‘నడవడికను చక్కబరచడానికి ఉత్త పాఠ్య పుస్తకాల చదువు చాలదు’ అని గాంధీజీ చెప్పిన మాటలను నేటి కార్పొరేట్‌ విద్యావ్యవస్థ పట్టించు కుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. గాంధీజీ ‘హింద్‌ స్వరాజ్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పాఠ్యపుస్తకాల విద్య మానవుల నైతికోన్నతికి ఇంచుకైనా సహకరించదని; చదువు వేరు, సద్గుణం వేరని స్వానుభవంతో తెలుసుకున్నాను’ అన్నారు. ఆయన దేశానికి స్వాతంత్య్రం రాకముందు చెప్పిన మాటలివి. ఇప్పటికీ మన చదువులు పూర్తిస్థాయిలో చక్కబడకపోవడం విచారకరం.

చదువులు చెప్పడానికి ఎన్నో బడులు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రత్యేక నైపుణ్యాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయి. పుట్టల నుంచి చీమలు పుట్టుకొచ్చినట్లు వీటి నుంచి ఏటా పట్టభద్రులు పుట్టుకొస్తున్నారు. వాళ్లలో చాలామంది సమాజంలో మేధావులుగా చలామణీ అవుతున్నారు. అంతమాత్రాన, వాళ్లంతా ఇంగితజ్ఞాన సంపన్నులనుకోవడానికి ఆస్కారం లేదు. ‘మీ డిగ్రీ ఒక కాగితం ముక్క మాత్రమే. 

మీ చదువేమిటో మీ ప్రవర్తనలోను, ఆలోచనా ధోరణిలోను, సౌశీల్యంలోను ప్రతిఫలిస్తుంది’ అన్నాడు అమెరికా మూడో అధ్యక్షుడు థామస్‌ జెఫర్‌సన్‌. ప్రవర్తనను, ఆలోచనా ధోరణిని మార్చలేని డిగ్రీలు ఉత్త కాగితం ముక్కలు మాత్రమే! ‘కొన్ని ఆలోచనలు చాలా మూర్ఖంగా ఉంటాయి. వాటిని మేధా వులు మాత్రమే నమ్ముతారు’ అని ఇంగ్లిష్‌ రచయిత జార్జ్‌ ఆర్వెల్‌ అన్నాడు. గోమూత్రపానంతో జ్వరాలు తగ్గుతాయని ఇటీవల ఐఐటీ–మద్రాసు డైరెక్టర్‌ మహాశయుడు సెలవిచ్చారు. ఆయనను బహుశా మేధావులే నమ్ముతారు కాబోలు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement