common sense
-
లోకజ్ఞానంతో కాదు... దైవజ్ఞానంతో ఆంతర్యాన్ని నింపుకోవాలి!
యేసు ఎంతోమందికి తన శిష్యులుగా తర్ఫీదునిచ్చి దేవుని రాజ్య రాయబారులుగా తీర్చిదిద్దాడు. తన నామంతో మహాద్భుతాలు చేసే అధికారాన్ని వారికిచ్చాడు. అయితే ఇస్కరియోతు యూదా అనే శిష్యుడొక్కడే ఆ శిక్షణలో ఫెయిల్ అయ్యాడు. నిజానికి శిక్షణలో అగ్రస్థానం పొందే ఎన్నో విశేషాలు అతనికున్నాయి. అతను మేధావి. యెరికోలోని ఒక గొప్ప వ్యాపారస్తుని కొడుకు. బహుశా అందుకే మిగిలిన వారితో సరిగా కలిసేవాడు కాడేమో. ధనిక నేపథ్యమున్న వాడు గనుక డబ్బుకు కక్కుర్తి పడడని అతనికి డబ్బు సంచి ఇచ్చారు. కాని ఏం లాభం? ముప్ఫై వెండినాణేలకు యేసును యూదు మత పెద్దలకు అప్పగించాడు.ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయాడు. మనిషి ఆంతర్యం ఒక మహా అగాధం. దాన్ని లోకజ్ఞానంతో నింపే కొద్దీ, మురికికూపంగా మారుతుంది. ఒక కరడుగట్టిన పాపి విశ్వాసిగా మారే ప్రయాణం పొడవునా ఆత్మ ప్రక్షాళన అనివార్యమవుతుంది. మూడున్నరేళ్ల తమ శిక్షణకాలంలో శిష్యులు తమ ఆంతర్యాన్ని దేవుని సహచర్యంలో పొందిన ఎన్నో దివ్యానుభవాలతో నింపుకున్నారు. అలా వాళ్లంతా దైవజ్ఞాన ఖజానాలు, దేవుని ప్రేమ పండించే పరమ క్షేత్రాలయ్యారు. ఇలా ఎక్కడ ఇతరులు లాభపడ్డారో అక్కడ యూదా విఫలమయ్యాడు. దేవునితోనే తిరిగిన మేధావి, కాని దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని అజ్ఞానం, దౌర్భాగ్యం అతనిది. అందుకే ఆంతర్యాన్ని లోకజ్ఞానంతో కాదు, దైవజ్ఞానంతో నింపుకోవాలి. చౌకబారు వినోదంతో కాదు, నిరుపేదల సేవలో తరించే అనిర్వచనీయమైన ఆనందంతో నింపుకోవాలి. అది దేవుని సన్నిధిలో మోకరించి గడిపే ఏకాంత ప్రార్థనలో, బైబిలు పఠనలో మాత్రమే విరివిగా దొరుకుతుంది. గతంలో విలువైన బైబిలు జ్ఞానంతో మహాభక్తులు పునాది వేసిన చర్చిలే దేవుని ప్రేమను అద్భుతంగా ప్రకటించాయి. అయితే అవాస్తవాలను, సగం వాస్తవాలను కూడా నమ్మలేని నిజాలుగా చలామణి చేసే ‘ఇంటర్నెట్’ ఇపుడు చాలామంది బోధకుల జీవితాల్లో ‘బైబిల్’కు ప్రత్యామ్నాయమైంది. అలా దైవజ్ఞానానికి బదులు నకిలీ దైవజ్ఞానంతో నిండుతున్న చర్చిలకు, విశ్వాసులకు నిరుపేదల ఆకలికేకలు వినలేని ‘చెవిటితనం’ వినబడ్డా పాకులాడలేని ‘ఆత్మీయ అవిటితనం’ ఆవహించింది! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
లోకజ్ఞానం లేని పాండిత్యం!
పూర్వం మాధవపురం అనే గ్రామంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. వారు కాశీలోని ఓ వేదపండితుడి వద్ద వేదాధ్యయనం చేసి, పండితులుగా మాధవపురానికి తిరిగి వచ్చారు. ఒకనాడు నలుగురు మిత్రులు కలిసి వేద పారాయణానికి పొరుగున ఉన్న వరదరాజ పురానికి బయలుదేరారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత వారు వెళుతున్న దారి రెండుగా చీలిపోయింది. వరదరాజ పురానికి ఏ దారిలో వెళ్ళాలో వారికి అర్థం కాలేదు. మొదటివాడైన రాజశేఖరుడు ‘‘పదిమందీ నడిచే దారిలో వెళ్ళడం ఉత్తమం. ఎందుకంటే మామూలు దారిలో నలుగురూ నడుస్తూ ఉంటారు. ఈ దారులను పరిశీలన చేస్తే ఈ కుడివైపు వెళ్ళే దారిలో మనుషులు ఎక్కువగా నడిచిన జాడలు కనబడుతున్నాయి. ఎడమవైపు దారిలో మనుషుల అడుగు జాడలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి కుడివైపు దారిలోనే మనం వెళదాం ’’ అన్నాడు. ఇంతలో కొంతమంది ఒక శవాన్ని మోసుకొని వెళుతున్నారు. ఈ పండితులు నలుగురూ వారి వెంట వెళ్ళి చివరికి ఒక శ్మశానానికి చేరారు. శ్మశానం సమీపంలో వారికి ఒక గాడిద కనిపించింది. రెండవ వాడైన ఇంద్రశర్మ ‘‘ఆనందంలో, కష్టాలలో, కరువులో, శత్రుబాధలో, శ్మశానంలో వెంట నిలిచినవారే మనకు నిజమైన బంధువులు!’’ అని అన్నాడు. మూడవవాడైన కౌశికశర్మ ‘‘అయితే మనకు ఈ గాడిద బంధువు అన్నమాట!’’ అన్నాడు. వెంటనే ఒక్కొక్కరూ ఆ గాడిదకు కాళ్ళు కడిగి, సేవ చేశారు. ఇంతలో వారికి ఒక ఒంటె కనబడింది. వెంటనే మూడవవాడైన కౌశికశర్మ ‘‘ఇష్టమైనవాణ్ణి ధర్మంతో కలపాలి.’’ అన్నాడు. ‘ధర్మం’ అంటే తాడు అనే అర్థం కూడా ఉంది కాబట్టి మనం ఒంటెను, గాడిదను తాడుతో కట్టేద్దాం’ అన్నాడు కౌశికశర్మ. కొద్దిసేపటికి అక్కడికి ఒక చాకలి వచ్చి తన గాడిదను ఒంటెతో కట్టేయడం చూసి ఆగ్రహం చెందాడు. ‘నా గాడిదను బంధించింది ఎవరు?’’ అని ప్రశ్నించేసరికి, ఆ నలుగురు పండితులు తామే ఆ పని చేశాం అని చెప్పారు. ‘‘అంటే నా గాడిదను మీరు తీసుకొని పోవాలనుకున్నారా?’’ అంటూ ఆ నలుగురిని కొట్టడానికి వచ్చాడు. దాంతో, నలుగురూ భయంతో పరుగుతీశారు. అలా పరుగెత్తి ఓ నది దగ్గరికి వచ్చారు. వారికి ఈత రాదు. ఏం చేయాలా? అని ఆలోచన చేస్తుంటే ఒక ఆకు నీటిప్రవాహంలో తేలుతూ కనిపించింది. అప్పుడు నాలుగోవాడు విష్ణుశర్మ తన దగ్గర ఉన్న గ్రంథాలను పరిశీలించి ‘‘తేలుతూ వస్తున్న ఆకు మనల్ని రక్షిస్తుంది’’ అని అన్నాడు. ఆ నలుగురూ ఆ ఆకును పట్టుకొని నీటిలోకి దిగారు. ఈత రాకపోవడంతో వారు నీటిప్రవాహంలో కొట్టుకుపోయారు. కొంతదూరం వెళ్ళాక నది ఒడ్డున ఉన్నవారు ఈ నలుగురినీ చూసి దయతలచి వారి ప్రాణాలను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుండి ఆ నలుగురూ కోదండపురం అనే గ్రామాన్ని చేరుకున్నారు. ఆ పండితులను చూసి గ్రామస్థులు ఆ నలుగురికీ నాలుగు ఇళ్ళలో భోజన ఏర్పాట్లు చేశారు. మొదటివాడైన రాజశేఖరుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళుతుండగా ఇంటి వాకిట్లో అతనికి ఒక పొడవైన దారం కనబడింది. దానిని చూసి అతడు ఒక్క క్షణం ఆలోచించాడు. ‘ఈ దారం ఇలా ఇంటి ముంగిట్లో అడ్డంగా పడి ఉండడం వల్ల ఇంద్రశర్మ మరణిస్తాడు’ అని అనుకున్నాడు. ‘అయ్యో! ఇంద్రశర్మ మరణించే సమయం వచ్చేసింది. ఇక నేను ఇక్కడ భోజనం చేస్తూ కాలం గడిపితే స్నేహధర్మం చెడిపోతుంది. కాబట్టి నేను తక్షణం ఇక్కడి నుండి వెళ్ళి ఇంద్రశర్మ ఉన్న ఇంటికి వెళ్ళిపోవాలి’ అని మనసులో అనుకున్నాడు. వెంటనే ఆ ఇంటి యజమానిని పిలిచి, ‘‘అయ్యా! నేను ఇప్పుడు భోజనం చేయలేను. నా మిత్రుడు ఆపదలో ఉన్నాడు. నేను వెంటనే వాడిని చేరుకోవాలి!’’ అని యజమాని సమాధానం కోసం కూడా ఎదురుచూడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఇంద్రశర్మ భోజనం కోసమని ఓ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఇంద్రశర్మను కూర్చోబెట్టి విస్తరిలో రొట్టెలు వడ్డించారు. ‘‘అయ్యో! రొట్టెలు తింటే ఆయుష్షు తగ్గుతుంది ఇవి తినకూడదు!’’ అనుకొని ఇంటి యజమానితో ‘‘అయ్యా! నేను ఈ రొట్టెలు తినలేను!’’ అని చెప్పి బయటికి వచ్చేశాడు. ఇంద్రశర్మ బయటికి రాగానే అతని దగ్గరికి రాజశేఖరుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ‘‘మిత్రమా నీవు క్షేమమే కదా!’’ అని ప్రశ్నించాడు. ఇంద్రశర్మ ఆశ్చర్యంగా ఏమిటని అడిగాడు. ‘‘ఏమీలేదు. నేను భోజనానికి వెళ్ళిన ఇంటి ముందు దారం కనబడింది. నీవు మరణిస్తావని అనుకొని నీ కోసం వచ్చాను.’’ అన్నాడు. ఇది ఇలా ఉండగా మూడవవాడు కౌశికశర్మ భోజనానికి ఓ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటివాళ్ళు అతనికి చిల్లులు పడిన విస్తరి వేశారు. ‘అయ్యో! విస్తరికి చిల్లులు పడ్డాయే’ అని భోజనం చేయకుండా ఇంటి నుండి బయటికి వచ్చాడు. అతడు బయటికి వచ్చేసరికి అక్కడికి రాజశేఖరుడు, ఇంద్రశర్మ కనిపించారు. ముగ్గురూ కలిసి తమ తమ అనుభవాలు చెప్పుకున్నారు. ఇక నాలుగోవాడైన విష్ణుశర్మ భోజనానికి ఓ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళు అతనికి ఆసనంగా తడిసి ఉన్న పీటను వేశారు. ‘అయ్యో! తడిసి ఉన్న ఆసనం మీద కూర్చొని భోజనం చేస్తే ప్రాణహాని!’ అని భయపడి అతడు భోజనం చేయకుండానే బయటికి వచ్చేశాడు. మిగిలిన ముగ్గురూ అతడిని చూసి దగ్గరికి వెళ్ళారు. అందరూ తమ అనుభవాలు చెబుతూ ఉంటే ముదుసలి అయిన ఒక గ్రామస్థుడు వారి మాటలు విని పెద్దగా నవ్వాడు. ఈ నలుగురూ ‘‘ఎందుకు నవ్వుతున్నావు?’’ అని అడిగారు. అప్పుడు ఆ ముదుసలి ఇలా అన్నాడు - ‘‘ఓరీ! మూర్ఖ పండితులారా! దారం అడ్డం పడిందని ఒకడు, రొట్టెలు ఆయుఃక్షీణమని ఒకడు, చిల్లుల విస్తరి అని మరొకడు, తడి ఆసనం అని ఇంకొకడు భోజనం మానేయడం మూర్ఖత్వం! దారాన్ని పక్కకు తప్పిస్తే సరిపోతుంది. రొట్టెల బదులు అన్నం పెట్టమని అడిగితే సరిపోతుంది. చిల్లుల విస్తరి మీద మరో విస్తరి వేసుకుంటే ఇబ్బందే లేదు. తడి ఆసనాన్ని తుడిచి కూర్చుంటే ఏ హానీ లేదు. మీకు పాండిత్యం ఉంది కాని లోకజ్ఞానం లేదు. ఈ రోజుకు మీకు అన్నం దొరకదు పొండి!’’ అని వారిని పంపించేశాడు. చూశారా! పాండిత్యంతో పాటు లోకజ్ఞానం లేకపోతే ఎంత ఇబ్బంది కలుగుతుందో! -
రాంబాబుగాడు... వాడి వ్యక్తిత్వ వికాస పాఠాలు!
నవ్వింత ఈమధ్య మా రాంబాబు గాడు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నాడు. ‘విజయానికి ఆరు మెట్లు’ చదివాడట. అయితే మెట్ల సంఖ్య ఎక్కువగా ఉందనీ, మరింత షార్ట్ కట్లో ఎవరైనా విజయానికి దారులు సూచిస్తే బాగుండేదనీ వెతుకుతున్నాడు. ‘విజయానికి రెండు మెట్లు’ అనో, ‘విజయానికి మెట్లు లేవ్!’ అనో ఇంకెవరైనా రాశారేమోనని కనుక్కుంటున్నాడు కానీ... ఇప్పటివరకు ఉన్న మెట్ల సంఖ్యలో అదే లీస్టు అని తెలిశాక నిరాశ-నిస్పృహలకు లోనయ్యాడు మనవాడు. ‘‘ఒరేయ్... పుస్తకాలు చదివితే వ్యక్తిత్వం వికసించదు. అదే జరిగితే ఒక లక్షమంది ఒకే పుస్తకాన్ని చదివి, తమ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుంటే... అందరి తత్వం ఒకేలా మారిపోయేది కదా! కానీ అలా కుదురుతుందా? ఆలోచించు. ఎంత చదివినా, ఏం చేసినా ఎవడి వ్యక్తిత్వం వాడిదే. సొంత ఆలోచనతో ఆయా సందర్భాల్లో ఏది మంచిదో నీ కామన్ సెన్స్తో నీకు నువ్వే నిర్ణయించుకోవాల్సిందే తప్ప... నీకు జీవితంలో ఎదురు కాబోయే సంఘటలను ఎవరో ఊహించి ముందుగానే రాయలేరు. సో... వికాసాన్ని చదువుతో సాధించలేం కాబట్టి విచక్షణతో మసలుకో. వివేచనతో బతుకుపో’’ అని చెప్పి చూశా. కానీ వాడు అస్సలు ఒప్పుకోలేదు. అనుభవమైతే గానీ తత్వం బోధపడదన్న గురజాడ వారి సూక్తిని అనుసరించి ప్రస్తుతానికి వాడి పైత్యానికి వాణ్ణే వదిలేశా. అనగనగా ఓ సింహం వ్యక్తిత్వ వికాస పుస్తకాలను బాగా ఒంటబట్టించుకుందట. అది తన జూలును క్లీన్గా షేవ్ చేయించుకునీ, తన గోళ్లను నీట్గా ట్రిమ్ చేయించుకునీ... ‘తరతరాలుగా, యుగయుగాలుగా నేను నీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టడమే చేస్తున్నా. ఇకపై అలాంటి దుర్మార్గాలు చేయబోన’ంటూ స్నేహపూర్వకంగా ఓ ఏనుగును పలకరిస్తూ దాని తలపెకైక్కి... ‘‘మన స్నేహానికి గుర్తుగా నీకు ‘పంజా మసాజ్’ చేస్తా’’నందట. ఒళ్లు మండిన ఏనుగు ఆ సింహాన్ని పట్టి, తొండంతో చుట్టి దూరంగా విసిరిపారేసిందట. దాంతో కుయ్యోమంటూ ఆ సింహం ‘‘స్టీఫెన్ పాలకోవా రచించిన ‘ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ యానిమల్స్’ లాంటి పుస్తకాలు నేనొక్కదాన్నే చదివితే కుదరదు. సదరు వ్యక్తిత్వ వికాస పాఠాలను ఏనుగు కూడా చదివినప్పుడే వాటికి సార్థకత’’ అని నిట్టూర్చిందట. సింహం గర్జించాలి, పులి గాండ్రించాలి. అప్పుడే వాటి వ్యక్తిత్వం వాటిదిలాగే ఉంటుంది. గర్జించాల్సిన, గాండ్రించాల్సిన జంతువులు కుయ్యోమొర్రోమంటే అడవిలో ఆర్డర్ తప్పుతుందని రాంబాబుగాడికి వివరించా. వాడిపై నా మాటల ప్రభావం కొద్దిగా పడినట్టే అనిపించింది. ఓరోజు మా రాంబాబుగాడింట్లో దొంగ దూరాడు. అర్ధరాత్రి వ్యక్తిత్వ వికాస పుస్తకం చదువుకుంటున్న రాంబాబు దొంగను సాదరంగా ఆహ్వానించాడు. దొంగతనం ఎంత తప్పో సోదాహరణంగా వివరించబోయాడు కానీ... అదంతా సోదిలా అనిపించడంతో సదరు దొంగ రాంబాబు బుర్రపై రామకీర్తనలతో సహా అనేక పాటలను ఏకకాలంలో పలికించి, చేతికందిన వస్తువుల్ని చక్కా పట్టుకుపోయాడు. ‘‘దొంగను చూడగానే పోలీసులకు ఫోన్ చేయాలి, లేదా అరుస్తూ, ఇరుగుపొరుగింటి వాళ్లను పిలుస్తూ హడావుడి చేసి వాణ్ణి పట్టుకునే మార్గం చూడాలిగానీ... ఎవడైనా దొంగకు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతారా...?’’అని నేను కోప్పడబోతే... సదరు దొంగ సరిగా ప్రవర్తించకపోవడానికి కారణం వాడు వ్యక్తిత్వ వికాస పాఠాలు చదవకపోవడమేననీ, అదేగానీ వాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చదివి ఉంటే తప్పక తన ఉపదేశాలు విని బాగుపడేవాడని బాధపడ్డాడు మా రాంబాబు. ఓరోజున మా రాంబాబు ‘హౌ టు విన్ ఫ్రెండ్స్, అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్’ అనే డేల్ కార్నెగీ పుస్తకాన్ని తదేక దీక్షతో చదువుతూ ఉండగా నేను వాడింటికి వెళ్లా. ‘‘ఒరేయ్ రాంబాబూ! ఫ్రెండ్స్ను గెలవడం ఏమిట్రా? స్నేహితుడంటే వాడేమైనా నీ ప్రత్యర్థా, పగవాడా, పొరుగింటి తగాదాకోరా? నీ ఫ్రెండ్ అంటే నీలోని బలహీనతలనూ, బలాలనూ సమానంగా స్వీకరించి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్నింటినీ స్వీకరించేవాడు. నీకు మానసికమైన తోడు. అలాంటి నీ స్నేహితులను ఓడించాల్సిన లేదా గెలవాల్సిన అవసరం ఎందుకొస్తుంది. కాస్త ఆలోచించు’’ అంటూ కౌన్సెలింగ్ చేశా. అలాగే పతంజలి రాసిన ‘‘గెలుపుసరే బతకడం ఎలా?’’ పుస్తకంతో పాటూ, మరికొన్ని రావిశాస్త్రిగారి పుస్తకాల్నీ ఇచ్చా. వ్యక్తిత్వ వికాసం అంటే లోకజ్ఞానం కలిగి ఉండటమని, వ్యక్తిత్వవికాసం పేరిట అందరూ యూనిఫామ్ వేసుకున్నట్లు మూసగా ఉండటం లోపమే కదా! కాబట్టి ఆ పేరుతో లోపజ్ఞానం కలిగి ఉండటం కాదని చెప్పా. ఇలా మా రాంబాబుగాడి రెట‘మత మార్పిడి’ కోసం నా వంతు ప్రయత్నం చేస్తూ ఒక బృహద్కృత్యానికి పూనుకున్నా. చూద్దాం ఏమంటాడో వాడు. - యాసీన్