లోకజ్ఞానం లేని పాండిత్యం! | Mastery is not common sense! | Sakshi
Sakshi News home page

లోకజ్ఞానం లేని పాండిత్యం!

Published Sat, Nov 29 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

లోకజ్ఞానం లేని పాండిత్యం!

లోకజ్ఞానం లేని పాండిత్యం!

పూర్వం మాధవపురం అనే గ్రామంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. వారు కాశీలోని ఓ వేదపండితుడి వద్ద వేదాధ్యయనం చేసి, పండితులుగా మాధవపురానికి తిరిగి వచ్చారు. ఒకనాడు నలుగురు మిత్రులు కలిసి వేద పారాయణానికి పొరుగున ఉన్న వరదరాజ పురానికి బయలుదేరారు.

కొంతదూరం వెళ్ళిన తర్వాత వారు వెళుతున్న దారి రెండుగా చీలిపోయింది. వరదరాజ పురానికి ఏ దారిలో వెళ్ళాలో వారికి అర్థం కాలేదు. మొదటివాడైన రాజశేఖరుడు ‘‘పదిమందీ నడిచే దారిలో వెళ్ళడం ఉత్తమం. ఎందుకంటే మామూలు దారిలో నలుగురూ నడుస్తూ ఉంటారు. ఈ దారులను పరిశీలన చేస్తే ఈ కుడివైపు వెళ్ళే దారిలో మనుషులు ఎక్కువగా నడిచిన జాడలు కనబడుతున్నాయి. ఎడమవైపు దారిలో మనుషుల అడుగు జాడలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి కుడివైపు దారిలోనే మనం వెళదాం ’’ అన్నాడు.
 ఇంతలో కొంతమంది ఒక శవాన్ని మోసుకొని వెళుతున్నారు. ఈ పండితులు నలుగురూ వారి వెంట వెళ్ళి చివరికి ఒక శ్మశానానికి చేరారు. శ్మశానం సమీపంలో వారికి ఒక గాడిద కనిపించింది. రెండవ వాడైన ఇంద్రశర్మ ‘‘ఆనందంలో, కష్టాలలో, కరువులో, శత్రుబాధలో,  శ్మశానంలో వెంట నిలిచినవారే మనకు నిజమైన బంధువులు!’’ అని అన్నాడు. మూడవవాడైన కౌశికశర్మ ‘‘అయితే మనకు ఈ గాడిద బంధువు అన్నమాట!’’ అన్నాడు. వెంటనే ఒక్కొక్కరూ ఆ గాడిదకు కాళ్ళు కడిగి, సేవ చేశారు.

ఇంతలో వారికి ఒక ఒంటె కనబడింది. వెంటనే మూడవవాడైన కౌశికశర్మ ‘‘ఇష్టమైనవాణ్ణి ధర్మంతో కలపాలి.’’ అన్నాడు. ‘ధర్మం’ అంటే తాడు అనే అర్థం కూడా ఉంది కాబట్టి మనం ఒంటెను, గాడిదను తాడుతో కట్టేద్దాం’ అన్నాడు కౌశికశర్మ. కొద్దిసేపటికి అక్కడికి ఒక చాకలి వచ్చి తన గాడిదను ఒంటెతో కట్టేయడం చూసి ఆగ్రహం చెందాడు. ‘నా గాడిదను బంధించింది ఎవరు?’’ అని ప్రశ్నించేసరికి, ఆ నలుగురు పండితులు తామే ఆ పని చేశాం అని చెప్పారు. ‘‘అంటే నా గాడిదను మీరు తీసుకొని పోవాలనుకున్నారా?’’ అంటూ  ఆ నలుగురిని కొట్టడానికి వచ్చాడు. దాంతో, నలుగురూ భయంతో పరుగుతీశారు. అలా పరుగెత్తి ఓ నది దగ్గరికి వచ్చారు.

వారికి ఈత రాదు. ఏం చేయాలా? అని ఆలోచన చేస్తుంటే ఒక ఆకు నీటిప్రవాహంలో తేలుతూ కనిపించింది. అప్పుడు నాలుగోవాడు విష్ణుశర్మ తన దగ్గర ఉన్న గ్రంథాలను పరిశీలించి ‘‘తేలుతూ వస్తున్న ఆకు మనల్ని రక్షిస్తుంది’’ అని అన్నాడు. ఆ నలుగురూ ఆ ఆకును పట్టుకొని నీటిలోకి దిగారు. ఈత రాకపోవడంతో వారు నీటిప్రవాహంలో కొట్టుకుపోయారు. కొంతదూరం వెళ్ళాక నది ఒడ్డున ఉన్నవారు ఈ నలుగురినీ చూసి దయతలచి వారి ప్రాణాలను కాపాడి ఒడ్డుకు చేర్చారు.

అక్కడి నుండి ఆ నలుగురూ కోదండపురం అనే గ్రామాన్ని చేరుకున్నారు. ఆ పండితులను చూసి గ్రామస్థులు ఆ నలుగురికీ నాలుగు ఇళ్ళలో భోజన ఏర్పాట్లు చేశారు. మొదటివాడైన రాజశేఖరుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళుతుండగా ఇంటి వాకిట్లో
 అతనికి ఒక పొడవైన దారం కనబడింది. దానిని చూసి అతడు ఒక్క క్షణం ఆలోచించాడు. ‘ఈ దారం ఇలా ఇంటి ముంగిట్లో అడ్డంగా పడి ఉండడం వల్ల ఇంద్రశర్మ మరణిస్తాడు’ అని అనుకున్నాడు. ‘అయ్యో! ఇంద్రశర్మ మరణించే సమయం వచ్చేసింది. ఇక నేను ఇక్కడ భోజనం చేస్తూ కాలం గడిపితే స్నేహధర్మం చెడిపోతుంది. కాబట్టి నేను తక్షణం ఇక్కడి నుండి వెళ్ళి ఇంద్రశర్మ ఉన్న ఇంటికి వెళ్ళిపోవాలి’ అని మనసులో అనుకున్నాడు. వెంటనే ఆ ఇంటి యజమానిని పిలిచి, ‘‘అయ్యా! నేను ఇప్పుడు భోజనం చేయలేను. నా మిత్రుడు ఆపదలో ఉన్నాడు. నేను వెంటనే వాడిని చేరుకోవాలి!’’ అని యజమాని సమాధానం కోసం కూడా ఎదురుచూడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
 ఇంద్రశర్మ భోజనం కోసమని ఓ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఇంద్రశర్మను కూర్చోబెట్టి విస్తరిలో రొట్టెలు వడ్డించారు. ‘‘అయ్యో! రొట్టెలు తింటే ఆయుష్షు తగ్గుతుంది ఇవి తినకూడదు!’’ అనుకొని ఇంటి యజమానితో ‘‘అయ్యా! నేను ఈ రొట్టెలు తినలేను!’’ అని చెప్పి బయటికి వచ్చేశాడు. ఇంద్రశర్మ బయటికి రాగానే అతని దగ్గరికి రాజశేఖరుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ‘‘మిత్రమా నీవు క్షేమమే కదా!’’ అని ప్రశ్నించాడు. ఇంద్రశర్మ ఆశ్చర్యంగా  ఏమిటని అడిగాడు. ‘‘ఏమీలేదు. నేను భోజనానికి వెళ్ళిన ఇంటి ముందు దారం కనబడింది. నీవు మరణిస్తావని అనుకొని నీ కోసం వచ్చాను.’’  అన్నాడు.

ఇది ఇలా ఉండగా మూడవవాడు కౌశికశర్మ భోజనానికి ఓ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటివాళ్ళు అతనికి చిల్లులు పడిన విస్తరి వేశారు. ‘అయ్యో! విస్తరికి చిల్లులు పడ్డాయే’ అని  భోజనం చేయకుండా ఇంటి నుండి బయటికి వచ్చాడు. అతడు బయటికి వచ్చేసరికి అక్కడికి రాజశేఖరుడు, ఇంద్రశర్మ కనిపించారు. ముగ్గురూ కలిసి తమ తమ అనుభవాలు చెప్పుకున్నారు. ఇక నాలుగోవాడైన విష్ణుశర్మ భోజనానికి ఓ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళు అతనికి ఆసనంగా తడిసి ఉన్న పీటను వేశారు. ‘అయ్యో! తడిసి ఉన్న ఆసనం మీద కూర్చొని భోజనం చేస్తే ప్రాణహాని!’ అని భయపడి అతడు భోజనం చేయకుండానే బయటికి వచ్చేశాడు.

మిగిలిన ముగ్గురూ అతడిని చూసి దగ్గరికి వెళ్ళారు. అందరూ తమ అనుభవాలు చెబుతూ ఉంటే ముదుసలి అయిన ఒక గ్రామస్థుడు వారి మాటలు విని పెద్దగా నవ్వాడు. ఈ నలుగురూ ‘‘ఎందుకు  నవ్వుతున్నావు?’’ అని అడిగారు. అప్పుడు ఆ ముదుసలి ఇలా అన్నాడు - ‘‘ఓరీ! మూర్ఖ పండితులారా! దారం అడ్డం పడిందని ఒకడు, రొట్టెలు ఆయుఃక్షీణమని ఒకడు, చిల్లుల విస్తరి అని మరొకడు, తడి ఆసనం అని ఇంకొకడు భోజనం మానేయడం మూర్ఖత్వం! దారాన్ని పక్కకు తప్పిస్తే సరిపోతుంది. రొట్టెల బదులు అన్నం పెట్టమని అడిగితే సరిపోతుంది. చిల్లుల విస్తరి మీద మరో విస్తరి వేసుకుంటే ఇబ్బందే లేదు. తడి ఆసనాన్ని తుడిచి కూర్చుంటే ఏ హానీ లేదు. మీకు పాండిత్యం ఉంది కాని లోకజ్ఞానం లేదు. ఈ రోజుకు మీకు అన్నం దొరకదు పొండి!’’ అని వారిని పంపించేశాడు.
 చూశారా! పాండిత్యంతో పాటు లోకజ్ఞానం లేకపోతే ఎంత ఇబ్బంది కలుగుతుందో!
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement